
వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టిన గుంటూరు ప్రజలు
భారీగా తరలివచ్చిన అభిమాన జనం
ఎదురేగి స్వాగతం పలికిన ప్రజలు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు
జగన్‌తో చేయి కలపాలని, మాట కలపాలని తపన
అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన జననేత
పట్నంబజారు, నగరంపాలెం (గుంటూరు ఈస్ట్/వెస్ట్): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం గుంటూరులో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మిర్చి యార్డు ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. కూటమి ప్రభుత్వ కుట్రలు బద్దలు బట్టబయలు చేస్తూ.. మిర్చి రైతుకు భరోసా కల్పించేందుకు వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. తమ పక్షాన వారి గొంతుకై.. గిట్టుబాటు ధర కల్పించని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వచ్చిన నాయకుడికి జనం నీరాజనం పలికారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గాన గుంటూరు–చిలకలూరిపేట రోడ్డులోని వై. జంక్షన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చిన రైతులు, యువత, విద్యార్థులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వారికి తోడయ్యారు. భారీ ర్యాలీ నడుమ వైఎస్ జగన్ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతం మీదుగా మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. యువత, ప్రజలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
జగన్‌తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వై జంక్షన్ వద్ద జననేతకు భారీ స్వాగతం లభించింది. పోలేరమ్మ తల్లి గుడి ప్రాంతం నుంచి రహదారికి ఇరు వైపులా పెద్ద సంఖ్యలో మహిళలు బారులుతీరారు. వారి దగ్గరకు జగన్ రాగానే.. ‘జగనన్నా..’ అంటూ కేకలు వేస్తూ.. చేతులూపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు యువకులు డివైడర్‌పై, ఇళ్లపై నుంచి మొబైల్ ఫోన్లలో జగన్ కాన్వాయ్‌ని చిత్రీకరిస్తూ కనిపించారు.
దారిపొడవునా అదే ఆదరణ
దారి పొడవునా అభిమాన జనం పోటెత్తడంతో వై. జంక్షన్ నుంచి మిర్చి యార్డు వద్దకు చేరేసరికి అరగంటకు పైగా పట్టింది. జగన్ మిర్చి యార్డు వద్దకు రాగానే యువత ఆనందంతో ఈలలు వేశారు. దారిపొడవునా అందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.
అప్పటికే తమ సమస్యలు చెప్పుకునేందుకు యార్డు గేటు వద్దకు వచ్చి ఎదురు చూస్తున్న మిర్చి రైతులు ఎదురేగి జగన్‌కు స్వాగతం పలికారు. తమ సమస్యలు వినేందుకు జననేత జగన్ వచ్చారంటూ పలువురు రైతులు భావోద్వేగానికి లోనయ్యారు. పంటలకు మద్దతు ధర లభించడం లేదని మొర పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment