సాక్షి, బాపట్ల : ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన భర్త తూలుతూ వస్తాడు.. నాన్న వస్తే పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు అడుగుదామని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్న కూతురికి తన తండ్రి నోటివెంట వచ్చే మద్యం వాసన గుప్పుమంటుంది. ప్రెండ్స్‌తో పార్టీలో ఉన్నానని భర్త ఫోన్ చేసి చెబుతాడు. కళాశాలకు వెళ్లే కుర్రాడి గదిలో బీరుబాటిల్స్ దర్శనమిస్తుంటాయి. నెలఖర్చులు జమచేసేందుకు జీతం డబ్బులు లెక్కేస్తే మిగిలినవి కనిపించని పరిస్థితి.
రోజంతా కాయాకష్టంచేసి ఉన్నదంతా మద్యానికి తగలేసి ఇంటిల్లిపాదీ పస్తులు పెట్టే మహానుభావులు కూడా ఎందరో... కుటుంబాలను ఎంతో నాశనం చేస్తున్న ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే కారణం మద్యం. దురలవాటుల వల్ల మాత్రమే ఈ నష్టాలకు కారణం అనుకుందామనుకుంటే.. ప్రభుత్వం మరో కారణంగా ఉండడం బాధాకరం. మద్యం విక్రయాలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్న ఆర్థిక సూత్రాన్ని తరతరాలుగా పాలకులు ఫాలో అవుతున్నారు.
ఎన్నికలకు మందు గ్రామానికి ఓ మహిళా కానిస్టేబుల్‌ను నియమిస్తాం.. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేకుండా చూస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలకు తాగునీటికన్నా కూడా మద్యమే అందుబాటులో ఉండేలా వీధికొకషాపు చొప్పున ఏర్పాటు చేయించారు. తొలిసారిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని నవరత్న పథకాల్లో ప్రకటించారు. అది ఎలా నిషేధిస్తారో కూడా ప్రణాళికను ప్రజల ముందు ఉంచారు.
బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల పట్టణం, మండలం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో 22 మద్యం దుకాణాలు 4 బార్లు ఉన్నాయి. సుమారు నియోజకవర్గంలో 50కు పైగా అనధికారికంగా బెల్టుషాపులు ఉంటాయని మహిళలు అరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో పర్యటించినప్పుడు మహిళల బాధలు నేరుగా చూశారు. బరువెక్కిన హృదయాలతో వారు చెప్పిన మాటలు విని చలించిపోయారు. ఇళ్ల మధ్యనే మద్య దుకాణాలు ఉండడంతో చిన్నపిల్లలు సైతం వెసనపరులుగా మారుతున్నారంటూ జననేత వద్ద మహిళలు అవేదన చెందారు.
మద్యపాన నిషేధానికి పెద్దపీట
మద్యం ఎంతగా పేదల కుటుంబాలను కుంగతీస్తుందో కళ్లారా చూసిన జగన్ నవరత్నాల్లో మద్యపాన నిషేధానికి పెద్దపీట వేశారు. ఐదేళ్లల్లో శాస్త్రీయ పద్ధతిలో దశలవారీగా మద్యం నిషేధిస్తామంటూ పార్టీ జాతీయ ప్లీనరీలో ప్రకటన చేశారు. ఉత్తుత్తి హామీ కాకుండా నిషేధం ఏ పద్ధతిలో చేస్తానో కూడా వివరించడంతో జగన్‌మోహన్‌రెడ్డిపై మహిళలకు నమ్మకం కలిగింది.
దేవుని దయవలన ప్రజలందరి ఆదరణ వల్ల ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనలో మద్య విక్రయాలను ఏడాదికాఏడాది తగ్గిస్తూ మద్యం మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రణాళికను రూపొందించారు. దీంతో కారుచీకట్లో కాంతిపుంజంలా మహిళలకు జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం పెరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి మద్యాన్ని నిషేధిస్తే సామాన్య కుటుంబాలు ఎన్నో బాగుపడుతాయంటూ ప్రజా ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.
తప్పక నెరవేరుస్తారనే విశ్వాసం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం తాగటానికి నీళ్లులేక ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం అసలు చర్యలు తీసుకోవడం లేదు. కానీ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు పెట్టి ఖజానా నింపుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. సంపాదించిన సొమ్మంతా మగవారు తాగుడుకే తగలేయడంతో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. జగనన్న ప్రకటించిన మద్యపాన నిషేధ హామీ తప్పక నేరవేరుస్తారని విశ్వాసం ఉంది.
– కొండా అన్నమ్మ
రాజన్న బిడ్డ.. మాట నిలబెట్టుకుంటాడు
తెలుగు ప్రజల దైవం.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలుబెట్టుకుంటాడన్నా విశ్వాసం మాలో ఉంది. ఐదేళ్లపాటు చంద్రబాబు పాలన చూసిన తర్వాత జగనన్నకు ఓ అవకాశం ఇచ్చి చూడాలన్న ఆలోచన ప్రజలందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేధిస్తామని నవరత్నాల్లో ప్రకటించడం మహిళల్లో భరోసా నింపుతుంది.
–షేక్ ఫాతిమా
Comments
Please login to add a commentAdd a comment