
సాక్షి, అమరావతి: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. ఉపాధ్యాయుల అరెస్టులు ఆపేవరకు సభను జరగనివ్వమంటూ మండలిలో నినాదాలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నిరసనతో మండలిలో గురువారం గందరగోళం నెలకొంది. సీపీఎస్ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం తీరు, ఉపాధ్యాయుల అరెస్టు తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండలి హాల్‌లో బైఠాయించారు.
రాత్రి నుంచి ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా? అని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులను వెనక్కి తీసుకోవాలని, అరెస్టులను ఆపాలంటూ మండలి చైర్మన్‌తో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సీపీఎస్ విషయంలో తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. దీంతో కల్పించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్.. సీపీఎస్ అంశంపై చర్చకు శుక్రవారం అనుమతి ఇస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళన విరమించారు.