health insurence
-
మణిపాల్‌సిగ్నాకు కీలక మార్కెట్లుగా తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమకు కీలక మార్కెట్లుగా మారాయని మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్న దేశాయ్ తెలిపారు. 2022–23లో రెండు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల పైచిలుకు స్థూల ప్రీమియం (జీడబ్ల్యూపీ) వచి్చందని, దక్షిణాదిలో తమకు రెండో అతి పెద్ద మార్కెట్‌గా ఈ ప్రాంతం నిలి్చందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా తమ ఆరోగ్య బీమా వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. తమ లైఫ్‌టైమ్ హెల్త్, ప్రైమ్ సీనియర్ పథకాలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. 2022–23లో దక్షిణాది మార్కెట్లో తమ జీడబ్ల్యూపీ 37 శాతం పెరిగి రూ. 500 కోట్లకు చేరినట్లు చెప్పారు. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 1,000 కోట్లకు పెంచుకోనున్నట్లు, కొత్త శాఖలను ప్రారంభించడంతో పాటు 10,000 మంది పైచిలుకు ఏజెంట్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు సప్న వివరించారు. లైఫ్‌టైమ్ హెల్త్ ప్లాన్ కింద మణిపాల్‌సిగ్నా రూ. 50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు కవరేజీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్దేశించిన ప్రైమ్ సీనియర్ కింద 91 రోజుల తర్వాత నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు కూడా కవరేజీ ఇస్తోంది. -
భవిష్యత్తు బాగుండాలంటే..?
‘ఈ రోజు గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం..?’ ఇలా అనుకుంటే అది భద్రతకు హామీనివ్వదు. రేపటి కోసం కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులోనూ నిశ్చితంగా ఉంటామని అర్థం చేసుకునే వారు కొందరే. కష్టపడి తెచ్చిందంతా ఖర్చు పెడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉండడం కుటుంబానికి ఏ మాత్రం భరోసానీయదు. చాలా మంది పొదుపును వాయిదా వేసుకుంటూ వెళతారు. ఆర్థిక ఇబ్బంది, అత్యవసర పరిస్థితి రానంత వరకు ఇదంతా సాఫీగానే అనిపిస్తుంది. కరోనా రాక ముందు వరకు చాలా మంది ఆరోగ్య బీమాను, అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేసిన వారే. ఈ తరహా వ్యక్తుల్లో కొంత మందికి కనువిప్పు కలిగింది. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని కాకుండా.. ఎవరి భవిష్యత్తు కోసం వారే రక్షణాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు కోసం ఎందుకు పొదుపు, మదుపులు అవసరమో అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. జీవితం అంటే ఎప్పుడూ ఒకే తీరున, సాఫీగా సాగిపోదు. కొన్ని ఇబ్బందులు సర్వ సాధారణం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. కరోనా నియంత్రణకు 2020 మార్చి చివరి నుంచి నెలరోజులకుపైగా లాక్డౌన్లను విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలు కావచ్చు. భవిష్యత్తులో ఏ రోజు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేని అంశం. కాకపోతే ఏది వచ్చినా ఎదుర్కోగల సన్నద్ధతే మన చేతుల్లో ఉంటుంది. తగినంత పొదుపు ఉంటే, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సాయం కోసం అర్థించాల్సిన అవస్థ తప్పుతుంది. అందుకే పొదుపు, మదుపులను వాయిదా వేయవద్దు. ఆదాయం ఆగిపోతుంది.. సంపాదన బండి ఏదో ఒకరోజు (రిటైర్మెంట్) ఆగిపోతుందని తెలిసిందే. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాతి రోజు నుంచి జీవితం ఎలా? ఈ విషయాన్ని తెలిసినా కానీ, చాలా మంది దాటవేస్తుంటారు. ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత కదా, చూసుకోవచ్చులే.. అనుకుంటూ రిటైర్మెంట్ ప్రణాళికను ఎక్కువ మంది వాయిదా వేస్తుంటారు. కానీ, ముందు నుంచే పొదుపు చేస్తే కాంపౌండింగ్‌తో తక్కువ మొత్తం అయినా పెద్ద నిధిగా సమకూరుతుంది. అదే 40–45 తర్వాత మొదలు పెడితే, ఉన్న కొద్ది కాలంలో ఎంత వెనుకేయగలరు?.. 60 ఏళ్ల తర్వాతి జీవించి ఉన్నంత కాలం అవసరాలను ఆ మొత్తం తీర్చగలదా? అని ఆలోచించాలి. ప్రశాంతత కోసం.. భద్రత, ప్రశాంతత ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత నిధి దగ్గర ఉంటే.. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండొచ్చు. ఆఫీసులో కొంత మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త మీ చెవిన పడితే, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయని తెలిస్తే.? ఇవన్నీ చిన్నవే అయినా ఎంతో కొంత ఆందోళనకు గురి చేసేవే. దేనిని అయినా టేక్ ఇట్ ఈజీ పాలసీగా ఎప్పుడు తీసుకుంటాం? తగినంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే కదా! బ్యాంకులో బ్యాలన్స్ లేకుండా, సాగిపోయే వారికి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే ? కష్టకాలం మొదలవుతుంది. కావాల్సినంత పొదుపు చేయలేని వారిపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి. అపరాధ భావం ఎందుకు? చాలా మంది ముందుచూపు, ప్రణాళికలేమితో పొదుపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన ఉన్నా కానీ, పొదుపు చేయలేని వారు కూడా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు అవసరానికి సరిపడా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. కానీ, దీని వెనుక కారణం.. వారు పిసినారులని కాదు. తగినంత సంపద లేకపోవడమే. దీంతో వెళ్లిన ప్రతి చోటా పాకెట్ నుంచి ఖర్చు చేసేందుకు ధైర్యం చాలదు. కానీ, ఇది వారిపై, వారి జీవిత భాగస్వామి, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. చక్కని ఆర్థిక జీవనం అంటే.. తగినంత పొదుపు చేయడమే కాదు.. అవసరానికి సరిపడా, వివేకంగా ఖర్చు చేయడం కూడా. కనుక పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చును పూర్తిగా బంధించేయకూడదు. వారసత్వం విషయంలో... తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు అందరికీ లభిస్తాయన్న గ్యారంటీ ఉండదు. తమ పిల్లలకు భూమి/ఇల్లు రూపంలో ఆస్తిని ఇవ్వాలని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిదండ్రుల నుంచి చెప్పుకోతగ్గ ఆస్తులు లభిస్తే.. వాటిని మెరుగ్గా నిర్వహించే ప్రణాళిక ఉండాలి. వారసత్వ ఆస్తుల్లేని వారు, తమ పిల్లలకు ఆస్తులను సమకూర్చిపెట్టాలని భావిస్తే.. ఇది అదనపు ప్రణాళిక అవుతుంది. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల విషయంలోనూ ప్రణాళికాయుతంగా నడుచుకోవాలి. పెద్ద లక్ష్యాలు జీవితంలో ఎన్నో కీలకమైన లక్ష్యాలు ఎదురవుతాయి. వీటిల్లో కొన్ని తప్పించుకునేవి కావు. పిల్లల విద్యా ఖర్చు, వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్, పర్యటనలు ఇలా ఎన్నో ఉంటాయి. భవిష్యత్తు కోసం తగినంత కూడబెట్టలేకపోతే, రుణాలపై ఆధారపడితే చివరికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? అందుకని జీవితాన్ని చేయి దాటిపోనీయకుండా, భవిష్యత్తు పట్ల ముందు చూపుతో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఆర్థిక స్వేచ్ఛ వేతనంపై ఇక ఆధారపడని రోజు ఒకటి జీవితంలో వస్తుంది. అప్పటికి కనీస అవసరాలకు సరిపడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేంత నిధిని సమకూర్చుకోవాలి. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రంగా చెబుతారు. మీ అవసరాలకు వేరేవారిపై ఆధారపడకపోవడం. ఆర్జన ఆరంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది వద్ద ఎటువంటి నిధి (వారసత్వంగా ఉంటే తప్ప) ఉండదు. కనుక 100 శాతం వేతనంపైనే జీవనం ఆధారపడి ఉంటుంది. అయితే, కాలక్రమేణా బుట్టలోకి సంపద చేరాలి. అప్పుడే అవసరానికి కావాల్సినంత తీసుకోగలరు. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు నెలవారీగా రూ.40,000 అవుతున్నాయని అనుకుంటే.. 12 నెలలకు సరిపడా రూ.4.8 లక్షలు కనీసం అతని వద్ద ఉండాలి. రూ.48 లక్షలు ఉంటే 8–10 ఏళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని జీవితంలో కోరుకున్న దశ నుంచి కనీస అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా నిధి ఏర్పడాలి. అందుకోసం ఆర్జన మొదలైన వెంటనే పొదుపు, మదుపు ప్రయాణాన్ని ఆరంభించాలి. దాంతో చాలా వేగంగా (50 ఏళ్లకే) ఆర్థిక స్వాతంత్య్ర స్థితిని చేరుకుంటారు. పురోగతి జీవితానికి పురోగతి కీలకమైనది. ఉద్యోగం ఆరంభంలో బ్యాంకు బ్యాలన్స్ జీరోగా ఉన్నా.. 5–10 ఏళ్ల సర్వీసు తర్వాత తగినంత కనిపించాలి. అది పురోగతికి చిహ్నంలా మరింత ప్రేరణనిస్తుంది. ఉత్సాహంతో పనిచేసేందుకు సరిపడా బూస్ట్‌నిస్తుంది. పదేళ్ల కెరీర్ తర్వాత కూడా బ్యాంకు ఖాతా వెక్కిరిస్తోందంటే.. అది పురోగతికి చిహ్నం కాబోదు. నికర విలువ పెరగడం లేదంటే ‘ధనిక బానిస’ అనే అనుకోవాల్సి వస్తుంది. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు ఉన్నంతలో ఎంతో కొంత ఆదా చేసుకోవడమే ఆచరణ కావాలి. ప్రతి నెలా రూ.5,000 సిప్ ఆరంభించి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం రాబడి రేటు ప్రకారం రూ.1.76 కోట్లు సమకూరుతుంది. 30 ఏళ్లలో మీరు చేసిన పెట్టుబడి రూ.18 లక్షలే. కానీ, వచ్చిన రాబడి రూ.1.58 కోట్లు. మెరుగైన మార్గం.. చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉండొచ్చు. వెనుక కావాల్సినంత నిధితో బ్యాకప్ ప్రణాళిక లేకపోతే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన ఆదాయం, జీవనం కోసం ఉద్యోగం మారాలనుకుంటే కనీసం 2–3 ఏళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చినా.. జీవనానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. మీ వద్ద నిధి ఉంటే, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కనుక విజయంలోనూ ‘వెల్త్’ పాత్ర ఉంటుంది. రుణ ఊబిలోకి వెళ్లొద్దు.. రుణం తీసుకోవడం ఒక్కసారి మొదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని స్టాప్ చేయడం కష్టమే. ముందు ఇది చిన్నగానే మొదలు కావచ్చు. కొన్నేళ్లకు నియంత్రించలేనంత స్థాయికి చేరిపోతుంది. చివరికి బయట పడలేనంత ఊబిగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకనే క్రెడిట్ కార్డు అయినా, వ్యక్తిగత రుణం తీసుకుంటున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. రుణం తీసుకుంటున్నారంటే.. తగినంత పొదుపు లేకపోవడం వల్లే. పొదుపు లేకుండా రుణం బాటపడితే.. తిరిగి అప్పుల భారం నుంచి బయటకు వచ్చి, పొదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి రావచ్చు. కొందరికి అది అసాధ్యం కావచ్చు. కనుక డెట్‌కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుసరించాల్సిన ప్రణాళిక ► మెరుగైన జీవనం కోసమే ప్రణాళికాయుత ఆర్థిక జీవనం. ఇందులో ముందుగా తన కుటుంబ రక్షణ కోసం సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ► 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అవసరమైన వెంటనే తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ► ప్రతీ నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం (సంపాదన) నుంచి 20–40 శాతాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► పెట్టుబడుల్లో అస్థిరతలు తగ్గించేందుకు వీలుగా కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పటికే ఈపీఎఫ్ రూపంలో చేస్తున్న డెట్ భాగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ► ఎండోమెంట్, మనీబ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమాను, పెట్టుబడిని కలపొద్దు. -
కరోనా మహమ్మారి.. ఆరోగ్య బీమా తీరు మారి...
ఒకప్పుడు ఆరోగ్య బీమా అనేది ముందున్న వ్యాధులకు, అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అందడం కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.కోవిడ్ 19 తర్వాత ఆరోగ్య బీమాకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కరోనా చికిత్సకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.10, 20లక్షల వరకూ వ్యయాన్ని భరించాల్సి రావడం ఆరోగ్య బీమా అవసరాల్ని మరింత ఎక్కువగా గుర్తు చేసింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తప్పనిసరిగా భావిస్తున్నారు. విప్లవాత్మక మార్పులు... ఈ క్రమంలోనే ఐఆర్డీఎ, బీమా సంస్థలు విప్లవాత్మక పరిష్కారాలు చేపట్టాయి. దీంతో బీమా కంపెనీలు అందించే పాలసీ నియమ నిబంధనల్లో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలును మరింత సులభతరం చేస్తున్నాయి. చాలా వరకూ డిజిటల్ అండర్ రైటింగ్ ప్రాసెస్‌లోనే పాలసీలు అందిస్తున్నారు. దీని వల్ల అరుదైన పరిస్థితుల్లో తప్ప బీమా కావాల్సిన వారు శారీరక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం తగ్గుముఖం పట్టింది. అలాగే డిసీజ్ మేనేజ్మెంట్ బెనిఫిట్ వంటివి కూడా అందించే పాలసీలు అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా అప్పటికే ఉన్న అనారోగ్యాలకు సంబంధించి కేవలం 2 నుంచి 4ఏళ్ల లోపునకు మాత్రమే వెయిటింగ్ పీరియడ్‌ని పరిమితం చేస్తున్నారు. పాలసీ తీసుకున్న కొన్ని నెలల్లోనే క్లెయిమ్ చేసుకోవాలనుకునేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటోంది. కొన్ని రకాల పాలసీల్లో పాత అనారోగ్యాలున్నా పాలసీ తీసుకున్న రోజు నుంచే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది చాలా విప్లవాత్మక పరిణామంగానే చెప్పొచ్చు. గతానికి భిన్నంగా ఇప్పుడు 20ఏళ్ల నుంచి హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న రోగికి కూడా పాలసీ ఇస్తున్నారు. అలాగే కేన్సర్, కిడ్నీ, హృద్రోగాలు, శ్వాస కోస వ్యాధులు వంటివి ఉన్నవారు కూడా ఆరోగ్య బీమా పొందగలుగుతున్నారు. సూచనలు: పాలసీ తీసుకోవడానికి పూర్వమే ఉన్న అనారోగ్యాలను గురించి దరఖాస్తు ఫారంలో తప్పనిసరిగా తెలియజేయడం అవసరం. వీటిని దాయడం వల్ల నష్టమే ఎక్కువ. అనారోగ్యం ఉందనే కారణం కన్నా, తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంతో క్లెయిమ్ని తిరస్కరించడం సులభం అని గుర్తించాలి. మన కుటుంబ సభ్యుల వయసు, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి సమ్ అస్యూర్డ్ నిర్ణయించుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలకు, ప్రాణాంతక వ్యాధులకు అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీలనే ఎంచుకోవాలి. జీరో కో పేమెంట్, విభిన్న రకాల ఆరోగ్య పరిస్థితులకు పలు రకాల ట్రీట్మెంట్స్కి సబ్ లిమిట్స్, రూమ్ రెంట్..వంటివి అందించే ప్లాన్స్‌ను పరిశీలించాలి. ఆరోగ్య బీమాపై ఆసక్తి పెరిగింది... ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో ఆరోగ్య బీమాపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరిగింది. అదే సమయంలో బీమా సంస్థలు కూడా చాలా వరకూ తమ నిబంధనల్ని సడలించి, బీమా కొనుగోలును సులభతరం చేశాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన, అవసరమైన బీమా పాలసీని తీసుకుంటే మన ఆదాయంలో నుంచి ఆరోగ్య చికిత్సల వ్యయం పూర్తిగా తగ్గించుకోవచ్చు. అమిత్ చాబ్రా, హెల్త్ బిజినెస్ హెడ్, పాలసీ బజార్ డాట్‌కామ్. -
కార్పొ‘రేటు’ సపరేటు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేట్ ఆసు పత్రుల విన్నపాన్ని సర్కారు మన్నించింది. సర్కారు నిర్దేశిం చిన ప్యాకేజీ కేవలం నగదు చెల్లించే వారికేనని, బీమా సంస్థ లకు వర్తించదని స్పష్టత ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రైవేట్, కార్పొ రేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజ మాన్యాలు తెలి పాయి. ప్రభుత్వం ఇటీవల ప్రకటిం చిన ప్రైవేట్ కరోనా వైద్య ఫీజుల ప్యాకేజీ ఉత్తర్వుల్లో బీమా కంపెనీల ప్రస్తావన లేదు. కేవలం ఎంత ఫీజు వసూలు చేయాలన్న అంశమే ఉంది. అయితే ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న కరోనా బాధితులు వాటి ప్రకారం చికిత్స చేయా లని ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తుండటం, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సర్కారు ప్యాకేజీ ప్రకారమే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేయడంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసు పత్రులు ఇరకాటంలో పడ్డాయి. ప్రైవేట్ బీమా పాలసీ ఉన్నప్పటికీ కరోనా రోగుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విష యం వివాదాస్పదం కావ డం, రోగుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండ టంతో కార్పొరేట్ ఆసుపత్రులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలకు సర్కారు ప్యాకేజీతో సంబంధం లేదన్నట్లుగా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్యాకేజీ ఉత్తర్వుల సవరణ కేవలం నగదు చెల్లించే సాధా రణ వార్డుల్లోని రోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న రోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. ప్రైవేట్‌లో సాధారణ బీమా కవరేజీ కింద కరోనా చికిత్స... కరోనా రోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్యాకేజీ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు తిరస్కరించాయి. కొన్ని ఆసుపత్రులు బీమా నుంచి వచ్చిన సొమ్ము పోను మిగిలిన సొమ్మును రోగుల నుంచి వసూలు చేశాయి. ఇటీవల ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా రోగికి చికిత్స కోసం రూ. 4.20 లక్షల బిల్లు వేశారు. ప్రైవేటు బీమాను అనుమతించినా ఆ సంస్థ ప్యాకేజీ ప్రకారం రోగికి రూ. 1.23 లక్షలు మాత్రమే బిల్లు మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును రోగి చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేసింది. తాజా ఉత్తర్వులో ఇచ్చిన స్పష్టతతో నిర్దేశించిన పాలసీ ప్రకారం పూర్తి సొమ్ము బీమా కంపెనీల నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు బీమా కంపెనీలతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు గతంలో వివిధ వ్యాధులకు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ బీమా పాలసీ ఉన్న బాధితులకు, ఆసుపత్రులకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ప్రైవేట్ బీమా పాలసీ లేని కరోనా రోగులు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు నగదు చెల్లించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి బాధితులకు ఆరోగ్యశ్రీ లేదా ఉద్యోగుల బీమా పాలసీలను అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయడంపై గుర్రుగా ఉంది. అత్యవసర సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకొనేది లేదని స్పష్టం చేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించే సర్వాధికారాలున్నాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ప్రైవేట్ బీమా పాలసీ లేనివారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సర్కారు స్పష్టత ఇచ్చింది మా విన్నపాన్ని సర్కారు పరిగణనలోకి తీసుకుంది. గతంలో ఇచ్చిన జీవోలో కరోనా ఫీజు ప్యాకేజీ వివరాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ బీమా కంపెనీలు కూడా దాని ప్రకారమే కరోనా బిల్లుల సొమ్ము చెల్లిస్తామని చెప్పాయి. వాస్తవానికి సర్కారు ప్రకటించిన ఫీజు మాకు ఏమాత్రం సరిపోని పరిస్థితి ఉంది. గతంలో ప్రైవేట్ బీమా కంపెనీలు, ఆసుపత్రుల మధ్య వివిధ వ్యాధులకు ఎంవోయూ ఉంది. దాని ప్రకారం కాకుండా సర్కారు ప్యాకేజీతో ఇబ్బంది ఏర్పడింది. అయితే సర్కారు ఇప్పుడు ప్యాకేజీతో బీమా కంపెనీలకు సంబంధం లేదని చెప్పడం వల్ల గతంలో మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం బీమా కంపెనీలు వ్యాధులను బట్టి బిల్లు సొమ్ము ఇస్తాయి. దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదు. రోగులపైనా ఆర్థిక భారం ఉండదు. – భాస్కర్‌రావు, తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్ ఆసుపత్రుల అధినేత -
రూ.50 లక్షల కరోనా బీమా
సాక్షి, హైదరాబాద్: కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ఇదివరకు ప్రకటించగా తాజాగా మార్గదర్శ కాలు విడుదల చేసింది. కరోనాతో మరణిస్తే కరోనా సంబంధ విధుల్లో ప్రమాదకర స్థితిలో మరణిస్తే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బందికీ పథకం వర్తించనుంది. అయితే ఈ మరణాలను రాష్ట్ర, జిల్లా స్థాయి లోని కమిటీలు నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ పథకం కింద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తారు. -
వాహన, ఆరోగ్య బీమాదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా బీమా పాలసీల గడువును మే 15వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేస్ పిరియడ్‌లో బీమాదారులకు బీమా కవరేజ్‌తో పాటు క్లెయిమ్స్‌ను పరిష్కరించాలని బీమా కంపెనీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. మార్చి 25 నుంచి మే 3 మధ్య గడువు ముగియనున్న థర్డ్‌పార్టీ వాహన, ఆరోగ్య పాలసీలకు ఈ వెసులుబాటును వర్తింపచేస్తారు. కాగా ఏప్రిల్ 14 వరకూ విధించిన తొలి విడత లాక్డౌన్ సందర్భంగా కూడా పాలసీ పునరుద్ధరణ గడువును పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వాహన, బీమా పాలసీల పునరుద్ధరణ గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేసిన క్రమంలో అందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చదవండి : వలస కూలీల ఆందోళన -
అంత చెమటలు కక్కాల్సిన అవసరం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : కండలు పెంచుకోవడానికి కొందరు, ఆరోగ్యంగా ఉండేందుకు మరికొందరు పోటీలు పడి జిమ్‌లకు వెళుతుంటారు. చెమటలు కక్కుతూ ప్రయాస పడి కసరత్తులు చేస్తుంటారు. ‘అమ్మో! ఆ బరువులు ఎత్తడం మనవల్ల కాదు బాబోయో! ’ ఇంకొందరు జిమ్‌కు వెళ్లాలంటేనే భయపడతారు. అలాంటి వారు ఆరోగ్యం కోసం సహజంగానే జాగింగ్ లేదా వాకింగ్‌ను ఎంచుకుంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అంత చెమటలు కక్కాల్సిన అవసరం లేదని, అంతగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదని ఓ అధ్యయనం తెలిపింది. కనీసం రోజుకు 13 నిమిషాల చొప్పున వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలట. వారి ఆయుర్దాయం మూడేళ్లు పెరుగుతుందట. అందుకోసం జిమ్‌లకు, జాగింగ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదట. రోజుకు 13 నిమిషాలకు తగ్గకుండా వారానికి 90 నిమిషాల పాటు ఇంటి పట్టునో, రోడ్డు మీదనో వాకింగ్ చేస్తే, మైదానానికి వెళ్లి చిన్న చిన్న కసరత్తులు చేస్తే ఏమీ చేయని వారికన్నా మూడేళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరోగ్య బీమా సంస్థ ‘వైటాలిటీ’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కనీస వ్యాయామం చేయని వారి నుంచి కనీస వ్యాయామం, ఎక్కువ వ్యాయామం చేసే వారి వరకు 1,40,000 మందిని ఎంపిక చేసుకొని వారి ఆరోగ్యం, ఆయుర్దాయంపై వైటాలిటీ సంస్థ కొన్నేళ్లపాటు అధ్యయనం జరిపింది. ఎలాంటి వ్యాయామం చేయని వారికంటే వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేసిన వాళ్లు మూడేళ్లు అధికంగా, అలాగే రోజుకు 25 నిమిషాల చొప్పున వారానికి మూడు గంటలపాటు వ్యాయామం చేస్తే నాలుగేళ్లు అధికంగా జీవిస్తారట. వ్యాయామంలో మంచి ఫలితాల గురించి తెల్సి కూడా దీనికున్న ప్రాధాన్యతను కొందరు ప్రజలు ఇప్పటికీ గుర్తించరని ఈ తాజా అధ్యయనాన్ని పరిశీలించిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్’ అధ్యక్షుడు లార్డ్ సబాస్టియన్ కో వ్యాఖ్యానించారు. కేవలం ఆయుర్దాయం పెరగడం కోసమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు, వత్తిలో అధిక ఉత్పత్తిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. వైటాలిటీ ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులపైనే ఈ అధ్యయనం జరిపి, వారిలో ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాయామం చేస్తున్న వారికి అదనపు రాయతీలను కల్పించింది. పాలసీదారులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తే బీమా సంస్థకు అంత లాభాలు గదా! -
జర్నలిస్టులకు ఆరోగ్యబీమా
-
జర్నలిస్టులకు ఆరోగ్యబీమా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కూడా ఆరోగ్య బీమా కల్పించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఆరోగ్య బీమా ఫైలుపై సంతకం చేశారు. జర్నలిస్టులకు, ఉద్యోగ విరమణ చేసిన జర్నలిస్టులకు ఈ సౌకర్యం లభించనుంది. ఇందుకు సంబంధించి, విధి విధానాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, ఆరోగ్యశాఖల ఉన్నతాధికారులు ఖరారు చేసిన అనంతరం వారం రోజుల్లో జీవో జారీ చేయనున్నారు. గ్రామీణ విలేకరుల నుంచి సంపాదకుల వరకూ ఆరోగ్యబీమా వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులు కూడా 1,885 జబ్బులకు నగదుప్రమేయంలేని వైద్య సేవలు పొందవచ్చు. ఇందులో 347 రకాల జబ్బుల చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆస్పత్రిలో అడ్మిట్ అయితే రూ. 2 లక్షల వరకూ ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. సంవత్సర కాలంలో ఆసుపత్రిలో చేరిన ప్రతిసందర్భంలోనూ గరిష్టంగా రూ. 2 లక్షల రూపాయల ఖర్చును చెల్లిస్తారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పరిధిలో వారి కుటుంబ సభ్యులను కూడా చేర్చారు. భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులకూ బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులు నెలకు రూ.120 ప్రీమియం చెల్లిస్తున్నారని, జర్నలిస్టుల ప్రీమియం కూడా ఆమేరకే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సొమ్మును ఎన్నిదఫాలుగా వసూలు చేయాలి, ఎలా చేయాలి, గ్రామీణ విలేకరుల నుంచి ఎంత వసూలు చేయాలి అన్న అంశాలపై విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలన్న వినతిని అంగీకరించిన ముఖ్యమంత్రికి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు శుక్రవారం కృత జ్ఞతలు తెలిపారు.