సాక్షి, నెల్లూరు: జిల్లాలో వైఎస్ జగన్ హవాతో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. గతంలో అనేక ప్రభంజనాలు ఉన్న సమయంలో ప్రతిపక్షం ఒక స్థానం గెలుచుకొని ఉనికి చాటుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ మొదటిసారిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిన్నటి వరకు అధికారపార్టీగా ఉన్న తెలుగుదేశం కనీసం ప్రతిపక్ష ఉనికి లేకుండా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు సమష్టి కృషి కూడా నూరు శాతం ఫలించి అభ్యర్థులను భారీ మెజార్టీతో విజయతీరాలకు చేర్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా పనిచేయడం దానికి వైఎస్ జగన్ మానియా బలంగా తోడవడంతో గెలుపు సునాయాసమైంది.
నెల్లూరు నగరంతో సహా అన్ని నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ నుంచి మొదలైన ఆధిక్యం చివరి వరకు కొనసాగింది. నెల్లూరు సిటీలో మాత్రం చివరి వరకు పూర్తి ఉత్కంఠగా నువ్వా.. నేనా.. అనే రీతిలో సాగినా చివరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌యాదవ్ 1287 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల్లోనూ మంచి మెజార్టీలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉదయగిరి, కోవూరులలో రికార్డు స్థాయిలో మెజార్టీలు రావడం విశేషం అలాగే ఆత్మకూరు, కావలిలోనూ మంచి మెజార్టీలు లభించాయి. 17వ రౌండ్ ముగిసే నాటికి నెల్లూరు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి 1,24,680 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అలాగే తిరుపతి పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 2.24 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
జిల్లాలో సూళ్లూరుపేటే టాప్. .
జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య రికార్డు స్థాయిలో 61,417 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గూడూరు నియోజకవర్గం నుంచి వెలగపల్లి వరప్రసాద్‌రావు 45,416 ఓట్ల మెజార్టీతో, కోవూరు నియోజకవర్గం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 39,769 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి 38,720 ఓట్ల మెజార్టీతో, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి 19,510 మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఉదయగిరి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 36,081 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి 21,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే కావలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 13 817 ఓట్ల మెజార్టీతో, నెల్లూరు సిటీ నుంచి పి.అనిల్‌కుమార్‌యాదవ్ 1,287 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
జనసేనకు డిపాజిట్ నిల్
మరోవైపు జిల్లాలో అధికారపార్టీ నుంచి బరిలో నిలిచిన మంత్రులు, హేమాహేమీలు పూర్తిగా మట్టికరిచారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, బడా నేతలుగా ఉన్న బొల్లినేని కృష్ణయ్య, బీద మస్తానరావు ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ నుంచి 2014లో గెలుపొందిన సిటింగ్ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని వెంకటరామారావు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతుల్లో ఘోరంగా ఓడిపోయారు. అలాగే పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన సునిల్‌ను కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రికార్డు స్థాయిలో ఓడించారు. ఇక జిల్లాలో జనసేన ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కించుకోని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment