
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ విషయంలో ఎదురయ్యే అవరోధాలేమిటి? వీటిని ఎలా అధిగమించాలి? అనే అంశాలపై దృష్టి సారించింది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆ హామీ అమలుపై చర్యలు ప్రారంభించారు. రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ ఠక్కర్ అధ్యక్షతన గత సర్కారు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు గల సాధ్యాసాధ్యాలను వివరిస్తూ ఠక్కర్ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కచ్చితంగా నిర్ణయిస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా ఎంత అదనపు భారం పడుతుంది? సీపీఎస్ రద్దు చేయకుండా, ఉద్యోగులకు నష్టం జరగకుండా చూడాలంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో కూడా ఈ కమిటీ కూలంకషంగా వివరించింది. అయితే, ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనని నిర్ణయించారు. పెన్షన్ విధానం పునరుద్ధరణకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఠక్కర్ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలను మంత్రివర్గ ఉపసంఘం ప్రధానంగా పరిశీలించనుంది.
నలుగురు మంత్రులతో ఉపసంఘం
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైద్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ఠక్కర్ కమిటీ నివేదికను అధ్యయనం చేయనుంది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు.
ఉద్యోగుల సంఘం హర్షం
సీపీఎస్ రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ స్వాగతించారు. సీసీఎస్ రద్దుకు అనువుగా త్వరితగతిన నివేదిక సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘానికి తమ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ‘‘మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించలేదు. అయినా ఈ ఉపసంఘం త్వరగా నివేదిక ఇస్తుందని అసోసియేషన్ ప్రతినిధులతో పాటు సీపీఎస్ ఉద్యోగులంతా ఎంతో నమ్మకంతో ఉన్నారు’’ అని రామాంజనేయులు యాదవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment