సాక్షి, గుంటూరు : రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో అన్నివర్గాల వారికి వరాల జల్లు కురిపించారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం, ఉచిత బోర్లు, 9 గంటల విద్యుత్‌తో అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.
కేజీ నుంచి పీజీ వరకు చదువులకు ప్రాధాన్యమిచ్చారు. అవ్వాతాతలకు పింఛన్లు పెంచి బతుకుపై భరోసా ఇచ్చారు. నవయుగ సాకారానికి నాంది పలుకుతూ.. సమున్నత ఆశయంతో ప్రతి ఒక్కరికీ మేలు కలిగించే విధంగా.. మనసా, వాచా, కర్మేణా మేనిఫెస్టోను అమలు చేస్తానని జననేత వైఎస్ జగన్ స్పష్టం చేయడంపై జిల్లాలో అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
సమసమాజ స్థాపనే లక్ష్యం.. అన్నదాతకు అండగా.. అక్కచెల్లెమ్మలకు చేయూతగా, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తూ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి సంక్షేమ పాలన అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అన్నదాతకు భరోసా
ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం సంవత్సరానికి రూ.12,500 చొప్పున కింద రూ.50 వేలు, అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ పథకం వల్ల జిల్లాలో 7.20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు ఉచితంగా బోర్లు, పగలే 9 గంటల నిరంతర విద్యుత్, ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లతో నిధి, ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.7 లక్షల బీమా, పాడి రైతులకు చేయూత, ఇలా అనేక విధాలుగా అన్నదాతను ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు.
అక్కాచెల్లెమ్మలకు అండగా..
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు, 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు దశల వారీగా కార్పొరేషన్‌ల ద్వారా రూ.75 వేలు అందిస్తామని, పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 20 లక్షల మంది మహిళలకు ఏదో రకంగా లబ్ధిచేకూరనుంది.
విద్య, వైద్యానికి పెద్ద పీట
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు చదువులన్నీ ఉచితమని, బిడ్డలను బడికి పంపితే తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు, ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌తోపాటు విద్యార్థికి ఏటా వసతి కోసం రూ.20 వేలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రిస్తామని ప్రకటించారు.
వైద్య ఖర్చులు రూ.1000 దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికిత్స చేయిం చుకున్నా ఉచితమేనని, నెలకు రూ.40 వేల వేతనం పొందే ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తామని జగన్ తెలిపారు. ఈ పథకాల వల్ల జిల్లాలోని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
బడుగు, బలహీన వర్గాలకు చేయూత
జిల్లాలో 30 లక్షల మందికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉన్నారు. బీసీల అభ్యున్నతికి రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లల్లో రూ.70 వేల కోట్లు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తామని జగన్ చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.బీసీ చెల్లెమ్మలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పెళ్లికానుకను రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు.
ఉద్యోగులకు భరోసా
జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలుపుకొని లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారందరినీ వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైఎస్ జగన్ మ్యానిఫెస్టో ద్వారా భరోసా ఇచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తామని, ఉద్యోగులు కోరుకున్న విధంగా 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అంది స్తామని, పోలీసు శాఖలో ఉద్యోగులకు వారానికి ఒక రోజు సెలవు ఉండేలా చూస్తానని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment