సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే | Contributory pension scheme should be cancle | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

Published Mon, Jun 11 2018 2:52 AM | Last Updated on Mon, Jun 11 2018 2:52 AM

Contributory pension scheme should be cancle - Sakshi

విజయవాడ: రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని నిమజ్జనం చేసేంతవరకు తమ పోరాటం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఆదివారం విజయవాడ సబ్‌–కలెక్టర్‌ కార్యాలయంలో బొప్పరాజు అధ్యక్షతన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించారు. అనంతరం బొప్పరాజు మాట్లాడుతూ  11వ పీఆర్సీ కమిషన్‌ను మూడునెలల్లో ఏర్పాటు చేయాలని, 10వ పీఆర్సీలోని సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 15 వేల మంది ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని, క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగుల ఉద్యోగ విరమణ 62 ఏళ్లకు పెంచాలని అన్నారు. పాత పింఛన్‌ విధానాన్ని(జీపీఎస్‌) పునరుద్ధరించేలా ప్రభుత్వాలు దిగొచ్చే వరకు దశల వారీ పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూలై 8న గుంటూరులో మహార్యాలీ, సభ, జూలై 14న కర్నూలులో పోరుబాట నిర్వహిస్తామని చెప్పారు.ఆగస్టు 4న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి సెప్టెంబర్‌ 1న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు.

రాష్ట్రంలో 70వేలకు పైగా సభ్యత్వం ఉన్న రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం, 12వేల సభ్యత్వం ఉన్న రాష్ట్ర హోంగార్డ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, 10వేలకు పైగా సభ్యత్వం ఉన్న మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్, 10వేల సభ్యత్వం ఉన్న ఎయిడెడ్‌ ఉద్యోగ సంఘాల అసోసియేషన్, 15వేల సభ్యత్వం ఉన్న ఏపీ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం, పంచాయతీరాజ్‌లో పనిచేస్తున్న డీపీవోలు, డీఎల్పీవోల సంఘాలు, రాష్ట్ర గ్రామపంచాయతీ ఈవోలు, ఈవోపీఆర్డీల సంఘాలు అమరావతి జేఏసీలో సభ్యత్వం తీసుకున్నాయని చెప్పారు. జేఏసీలో 94సంఘాలున్నాయనీ..సీపీఎస్‌ బాధితుల తరఫున పోరాడేందుకు ఈ సంఘాలన్నీ మద్దతుగా నిలుస్తాయన్నారు.   

లోగో ఆవిష్కరణ
ఏపీ అమరావతి జేఏసీ లోగోను జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు ఆవిష్కరించారు.  లోగోలో అశోకుని ధర్మచక్రంలో ఔటర్‌ రింగ్, ఔటర్‌ రింగ్‌ పైభాగాన ఏపీ జేఏసీ అమరావతి అని, కింద భాగాన సర్వీస్‌ ఆఫ్‌ అవర్‌మోటివ్‌ అని లోగో రూపొందించారు.

త్వరలో తాలూకా యూనిట్లు
రానున్న రోజుల్లో అమరావతి జేఏసీ తాలూకా సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని జిల్లాల్లో తాలూకా కేంద్రాల్లో జేఏసీని విస్తరించి మరింత బలోపేతం చేస్తామన్నారు.   జేఏసీ ప్ర«ధాన కార్యదర్శి టి.వి.ఫణి పేర్రాజు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement