
కర్నూలు జిల్లా మద్దికెరలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగులు
కొత్తవి ఇవ్వకపోగా.. ఉన్నవే ఏరివేత ఏడాదిలో నాలుగున్నర లక్షలు పింఛన్లు ఔట్..
2019 ఎన్నికల ముందు నాటికి పింఛన్లు 66.34 లక్షలు
2025 ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు కేవలం 62.19 లక్షలే
పండుటాకులకు దిక్కుతోచక దురవస్థ..
దివ్యాంగులనూ దయతలచని సర్కారు
ఎడాపెడా కత్తెర.. వైకల్య శాతం కుదింపు
సెప్టెంబరు 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రతి జిల్లాలో వేల మందికి నోటీసులు
పదేళ్లుగా తీసుకుంటున్న వారూ అనర్హులంటూ తాఖీదులు
నివ్వెరపోతున్న లబ్ధిదారులు
ఇన్నాళ్లూ ఆ డబ్బులే జీవనాధారం.. ఇక మేం జీవించేదెలా?
తల్లడిల్లి ఆత్మహత్యాయత్నాలు
పలు చోట్ల నిరసనలకు దిగిన దివ్యాంగులు
గత ప్రభుత్వంలో ఇంటింటికీ పారదర్శకంగా టంచన్‌గా అందించిన వాటిని సైతం లేకుండా చేశారని బాబు సర్కారుపై ఆగ్రహం
పింఛన్ ఆగింది.. ప్రాణం పోయింది
కృష్ణా జిల్లా పెదపూడికి చెందిన మేడం లక్ష్మి(53) ఒంటరి మహిళ పింఛన్ పొందేది. కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన రీ వెరిఫికేషన్‌లో ఆమెను అనర్హురాలిగా తేల్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసు ఇవ్వడంతో ఆందోళనకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని.. పింఛన్ డబ్బులతోనే మందులు కొనుక్కునేవాళ్లమని లక్ష్మి తల్లి బాలమ్మ కన్నీటిపర్యంతమైంది.
అన్యాయంగా తనకు వైకల్య శాతం తగ్గించారని ఓ దివ్యాంగుడు తిరుపతి జిల్లా వాకాడులో మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి ధర్నాకు దిగారు. వాకాడు మండలం దుగ్గరాజపట్నం అరుందీతయ వాడలోని నిరుపేద కుటుంబానికి చెందిన పట్టపు వెంకటసుబ్బయ్య 2018లో చెట్టుపై నుంచి కిందపడిపోవడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఏడేళ్లుగా బాధితుడు మంచానికే పరిమితమయ్యాడు. 2019లో వైద్యులు పరీక్షలు చేసి 86 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం ధృవీకరణ పత్రం ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో తిరుపతిలో నిర్వహించిన సదరం క్యాంపులోనూ దీన్ని నిర్థారించారు. తాజాగా రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 45 శాతానికి తగ్గించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారంటూ బాధితుడు ధర్నాకు దిగాడు.
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: అవ్వాతాతలు అందుకుంటున్న పింఛన్లను ఎడాపెడా కత్తిరిస్తున్న చంద్రబాబు సర్కారు అనైతికంగా వ్యవహరించేందుకూ వెనుకాడటం లేదు! కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటినే ఏరిపారేస్తోంది! కనీసం దివ్యాంగుల పట్ల కూడా దయ చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల ముందు నాటికి 66.34 లక్షల మందికిపైగా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దే పారదర్శకంగా వలంటీర్ల ద్వారా అందించగా.. టీడీపీ కూటమి సర్కారు ఇప్పుడు వీటిని కేవలం 62.19 లక్షలకే పరిమితం చేసింది.
ఏడాదిలో ఏకంగా దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లను ఎగరగొట్టింది! ఇప్పటికే పండుటాకులకు పింఛన్లు తొలగించి అవస్థలకు గురి చేస్తున్న కూటమి సర్కారు.. తాజాగా దివ్యాంగులను టార్గెట్‌గా చేసుకుని ఎడాపెడా కోతలు పెడుతోంది. మళ్లీ మళ్లీ సదరం సర్టిఫికెట్లు తేవాలంటూ, వైద్య పరీక్షలు, వైకల్య శాతం కుదింపుతో ముప్పు తిప్పలు పెడుతోంది. 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి.
ఎన్నో ఏళ్లుగా నెలనెలా అందే పింఛన్‌నే నమ్ముకుని బతుకుతున్న దివ్యాంగులను చంద్రబాబు సర్కారు నిర్దయగా రోడ్డుకీడ్చేసింది! ఇన్నాళ్లూ నిబ్బరంగా తీసుకుంటున్న పింఛన్‌కు ఇకపై మీరు అనర్హులంటూ గత వారం పది రోజులుగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న నోటీసులతో పింఛన్‌దారులు కకావికలం అవుతున్నారు! నిశ్చేషు్టలై ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఆవేదనతో తల్లడిల్లి ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
చంద్రబాబు సర్కారు మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పెన్షన్లు కోల్పోతున్న దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. తమ వైకల్యాన్ని నిర్ధారిస్తూ గతంలో వైద్యులే ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తే ఇప్పుడీ కోతలు ఏమిటని ఆక్రోశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైనే తాజాగా పింఛను నోటీసులు జారీ అయ్యాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
అప్పీలు చేయాలంటే అగచాట్లే..
దివ్యాంగ సర్టిఫికెట్ (సదరం) కలిగి ఉండి గత పదేళ్లకు పైగా పింఛను పొందుతున్న వారికి తాజా పరీక్షల్లో అనర్హులంటూ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వినికిడి లోపం ఉన్న వారికి సైతం వైకల్యం లేదని అనర్హత పేరుతో నోటీసులు జారీ కావడంపై నివ్వెరపోతున్నారు. నోటీసులు అందుకున్న పింఛనుదారులు అభ్యంతరాలు తెలియజేసే ప్రక్రియను అత్యంత క్లిష్టతరంగా మార్చారు.
దివ్యాంగ శాతంపై అభ్యంతరం ఉన్నవారు కొత్త సదరం సర్టిఫికెట్లను సంబంధిత ఏరియా వైద్యశాల నుంచి లేదంటే గ్రామ, వార్డు సచివాలయం నుంచి పొంది ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎండీపీవో తిరిగి వైద్య పరీక్షలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిరీ్ణత తేదీలో మళ్లీ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి.
ఎంపీడీవో నిర్దేశించిన తేదీన, ఆయన సూచించిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర అవయవాలు అన్నీ బాగున్న వ్యక్తులకే ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బంది. అలాంటిది దివ్యాంగులు రోజులు, నెలల తరబడి మండలాఫీసులు, ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
సెప్టెంబరు 1వతేదీ నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్లు ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు నోటీసులు అందాయి. నోటీసు అందుకున్న వారు తమ అర్హతను నిరూపించుకొని పింఛన్ కాపాడుకునేందుకు ప్రభుత్వం కనీసం 15 రోజులు గడువు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన 34 ఏళ్ల మద్దులూరి నాగరాజు చిన్నతనంలో ప్రమాదవశాత్తూ పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో సగానికిపైగా శరీరం, ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. 15 ఏళ్లుగా దివ్యాంగుల పింఛన్ పొందుతుండగా కూటమి సర్కారు నాగరాజును అనర్హుడిగా ప్రకటించి పెన్షన్ తొలగించింది.

ఈ బాలుడికీ అర్హత లేదట!
అనంతపురంలోని ప్రభాకర్ స్ట్రీట్‌లో ఉంటున్న వేలూరు ధీరజ్ వెంకట్‌నాథ్ పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఈ బాలుడికి తల్లిదండ్రులే సపర్యలు చేయాలి. ఈ నెల 14న ధీరజ్‌కు పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసులు రావడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇంత కన్నా దారుణం మరెక్కడా ఉండదని ఆక్రోశిస్తున్నారు.
పక్షవాతమున్నా పింఛన్ తొలగింపు..
నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన జి.గులాంబాషాకు రోడ్డు ప్రమాదంలో నడుం విరిగింది. పక్షవాతం బారిన పడటంతో 72 శాతం వైకల్యం ఉందని నిర్ధారిస్తూ 2019లో నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు శాశ్వత ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయనకు దివ్యాంగుల పింఛన్ మంజూరైంది. ఇటీవల రీ వెరిఫికేషన్‌లో గులాంబాషాకు 40 శాతంలోపే వైకల్యం ఉందంటూ పింఛన్ తొలగిస్తూ అధికారులు నోటీసు ఇచ్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గులాంబాషా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కలవారు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు తరలించారు.
⇒ గుంటూరు జిల్లాలో దివ్యాంగ పింఛన్లు 23,459 ఉండగా 2,489 మందిని అనర్హులుగా పేర్కొంటూ నోటీసులిచ్చారు. 472 మందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద రూ.15 వేలు చెల్లిస్తుండగా వాటిని దివ్యాంగ పెన్షన్లుగా మార్చి రూ.6 వేలకు కుదించారు. 388 మంది దివ్యాంగ పెన్షన్ కింద రూ.6 వేలు పొందుతుండగా ఓల్డ్ ఏజ్ కిందకు మార్చి రూ.4 వేలకు పరిమితం చేశారు.
⇒ పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో 2024 మార్చి నాటికి 2,83,119 మందికి పింఛన్లు అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో దివ్యాంగులకు 35,096 పింఛన్లు అందజేస్తుండగా వారిలో 3,300 మందికి వివిధ కారణాలతో తొలగించారు. రీ అసెస్‌మెంట్‌లో 40 శాతం కంటే తక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నందున తొలగించినట్లు డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి పేర్కొన్నారు.
⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 32 వేల దివ్యాంగ పింఛన్లు ఉండగా మరోసారి ధ్రువీకరించాలంటూ రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. ఆగస్టులో జిల్లావ్యాప్తంగా 4,215 దివ్యాంగ పింఛన్లను తొలగించారు. ఇవి కాకుండా 597 హెల్త్ పింఛన్లు (మంచానికే పరిమితమైనవారు), 1,611 వృద్ధాప్య పింఛన్లు నిలిపివేసినట్లు అధికారికంగా ధ్రువీకరించారు.
⇒ ప్రకాశం జిల్లావ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 33,310 మంది ఉన్నారు. రీ వెరిఫికేషన్‌లో ఇప్పటివరకు 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు 9 వేల మంది దివ్యాంగులకు అనర్హులంటూ నోటీసులు అందాయి. 85 నుంచి 90 శాతం అంగవైకల్యంతో ఇప్పటి వరకు పింఛను పొందుతుంటే రీ వెరిఫికేషన్‌లో సాధారణ వైకల్యం మాత్రమే ఉందని, పింఛన్‌కు అనర్హులని నోటీసులిచ్చారు. దీంతో సోమవారం ఒంగోలులో ‘మీ కోసం’ కార్యక్రమానికి నోటీసులతో దివ్యాంగులు పోటెత్తారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9,601 మంది దివ్యాంగులకు పింఛన్ నిలిపివేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వికలాంగులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మంచానికే పరిమితమైన వారిని జాబితా నుంచి తొలగించారు. కలెక్టర్, ఎంపీడీవో, సర్వజనాసుపత్రి, మున్సిపల్ కార్యాలయాల వద్ద వికలాంగులు మంగళవారం రోజంతా పడిగాపులు కాశారు. శ్రీసత్యసాయి జిల్లా అగళి, బత్తలపల్లి, తాడిమర్రి, హిందూపురం, అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లు, పామిడి తదితర ప్రాంతాల్లో బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు అర్హత ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు.
⇒ అన్నమయ్య జిల్లాలో దివ్యాంగుల పెన్షన్లు 29 వేలు ఉండగా 4 వేలకుపైగా పెన్షన్లు అనర్హుల జాబితాలో చేర్చారు.
⇒ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం దివ్యాంగ పెన్షన్లు 27,302 ఉండగా రీవెరిఫికేషన్ పేరుతో 10,205 పెన్షన్లు నిలిచిపోయాయి.
⇒ కృష్ణా జిల్లాలో 33,173 దివ్యాంగ పింఛన్లు ఉండగా వేల సంఖ్యలో నోటీసులు జారీ అయ్యాయి. అర్హులై పించన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్‌ఎస్ నారాయణ చెప్పారు.
⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 3,211 మంది దివ్యాంగులకు పింఛన్లు రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
⇒ బాపట్ల జిల్లాలో 24,660 దివ్యాంగ పింఛన్లు ఉండగా రీ వెరిఫికేషన్ పేరుతో 3,829 పింఛన్లను తొలగించేందుకు అధికారులు నోటీసులు అందజేశారు.
చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ నెల 18న ధర్నా చేస్తున్న దివ్యాంగులు
కూర్చోలేడు.. లేవలేడు...మాట్లాడలేడు..
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం దాదంవారిపల్లెకు చెందిన ఎన్.జయరామిరెడ్డి నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు. కనీసం కాలు, చేతులు కూడా కదిలించలేడు. మాట కూడా పడిపోయింది. మలమూత్రాలకు కూడా ఎత్తుకుని వెళ్లాలి. ఇంత దీనస్థితిలో ఉన్న ఆయన దివ్యాంగ పింఛన్‌ను రీ వెరిఫికేషన్ పేరుతో రూ.15 వేల నుంచి తొలగించి రూ.6 వేలకు మార్చారు. గతంలో 90 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ జారీ కాగా ఇప్పుడు 75 శాతానికే పరిమితం చేశారు. నిరక్షరాస్యుడైన ఆయన.. చదవగలడు, రాయగలడు, బరువులు ఎత్తగలడు అని వైక్యలం సర్టిఫికెట్‌లో నమోదు చేయడం గమనార్హం.
కోతలకే రీ వెరిఫికేషన్
వైఎస్ జగన్ పాలనలో దివ్యాంగుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించారు. ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. 100 శాతం వైకల్యం ఉన్న వారిని సైతం రీ వెరిఫికేషన్ పేరుతో వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు పిలిíపించి అమానుషంగా వ్యవహరిస్తున్నారు. పెన్షన్లలో కోత వేసేందుకే రీ వెరిఫికేషన్. నెలవారీ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– పూర్ణకంటి బాబురావు, దివ్యాంగుడు , వేమవరం జగ్గయ్యపేట
ఎలా బతకాలి?
నాకు యాక్సిడెంట్‌లో కాలు విరిగింది. డాక్టర్లు పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. గత ఆరేళ్లుగా పింఛను అందుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. మా కుటుంబం ఎలా బతకాలి?
అప్పలనాయుడు, కొవ్వలి గ్రామం, ఏలూరు జిల్లా
⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 32,101 దివ్యాంగ పింఛన్లున్నాయి. వీరిలో కదలలేని స్థితిలో ఉండేవారు 16,934 మంది కాగా దృష్టి లోపం ఉన్నవారు 4,036 మంది, వినికిడి లోపం ఉన్నవారు 3,992 మంది, మానసిక వైకల్యం ఉన్నవారు 3,751 మంది, మానసిక అనారోగ్యం బాధితులు 1,277 మంది, బహుళ వైకల్యం ఉన్నవారు 2,111 మంది ఉన్నారు. ఇప్పటివరకు సర్వేలో 24,213 మంది వివరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోనసీమ జిల్లాలో 2,899 పింఛన్లను రద్దు చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.
⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు 27,193 మంది ఉండగా 13,690 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. 1,289 మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు.
⇒ కాకినాడ జిల్లాలో 35 వేల మంది దివ్యాంగులు ఉండగా 24,000 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,300 దివ్యాంగ పింఛన్లు తొలగించారు.
⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్లు కోల్పోయిన దివ్యాంగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. డోన్, మద్దికెర, తుగ్గలి తదితర మండలాల్లో దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేశారు. 10,050 దివ్యాంగ పింఛన్లను తొలగిస్తూ నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం.
⇒ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 12,523 మందికి నోటీసులు జారీచేసి తొలగించడంతో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల బంగారుపాళ్యం మండల కేంద్రంలో ధర్నాకు దిగి రాకపోకలను నిలిపివేశారు. ఈనెల 18వ తేదీన చిత్తూరు కలెక్టరేట్‌లో వందలాది మంది దివ్యాంగులు బైఠాయించారు.
⇒ వైఎస్సార్ కడప జిల్లాలో 2.50 లక్షలకు పైగా పెన్షన్లు ఉండగా దివ్యాంగుల పింఛన్లు 40 వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 7,182 మంది దివ్యాంగులను అనర్హులుగా ప్రకటించారు.
⇒ విశాఖ జిల్లాలో మొత్తం 1,60,778 మంది పింఛన్లు పొందుతుండగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు 21,306 మంది ఉన్నారు. ప్రస్తుతం 1,178 మంది దివ్యాంగులకు పింఛన్లు నిలుపుదల చేశారు.
⇒ శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ పింఛన్‌దారులు 31,502 మంది ఉండగా 29,055 మందికి నోటీసులిచ్చారు. ఆగస్టులో 1,458 దివ్యాంగ పింఛన్లు తొలగించారు.
⇒ విజయనగరం జిల్లాలో 36,412 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతుండగా ప్రస్తుతం 6,770 పెన్షన్లు రద్దయ్యే పరిస్థితి నెలకొంది.
⇒ పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్న వారు 16,750 మంది ఉండగా పునఃపరిశీలన తర్వాత 2,781 మంది అనర్హులని తేల్చారు. దీంతో రెండు జిల్లాల్లో బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
⇒ అనకాపల్లి జిల్లాలో 30,688 మంది దివ్యాంగుల పెన్షన్లు పొందుతుండగా 3,339 మంది పెన్షన్లను తొలగించారు. 799 మంది దివ్యాంగులకు వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే జిల్లాలో 10,136 మంది వృద్ధాప్య పెన్షన్లను తొలగించింది.