సాక్షి, అచ్చంపేట : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, తన విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రాత్రి ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.
ప్రశ్న: మీరు ఈ విజయాన్ని ఎలా భావిస్తున్నారు.?
జవాబు: ఈ విజయం జగన్‌మోహనరెడ్డి విజయంగా భావిస్తున్నా.. ప్రజా విజయంగా భావిస్తున్నాను. జగన్ అలుపెరగకుండా 14 నెలలపాటు పాదయాత్ర చేయడం, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, ప్రతి సమస్యను జగన్ అయితేనే పరిష్కరించగలడని ప్రజలు నమ్మడం వల్లే నాకు ఈ గెలుపు సాధ్యపడింది.
ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గమనించిన సమస్యలేంటి, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు?
జవాబు: నియోజకవర్గంలో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల మండల కేంద్రాలకు వెళ్లే రహదారులన్నీ చిన్నాభిన్నమై నడిచేందుకు కూడా వీలు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిన్నింటినీ వచ్చే ఆరు నెలల కాలంలో పరిష్కరించేందుకు కృషిచేస్తా. ప్రతి చివరి భూమికీ సాగునీరు అందేల చూస్తా. పూర్తికాని మరమ్మతుల్లో ఉన్న ఇరిగేషన్ స్కీములను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తా.
ప్రశ్న: మీ విజయానికి ముఖ్యమైన కారణాలేవి.
జవాబు: జగన్ కష్టమే నా విజయం. గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. జన్మభూమి కమిటీలతో అక్రమాలు, మట్టి, ఇసుక దోపిడీలు జరిగాయి. ప్రజలు టీడీపీ పాలనపై విరక్తి చెందారు. మార్పు కోరుకున్నారు. జగన్‌మోహనరెడ్డిని సీఎంగా చూడాలనుకున్నారు. అందువల్లనే విజయం సాధించగలిగాను.
ప్రశ్న: నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు?
జవాబు: రాజధాని పరిధిలో ఉన్నదనేగాని, పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ లేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమని నిర్మించి నిరుద్యోగులందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలనుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలన్నదే నా ఆశయం.
ప్రశ్న: రైతులకోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా?
జవాబు: ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్నదే నా ఆశయం. రైతులు పండించిన పంటను నిల్వ ఉంచుకునేందుకు నియోజకవర్గంలో ఒక్క కోల్డు స్టోరేజీ కుడా లేదు. వెంటనే కోల్డు స్టోరేజ్ ఏర్పాటుకు కృషి చేయాలనుకుంటున్నా.
ప్రశ్న: ఆధ్యాత్మికంగా ఏం చేయాలనుకుంటున్నారు?
జవాబు: అమరావతిలో అమరలింగేశ్వరస్వామి దేవాలయం ఉంది. అందువల్ల అమరావతి ఆధ్యాత్మిక నగరంగా మరింత తీర్చి దిద్దాలనుకుంటున్నాను. అదే విధంగా అచ్చంపేట మండలం, మాదిపాడును పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలనుకుంటున్నా.
ప్రశ్న: నియోజకవర్గంలో ఏఏ సదుపాయాలు కల్పించుకుంటున్నారు?
జవాబు: నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాలు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. కృష్ణానది దాటాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సంప్రదించి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై బ్రడ్జి నిర్మించేందుకు ప్రయత్నం చేస్తా.
ప్రశ్న: చివరగా ప్రజలకు మీరు ఏమి చెప్పదలచారు?
జవాబు: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాను. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. వైఎస్సార్ సీపీ, జగన్‌మోహనరెడ్డి, నాపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు.
Comments
Please login to add a commentAdd a comment