సాక్షి, బాపట్ల : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)తో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. సీపీఎస్ విధానం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విధానం అమలుచేయడం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ఎలాంటి జీవితాన్ని గడపాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. షేక్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. పదవీ విరమణ తరువాత భద్రత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సీపీఎస్ వల్ల సంకట పరిస్థితులు
ఏళ్ళ తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంకట పరిస్థితుల్లో పడ్డారు. సీపీఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ ఒకటో తేది నుంచి ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్‌ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది.
ఉద్యోగుల ఆందోళన
సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రంలో 1.80లక్షల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో సుమారు 15వేలకు పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయడం, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేయించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్యోగులు ఖండిస్తున్నారు. ఎన్నో ఆందోళనలు చేశామని తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్ హామీ ఇచ్చారు. జననేత ఇచ్చిన హామీపై సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాత పెన్షన్ విధానంతో కలిగే లాభాలు
- ప్రభుత్వ హామి ఉంటుంది.
- సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్ మొత్తం పెంపు
- పదవీ విరమణ తర్వాత హెల్త్‌కార్డులు
- ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు.
- పెన్షన్‌కు ప్రతినెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఉద్యోగి మరణించేంతవరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది.
- గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది.
- జీవితాంతం పెన్షన్ మొత్తానికి ఢోకా ఉండదు
సీపీఎస్‌తో కలిగే నష్టాలు
- షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామి ఉండదు.
- ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ఫ్లాన్ ఆధారంగా పెన్షన్‌మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు.
- ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి.
- ప్రతినెలా మూలవేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి.
- ఉద్యోగులు పదవీవిరమణ చేసేంతవరకు 10 శాతం మాచింగ్ గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది.
- పదవీవిరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు.
- కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ప్రాన్ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది
గతంలో ఆర్‌టీఐ చట్టం కింద సీపీఎస్ విధానం రద్దు చేసే అధికారం ఎవరిది అని కేంద్రానికి ఒక లేఖ రాశాం. దాని ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశాం. ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానంతో మాకు ఎంతో మేలు చేకూరుతుంది.
– ఆయూబ్, వీఆర్వో
ఉద్యోగులను బిచ్చగాళ్లను చేస్తోంది
సీపీఎస్ విధానం ఉద్యోగులను పదవీవిరమణ తర్వాత బిచ్చగాళ్లుగా మార్చేవిధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి సీబీఐకి సాధారణ సమ్మతిని తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం మన భారతరాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఉన్న అర్టికల్ 246(3) ప్రకారం, అర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సర్వీస్ మాటర్స్‌కు సంబంధించి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుండా తీర్మానాలు, కమిటీలు, కేంద్రానికి లేఖలు అనే పేరుతో కాలయాపన చేయడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే.
– కె. పార్ధసారథి, ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment