
సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ ఉద్యోగుల నిరసన(పాత చిత్రం)
‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశం రాష్ట్రం చేతిలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సాధ్యమవుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేను’–తిరుపతి ఎన్‌జీఓల మహాసభ సంద ర్భంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలివి.
‘సీపీఎస్ రద్దు అంశం ఉద్యోగుల ప్రాథమిక హక్కు. ఆర్థిక భారమే అయినా ఉద్యోగులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. సీపీఎస్ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాం’ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసా.
సీపీఎస్.. ప్రస్తుతం రాష్ట్రంలోని 1.60 లక్షల మంది ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రైవేటు సంస్థలకు కాసులు కురిపించే కార్పొరేట్ పెన్షన్ స్కీమ్ అంటూ ఉద్యోగులు దుయ్యబడుతున్నారు. ఈ సీపీఎస్ మాకొద్దంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ‘చలో పోరాడుదాం సమష్టిగా’ అంటూ సీపీఎస్‌కు కొత్త భాష్యం చెబుతున్నారు.
పీఎఫ్‌ఆర్‌డీఏ, ఎన్‌ఎస్‌డీఎల్, సీఆర్‌ఏ అనే మూడు సంస్థల అధీనంలో సీపీఎస్ అమలవుతోంది. ప్రైవేటు కార్పొరేట్ శక్తుల అధీనంలో నడిచే ఈ మూడింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ లేదు. వీటి నిర్వహణా ఖర్చు కూడా ఉద్యోగుల ఖాతాల నుంచే వినియోగిస్తారు. నష్టాలు వస్తే ఉద్యోగులే బలికావడం, లాభాలు వస్తే ప్రభుత్వాలు బాగుపడటం తప్ప సగటు ఉద్యోగికి ఏ రకంగానూ లాభదాయకం కాదు.
అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి మొదటినెల జీతం రావాలంటే విధిగా పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్‌ఏఎన్–ప్రాన్) పత్రాలపై సంతకాలు చేయాలనే షరతుతో సీపీఎస్‌లో నిర్బంధంగా చేర్పించారు. ఇదిలాఉంటే 2015 నుంచే సీపీఎస్‌పై వ్యతిరేకత పెల్లుబికింది. అనంతపురం జిల్లా గుమ్మఘట్టకు చెందిన కె.కన్నప్పరావు గ్రామరెవెన్యూ అధికారిగా 2016లో ఉద్యోగ విరమణ పొందారు. ఎనిమిదేళ్ల సర్వీసుకు అతనికి నెలకు కేవలం రూ. 668 మాత్రమే పింఛను జమయ్యింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్లకు చెందిన టి. వెంకటాద్రి వీఆర్‌ఓగా పనిచేస్తూ 2011లో రిటైరయ్యారు. అతనికి ఎలాంటి పింఛనూ అందలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 460 ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు సీపీఎస్ బాధితులుగా మారాయి. దీంతో ఉద్యో గులు ఉద్యమబాట పట్టారు. ఇదిలా ఉండగా సీపీఎస్ రద్దులో జాప్యానికి ఉద్యోగ సంఘాల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. 2015లో సీపీఎస్ రద్దు అనే ఏకైక డిమాండ్‌తో ఏర్పడిన ఏపీసీపీఎస్‌ఈఏ తప్ప అన్ని సంఘాల నేతలు ప్రభుత్వానికి భజన చేస్తున్నారని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి బాజీ పటాన్ తప్పుబడుతున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో సంఘాలన్నీ ఏకమై సీపీఎస్ రద్దుకు సమ్మె చేస్తుంటే, ఇక్కడి నాయకులు మాత్రం నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీపీఎస్‌తో ఇవీ నష్టాలు
1. స్థిరమైన నెలరాబడి లేకపోవడం: పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ సమయంలో జీత భత్యాలలో 50 శాతం నెల ఆదాయం పొందేవాడు. వేతన సవరణ జరిగిన, కరువు భత్యం పెరిగిన సందర్భంలో అవి విశ్రాంత ఉద్యోగులకు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు వర్తిస్తాయి. సీపీఎస్‌లో ఇవేమీ వర్తించవు.
2. చందా పెన్షన్: పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ చేసినా, మరణించినా ఉద్యోగానికి అన ర్హుడిగా ప్రకటించినా, సస్పెండ్‌కు గురైనా ఏడు రకాల పెన్షన్లు అతని కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయి. కానీ సీపీఎస్‌లో పే/డీఏలలో 10 శాతం చందా తప్పనిసరిగా చెల్లిస్తేనే షేర్‌మార్కెట్ ఆధారిత పెన్షన్ సమకూరుతుంది. కానీ, షేర్‌మార్కెట్ తలకిందులైతే పెన్షన్ సొమ్ము గల్లంతే. అది కూడా 70 ఏళ్లవరకే వస్తుంది. పాత విధానంలో ఉద్యోగి చందా చెల్లింపు పద్ధతి లేదు.
3. గ్రాట్యుటీ: 2004 వరకు ఉద్యోగి పదవీ విరమణ పొందినా, మరణించినా నాలుగేళ్ల 240 రోజులు ఉద్యో గం చేసి ఉంటే 1972 యాక్ట్ ప్రకారం అతనికి గ్రాట్యుటీ వర్తిస్తుంది. ఉద్యోగి సర్వీసు కాలానికి అనుగుణంగా గరిష్టంగా 12 లక్షల వరకు గ్రాట్యుటీని చెల్లించే వీలుంది. సీపీఎస్‌లో ఇలాంటి సౌకర్యం లేదు. వీటితోపాటు పన్ను మినహాయింపుల్లోనూ నష్టపోయే ప్రమాదముంది.
సీపీఎస్ జీఓలు 653, 654, 655 రద్దు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది. సీపీఎస్ రద్దు కావాలంటే పీఎఫ్‌ఆర్‌డీఏని కేంద్రమే రద్దు చేయాలంటూ చెప్పుకొస్తోంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సీపీఎస్ రద్దు పెద్ద పనేం కాదు.
దాదాపు 1.60లక్షల మంది ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయానికి సంకల్పించకుంటే మరిన్ని కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముంది. విచిత్రమేమిటంటే 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన ఇదే తెలుగుదేశం పెద్దలు ఏపీలో అధికారంలో ఉండి మరీ కేంద్రంపై నెపం వేయడం హాస్యాస్పదమని వారు అంటున్నారు. (నేడు సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగుల ‘చలో అసెంబ్లీ’ ముట్టడి సందర్భంగా)
-తిరుమల శ్రీనివాస్ కరుకోల
హైదరాబాద్ ‘ మొబైల్ : 81438 14131
Comments
Please login to add a commentAdd a comment