85% వైకల్యం ఉన్న అందరికీ పెంచిన పెన్షన్ ఇవ్వాలని డిమాండ్
మహారాణిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ఇంకా ఈ హామీ అమలుకు నోచుకోలేదని, ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 85 శాతం అంగవైకల్యం ఉన్నవారికి కూడా పెంచిన పెన్షన్ అమలు చేయడంలేదని ఆక్షేపించారు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్‌రాజు, జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్.మల్లేశ్వరి ఆధ్వర్యాన సోమవారం పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఇక్కడికి తరలివచ్చారు. తాము వివిధ సమస్యలతో సతమతమవుతున్నామని, వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని అక్కిరెడ్డి అప్పారావు అన్నారు. పెంచిన పెన్షన్ అమలుకోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని.. పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి దివ్యాంగులను అర్హులుగా గుర్తిస్తున్నారని.. కానీ, విశాఖలో ఎలాంటి క్యాంపులు నిర్వహించడం లేదన్నారు.
సాంకేతిక కారణాలు చూపుతూ పెన్షన్లను నిలుపుదల చేయడం తగదన్నారు. తండ్రికి ఇల్లు ఉందంటూ పిల్లలకు పెన్షన్ నిలిపేయడం సరికాదన్నారు. ఇలా జిల్లాలో దాదాపు 100 మందికి పింఛన్లు నిలిచిపోయాయన్నారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగా పింఛను ఇవ్వాలని.. ఒంటరి దివ్యాంగులకు కూడా రేషన్ కార్డులివ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి ట్రై సైకిళ్లు, దివ్యాంగుల స్కూటర్లు, ఇతర వాహనాల మీద దివ్యాంగులు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment