![KCR may cancel Contributory Pension Scheme - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/11/kcr_0.jpg.webp?itok=kdhwDL2D)
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించనుంది. ఈ ఏడాదిలోనే మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. పదకొండో వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సన్నద్ధమవుతూనే మధ్యంతర భృతి ప్రకటించాలని యోచిస్తోంది. దీంతోపాటు కొత్త ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని(సీపీఎస్) రద్దు చేయాలని భావిస్తోంది. మరో రెండు నెలల్లో ప్రవేశపెట్టనున్న 2018–19 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఈ అంశాలను పొందుపరిచే అవకాశాలున్నాయి.
గ్రాట్యుటీ వద్దు.. రద్దే ముద్దు
ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎస్ రద్దుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి తమకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ సీపీఎస్ వర్తిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది ఉద్యోగులు దీని పరిధిలో ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసినవారికి పింఛన్ అందకపోగా.. చనిపోయిన కుటుంబాలకు కనీస ఆర్థిక సాయం కూడా అందటం లేదు.
అందుకే కొత్త పెన్షన్ స్కీంను రద్దు చేసి వారిని పాత పెన్షన్ పథకంలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ఆర్థిక భారమని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు చెల్లిస్తున్నట్లుగా సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులను సిఫారసు చేసింది. కానీ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులు కోరినట్లుగానే పాత పెన్షన్ విధానంలో చేర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని, సాధ్యాసాధ్యాలపై నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
జూన్‌తో ముగియనున్న పీఆర్సీ గడువు
పీఆర్సీకి సంబంధించి ఆర్థిక శాఖ పంపించిన ఫైలు ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉంది. ఇటీవలే అధికారులతో సీఎం ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్సీ ఏర్పాటుతోపాటు మధ్యంతర భృతి (ఇంటీరియమ్ రిలీఫ్) ఇచ్చే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పదో పీఆర్సీ సిఫారసులే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1998 నుంచి అమల్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం అయిదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరిస్తారు. దీని ప్రకారం పదో పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుంది.
జూలై ఒకటో తేదీ నుంచి పదకొండో వేతన సవరణ అమల్లోకి రావాల్సి ఉంటుంది. సాధారణంగా ఆర్నెళ్ల ముందే పీఆర్సీని ఏర్పాటు చేసి ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వ్యవహారాలు, జీతభత్యాలు, పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలన్నింటిపై సిఫారసులు స్వీకరించాల్సి ఉంటుంది. దీంతో కొత్త పీఆర్సీ ఎప్పుడు ఏర్పాటవుతుంది.. వేతన సవరణ ఏ మేరకు ఉంటుంది? అని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే పీఆర్సీని ఏర్పాటు చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
జూలై నుంచే మధ్యంతర భృతి
సాధారణంగా పీఆర్సీ వేయటం ఆలస్యమైన సందర్భాల్లో ప్రభుత్వం ముందస్తుగా మధ్యంతర భృతిని చెల్లిస్తుంది. ఆ తర్వాత పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చే ఫిట్‌మెంట్ (వేతన సవరణ) నుంచి ఇంటీరియమ్ రిలీఫ్‌ను సర్దుబాటు చేసుకుంటుంది. కొత్త పీఆర్సీ సిఫారసులు ఎప్పుడు అమల్లోకి వచ్చినా ఈ ఏడాది జూలై నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకే జూలై నుంచే 25 శాతం నుంచి 30 శాతం వరకు మధ్యంతర భృతి ఇచ్చే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది. దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులతో ముడిపడిన అంశమైనందున ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? బడ్జెట్‌లో ఎంత మేర నిధులు కేటాయించాలన్న అంశాలపై నివేదిక రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment