కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)తో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. సీపీఎస్ విధానం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విధానం అమలు చేయడం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ఎలాంటి జీవితాన్ని గడపాల్సివస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. పదవీ విరమణ తరువాత భద్రత లేని జీవితాన్ని గడపాల్సివస్తుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, నెల్లూరు (పొగతోట): ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంకట పరిస్థితుల్లో పడ్డారు. సీపీఎప్ విధానాన్ని 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్ విధానం షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది.
ఉద్యోగుల ఆందోళన
సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రంలో 1.80 లక్షల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 12,200 మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయ డం, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులు ఖండిస్తున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగులను మభ్యపెట్టడానికేనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నా అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని నాటకాలాడుతోందని సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. జననేత ఇచ్చిన హామీపై సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విధానంతో సీపీఎస్ ఉద్యోగి మరణించినా, పదవీ విరమణ చేసినా ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లభించవు. పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు సర్వీస్‌లో ఉండగా మరణిస్తే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. భార్యకు ప్యామిలీ పెన్షన్ వస్తుంది. ఇతర రాయితీలు పొందే అవకాశం ఉండేది. మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి నానా అవస్థలు పడుతున్నాయి.
దీంతో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీసీపీఎస్‌ఈఏ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. సీపీఎస్ ఉద్యోగులను శాంతపరిచేందుకు కంటితుడుపుగా ప్రభుత్వం గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అమలుకు జీఓ 121ను జారీ చేసినా ఇంతవరకు మార్గదర్శకాలు ఇవ్వలేదు. జీఓ వల్ల ఎలాంటి న్యాయం జరగలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఇప్పటివరకు వందల సార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులను ఉద్యమాల బాట నుంచి బయటకు తీసుకువచ్చేందుకే ప్రభుత్వం కమిటీ వేయనుందని సీపీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌కు సంబంధించి 653, 654, 655 జీఓలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. షేర్ మార్కెట్లతో సంబంధం లేకుండా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
పాత పెన్షన్ విధానంతో లాభాలు
♦ ప్రభుత్వ హామీ ఉంటుంది.
♦ సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్ మొత్తం పెంపు
♦ పదవీ విరమణ తరువాత హెల్త్‌కార్డులు
♦ ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు.
♦ పెన్షన్‌కు ప్రతి నెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు.
♦ ఉద్యోగి మరణించేంత వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది.
♦ గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది.
♦ కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సినప్పుడు జీపీఎస్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు.
♦ జీవితాంతం పెన్షన్ మొత్తానికి ఢోకా ఉండదు.
సీపీఎస్‌తో నష్టాలు
♦ షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదు.
♦ ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ప్లాన్ ఆధారంగా పెన్షన్ మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు.
♦ కార్పొరేట్ శక్తులు నిర్ణయిస్తాయి.
♦ ఆరోగ్య కార్డులు వర్తిస్తాయో లేదో తెలియని పరిస్థితి.
♦ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి.
♦ ప్రతి నెలా మూల వేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి.
♦ ఉద్యోగులు పదవీ విరమణ చేసేంత వరకు 10 శాతం మాచింగ్ గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది.
♦ పదవీ విరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు.
♦ కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ప్రాన్ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
సీపీఎస్ ఉద్యోగులు భద్రత లేని జీవితాన్ని గుడుపుతున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని పోరాటాలు చేశాం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడంతో కమిటీ వేశారు. కమిటీ కాలయాపన చేస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు తీవ్ర నిరాశ చెందుతున్నాయి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలి.
– ఎం.హరి, ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా సహాధ్యక్షుడు
ఉద్యోగులు అభద్రత భావంతో ఉన్నారు
సీపీఎస్ విధానంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు అభద్రత భావంతో ఉన్నారు. ఉద్యోగులకు భవిష్యత్ జీవనానికి భద్రత లేకుండా ఉంది. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చేది భిక్ష కాదు. పెన్షన్ అనేది మా హక్కు.
– బి.ప్రవీణ్‌కుమార్, ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నాం. సీపీఎస్ విధానంపై ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది. కమిటీ నివేదికలను సమర్పించకుండా చేతులు దులుపుకుంది. సీపీఎస్ విధానం రద్దుపై కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశాలతో ఉన్నాం. వచ్చే ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులకు భరోసా కల్పించాలి.
– ఆర్.రామకిషోర్, ఏపీసీపీఎస్‌ఈఏ జనరల్ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment