సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కూడా ఆరోగ్య బీమా కల్పించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఆరోగ్య బీమా ఫైలుపై సంతకం చేశారు. జర్నలిస్టులకు, ఉద్యోగ విరమణ చేసిన జర్నలిస్టులకు ఈ సౌకర్యం లభించనుంది. ఇందుకు సంబంధించి, విధి విధానాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, ఆరోగ్యశాఖల ఉన్నతాధికారులు ఖరారు చేసిన అనంతరం వారం రోజుల్లో జీవో జారీ చేయనున్నారు.
గ్రామీణ విలేకరుల నుంచి సంపాదకుల వరకూ ఆరోగ్యబీమా వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులు కూడా 1,885 జబ్బులకు నగదుప్రమేయంలేని వైద్య సేవలు పొందవచ్చు. ఇందులో 347 రకాల జబ్బుల చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆస్పత్రిలో అడ్మిట్ అయితే రూ. 2 లక్షల వరకూ ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. సంవత్సర కాలంలో ఆసుపత్రిలో చేరిన ప్రతిసందర్భంలోనూ గరిష్టంగా రూ. 2 లక్షల రూపాయల ఖర్చును చెల్లిస్తారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పరిధిలో వారి కుటుంబ సభ్యులను కూడా చేర్చారు. భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులకూ బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులు నెలకు రూ.120 ప్రీమియం చెల్లిస్తున్నారని, జర్నలిస్టుల ప్రీమియం కూడా ఆమేరకే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సొమ్మును ఎన్నిదఫాలుగా వసూలు చేయాలి, ఎలా చేయాలి, గ్రామీణ విలేకరుల నుంచి ఎంత వసూలు చేయాలి అన్న అంశాలపై విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలన్న వినతిని అంగీకరించిన ముఖ్యమంత్రికి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు శుక్రవారం కృత జ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టులకు ఆరోగ్యబీమా
Published Sat, Feb 15 2014 12:45 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement