సాక్షి, గుంటూరు: పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కానుక ప్రకటించారు. పేదవారు మొదలుకొని ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కొత్తగా యూనివర్సల్ హెల్త్ కార్డులు తీసుకువస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. అంటే నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తామని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు వాళ్లందరిని యూనివర్సల్ హల్త్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీలోకి తీసుకువస్తామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తానే ఈ పథకాన్ని దగ్గరి ఉండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజులను నియంత్రిస్తామన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తాఫాను, గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఏసురత్నంను, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్‌రెడ్డిని గెలిపించమని కోరారు.
ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశామా?
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘గుంటూరు సిటీ మీదుగా నా పాదయాత్ర సాగింది. జిల్లాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్లు తవ్వి పూడ్చకుండా వదిలివేశారు. నిర్లక్ష్యం కారణంగా తాగునీటి పైపుల్లోకి మురుగు నీరు చేరి డయేరియా వచ్చి 32 మంది చనిపోలేదా?. ప్రతిపక్షం ఆందోళన చేస్తే తప్ప చంద్రబాబు మనుషులు చనిపోయినట్టు ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఉన్న గుంటూరులోనే పరిస్థితి ఇలా ఉంది. ఇవాల్టికి కూడా దెబ్బతిన్న పైపులైన్లను బాగు చేయలేదు. శివార్లలో ఇప్పటికీ రెండు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయో మీరంతా చూశారు. ఆస్పత్రిలో లైట్లు, జనరేటర్లు లేక సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఇదే ఆస్పత్రిలో చిన్నారి ఎలుకలు కోరికి చనిపోవడం చూశాం. ఏ ముఖ్యమంత్రి పాలనలోనైనా మనం ఇలాంటి ఘటనలు చూశామా?. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై అపనమ్మకం కలిగి.. ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.
ఆ డబ్బులు మాఫీ చేస్తాం..
గుంటూరు శివార్లలో పేదవారికి సంబంధించిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. ఆ భూముల్లో ఫ్లాట్లు కట్టే స్కామ్ చేస్తున్నారు. మూడు లక్షల రూపాయలు కూడా విలువ చేయని ఫ్లాట్‌లను 6 లక్షల రూపాయలకు పేదవారికి అమ్ముతున్నారు. అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు. లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా?. చంద్రబాబు ఇచ్చిన ఫ్లాటులను తీసుకున్న వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3లక్షల రూపాయలను మాఫీ చేస్తాం.
నేనున్నానని హామీ ఇస్తున్నా...
3,648 కి.మీ సాగిన పాదయాత్రలో ప్రతి పేదవాడు పడుతున్న బాధ విన్న.. గుంటూరు లాంటి నగరాల్లోకి వచ్చినప్పుడు మధ్య తరగతి వాళ్లు పడుతున్న బాధలు కూడా విన్నాను. నగరాల్లో ఉన్న వాళ్లకు సమస్యలు ఏమిటని నా ఆలోచన సాగింది. పిల్లలను చదివించడం కోసం ఫీజులు చూస్తే.. ఎల్‌కేజీ చదివించాలన్నా ఏడాదికి రూ. 25 వేలు గుంజుతున్నారు. కాలేజ్‌ల్లో కూడా ఫీజులు బాదుతూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి అరకొర సాయమే అందుతుంది. చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంతో కొంత జీతాలు వచ్చే వారికి కూడా ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రులకు వెళ్తే.. వారు వేసే బిల్లులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. చదువుకున్న వారికి ఉద్యోగం లభించని పరిస్థితి. పాదయాత్రలో అందరి కష్టాలు చూశాను. ప్రతి బాధ విన్నాను.. నేనున్నానని భరోసా ఇస్తున్నాను.
ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేస్తాం..
టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా.. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటే భయపడేలా చేస్తున్నారు. పుస్తకాలు సమయానికి సప్లై చేయడం లేదు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రైవేటు స్కూల్స్ నారాయణ, చైతన్య పేర్లు వినబడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజులను నియంత్రిస్తాం. ప్రైవేటు ఫీజులు తగ్గించేందుకు రెగ్యూలేటరీ కమిటీ వేస్తాం. అంతేకాకుండా ప్రైవేటు స్కూళ్లలో, కాలేజీల్లో వసతులు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటాం.
నిరుద్యోగులకు వైఎస్ జగన్ భరోసా..
రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా గ్రామ సెక్రటేరియట్ పేరిట ప్రతి గ్రామంలో చదువుకున్న 10 మందికి అక్కడే ఉద్యోగం ఇస్తాం. ప్రభుత్వ పథకాలకు, నవ రత్నాలకు సంబంధించి ఏ పని అయినా 72 గంటల్లో పూర్తి చేసేలా గ్రామ సచివాలయం పనిచేస్తుంది. గ్రామ సెక్రటేరియట్‌కు అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇస్తాం. వారికి గౌరవ వేతనం కింద 5000వేల రూపాయలు అందజేస్తాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యతలను వారే చూస్తారు. రేషన్, పింఛన్ ఇలా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు రావడం లేదు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెస్తాం. అంతేకాకుండా వారికి స్కిల్ డెవలప్‌మెంట్ కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తాం. నిరుద్యోగ యువతకు వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద రుణం, సబ్సిడీ అందజేస్తాం. ఈ కాంట్రాక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం.దేశంలో రేపు ఏ ఒక్కరు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉంది. మనం 25 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలను గెలిపించుకుందాం. ప్రత్యేక హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతిస్తాం. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, హోటళ్లు నెలకొల్పడానికి అందరు ముందుకొస్తారు. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది.
నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి..
రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత రావాలి. రాజకీయ నాయకులు చెప్పిన పని చేయకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ కూళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. చంద్రబాబు ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తార పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండ’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment