old pension scheme
-
సమ్మెకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైరన్?
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 2024, మే ఒకటి నుంచి చేపట్టబోయే ఈ సమ్మెలో 28 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మూడు కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అమవుతున్న జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని పునరుద్ధరించాలని ఈ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ జాయింట్ ఫోరమ్(జేఎఫ్ఆర్ఓపీఎస్) ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మార్చి 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఫోరమ్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు ఫోరమ్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను పాటిస్తూ కేంద్రం ఎన్‌పీఎస్‌లో మార్పులు!
ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో ఈ ఏడాది చివరి నాటికి మార్పులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేస్తున్న కొన్ని మార్పులను ఈ ఏడాది చివరిలో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగి చివరిగా తీసుకున్న బేసిక్ జీతంలో 40-50% ఆధారంగా పెన్షన్‌కు హామీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను అనుసరించాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ పెన్షన్ కార్పస్‌లో లోటును పూరించడం మార్కెట్‌పై ఆధారపడుతుందన్నారు. ప్రస్తుతం ఎన్‌సీఎస్‌లో భాగంగా ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 10% జమ చేస్తారు. ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో మరో 14% జమ చేస్తుంది. అయితే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టబోయే ప్రతిపాదనల్లో ద్రవ్యోల్బణం అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రాబోయే సమావేశంలో దీనిపై మరింత చర్చించే అవకాశం ఉందని ఆ అధికారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పెన్షనర్లు డీఏతో పాటు తాము చివరిగా డ్రా చేసిన బేసిక్ జీతంలో 50% పొందే వీలుంది. ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి జాతీయ పెన్షన్ విధానాన్ని సవరించాలని, పాత పెన్షన్ విధానాన్ని పోలిన పథకాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఝార్ఖండ్ వంటి కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని కింద రాష్ట్రాలు తమ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్‌పై అధిక భారాన్ని భరిస్తున్నాయి. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధించిన కేంద్రం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) రెగ్యులేటర్ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం..ఎన్పీఎస్ నిర్వహణలో ఉన్న రూ.9 లక్షల కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వాటా 79% ఉంది. మార్చి 31, 2023 నాటికి ఎన్పీఎస్ అందించే వివిధ పథకాల ద్వారా 6.3కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఇందులో 60.72 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 23.86 లక్షల మంది ఉన్నారు. -
OPS దేశానికి గుది 'బండ'
-
పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: పాత పింఛన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ‘పెన్షన్ శంఖనాథ్ మహార్యాలీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20కిపైగా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వం తీసుకొచి్చన కొత్త పింఛన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి భరోసానిచ్చే పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని తేల్చిచెప్పారు. జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నిరసనకారులు వెల్లడించారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కొత్త పింఛన్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ కనీ్వనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. -
ఓపీఎస్‌కి దీటుగా పెన్షన్ స్కీమ్
సాక్షి, అమరావతి: పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)తో సమానంగా నూతన పెన్షన్ విధానం రూపుదిద్దుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. మంగళవారం వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అనేది ఉండదన్నారు. ఓపీఎస్‌తో సమానమైన పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. ఉద్యోగులు 50 శాతం బెనిఫిట్ పొందే విధంగా ఈ విధానం ఉంటుందన్నారు. కేబినెట్లో తీసుకునే నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వ హయాంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో పలు సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చారన్నారు. 32 శాఖలకు సంబంధించి సుమారు 454 అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తేగా 330 అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయన్నారు. తక్కువ వ్యవధిలో ఇన్ని సమస్యలు పరిష్కరించడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇప్పటికే జీపీఎఫ్ బకాయిలు, సరెండర్ లీవులు, ఏపీజీఎల్ఐ పెండింగ్ బిల్లులను చెల్లించారని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో సమస్యలను పరిష్కరించేందుకు ఆరోగ్యశ్రీ ïసీఈఓ ఖాతాలో హెల్త్ కార్డ్ డబ్బులను ఈ నెల నుంచే జమ చేస్తారని చెప్పారు. గతంలో ఓ సీఎం మాట తప్పారు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబధ్దీకరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన తర్వాత తాము అలా ఎప్పుడు చెప్పామంటూ గతంలో ఒక ముఖ్యమంత్రి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు సీఎం జగన్ హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తున్నారని తెలిపారు. సుమారు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీలు, సహకార సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచనున్నారని తెలిపారు. స్పెషల్ పే చెల్లించేందుకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలను పదవీ విరమణ తర్వాత ఇవ్వాలని తొలుత భావించినా ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు నాలుగేళ్లలో 16 విడతలుగా సుమారు రూ.7,382 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.76 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందన్నారు. పద్ధతి ప్రకారం చెల్లింపులు తాము చేసిన ఉద్యమం వల్లే ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేస్తున్నట్లు కొన్ని ఉద్యోగ సంఘాలు గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేయడం సరికాదని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమైన పెద్ద అంశాలపై మాత్రమే ఉద్యమాలు నిర్వహించగా ఇప్పుడు కొన్ని సంఘాలు ఎందుకు ఉద్యమం చేస్తున్నాయో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వడం లేదని, ఒక పద్ధతి ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో పీఆర్సీ కమిషన్ నియమించాలని ఉద్యమాలు జరగగా ఇప్పుడు ప్రభుత్వం ముందుగానే నియమిస్తోందని గుర్తు చేశారు. చదవండి: ఆకాశమే హద్దుగా.. ఎగుమతుల్లో ఏపీ దూకుడు -
కేంద్ర ఉద్యోగుల్లో కొందరికి పాత పెన్షన్
న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ విధానం(ఎన్పీఎస్) అమల్లోకి వచ్చిన 2003 డిసెంబర్ 22వ తేదీకి ముందే ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ‘పాత పెన్షన్’ స్వీకరించే అవకాశం పొందారు. అంటే ఆ తేదీ కంటే ముందే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్/అడ్వర్ట్టైజ్డ్ చేసిన పోస్టుల్లో చేరిన ఉద్యోగులు మాత్రమే పాత పెన్షన్ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరేందుకు వన్–టైమ్ ఆప్షన్ ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర సిబ్బంది శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ‘ఎన్పీఎస్ నోటిఫికేషన్‌కు ముందే ప్రకటించిన పోస్టులు/ఖాళీలకు అనుగుణంగా ఎంపికైనందున పాత పెన్షన్ స్కీమ్‌ను తమకు వర్తింపజేయాలని 2003 డిసెంబర్ 22కు ముందు కేంద్ర ఉద్యోగాల్లో చేరిన వారి వినతులు మాకు అందాయి. పలు రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనళ్లు వెలువర్చిన తీర్పులు, ఆ ఉద్యోగుల అభ్యర్థనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఉత్వర్వులో కేంద్రం పేర్కొంది. -
‘అధికారంలోకి వస్తే పాత పింఛను విధానం’
న్యూఢిల్లీ/వడోదర: గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ, ఆప్ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఇదే చేశామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్ చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వడోదరలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇదే హామీ ఇచ్చారు. ఉద్యోగులు డిమాండ్ల సాధనకు రోడ్లెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే -
పాపం ఈ కుర్రాళ్లు .. పుట్టుకతో వృద్ధులు
చెన్నై: సహజంగా అందరూ వృద్ధాప్యంలోనూ యవ్వనవంతులుగా ఉండాలని కోరుకుంటారు. అయితే తమిళనాడులో కొందరు యవ్వనంలోనే సీనియర్ సిటిజన్స్‌గా ప్రచారంగా చేసుకుంటూ “కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’అనే శ్రీశ్రీ రాసిన కవితను తలపిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి వృద్ధ్యాప్య పింఛను స్వాహా చేస్తున్న చెన్నై, కాంచీపురం జిల్లాలకు చెందిన 4,191 మంది పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో వృద్ధ్యాప్య పింఛను కూడా ఒకటి. బంధువుల ఆసరా లేకుండా, సొంతిల్లు, రెండు వంట గ్యాస్ సిలిండర్ల కనెక్షన్, బ్యాంకులో రూ.1 లక్షకు మించని నగదు, 5 సవర్లకు మించని బంగారు నగలు తదితర నిబంధనలకు లోబడి జీవించే 60 ఏళ్లు పైబడిన వారు వృద్ధ్యాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికేట్లు తనిఖీ చేసిన తరువాత అర్హత ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలకు రూ.1000 పింఛను మంజూరు చేస్తారు. అవకతవకలపై ఫిర్యాదులు పెన్షన్ మంజూరులో రాష్ట్రవ్యాప్తంగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కాంచీపురం జిల్లాలో 60,500 మంది పింఛను పొందుతున్నారు. వీరిలో కొందరు మంచి వసతులతో కూడిన జీవిస్తున్నా తప్పుడు పత్రాలను సమర్పించి పెన్షన్ పొందుతున్నట్లు అనుమానాలు తలెత్తడంతో అధికారుల బృందం విచారణ ప్రారంభించింది. ఆయా తాలూకాల, గ్రామ నిర్వాహకుల కార్యాలయాలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల సాయంతో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. ఒక్క కాంచీపురం జిల్లాల్లోనే 4,180 మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారందరిని వృద్ధ్యాప్య పింఛనుకు అనర్హులుగా ప్రకటించి లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ఇక చెన్నై జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పథకం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు 1.95 లక్షల మంది పింఛన్ పొందుతున్నారు. వీరిలో కొందరు నకిలీ లబ్ధిదారులని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. 11 వేల బోగస్ పింఛనుదారులను జాబితా నుంచి తొలగించారు. రెండు జిల్లాల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ లబ్ధిదారులు పట్టుబడటంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: చెన్నైలోని ఐసీఎఫ్.. ప్రపంచ దేశాల్లో ఈ పేరు మారుమోగుతోంది.. ఎందుకో తెలుసా! -
సీపీఎస్ గుదిబండ
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)తో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. సీపీఎస్ విధానం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విధానం అమలు చేయడం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ఎలాంటి జీవితాన్ని గడపాల్సివస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. పదవీ విరమణ తరువాత భద్రత లేని జీవితాన్ని గడపాల్సివస్తుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, నెల్లూరు (పొగతోట): ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంకట పరిస్థితుల్లో పడ్డారు. సీపీఎప్ విధానాన్ని 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్ విధానం షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది. ఉద్యోగుల ఆందోళన సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రంలో 1.80 లక్షల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 12,200 మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయ డం, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులు ఖండిస్తున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగులను మభ్యపెట్టడానికేనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నా అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని నాటకాలాడుతోందని సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. జననేత ఇచ్చిన హామీపై సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విధానంతో సీపీఎస్ ఉద్యోగి మరణించినా, పదవీ విరమణ చేసినా ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లభించవు. పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు సర్వీస్‌లో ఉండగా మరణిస్తే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. భార్యకు ప్యామిలీ పెన్షన్ వస్తుంది. ఇతర రాయితీలు పొందే అవకాశం ఉండేది. మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి నానా అవస్థలు పడుతున్నాయి. దీంతో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీసీపీఎస్ఈఏ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. సీపీఎస్ ఉద్యోగులను శాంతపరిచేందుకు కంటితుడుపుగా ప్రభుత్వం గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అమలుకు జీఓ 121ను జారీ చేసినా ఇంతవరకు మార్గదర్శకాలు ఇవ్వలేదు. జీఓ వల్ల ఎలాంటి న్యాయం జరగలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఇప్పటివరకు వందల సార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులను ఉద్యమాల బాట నుంచి బయటకు తీసుకువచ్చేందుకే ప్రభుత్వం కమిటీ వేయనుందని సీపీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌కు సంబంధించి 653, 654, 655 జీఓలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. షేర్ మార్కెట్లతో సంబంధం లేకుండా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పాత పెన్షన్ విధానంతో లాభాలు ♦ ప్రభుత్వ హామీ ఉంటుంది. ♦ సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్ మొత్తం పెంపు ♦ పదవీ విరమణ తరువాత హెల్త్‌కార్డులు ♦ ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు. ♦ పెన్షన్‌కు ప్రతి నెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఉద్యోగి మరణించేంత వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ♦ గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది. ♦ కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సినప్పుడు జీపీఎస్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ జీవితాంతం పెన్షన్ మొత్తానికి ఢోకా ఉండదు. సీపీఎస్‌తో నష్టాలు ♦ షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదు. ♦ ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ప్లాన్ ఆధారంగా పెన్షన్ మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు. ♦ కార్పొరేట్ శక్తులు నిర్ణయిస్తాయి. ♦ ఆరోగ్య కార్డులు వర్తిస్తాయో లేదో తెలియని పరిస్థితి. ♦ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి. ♦ ప్రతి నెలా మూల వేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి. ♦ ఉద్యోగులు పదవీ విరమణ చేసేంత వరకు 10 శాతం మాచింగ్ గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. ♦ పదవీ విరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు. ♦ కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ప్రాన్ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి సీపీఎస్ ఉద్యోగులు భద్రత లేని జీవితాన్ని గుడుపుతున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని పోరాటాలు చేశాం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడంతో కమిటీ వేశారు. కమిటీ కాలయాపన చేస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు తీవ్ర నిరాశ చెందుతున్నాయి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలి. – ఎం.హరి, ఏపీసీపీఎస్ఈఏ జిల్లా సహాధ్యక్షుడు ఉద్యోగులు అభద్రత భావంతో ఉన్నారు సీపీఎస్ విధానంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు అభద్రత భావంతో ఉన్నారు. ఉద్యోగులకు భవిష్యత్ జీవనానికి భద్రత లేకుండా ఉంది. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చేది భిక్ష కాదు. పెన్షన్ అనేది మా హక్కు. – బి.ప్రవీణ్‌కుమార్, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నాం. సీపీఎస్ విధానంపై ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది. కమిటీ నివేదికలను సమర్పించకుండా చేతులు దులుపుకుంది. సీపీఎస్ విధానం రద్దుపై కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశాలతో ఉన్నాం. వచ్చే ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులకు భరోసా కల్పించాలి. – ఆర్.రామకిషోర్, ఏపీసీపీఎస్ఈఏ జనరల్ సెక్రటరీ -
పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ : విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సామూహిక నిరహార దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాగి రాములు కోరారు. ఆదివారం ఐబీలో నిరాహార దీక్ష వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మట్లాడుతూ కంట్రిబ్యూషన్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అరోగ్యకార్డులు అన్ని కార్పోరేట్, ప్రయివేట్ అసుపత్రులలో అన్ని రకాల జబ్బులకు ఉచిత చికిత్సలతో పాటు ఓపీ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, దత్తాత్రి, భాస్కర్‌దేశ్, నర్సింలు, తిరుపతి, అశోక్ తధితరులు పాల్గొన్నారు.