సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానిపై లోతుగా అధ్యయనం చేస్తారు. నిబంధనలను అనుసరిస్తూనే, లబ్ధిదారులకు సాధ్యమైనంత ఎక్కువ మేలు చేసేలా దానిని రూపొందిస్తారు. ఇటువంటిదే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్ స్కీము (ఏపీజీపీఎస్).
కేంద్ర ప్రభుత్వం 2004లో చేసిన పింఛను సంస్కరణలను కాపాడుతూనే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అటు ఉద్యోగులకు, ఇటు ప్రభుత్వానికి మేలు చేసేలా ఆంధ్రఫ్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయి పత్రికలు కూడా వైఎస్ జగన్ తెచ్చిన జీపీఎస్‌ను మంచి పథకంగా అభివర్ణిస్తున్నాయి. దీనిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘మింట్’ బ్యానర్ కథనమే ప్రచురించింది.
ఏపీజీపీఎస్ పింఛను సంస్కరణలను ఎలా కాపాడుతోందో ఈ కథనం వివరించింది. పదవీ విరమణ చేసిన తరువాత చివరి నెల డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పింఛను వచ్చేలా ఉద్యోగులకు ఏపీజీపీఎస్ ద్వారా గ్యారెంటీ కల్పిస్తూనే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం పడకుండా సరికొత్త సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిందని మింట్ పత్రిక ప్రశంసించింది.
వివేచనతో వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం
పాత పింఛను పథకంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భవిష్యత్‌లో మోయలేని ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పెన్షన్ స్కీము ద్వారా పింఛను సంస్కరణలు తెచ్చింది. మెజారిటీ రాష్ట్రాలు కూడా 2004 నుంచి జాతీయ పెన్షన్ స్కీమును అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 2004 నుంచి ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ జాతీయ పెన్షన్ స్కీము అమలు చేస్తున్నారు. దీనినే ఎంప్లాయీస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముగా (సీపీఎస్) కూడా పేర్కొంటారు. ఇందులో పింఛను ఎంత వస్తుందనేది మార్కెట్ పరిస్థితులనుబట్టి ఉంటుంది.
కచ్చితంగా ఎంత వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పాత పెన్షన్ స్కీము అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వీటిపై లోతుగా అధ్యయనం చేసింది. భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పెన్షన్ సంస్కరణలపై రాజీపడకుండా మధ్యే మార్గంగా ఏపీజీపీఎస్ను తీసుకువచ్చిందని మింట్ పత్రిక ప్రశంసించింది. ఒక వేళ భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయకుండా పాత పింఛను పథకాన్నే అమలు చేస్తే పదేళ్ల తరువాత ఉద్యోగులకు జీతభత్యాలిచ్చే పరిస్థితి కూడా ఉండదని, మొదటికే మోసం వస్తుందని తెలిపింది.
రాజకీయం కోసం ఆలోచన చేయకుండా భవిష్యత్ తరాల కోసం, ఉద్యోగుల డిమాండ్‌లో కూడా న్యాయం ఉందని భావించి సుదీర్ఘ కసరత్తు చేయడంతోపాటు వివేచనతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఇటు ఉద్యోగులకు పెన్షన్ గ్యారెంటీ ఇస్తూనే, మరోపక్క రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఏపీజీపీఎస్ను హైబ్రీడ్ మోడల్‌లో అమలుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా 2004 పెన్షన్ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడింది. పాత పింఛను స్కీమును అమలు చేస్తే 2041 కల్లా అప్పు కూడా పుట్టని దశకు రాష్ట్రం చేరుతుంది. అంతే కాకుండా 2050కల్లా ద్రవ్యలోటు 8 శాతానికి చేరుతుంది.
ఇవీ పింఛను స్కీములు
పాత పింఛను విధానంపాత పెన్షన్ స్కీము అమలు చేయడం కేంద్రంపైన, రాష్ట్రాలపైన ఆర్థికంగా పెనుభారం పడుతుంది. దీన్ని భవిష్యత్‌లో కొనసాగించడం సాధ్యం కాదు. పెన్షన్ల భారం 4.5 రెట్లు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో జీతభత్యాలు కూడా ఇవ్వలేనంతగా భారం అవుతుంది.
2004లో తెచ్చిన జాతీయ పింఛను పథకం
జాతీయ పెన్షన్ స్కీము కింద ఉద్యోగులకు వచ్చే పెన్షన్ పరిమాణాన్ని మార్కెట్ పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఎంత పెన్షన్ వస్తుందనేది కచ్చితంగా చెప్పలేరు. అయితే ఈ స్కీము రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీజీపీఎస్ ఉద్యోగుల పదవీ విరమణ చేసిన తరువాత చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి ఆ పెన్షనలో 60 శాతం వస్తుంది. ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది. హెల్త్ స్కీము కూడా వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment