సాక్షి, హైదరాబాద్: కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్) పరిధిలోనికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబ పింఛన్ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గతేడాది జూన్ 11న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలతో సర్క్యులర్‌ను రాష్ట్ర ట్రెజరీ శాఖ మంగళవారం అన్ని జిల్లాలకు పంపింది. ఈ సర్క్యులర్ ప్రకారం చనిపోయిన లేదా విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న ఉద్యోగి తన చివరి నెలలో డ్రా చేసే వేతనంలోని 33 శాతాన్ని అతని కుటుంబానికి పింఛన్ కింద ఇవ్వ నున్నారు.
అదేవిధంగా గతంలో ఉద్యోగి వేతనం నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్‌ను మినహాయించుకోకపోయినా, పింఛన్ కోసం శాశ్వత అకౌంట్ నెంబర్ (ప్రాన్) లేకపోయినా ఈ పింఛన్ విధానం వర్తించనుంది. ఈ ఉత్తర్వులు రాకముందే చనిపోయి లేదా ఉద్యోగ విధుల్లో లేకుండా ఉండి అరకొర పింఛన్‌తో వెళ్లదీస్తోన్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పింఛన్ వర్తించనుంది. తద్వారా 1,500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్ మంజూరయ్యేందుకు మార్గం సుగమం అయింది.
ఈ ఉత్తర్వుల జారీ పట్ల తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పింఛన్ పథక ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. కుటుంబ పింఛన్ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్‌కు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ కృతజ్ఞతలు తెలిపారు. తమ యూనియన్ వినతి మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సంతోషదాయకమని యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, ౖఅధ్యక్షుడు నరేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment