నిండు నూరేళ్లూ... హ్యాపీగా | Happy life in life with NPS scheme | Sakshi
Sakshi News home page

నిండు నూరేళ్లూ... హ్యాపీగా

Published Sun, Jun 11 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

నిండు నూరేళ్లూ... హ్యాపీగా

నిండు నూరేళ్లూ... హ్యాపీగా

పెరుగుతున్న ఆయుర్దాయం; తగ్గుతున్న ఉద్యోగ కాలం
తక్కువ వ్యవధిలోనే ఎక్కువ సంపదకు ప్రణాళిక కావాలి
వయసులో ఉన్నప్పటి నుంచే రిటైర్మెంట్‌ ప్లాన్‌ తప్పనిసరి
అధిక రాబడులను ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు బెటర్‌
అందుకోసం ఈక్విటీ ఫండ్లు, ఇండెక్స్‌ ఫండ్లు చూడొచ్చు
రిటైరయ్యాక అంతా ఒకేసారి వెనక్కి తీసుకోవద్దు
అప్పుడే హాయిగా చివరి మజిలీ  


ఇదివరకట్లా కాదు. ఇప్పుడు పెద్ద వయసు వారి సంఖ్య పెరుగుతోంది. కారణం! సగటు ఆయుర్దాయం పెరిగింది. మన దేశంలోనే కాదు!! ప్రపంచమంతటా ఇదే ధోరణి. మరి వృద్ధాప్యంలో ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం లభించినపుడు... నిండు నూరేళ్లూ ఏ ఇబ్బందీ లేకుండా సౌకర్యవంతంగా జీవించాలి కదా? ప్రతి చిన్న దానికీ రాజీ పడకుండా... అవసరాలను చంపుకోకుండా జీవించాలి కదా? అలా చేయాలంటే చివరి మజిలీని చక్కగా డిజైన్‌ చేసుకోవాలి. అందుకు కాస్త ప్లానింగ్‌ ఉండాలి. అదెలాగో తెలియజేసేదే ఈ కథనం...

మన దేశంలో 1997లో సగటు ఆయుర్దాయం 57 ఏళ్లు. అదిప్పుడు 70 ఏళ్లు దాటిపోయింది. పురుషులు సగటున 77 ఏళ్లు, మహిళలు 78 ఏళ్ల పాటు జీవించగలుగుతున్నారు. ఇవి సగటు లెక్కలే. కొందరు 80 నుంచి 90 ఏళ్ల వరకూ ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవిస్తున్నారు. కానీ ఏ ఉద్యోగమైనా 60 ఏళ్లకే రిటైర్‌ కావాల్సిందే. వృత్తి, వ్యాపారాలయితే మాత్రం ఆరోగ్యం సహకరించే వరకూ చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న వైద్య రంగం, నూతన ఆవిష్కరణల వల్ల వచ్చే 20 ఏళ్లలో సగటు ఆయుర్దాయం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మరి వృద్ధాప్యంలో జీవించి ఉన్నంత వరకూ అవసరాలు చూసేదెవరు? యుక్త వయసులోనే పిల్లలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంటే సంక్షేమం చూసేది ఎవరు. అందుకే విశ్రాంత జీవనానికి యుక్త వయసు నుంచే సర్వసన్నద్ధం కావాలి.     – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

తగ్గుతున్న పని కాలం
గతంతో పోలిస్తే నేడు ఆర్జన కాలం తక్కువగా ఉంటోంది. ఒకప్పుడు డిగ్రీ అయ్యాక 20–21 ఏళ్ల నుంచే సంపాదన మొదలు పెట్టేవారు. కానీ, ఇపుడు ఉన్నత డిగ్రీలు ఉద్యోగాలకు కీలక అర్హతగా మారుతుండడంతో 22–25 ఏళ్లకు గానీ ఉద్యోగం మొదలు పెట్టడం లేదు. పైగా ఎక్కువ కాలం పాటు కష్టపడకుండా త్వరగా రిటైర్మెంట్‌ తీసుకోవాలన్నది కొందరి ఆలోచన. అనారోగ్యం, పనిలో పెరిగిపోతున్న ఒత్తిళ్ల వంటి కారణాలూ ఉంటున్నాయి. ఇక వృద్ధాప్యంలోకి వచ్చిన వారికి కుటుంబ పరంగా తగినంత రక్షణ కూడా ఉండడం లేదు. భవిష్యత్తులో పిల్లలు తమ పెద్దల సంక్షేమ బాధ్యతను కూడా చూడకపోవచ్చన్న అభిప్రాయాన్ని క్రిసిల్‌ ఫండ్స్‌ అండ్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగం డైరెక్టర్‌ జిజు విద్యాదరణ్‌ వ్యక్తం చేశారు. ఒకవేళ చూసినా వారిపై ఆర్థికంగా చాలా భారం పడుతుందట!! అందుకే విశ్రాంత జీవనానికి చక్కటి ప్లాన్‌ అవసరం అన్నారాయన.

పింఛనుకూ భరోసా లేదు
పింఛనుకూ తగినంత భరోసా లేకుండా పోతోంది. ప్రభుత్వ రంగంలో 2004 మార్చి తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్‌ను ఎన్‌పీఎస్‌ పథకంతో ముడిపెట్టారు. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్‌ తరహా పథకాలైనా ఉన్నాయి గానీ, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారికి ఎటువంటి సామాజిక భద్రతా పథకాలూ లేవు. రిటైర్మెంట్‌ తర్వాత కనీసం 20, 30 ఏళ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్‌ అయిన తర్వాత ఖర్చులు తగ్గుతాయన్న ఆలోచన కొందరిలో ఉంటుంది. కానీ అప్పుడే పెరుగుతాయి. ముఖ్యంగా వైద్యం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. హెల్త్‌ పాలసీ తీసుకున్నా ప్రీమియం రూ.20 నుంచి రూ.30వేల మధ్య ఉంటుంది. ఉదాహరణకు 7 శాతం ద్రవ్యోల్బణం అంచనాతో 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అయితే... ఇదే వ్యక్తికి 80 ఏళ్ల వయసుకు వచ్చే సరికి రూ.96 లక్షలు కావాల్సి ఉంటుంది.

ముందు నుంచే...
విశ్రాంత జీవనంలో అవసరాలన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత అందుకు పటిష్టమైన ప్రణాళికను యుక్త వయసు నుంచే ఆచరణలో పెట్టాలి. రిటైర్మెంట్‌ జీవనం కోసం చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభిస్తే కాంపౌండింగ్‌ వల్ల భారీ నిధి సమకూరుతుంది. ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అంచనా వేసి, మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర, ఇతర రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుని కావాల్సిన నిధి గురించి ఓ అంచనాకు రావచ్చు. ఆ తర్వాత అందుకు తగ్గ సంపదను సమకూర్చే సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

నిధులను దారి మళ్లించొద్దు
పింఛను కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే అవసరాలకు మళ్లించే పొరపాటు చేయకూడదు. కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకోకుండా కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవాలి. ఐదేళ్ల లోపు ఈపీఎఫ్‌ చందాలను వెనక్కి తీసుకుంటే వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌లో ముందస్తు నిధుల ఉపసంహరణ అవకాశాలను తప్పనిసరి సందర్భాల్లోనే వినియోగించుకోవాలన్నది నిపుణులు ఇచ్చే సూచన. ఇక రిటైర్మెంట్‌ నిధి కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు, అవసరమైనప్పుడు వాటిని సులభంగా వెనక్కి తీసుకునే వెసులుబాటును దుర్వినియోగం చేసుకోకూడదు.

ఆర్జనను ఆపొద్దు
విశ్రాంత జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే 60 ఏళ్లకే కష్టపడడాన్ని ఆపేసి కాలుపై కాలేసుకుని కూర్చుంటాననడం సరైంది కాదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్టు... శరీరం సహకరించినంత వరకూ పనిచేసుకోవాలని, తద్వారా మరింత ఆర్థిక భద్రతకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

రాబడులను పెంచుకోవాలి...
ఈక్విటీల్లో పెట్టుబడులు ద్రవ్యోల్బణం రేటును మించి వేగంగా వృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది కీలకం. ఎందుకంటే వారి ఎన్‌పీఎస్‌ పథకంలో ఈక్విటీలో పెట్టుబడులు 15 శాతానికే పరిమితం. అందుకే వారు విడిగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించాలి. ఉద్యోగ పరంగా భద్రత ఎక్కువగా ఉంటుంది గనుక కొంచెం ఎక్కువ రిస్క్‌ తీసుకుని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని నిపుణుల సూచన. తద్వారా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చంటున్నారు. ఈపీఎఫ్‌ చందాదారులు కూడా ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించొచ్చు.

నిధిని కాపాడుకోవడమూ ముఖ్యమే...
ఉద్యోగ జీవితం నుంచి రిటైరయ్యాక విచ్చలవిడిగా ఖర్చు చేయడం తేలికే. అప్పటి వరకు పొదుపు చేసిన నిధి భారీ సంపదగా మారి ఉంటే ఖర్చు విషయంలో నియంత్రణలు అక్కర్లేదు కానీ... పరిమితంగా ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే. రిటైర్‌ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో 20 శాతం వరకూ ఇన్వెస్ట్‌ చేసుకోవాలనేది నిపుణుల సూచన. రిస్క్‌ తక్కువగా ఉండే ఈక్విటీ సాధనాలైన ఇండెక్స్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని వారు చెబుతున్నారు. మరోవైపు డెట్‌ పథకాలైన ఈపీఎఫ్, పీపీఎఫ్‌ నిధులను రిటైర్‌ అయిన వెంటనే వెనక్కి తీసుకోకుండా కొన్నాళ్లు పొడిగించుకోవడం కూడా సరైనదే. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ వంటి అధిక రాబడులను ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం మరో ఆప్షన్‌. పన్ను ప్రయోజనాన్ని కల్పించే డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి క్రమానుగతంగా కొద్ది కొద్దిగా ఉపసంహరించుకోవడాన్నీ పరిశీలించొచ్చు. అదే సమయంలో అధిక రాబడుల కోసం భద్రత లేని సాధనాల్లో పెట్టుబడులు పెటొద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement