Contributory pension scheme
-
‘‘సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు’’ ఇదే మా నినాదం.. పోరాటం
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలి... పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలి’అంటూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) గొంతెత్తింది. 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఈ సభకు హాజరై సీపీఎస్ రద్దుకు గొంతు కలిపారు. 2 లక్షల కుటుంబాల చిరకాల వాంఛ ఇది ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. ‘ఐదేళ్ల క్రితం సీపీఎస్ రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమాధానం దొరికింది. సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా ఈ పథకం కింద జమ అయిన నిధులను వెనక్కు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల చిరకాల వాంఛ సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీ మాదిరి కాకుండా ఎన్నికలకు ముందే సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. వెనువెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే వారే. ప్రభుత్వం ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరించి అమలు చేసేవారు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా సీపీఎస్‌ను రద్దు చేయాలి’అని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి పోవడం లేదని, ఆయనకు సుదీర్ఘంగా వివరిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకోసమే రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. జిల్లాలను చుట్టి.. రాజధానికి చేరి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ రద్దుపై విస్తృత అవగాహన కలి్పంచేందుకు టీఎస్సీపీఎస్ఈయూ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను తలపెట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచి పాత పెన్షన్ ఆవశ్యకత, సీపీఎస్ రద్దుపై విపులంగా వివరించి అభిప్రాయ సేకరణ జరిపింది. పక్షం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాద్‌లో సీపీఎస్ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పోటెత్తిన వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షులు విజయకుమార్ బంధు, పంజాబ్ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్ సింగ్, కర్ణాటక సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ నాయకుడు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటేష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, సురేష్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్య క్షుడు మహిపాల్ రెడ్డి, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ఇరువురు సీఎంలతో చర్చ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఇరువురు సీఎంలతో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చిస్తాం. అదేవిధంగా జార్ఖండ్‌లో అమలు చేస్తున్న పాత పెన్షన్ స్టాండింగ్ ఆపరేటింగ్ గైడ్‌లైన్స్ వివరిస్తాం. –విక్రమ్ సింగ్, జార్ఖండ్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు మేమూ ఎదురుచూస్తున్నాం తెలంగాణలో సీపీఎస్ రద్దుకోసం మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పాత పెన్షన్ కోసం పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. –విటేష్ ఖండేల్కర్, మహారాష్ట్ర సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు కేసీఆర్ దేశ్‌కీ నేతా అయ్యేందుకు ఇదే చాన్స్ తెలంగాణలోని రెండు లక్షల ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుకరిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ్‌కి నేతా అయ్యేందుకు ఇదే మంచి అవకాశం. – విజయ్‌కుమార్ బంధు, సీపీఎస్ జాతీయ అధ్యక్షుడు -
ఉద్యోగికి ‘గ్యారెంటీ’ భరోసా.. సీపీఎస్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా జీపీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత, కాంట్రాక్టు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను రూపొందించింది. దీనిద్వారా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరనుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్, ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కరువు భృతి (డీఆర్) ఇవ్వడం ద్వారా మెరుగైన పెన్షన్‌ను అందించనుంది. దీంతోపాటు ఉద్యోగులు అడగకుండానే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి కీలక అంశాలకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మాట ప్రకారం సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రతనిచ్చేలా రూపొందించిన జీపీఎస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగుల జీతాలను దాటేస్తుంది.. సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లేకపోవడంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సంతకం చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. కానీ ఆ తర్వాత ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలిపి రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లకు చేరుతుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ను తీసుకొచ్చాం. సీపీఎస్‌తో అనిశ్చితి.. ప్రస్తుత సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని 40 శాతం సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పడితే రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండటం లేదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి వస్తుండటంతో భద్రత ఉండటం లేదు. జీపీఎస్‌తో గ్యారంటీ ఇలా.. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పూర్తి గ్యారంటీ ఇస్తుంది. ఇందులోనూ సీపీఎస్‌లో చెల్లించినట్లే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తుంది. ఉదాహరణకు రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే అందులో రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే 82 ఏళ్ల వయసులో జీపీఎస్ ద్వారా రూ.1,10,000 పెన్షన్‌గా తీసుకుంటారు. తద్వారా రిటైర్డ్ ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటు లేదు. దేశానికే ఆదర్శంగా జీపీఎస్ దేశంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఓపీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించినా అమల్లోకి తీసుకురాలేకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేసి జీపీఎస్‌ను తీసుకొస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవనుంది. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయం క్రమంగా పెరుగుతూ రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. మాట ఇచ్చి.. నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కటాఫ్ తేదీకి 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే సీఎం జగన్ ఐదేళ్లకు తగ్గించారు. దీంతో మేనిఫెస్టో హామీల్లో 99.50 శాతం అమలు చేసినట్లైంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఒకేలా హెచ్ఆర్ఏ ఉండేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా కొన్ని జిల్లా కేంద్రాల్లో 12 «శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ 16 శాతానికి పెరుగుతుంది. 2022 జనవరి 1వతేదీ నుంచి డీఏ, డీఆర్ 2.73 శాతం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. 6,840 కొత్త పోస్టుల మంజూరు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెచ్చింది. వివిధ శాఖల్లో సుమారు 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. వీటిల్లో 3,920 రిజర్వ్ పోలీసు ఉద్యోగాలు సహా నూతన వైద్య కళాశాలలు, పలు విద్యా సంస్థల్లో భారీ ఎత్తున కొత్త పోస్టులను కల్పించింది. ప్రభుత్వంలోకి వైద్య విధాన పరిషత్ ఏపీ వైద్య విధాన పరిషత్ 1986 యాక్ట్‌ను రద్దు చేసి ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ శాఖగా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలుగా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ స్వయం ప్రతిపత్తి నుంచి ప్రభుత్వంలోకి మారడం ద్వారా 14,658 మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలను చెల్లించనుంది. -
సీపీఎస్ ఉద్యోగుల తొలి డైరీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలో పనిచేస్తోన్న ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రూపొందించిన తొలి డైరీని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. అనంతరం నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... సీపీఎస్ ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని ఈ డైరీలో పొందుపరిచామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో ప్రధానాంశం సీపీఎస్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు అంశమే రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతుందని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రెటరీ జనరల్ గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని చరక్ భవన్ గ్రౌండ్లో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుంభమేళా నిర్వహించారు. కార్యక్రమంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికే ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసిందని, మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.లక్షల కోట్ల కార్పొరేట్ కంపెనీల అప్పులు రద్దు చేసినప్పుడు కలగని నష్టం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు చేస్తే వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహాకాళుడి సాక్షిగా ఉజ్జయిని నగరంలో ‘ఓట్ ఫర్ ఓపీఎస్’ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విజయకుమార్ బంధు (ఉత్తరప్రదేశ్), వితీశ్ ఖండేల్కర్ (మహారాష్ట్ర), కల్వల్ శ్రీకాంత్, నరేశ్ గౌడ్ (తెలంగాణ) తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్‌పై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
సాక్షి, విజయవాడ: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో రేపు(బుధవారం) ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని 20 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం అందించింది. సీపీఎస్ రద్దు అంశంపై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. -
సీపీఎస్ ఉద్యోగులకు పింఛన్ మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కారు
సాక్షి, హైదరాబాద్: కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్) పరిధిలోనికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబ పింఛన్ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గతేడాది జూన్ 11న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలతో సర్క్యులర్‌ను రాష్ట్ర ట్రెజరీ శాఖ మంగళవారం అన్ని జిల్లాలకు పంపింది. ఈ సర్క్యులర్ ప్రకారం చనిపోయిన లేదా విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న ఉద్యోగి తన చివరి నెలలో డ్రా చేసే వేతనంలోని 33 శాతాన్ని అతని కుటుంబానికి పింఛన్ కింద ఇవ్వ నున్నారు. అదేవిధంగా గతంలో ఉద్యోగి వేతనం నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్‌ను మినహాయించుకోకపోయినా, పింఛన్ కోసం శాశ్వత అకౌంట్ నెంబర్ (ప్రాన్) లేకపోయినా ఈ పింఛన్ విధానం వర్తించనుంది. ఈ ఉత్తర్వులు రాకముందే చనిపోయి లేదా ఉద్యోగ విధుల్లో లేకుండా ఉండి అరకొర పింఛన్‌తో వెళ్లదీస్తోన్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పింఛన్ వర్తించనుంది. తద్వారా 1,500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్ మంజూరయ్యేందుకు మార్గం సుగమం అయింది. ఈ ఉత్తర్వుల జారీ పట్ల తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పింఛన్ పథక ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. కుటుంబ పింఛన్ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్‌కు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ కృతజ్ఞతలు తెలిపారు. తమ యూనియన్ వినతి మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సంతోషదాయకమని యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, ౖఅధ్యక్షుడు నరేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. -
సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటాం: బొత్స
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. కమిటీ వేశామని.. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని తెలిపారు. దానిపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని చెప్పారు. ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాదాంతం ఎందుకు చేస్తున్నాయని మండిపడ్డారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ కానుంది. సోమవారం సాయంత్రం మంత్రులు, జాయింట్ స్టాఫ్ కమిటీ సభ్యులతో సమావేశం జరగనుంది. 16 ఉద్యోగ సంఘాలను సంప్రదింపులకు ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
సీపీఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక
సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఈ జాబితాలో చేర్చాలని చెప్పారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్), కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం జీవోలు జారీ చేసి, ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి, టర్మ్ అయిపోయాక అమలవుతుందని చెప్పిన ఘనత గత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ జీవోలను అమలు చేశామని వివరించారు. మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కూడా మన ప్రభుత్వమే అమలు చేసిందని స్పష్టం చేశారు. – కాంట్రిబ్యూటరీ పింఛను పథకానికి (సీపీఎస్) సంబంధించిన సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు. – రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 మంది ఉండగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉన్నారని, మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు. వీరికి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తే రూ.23 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. – ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ విజయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్), కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీపీఎస్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని వివరించారు. వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు. వారికి ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు. (గడువులోగా పోలవరం పూర్తి కావాల్సిందే) వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. అయితే తన ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కూడా అమలు చేశామని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
సీపీఎస్ రద్దుపై వర్కింగ్ కమిటీ
సాక్షి, అమరావతి : కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్) రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ కమిటీని నియమించింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్, వైద్య శాఖ కార్యదర్శులు ఉన్నారు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నియమించింది. ఎన్పీ టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తుంది. జూన్ 30లోపు నివేదిక అందజేయాలని వర్కింగ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. -
సీపీఎస్ రద్దుకు సర్కారు కసరత్తు
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ విషయంలో ఎదురయ్యే అవరోధాలేమిటి? వీటిని ఎలా అధిగమించాలి? అనే అంశాలపై దృష్టి సారించింది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆ హామీ అమలుపై చర్యలు ప్రారంభించారు. రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ ఠక్కర్ అధ్యక్షతన గత సర్కారు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు గల సాధ్యాసాధ్యాలను వివరిస్తూ ఠక్కర్ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కచ్చితంగా నిర్ణయిస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా ఎంత అదనపు భారం పడుతుంది? సీపీఎస్ రద్దు చేయకుండా, ఉద్యోగులకు నష్టం జరగకుండా చూడాలంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో కూడా ఈ కమిటీ కూలంకషంగా వివరించింది. అయితే, ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనని నిర్ణయించారు. పెన్షన్ విధానం పునరుద్ధరణకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఠక్కర్ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలను మంత్రివర్గ ఉపసంఘం ప్రధానంగా పరిశీలించనుంది. నలుగురు మంత్రులతో ఉపసంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైద్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ఠక్కర్ కమిటీ నివేదికను అధ్యయనం చేయనుంది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు. ఉద్యోగుల సంఘం హర్షం సీపీఎస్ రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ స్వాగతించారు. సీసీఎస్ రద్దుకు అనువుగా త్వరితగతిన నివేదిక సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘానికి తమ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ‘‘మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించలేదు. అయినా ఈ ఉపసంఘం త్వరగా నివేదిక ఇస్తుందని అసోసియేషన్ ప్రతినిధులతో పాటు సీపీఎస్ ఉద్యోగులంతా ఎంతో నమ్మకంతో ఉన్నారు’’ అని రామాంజనేయులు యాదవ్ పేర్కొన్నారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి నష్టమేతప్ప లాభం లేదని పేర్కొంది. పాత పద్ధతిలోనే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని కోరింది. శనివారం ఇక్కడ నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గ భేటీ జరిగింది. సమావేశంలో 18 అంశాల పై తీర్మానాలు చేశారు. తీర్మానాల ప్రతిని ప్రభుత్వానికి సమర్పించి వీటిని మంజూరు చేయించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వి.మమత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఐఆర్, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరారు. ఏపీలో పని చేస్తున్న 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించాలని, ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. బడిబాట తర్వాతే హేతుబద్ధీకరణ చేపట్టాలి బడిబాట కార్యక్రమం తర్వాతే పాఠశాలల హేతుబ ద్ధీకరణను చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాలనలో భాగంగా చేపట్టే సంస్కరణలకు ఉద్యోగులు సహకరిస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని, వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. 010 పద్దు కింద గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ, వర్సిటీలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి జూన్, జూలైల్లో సాధారణ బదిలీ లకు అనుమతించాలన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 36 లో ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన ఇళ్లస్థలాలను టీఎన్జీవోలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లకే పదోన్నతి కల్పించాలి... పదోన్నతి కోసం ప్రస్తుతమున్న మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు కుదించాలని కోరారు. రెవెన్యూ శాఖను విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనంగా 15% పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యమంలో పాల్గొన్నందున వాళ్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, అవు ట్ సోర్సింగ్ ఉద్యోగులకు సెలవు ప్రయోజనాలను కల్పించాలని, కొత్త జిల్లాలకు సరిపడా క్యాడర్‌ను మంజూరు చేయాలన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. -
మడమ తిప్పని హామీకే..మద్దతు
సాక్షి, బాపట్ల : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)తో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. సీపీఎస్ విధానం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విధానం అమలుచేయడం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ఎలాంటి జీవితాన్ని గడపాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. షేక్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. పదవీ విరమణ తరువాత భద్రత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సీపీఎస్ వల్ల సంకట పరిస్థితులు ఏళ్ళ తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంకట పరిస్థితుల్లో పడ్డారు. సీపీఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ ఒకటో తేది నుంచి ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్‌ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది. ఉద్యోగుల ఆందోళన సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రంలో 1.80లక్షల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో సుమారు 15వేలకు పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయడం, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేయించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్యోగులు ఖండిస్తున్నారు. ఎన్నో ఆందోళనలు చేశామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ హామీ ఇచ్చారు. జననేత ఇచ్చిన హామీపై సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంతో కలిగే లాభాలు ప్రభుత్వ హామి ఉంటుంది. సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్ మొత్తం పెంపు పదవీ విరమణ తర్వాత హెల్త్‌కార్డులు ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు. పెన్షన్‌కు ప్రతినెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి మరణించేంతవరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది. జీవితాంతం పెన్షన్ మొత్తానికి ఢోకా ఉండదు సీపీఎస్‌తో కలిగే నష్టాలు షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామి ఉండదు. ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ఫ్లాన్ ఆధారంగా పెన్షన్‌మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి. ప్రతినెలా మూలవేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి. ఉద్యోగులు పదవీవిరమణ చేసేంతవరకు 10 శాతం మాచింగ్ గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. పదవీవిరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు. కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ప్రాన్ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో ఆర్టీఐ చట్టం కింద సీపీఎస్ విధానం రద్దు చేసే అధికారం ఎవరిది అని కేంద్రానికి ఒక లేఖ రాశాం. దాని ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశాం. ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానంతో మాకు ఎంతో మేలు చేకూరుతుంది. – ఆయూబ్, వీఆర్వో ఉద్యోగులను బిచ్చగాళ్లను చేస్తోంది సీపీఎస్ విధానం ఉద్యోగులను పదవీవిరమణ తర్వాత బిచ్చగాళ్లుగా మార్చేవిధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి సీబీఐకి సాధారణ సమ్మతిని తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం మన భారతరాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉన్న అర్టికల్ 246(3) ప్రకారం, అర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సర్వీస్ మాటర్స్‌కు సంబంధించి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుండా తీర్మానాలు, కమిటీలు, కేంద్రానికి లేఖలు అనే పేరుతో కాలయాపన చేయడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే. – కె. పార్ధసారథి, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి -
సీపీఎస్ గుదిబండ
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)తో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. సీపీఎస్ విధానం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విధానం అమలు చేయడం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ఎలాంటి జీవితాన్ని గడపాల్సివస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. పదవీ విరమణ తరువాత భద్రత లేని జీవితాన్ని గడపాల్సివస్తుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, నెల్లూరు (పొగతోట): ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంకట పరిస్థితుల్లో పడ్డారు. సీపీఎప్ విధానాన్ని 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్ విధానం షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది. ఉద్యోగుల ఆందోళన సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రంలో 1.80 లక్షల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 12,200 మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయ డం, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులు ఖండిస్తున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగులను మభ్యపెట్టడానికేనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నా అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని నాటకాలాడుతోందని సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. జననేత ఇచ్చిన హామీపై సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విధానంతో సీపీఎస్ ఉద్యోగి మరణించినా, పదవీ విరమణ చేసినా ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లభించవు. పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు సర్వీస్‌లో ఉండగా మరణిస్తే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. భార్యకు ప్యామిలీ పెన్షన్ వస్తుంది. ఇతర రాయితీలు పొందే అవకాశం ఉండేది. మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి నానా అవస్థలు పడుతున్నాయి. దీంతో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీసీపీఎస్ఈఏ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. సీపీఎస్ ఉద్యోగులను శాంతపరిచేందుకు కంటితుడుపుగా ప్రభుత్వం గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అమలుకు జీఓ 121ను జారీ చేసినా ఇంతవరకు మార్గదర్శకాలు ఇవ్వలేదు. జీఓ వల్ల ఎలాంటి న్యాయం జరగలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఇప్పటివరకు వందల సార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులను ఉద్యమాల బాట నుంచి బయటకు తీసుకువచ్చేందుకే ప్రభుత్వం కమిటీ వేయనుందని సీపీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌కు సంబంధించి 653, 654, 655 జీఓలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. షేర్ మార్కెట్లతో సంబంధం లేకుండా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పాత పెన్షన్ విధానంతో లాభాలు ♦ ప్రభుత్వ హామీ ఉంటుంది. ♦ సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్ మొత్తం పెంపు ♦ పదవీ విరమణ తరువాత హెల్త్‌కార్డులు ♦ ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు. ♦ పెన్షన్‌కు ప్రతి నెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఉద్యోగి మరణించేంత వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ♦ గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది. ♦ కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సినప్పుడు జీపీఎస్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ జీవితాంతం పెన్షన్ మొత్తానికి ఢోకా ఉండదు. సీపీఎస్‌తో నష్టాలు ♦ షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదు. ♦ ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ప్లాన్ ఆధారంగా పెన్షన్ మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు. ♦ కార్పొరేట్ శక్తులు నిర్ణయిస్తాయి. ♦ ఆరోగ్య కార్డులు వర్తిస్తాయో లేదో తెలియని పరిస్థితి. ♦ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి. ♦ ప్రతి నెలా మూల వేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి. ♦ ఉద్యోగులు పదవీ విరమణ చేసేంత వరకు 10 శాతం మాచింగ్ గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. ♦ పదవీ విరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు. ♦ కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ప్రాన్ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి సీపీఎస్ ఉద్యోగులు భద్రత లేని జీవితాన్ని గుడుపుతున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని పోరాటాలు చేశాం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడంతో కమిటీ వేశారు. కమిటీ కాలయాపన చేస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు తీవ్ర నిరాశ చెందుతున్నాయి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలి. – ఎం.హరి, ఏపీసీపీఎస్ఈఏ జిల్లా సహాధ్యక్షుడు ఉద్యోగులు అభద్రత భావంతో ఉన్నారు సీపీఎస్ విధానంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు అభద్రత భావంతో ఉన్నారు. ఉద్యోగులకు భవిష్యత్ జీవనానికి భద్రత లేకుండా ఉంది. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చేది భిక్ష కాదు. పెన్షన్ అనేది మా హక్కు. – బి.ప్రవీణ్‌కుమార్, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నాం. సీపీఎస్ విధానంపై ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది. కమిటీ నివేదికలను సమర్పించకుండా చేతులు దులుపుకుంది. సీపీఎస్ విధానం రద్దుపై కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశాలతో ఉన్నాం. వచ్చే ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులకు భరోసా కల్పించాలి. – ఆర్.రామకిషోర్, ఏపీసీపీఎస్ఈఏ జనరల్ సెక్రటరీ -
ఉపాధ్యాయుల అరెస్టుపై భగ్గుమన్న ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. ఉపాధ్యాయుల అరెస్టులు ఆపేవరకు సభను జరగనివ్వమంటూ మండలిలో నినాదాలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నిరసనతో మండలిలో గురువారం గందరగోళం నెలకొంది. సీపీఎస్ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం తీరు, ఉపాధ్యాయుల అరెస్టు తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండలి హాల్లో బైఠాయించారు. రాత్రి నుంచి ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా? అని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులను వెనక్కి తీసుకోవాలని, అరెస్టులను ఆపాలంటూ మండలి చైర్మన్‌తో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సీపీఎస్ విషయంలో తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. దీంతో కల్పించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్.. సీపీఎస్ అంశంపై చర్చకు శుక్రవారం అనుమతి ఇస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళన విరమించారు. -
సీపీఎస్ ఉచ్చులో ఉద్యోగులు విలవిల
‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశం రాష్ట్రం చేతిలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సాధ్యమవుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేను’–తిరుపతి ఎన్జీఓల మహాసభ సంద ర్భంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలివి. ‘సీపీఎస్ రద్దు అంశం ఉద్యోగుల ప్రాథమిక హక్కు. ఆర్థిక భారమే అయినా ఉద్యోగులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. సీపీఎస్ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాం’ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసా. సీపీఎస్.. ప్రస్తుతం రాష్ట్రంలోని 1.60 లక్షల మంది ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రైవేటు సంస్థలకు కాసులు కురిపించే కార్పొరేట్ పెన్షన్ స్కీమ్ అంటూ ఉద్యోగులు దుయ్యబడుతున్నారు. ఈ సీపీఎస్ మాకొద్దంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ‘చలో పోరాడుదాం సమష్టిగా’ అంటూ సీపీఎస్‌కు కొత్త భాష్యం చెబుతున్నారు. పీఎఫ్ఆర్డీఏ, ఎన్ఎస్డీఎల్, సీఆర్ఏ అనే మూడు సంస్థల అధీనంలో సీపీఎస్ అమలవుతోంది. ప్రైవేటు కార్పొరేట్ శక్తుల అధీనంలో నడిచే ఈ మూడింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ లేదు. వీటి నిర్వహణా ఖర్చు కూడా ఉద్యోగుల ఖాతాల నుంచే వినియోగిస్తారు. నష్టాలు వస్తే ఉద్యోగులే బలికావడం, లాభాలు వస్తే ప్రభుత్వాలు బాగుపడటం తప్ప సగటు ఉద్యోగికి ఏ రకంగానూ లాభదాయకం కాదు. అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి మొదటినెల జీతం రావాలంటే విధిగా పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్–ప్రాన్) పత్రాలపై సంతకాలు చేయాలనే షరతుతో సీపీఎస్‌లో నిర్బంధంగా చేర్పించారు. ఇదిలాఉంటే 2015 నుంచే సీపీఎస్‌పై వ్యతిరేకత పెల్లుబికింది. అనంతపురం జిల్లా గుమ్మఘట్టకు చెందిన కె.కన్నప్పరావు గ్రామరెవెన్యూ అధికారిగా 2016లో ఉద్యోగ విరమణ పొందారు. ఎనిమిదేళ్ల సర్వీసుకు అతనికి నెలకు కేవలం రూ. 668 మాత్రమే పింఛను జమయ్యింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్లకు చెందిన టి. వెంకటాద్రి వీఆర్ఓగా పనిచేస్తూ 2011లో రిటైరయ్యారు. అతనికి ఎలాంటి పింఛనూ అందలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 460 ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు సీపీఎస్ బాధితులుగా మారాయి. దీంతో ఉద్యో గులు ఉద్యమబాట పట్టారు. ఇదిలా ఉండగా సీపీఎస్ రద్దులో జాప్యానికి ఉద్యోగ సంఘాల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. 2015లో సీపీఎస్ రద్దు అనే ఏకైక డిమాండ్‌తో ఏర్పడిన ఏపీసీపీఎస్ఈఏ తప్ప అన్ని సంఘాల నేతలు ప్రభుత్వానికి భజన చేస్తున్నారని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి బాజీ పటాన్ తప్పుబడుతున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో సంఘాలన్నీ ఏకమై సీపీఎస్ రద్దుకు సమ్మె చేస్తుంటే, ఇక్కడి నాయకులు మాత్రం నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌తో ఇవీ నష్టాలు 1. స్థిరమైన నెలరాబడి లేకపోవడం: పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ సమయంలో జీత భత్యాలలో 50 శాతం నెల ఆదాయం పొందేవాడు. వేతన సవరణ జరిగిన, కరువు భత్యం పెరిగిన సందర్భంలో అవి విశ్రాంత ఉద్యోగులకు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు వర్తిస్తాయి. సీపీఎస్‌లో ఇవేమీ వర్తించవు. 2. చందా పెన్షన్: పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ చేసినా, మరణించినా ఉద్యోగానికి అన ర్హుడిగా ప్రకటించినా, సస్పెండ్‌కు గురైనా ఏడు రకాల పెన్షన్లు అతని కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయి. కానీ సీపీఎస్‌లో పే/డీఏలలో 10 శాతం చందా తప్పనిసరిగా చెల్లిస్తేనే షేర్‌మార్కెట్ ఆధారిత పెన్షన్ సమకూరుతుంది. కానీ, షేర్‌మార్కెట్ తలకిందులైతే పెన్షన్ సొమ్ము గల్లంతే. అది కూడా 70 ఏళ్లవరకే వస్తుంది. పాత విధానంలో ఉద్యోగి చందా చెల్లింపు పద్ధతి లేదు. 3. గ్రాట్యుటీ: 2004 వరకు ఉద్యోగి పదవీ విరమణ పొందినా, మరణించినా నాలుగేళ్ల 240 రోజులు ఉద్యో గం చేసి ఉంటే 1972 యాక్ట్ ప్రకారం అతనికి గ్రాట్యుటీ వర్తిస్తుంది. ఉద్యోగి సర్వీసు కాలానికి అనుగుణంగా గరిష్టంగా 12 లక్షల వరకు గ్రాట్యుటీని చెల్లించే వీలుంది. సీపీఎస్‌లో ఇలాంటి సౌకర్యం లేదు. వీటితోపాటు పన్ను మినహాయింపుల్లోనూ నష్టపోయే ప్రమాదముంది. సీపీఎస్ జీఓలు 653, 654, 655 రద్దు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది. సీపీఎస్ రద్దు కావాలంటే పీఎఫ్‌ఆర్‌డీఏని కేంద్రమే రద్దు చేయాలంటూ చెప్పుకొస్తోంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సీపీఎస్ రద్దు పెద్ద పనేం కాదు. దాదాపు 1.60లక్షల మంది ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయానికి సంకల్పించకుంటే మరిన్ని కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముంది. విచిత్రమేమిటంటే 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన ఇదే తెలుగుదేశం పెద్దలు ఏపీలో అధికారంలో ఉండి మరీ కేంద్రంపై నెపం వేయడం హాస్యాస్పదమని వారు అంటున్నారు. (నేడు సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగుల ‘చలో అసెంబ్లీ’ ముట్టడి సందర్భంగా) -తిరుమల శ్రీనివాస్ కరుకోల హైదరాబాద్ ‘ మొబైల్ : 81438 14131 -
సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగుల నిరసన
-
చలో అసెంబ్లీ.. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత!
సాక్షి, విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూనియన్ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. ప్రకాశం బ్యారేజీపై బైఠాయించారు. వందలసంఖ్యలో ఉద్యోగులు బ్యారేజీపై బైఠాయించి.. బ్యారేజీని దిగ్బంధించారు. దీంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్యారేజీపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదంటూ.. ఉద్యోగులను అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులు బలగాలను మోహరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సెక్షన్ 30తోపాటు 144 సెక్షన్ విధించారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రకాశం బ్యారేజితోపాటు పలుచోట్ల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతే అసెంబ్లీలోకి సిబ్బందిని, ఇతరులను అనుమతించారు. మరోవైపు విజయవాడలో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత.. చలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావడంతో ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీని దిగ్బంధించి.. ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీతోపాటు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు.. ‘చలో అసెంబ్లీ’కి తరలివస్తున్న ఉద్యోగులను పెద్దసంఖ్యలో అరెస్టు చేస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
అశోక్‌బాబుకు నిరసన సెగ!
సాక్షి, విజయవాడ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేయాలంటూ విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు శనివారం చేపట్టిన ధర్నాలో ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబుకు చుక్కెదురైంది. జింఖానా మైదానంలో కొనసాగుతున్న ఉద్యోగుల సభకు ఆయన హాజరుకావడంపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అశోక్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను వేదికపైకి ఆహ్వానించడాన్ని అడ్డుకున్నారు. ఉద్యమాన్ని చీల్చే ఇలాంటి నేతలను పిలవొద్దంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అశోక్ బాబు వెంటనే వేదికపైనుంచి దిగిపోవాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంతో నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చిన వేలాదిమంది ప్రతినిధులు.. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. -
విజయవాడలో ఉద్యోగుల భారీ ర్యాలీ
-
సీపీఎస్ రద్దు చేయాల్సిందే
విజయవాడ: రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని నిమజ్జనం చేసేంతవరకు తమ పోరాటం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఆదివారం విజయవాడ సబ్–కలెక్టర్ కార్యాలయంలో బొప్పరాజు అధ్యక్షతన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించారు. అనంతరం బొప్పరాజు మాట్లాడుతూ 11వ పీఆర్సీ కమిషన్‌ను మూడునెలల్లో ఏర్పాటు చేయాలని, 10వ పీఆర్సీలోని సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 15 వేల మంది ఎన్ఎంఆర్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని, క్లాస్ ఫోర్ ఉద్యోగుల ఉద్యోగ విరమణ 62 ఏళ్లకు పెంచాలని అన్నారు. పాత పింఛన్ విధానాన్ని(జీపీఎస్) పునరుద్ధరించేలా ప్రభుత్వాలు దిగొచ్చే వరకు దశల వారీ పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూలై 8న గుంటూరులో మహార్యాలీ, సభ, జూలై 14న కర్నూలులో పోరుబాట నిర్వహిస్తామని చెప్పారు.ఆగస్టు 4న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి సెప్టెంబర్ 1న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో 70వేలకు పైగా సభ్యత్వం ఉన్న రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం, 12వేల సభ్యత్వం ఉన్న రాష్ట్ర హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, 10వేలకు పైగా సభ్యత్వం ఉన్న మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్, 10వేల సభ్యత్వం ఉన్న ఎయిడెడ్ ఉద్యోగ సంఘాల అసోసియేషన్, 15వేల సభ్యత్వం ఉన్న ఏపీ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం, పంచాయతీరాజ్‌లో పనిచేస్తున్న డీపీవోలు, డీఎల్పీవోల సంఘాలు, రాష్ట్ర గ్రామపంచాయతీ ఈవోలు, ఈవోపీఆర్డీల సంఘాలు అమరావతి జేఏసీలో సభ్యత్వం తీసుకున్నాయని చెప్పారు. జేఏసీలో 94సంఘాలున్నాయనీ..సీపీఎస్ బాధితుల తరఫున పోరాడేందుకు ఈ సంఘాలన్నీ మద్దతుగా నిలుస్తాయన్నారు. లోగో ఆవిష్కరణ ఏపీ అమరావతి జేఏసీ లోగోను జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు ఆవిష్కరించారు. లోగోలో అశోకుని ధర్మచక్రంలో ఔటర్ రింగ్, ఔటర్ రింగ్ పైభాగాన ఏపీ జేఏసీ అమరావతి అని, కింద భాగాన సర్వీస్ ఆఫ్ అవర్‌మోటివ్ అని లోగో రూపొందించారు. త్వరలో తాలూకా యూనిట్లు రానున్న రోజుల్లో అమరావతి జేఏసీ తాలూకా సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని జిల్లాల్లో తాలూకా కేంద్రాల్లో జేఏసీని విస్తరించి మరింత బలోపేతం చేస్తామన్నారు. జేఏసీ ప్ర«ధాన కార్యదర్శి టి.వి.ఫణి పేర్రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రేపు సకల ఉద్యోగుల మహాసభ
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు కోసం ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఉద్యోగ సంఘాలతో మొదలైన ఆందోళన ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు పాకింది. సీపీఎస్ రద్దు కోసం ఏర్పాటైన సంఘాలన్నీ ఇప్పటికే నిరసన ప్రదర్శనలు, మౌన దీక్షలు, సామూహిక సెలవులు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో క్షేత్రస్థాయిలో సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులంతా తమ ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెంచారు. దాదాపు 1.2 లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశం కావడంతో అన్ని సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 25న సరూర్‌నగర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మçహాసభ నిర్వహణకు ఏర్పాట్లు చేశాయి. ఇదీ సీపీఎస్ సమస్య.. కేంద్రం 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం.. సీపీఎస్‌లోని ఉద్యోగికి జీపీఎఫ్ ఉండదు. ఇందులోని రాష్ట్ర ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. 2004 సెప్టెంబరు 1కి ముందు నియమితులైన వారికి జీపీఎఫ్, రుణ సదుపాయాలున్నాయి. 20 ఏళ్ల సర్వీసు తరువాత జీపీఎఫ్‌లోని 75 శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. సీపీఎస్‌లో ఆ అవకాశమే లేదు. రిటైరైన తరువాత నామమాత్రపు పెన్షనే దిక్కు. షేర్ మార్కెట్‌పైనే ఆధా రం. పెన్షన్ కోసం ఉద్యోగి 10 శాతం వాటా చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా చెల్లిస్తుంది. ఉద్యోగి రిటైరైనప్పుడు తన ఖాతాలో ఉన్న సొమ్ములో 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతం మొత్తాన్ని ఉద్యోగి పెన్షన్ కోసం కేంద్రం అధీనంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) తన వద్దే ఉంచుకుంటోంది. ఆ మొత్తాన్ని నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీస్ లిమిటెడ్ ద్వారా షేర్ మార్కెట్లో పెడుతోంది. నెట్ అసెట్ వాల్యూ ప్రకారం లెక్కించి ఉద్యోగి కి పెన్షన్ మంజూరు చేస్తుంది. పదవీ విరమణ చేసినవారికి పెన్షన్ రూ.2000, రూ.2500 మాత్రమే వస్తోంది. చనిపోయిన కుటుంబాలకు కనీస ఆర్థిక సాయం కూడా దక్కదు. కనీసం చర్చించకపోతే ఎలా? రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం చర్చించేందుకు చర్యలు చేపట్టకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ఉద్యోగ సంఘాలన్నీ ఆందోళనబాట పట్టక తప్పలేదు. ఇందులో భాగంగానే సకల ఉద్యోగుల మహాసభ నిర్వహణకు జేఏసీ సిద్ధమైంది. –డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ -
పెన్షన్’ ఇక నో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించనుంది. ఈ ఏడాదిలోనే మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. పదకొండో వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సన్నద్ధమవుతూనే మధ్యంతర భృతి ప్రకటించాలని యోచిస్తోంది. దీంతోపాటు కొత్త ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని(సీపీఎస్) రద్దు చేయాలని భావిస్తోంది. మరో రెండు నెలల్లో ప్రవేశపెట్టనున్న 2018–19 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఈ అంశాలను పొందుపరిచే అవకాశాలున్నాయి. గ్రాట్యుటీ వద్దు.. రద్దే ముద్దు ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎస్ రద్దుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి తమకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ సీపీఎస్ వర్తిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది ఉద్యోగులు దీని పరిధిలో ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసినవారికి పింఛన్ అందకపోగా.. చనిపోయిన కుటుంబాలకు కనీస ఆర్థిక సాయం కూడా అందటం లేదు. అందుకే కొత్త పెన్షన్ స్కీంను రద్దు చేసి వారిని పాత పెన్షన్ పథకంలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ఆర్థిక భారమని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు చెల్లిస్తున్నట్లుగా సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులను సిఫారసు చేసింది. కానీ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులు కోరినట్లుగానే పాత పెన్షన్ విధానంలో చేర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని, సాధ్యాసాధ్యాలపై నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. జూన్‌తో ముగియనున్న పీఆర్సీ గడువు పీఆర్సీకి సంబంధించి ఆర్థిక శాఖ పంపించిన ఫైలు ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉంది. ఇటీవలే అధికారులతో సీఎం ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్సీ ఏర్పాటుతోపాటు మధ్యంతర భృతి (ఇంటీరియమ్ రిలీఫ్) ఇచ్చే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పదో పీఆర్సీ సిఫారసులే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1998 నుంచి అమల్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం అయిదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరిస్తారు. దీని ప్రకారం పదో పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుంది. జూలై ఒకటో తేదీ నుంచి పదకొండో వేతన సవరణ అమల్లోకి రావాల్సి ఉంటుంది. సాధారణంగా ఆర్నెళ్ల ముందే పీఆర్సీని ఏర్పాటు చేసి ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వ్యవహారాలు, జీతభత్యాలు, పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలన్నింటిపై సిఫారసులు స్వీకరించాల్సి ఉంటుంది. దీంతో కొత్త పీఆర్సీ ఎప్పుడు ఏర్పాటవుతుంది.. వేతన సవరణ ఏ మేరకు ఉంటుంది? అని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే పీఆర్సీని ఏర్పాటు చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. జూలై నుంచే మధ్యంతర భృతి సాధారణంగా పీఆర్సీ వేయటం ఆలస్యమైన సందర్భాల్లో ప్రభుత్వం ముందస్తుగా మధ్యంతర భృతిని చెల్లిస్తుంది. ఆ తర్వాత పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చే ఫిట్మెంట్ (వేతన సవరణ) నుంచి ఇంటీరియమ్ రిలీఫ్‌ను సర్దుబాటు చేసుకుంటుంది. కొత్త పీఆర్సీ సిఫారసులు ఎప్పుడు అమల్లోకి వచ్చినా ఈ ఏడాది జూలై నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకే జూలై నుంచే 25 శాతం నుంచి 30 శాతం వరకు మధ్యంతర భృతి ఇచ్చే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది. దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులతో ముడిపడిన అంశమైనందున ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? బడ్జెట్లో ఎంత మేర నిధులు కేటాయించాలన్న అంశాలపై నివేదిక రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం. -
పెన్షన్ టెన్షన్
-
‘వైఎస్ జగన్ హామీ మాలో భరోసా నింపింది’
సాక్షి, వేంపల్లి : ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వేంపల్లిలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం గురించి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించారు. నిన్నటి సభలో పెన్షన్ స్కీంపై ప్రతిపక్షనేత ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాత పద్థతిలోనే పెన్షన్ స్కీం కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని వైఎస్ జగన్ ...ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపారు. అలాగే విద్యారంగ సమస్యలపైనా దృష్టి పెడతామని ఆయన హామీ ఇచ్చారు. పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పెడతామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీ తమలో భరోసా నింపిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టమని తాము కోరినట్లు చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేస్తే లక్ష 80వేలమంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందన్నారు. జరగబోయే ఎన్నికల్లో తాము వైఎస్ జగన్ వెంటే ఉంటామని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాల నేతల ఆశాభావం వ్యక్తం చేశారు.