సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత, కాంట్రాక్టు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను రూపొందించింది. దీనిద్వారా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరనుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్, ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కరువు భృతి (డీఆర్) ఇవ్వడం ద్వారా మెరుగైన పెన్షన్‌ను అందించనుంది.
దీంతోపాటు ఉద్యోగులు అడగకుండానే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి కీలక అంశాలకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మాట ప్రకారం సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రతనిచ్చేలా రూపొందించిన జీపీఎస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే..
ఉద్యోగుల జీతాలను దాటేస్తుంది..
సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లేకపోవడంపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సంతకం చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. కానీ ఆ తర్వాత ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది.
2041 నాటికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలిపి రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లకు చేరుతుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ను తీసుకొచ్చాం.
సీపీఎస్‌తో అనిశ్చితి..
ప్రస్తుత సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని 40 శాతం సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది.
ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పడితే రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండటం లేదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి వస్తుండటంతో భద్రత ఉండటం లేదు.
జీపీఎస్‌తో గ్యారంటీ ఇలా..
సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పూర్తి గ్యారంటీ ఇస్తుంది. ఇందులోనూ సీపీఎస్‌లో చెల్లించినట్లే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది.
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు డీఆర్‌లు ఇస్తుంది. ఉదాహరణకు రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే అందులో రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది.
ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే 82 ఏళ్ల వయసులో జీపీఎస్ ద్వారా రూ.1,10,000 పెన్షన్‌గా తీసుకుంటారు. తద్వారా రిటైర్డ్ ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటు లేదు.
దేశానికే ఆదర్శంగా జీపీఎస్
దేశంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఓపీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించినా అమల్లోకి తీసుకురాలేకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేసి జీపీఎస్‌ను తీసుకొస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవనుంది. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయం క్రమంగా పెరుగుతూ రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది.
మాట ఇచ్చి.. నెరవేర్చి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కటాఫ్ తేదీకి 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే సీఎం జగన్ ఐదేళ్లకు తగ్గించారు. దీంతో మేనిఫెస్టో హామీల్లో 99.50 శాతం అమలు చేసినట్లైంది.
జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఒకేలా హెచ్‌ఆర్‌ఏ ఉండేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా కొన్ని జిల్లా కేంద్రాల్లో 12 «శాతంగా ఉన్న హెచ్‌ఆర్‌ఏ 16 శాతానికి పెరుగుతుంది. 2022 జనవరి 1వతేదీ నుంచి డీఏ, డీఆర్ 2.73 శాతం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది.
6,840 కొత్త పోస్టుల మంజూరు
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెచ్చింది. వివిధ శాఖల్లో సుమారు 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. వీటిల్లో 3,920 రిజర్వ్ పోలీసు ఉద్యోగాలు సహా నూతన వైద్య కళాశాలలు, పలు విద్యా సంస్థల్లో భారీ ఎత్తున కొత్త పోస్టులను కల్పించింది.
ప్రభుత్వంలోకి వైద్య విధాన పరిషత్
ఏపీ వైద్య విధాన పరిషత్ 1986 యాక్ట్‌ను రద్దు చేసి ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ శాఖగా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలుగా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ స్వయం ప్రతిపత్తి నుంచి ప్రభుత్వంలోకి మారడం ద్వారా 14,658 మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలను చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment