నిరసనల నడుమ సీఎం పర్యటన | CM to tour amidst protests | Sakshi
Sakshi News home page

నిరసనల నడుమ సీఎం పర్యటన

Published Mon, Sep 23 2013 2:47 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

నిరసనల నడుమ సీఎం పర్యటన - Sakshi

నిరసనల నడుమ సీఎం పర్యటన

కూకట్‌పల్లి, గచ్చిబౌలి జోన్ బృందం,న్యూస్‌లైన్: చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం నగరంలో పర్యటించారు. నిరసనలు, ఆందోళనల నడుమ ఆయన పర్యటన కొనసాగింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది. సీఎం కిరణ్ తొలుత కేపీహెచ్‌బీ ముల్లకతువ చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ జంక్షన్, సర్వీసురోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే, రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మియాపూర్-ఎల్లమ్మబండ లింకు రోడ్డు నిర్మాణపు పనులకు, రూ.16.43 కోట్లతో ఏర్పాటు చేయనున్న మంజీరా పైపులైన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఖానామెట్‌లో నిర్మించనున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు మహీదర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ముఖేష్‌గౌడ్, ప్రసాద్‌కుమార్, ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు జయప్రకాష్ నారాయణ, భిక్షపతియాదవ్, కూన శ్రీశైలంగౌడ్, మేయర్ మాజిద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 పోలీసుల అత్యుత్సాహం..

 సీఎం పర్యటనలో పోలీసు ఎస్కార్టు బృందం అత్యుత్సాహం ప్రదర్శించింది. మియాపూర్‌లోని సుభాష్‌చంద్రబోస్ నగర్ వేదిక వద్దకు వస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు రోడ్డుపైనే కూర్చోని ధర్నా చేపట్టారు. అయినా అనుమతించక పోవడంతో జర్నలిస్టులు సీఎం పర్యటనను బహిష్కరించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌లను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ముల్లకత్వ చెరువు శంకుస్థాపన అనంతరం సీఎం కాన్వాయ్‌తో పాటు వెళ్లబోయిన మేయర్ మాజిద్ వాహనాన్ని కూడా నిలువరించారు.

దీంతో కలత చెందిన ఆయన తదుపరి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. సీఎం పర్యటనను అడ్డుకంటారని భావించిన పోలీసులు ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేశారు. జేఏసీ శేరిలింగంపల్లి చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర భూ పరిరక్షణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు.
     
సీఎం బహిరంగ సభ లేకపోయినప్పటికీ, స్థానిక నాయకులు మహిళలను తరలించేందుకు తంటాలు పడ్డారు
     
గిరిజన మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
     
ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి సీఎంతో కలిసి పర్యటించారు
     
టీడీపీ కార్పొరేటర్లు అశోక్‌గౌడ్, భానుప్రసాద్‌లను పోలీసులు వేదిక వద్దకు అనుమతించలేదు.
 
 సీఎం పర్యటన కోసం..
 ముల్లకతువ చెరువులో మట్టిని నింపిన అధికారులు
 
 కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: బయోడైవర్సిటీ పార్కు పేరుతో ముల్లకతువ చెరువు అభివృద్ధికి అధికారులు చేపట్టిన పనులు జలాశయానికి ముప్పుగా పరిణమించనున్నాయి. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ముల్లకతువ చెరువు ఇప్పటికే కుంచించుకుపోయి, 35 ఎకరాలకు చేరింది. తాజాగా బయోడైవర్సిటీ పార్కు పనుల శంకుస్థాపన కోసం అధికారులు చేపట్టిన పనులతో చెరువు నీటిలో మరో అర ఎకరానికి పైగా మట్టిని నింపారని సమాచారం. గతంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి పిల్లర్‌ల నిర్మాణం కోసం సుమారు రెండు ఎకరాలు చెరువు స్థలాన్ని చదును చేసి వినియోగంలోకి తీసుకున్నారు. తాజాగా, సీఎం శంకుస్థాపన వేదిక ప్రాంతం పూర్తిగా జలాశయంలో మట్టిని నింపిన ప్రాంతంలోనే ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఒకవైపు చెరువుల పరిరక్షణ కోసం రూ.కోట్లు వెచ్చించి జలశయాలను కాపాడాలని ధృడసంకల్పంతో ఉంటే.. కేవలం సీఎం పర్యటన కోసమే అర ఎకరం మేర జలశయాన్ని పూడ్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement