సాక్షి, మంగళగిరి : ‘నా సోదరుడు.. లోకల్ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిని ప్రతి కుంభకోణం.. మోసం.. వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయన్నారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
చంద్రబాబు, ఆయన పార్టనర్.. ఎల్లో మీడియా చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి రాగానే చేనేత వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి (ఆర్కే)తో పాటు గుంటూరు లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..
బాబు సుపుత్రుడిని ఓడించండి..
‘చంద్రబాబు గత ఐదేళ్ల పాలన చూశారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి.. మీరందరూ మీ గుండెల మీద చేతులు వేసి ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ పక్కనే ఆర్కే(ఆళ్లరామకృష్ణారెడ్డి) నిల్చోని ఉన్నాడు. ఈ లోకల్ హీరో గురించి మీ అందరికి తెలుసు. తన పొలంలో తానే నాట్లు వేస్తాడు. తానే కాడిపట్టి దున్నుతాడు. ఆ గట్టు మీదనే భోజనం చేస్తాడు. తనతో పాటు పది మందికి రాజన్న క్యాంటీన్ ద్వారా భోజనం పెడ్తాడు. అందరికి అందుబాటు ధరల్లో కూరగాయాలు కూడా అమ్మిస్తాడు. రైతులకు కష్టం వస్తే రైతుల తరఫున కోర్టుకు కూడా వెళ్తాడు. తనను కొనేందుకు చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. తాను మాత్రం అమ్ముడుపోలేదు. నా సోదరుడు ఆర్కే గత 5 ఏళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఇక టీడీపీ నుంచి ఇక్కడ చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అభ్యర్థి ఇక్కడ ఐదేళ్లలో ఎన్నడూ కాలుకూడా పెట్టలేదు. టీడీపీ పాలనలో చుట్టు పక్కల రైతులకు రక్షణ కూడా లేదు. ఇష్టానుసారం భూములను ఆక్రమిస్తున్నారు. వాటిని అడ్డుకోవాలంటే కోర్టులదాకా వెళ్లే పరిస్థితి. బాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుంది. ఆయన సుపుత్రుడిని కూడా ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వాలని కోరుతున్నాను.
అన్ని అక్రమాలు ఇక్కడే..
మంగళగిరిలోనే హాయ్‌ల్యాండ్, సింగపూర్ కుంభకోణం.. రిషితేశ‍్వరి మరణం, సదావర్తి భూముల కుంభకోణం. మూడు సెంటిమీటర్ల వర్షం పడితే లోపల 6 సెంటీమీటర్ల నీరు కనబడే టెంపరరీ సెక్రటిరియేట్, అసెంబ్లీ. అరటి తోటలను తగల బెట్టించింది. చంద్రబాబు అక్రమ నివాసం ఇక్కడే.. ఈ మంగళగిరిలోనే. ఇక్కడి నేతన్నలను వంచించింది. మేనిఫెస్టోలోచెప్పింది ఒక్కటి కూడా చేయనిది. స్వర్ణకారుల ఆత్మహత్యలు కూడా ఇక్కడే. రైతులను, కూలీలను మోసగించింది ఇక్కడే. దళితుల అసైన్డ్ భూములు లాక్కుంది ఇక్కడే. ల్యాండ్‌పూలింగ్ బాధితులకు ప్లాట్‌లు ఇవ్వలేదు కానీ.. ఆయన బీనామిలుకు ఇచ్చింది ఇక్కడే. కృష్ణానది పక్కనే ఉన్నా సాగు నీరు అందించలేని అధ్వాన్నమైన పరిస్థితి ఇక్కడే. కూతవేటులో సీఎం నివాసం.. పక్కనే ఇసుక దోపిడి. సీఎం ఆయన కొడుకు ఏనాడు మంగళగిరిలో తిరిగినది లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులనుకాపాడుతాడు.. మీ కుటుంబాలను కాపాడుతాడు.. నా క్యాబినెట్‌లోమంత్రిగా ఉంటాడు.
పార్టనర్ ఎందుకు రాలేదు?
ఇక చంద్రబాబు పార్టనర్ అయిన యాక్టర్ పోటీచేసే గాజువాక, భీమవరంలో బాబు ఆయన కొడుకు ప్రచారనికి వెళ్లరు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం.. ఆయన కొడుకు పోటీచేస్తున్న మంగళగిరిలో బాబు గారి పార్ట్‌నర్ ప్రచారానికి రారు. ఈ ఇద్దరికి ఒకే పార్టీలా ? లేక వేర్వేరు పార్టీలా? ఆలోచన చేయమని కోరుతున్నా. దుర్యోధనుడు ఏం చేసినా.. కౌరవసభలో కొందరికి గొప్పగా కనిపంచేదట.. అధికార మదంతో దుర్యోధనుడిని పొగిడినవారిని దుష్ట శక్తులంటాం. హిట్లర్ చేసిన దుర్మార్గులను కప్పిపెట్టి.. రెండో ప్రపంచ యుద్దంలో ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నాడని ఆ నాడు జర్మనిలో రేడియోలోతప్పుడు ప్రచారం చేసినవాడు.. హిట్లర్ మంత్రి గోబెల్స్. వీటిన్నిటిని వింటాఉంటే.. ఎవరైనా గుర్తుకు వస్తున్నారా? ఇదే మాదిరిగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 గుర్తుకు వస్తున్నాయా? ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబు నాయుడు ఓటమి కాయమని ప్రజలు నిర్ణయానికి వచ్చినా.. కూడా గోబెల్స్ తరహాలో చేస్తున్నా ప్రచారాన్ని చూడమని కోరుతున్నా.. 10 ఎల్లో మీడియా చానెళ్లు మైక్స్ పట్టుకోని ప్రచారం చేసినంతా మాత్రానా చంద్రబాబు చేసిన మోసాలు మంచివి అయిపోతాయా?
దగా చేసంది ఎవరు?
చదువుకున్న ప్రజలున్న ఈ అర్భన్ సిటీలో... వారందరిని కోరేది ఒక్కటే.. రుణమాఫి అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేసిందేవరు? నిరుద్యోగభృతి, ఉద్యోగం అంటూ నిరుద్యోగులను మోసం చేసింది ఎవరో ఆలోచన చేయమని కోరుతున్నా. మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? ప్రత్యేకహోదాను పట్టించుకోనిది ఎవరు? ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉన్నా కనీసం.. ఒక్క లేఖ రాయకుండా.. ఒక్కసారి కలవకుండా రాష్ట్రప్రయోజనాలు.. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఎవరు? సెప్టెంబర్ 16, 2016 అందరికీ గుర్తుంటుంది. హోదా వద్దు ప్యాకేజీ కావాలని ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేసింది ఎవరు? ప్యాకేజీ ఇస్తే చాలని కేంద్రానికి లేఖ రాసిందెవరు? ప్యాకేజీ ఇచ్చిన నాలుగు నెలలు తర్వాత.. బీజేపీ మన రాష్ట్రానికి చేసినంత ఎవరు చేయలేదని ప్రెస్‌మీట్ పెట్టి పొగిడింది ఎవరు? దుగ్గరాజు పట్నం ఓడరేవు వద్దని లేఖరాసింది ఎవరు? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టింది చంద్రబాబు?కాదా అని అడుగుతున్నా.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డానని ఇటీవల ప్రకటించింది చంద్రబాబు కాదా? సింగపూర్ కంపెనీలతో రహస్య ఒప్పందం పెట్టుకుని రాజధాని భూములను దారదత్తం చేసిందెవరు? ఆత్మగౌరవం అని మాట్లాడే పార్టనర్, ఎల్లో మీడియా.. ఈ మోసాలపై ఎందుకు మాట్లాడటం లేదని మీ అందరి తరపున ప్రశ్నిస్తున్నా? భూములు ఇవ్వలేదని పంటలు తగలబెట్టింది ఎవరు? రాజధాని ప్రకటనకు ముందు బినామీల చేత ఇక్కడ భూములు కొనగోలు చేయించింది ఎవరు? జగన్ ఇళ్లు ఎక్కడా? అని ఎవరిని అడిగినా.. తాడేపళ్లి అని చూపిస్తారు. అదే చంద్రబాబు ఇళ్లు ఎక్కడా? అని అడిగితే హైదారబాద్ జూబ్లిహిల్స్ చూపిస్తారు. ఈ ఐదేళ్లపాలనలో చంద్రబాబు మోసాలు చూశారు. అబద్దాలు చూశారు. ఈ మోసాలకు ఎన్నిక రోజు క్లైమాక్స్ వస్తుంది. ఇక్కడ ఓటుకు 10వేలు ఇస్తున్నారని నాకు తెలుస్తూ ఉంది. డబ్బులతో ప్రలోభాలకు గురిచేసినా.. మోసపోకండి. ప్రతి గ్రామానికి వెళ్లి.. ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పిండి. మేనిఫెస్టోను వివరించండి. అన్నను గెలిపిస్తే రాజన్నరాజ్యం వస్తుందని చెప్పండి’ అని వైఎస్ జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment