సీపీఎస్ రద్దు కోరుతూ శనివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభకు హాజరైన ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలి... పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలి’అంటూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) గొంతెత్తింది.
2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఈ సభకు హాజరై సీపీఎస్ రద్దుకు గొంతు కలిపారు.
2 లక్షల కుటుంబాల చిరకాల వాంఛ ఇది
ఈ సందర్భంగా టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. ‘ఐదేళ్ల క్రితం సీపీఎస్ రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమాధానం దొరికింది. సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా ఈ పథకం కింద జమ అయిన నిధులను వెనక్కు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల చిరకాల వాంఛ సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎన్నికల హామీ మాదిరి కాకుండా ఎన్నికలకు ముందే సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. వెనువెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే వారే. ప్రభుత్వం ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరించి అమలు చేసేవారు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా సీపీఎస్‌ను రద్దు చేయాలి’అని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి పోవడం లేదని, ఆయనకు సుదీర్ఘంగా వివరిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకోసమే రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు.
జిల్లాలను చుట్టి.. రాజధానికి చేరి..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ రద్దుపై విస్తృత అవగాహన కలి్పంచేందుకు టీఎస్‌సీపీఎస్‌ఈయూ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను తలపెట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచి పాత పెన్షన్ ఆవశ్యకత, సీపీఎస్ రద్దుపై విపులంగా వివరించి అభిప్రాయ సేకరణ జరిపింది.
పక్షం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాద్‌లో సీపీఎస్ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు.
పోటెత్తిన వివిధ రాష్ట్రాల నేతలు
కార్యక్రమంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షులు విజయకుమార్ బంధు, పంజాబ్ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్ సింగ్, కర్ణాటక సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ నాయకుడు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటేష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, సురేష్, టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, ఎస్‌జీటీయూ రాష్ట్ర అధ్య క్షుడు మహిపాల్ రెడ్డి, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.
ఇరువురు సీఎంలతో చర్చ
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఇరువురు సీఎంలతో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చిస్తాం. అదేవిధంగా జార్ఖండ్‌లో అమలు చేస్తున్న పాత పెన్షన్ స్టాండింగ్ ఆపరేటింగ్ గైడ్‌లైన్స్ వివరిస్తాం. –విక్రమ్ సింగ్, జార్ఖండ్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు
మేమూ ఎదురుచూస్తున్నాం
తెలంగాణలో సీపీఎస్ రద్దుకోసం మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పాత పెన్షన్ కోసం పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. –విటేష్ ఖండేల్కర్, మహారాష్ట్ర సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు
కేసీఆర్ దేశ్‌కీ నేతా అయ్యేందుకు ఇదే చాన్స్
తెలంగాణలోని రెండు లక్షల ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుకరిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ్‌కి నేతా అయ్యేందుకు ఇదే మంచి అవకాశం. – విజయ్‌కుమార్ బంధు, సీపీఎస్ జాతీయ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment