ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో ఈ ఏడాది చివరి నాటికి మార్పులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేస్తున్న కొన్ని మార్పులను ఈ ఏడాది చివరిలో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగి చివరిగా తీసుకున్న బేసిక్ జీతంలో 40-50% ఆధారంగా పెన్షన్‌కు హామీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను అనుసరించాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ పెన్షన్ కార్పస్‌లో లోటును పూరించడం మార్కెట్‌పై ఆధారపడుతుందన్నారు.
ప్రస్తుతం ఎన్‌సీఎస్‌లో భాగంగా ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 10% జమ చేస్తారు. ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో మరో 14% జమ చేస్తుంది. అయితే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టబోయే ప్రతిపాదనల్లో ద్రవ్యోల్బణం అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రాబోయే సమావేశంలో దీనిపై మరింత చర్చించే అవకాశం ఉందని ఆ అధికారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పెన్షనర్లు డీఏతో పాటు తాము చివరిగా డ్రా చేసిన బేసిక్ జీతంలో 50% పొందే వీలుంది.
ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి జాతీయ పెన్షన్ విధానాన్ని సవరించాలని, పాత పెన్షన్ విధానాన్ని పోలిన పథకాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఝార్ఖండ్ వంటి కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని కింద రాష్ట్రాలు తమ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్‌పై అధిక భారాన్ని భరిస్తున్నాయి.
ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధించిన కేంద్రం
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) రెగ్యులేటర్ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం..ఎన్‌పీఎస్ నిర్వహణలో ఉన్న రూ.9 లక్షల కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వాటా 79% ఉంది. మార్చి 31, 2023 నాటికి ఎన్‌పీఎస్ అందించే వివిధ పథకాల ద్వారా 6.3కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఇందులో 60.72 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 23.86 లక్షల మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment