‘చరిత్రలో ఇంతటి అన్యాయమైన ఎన్నిక జరిగి ఉండదు’ | YS Jagan Speech At Nandyal Public Meeting | Sakshi
Sakshi News home page

‘చరిత్రలో ఇంతటి అన్యాయమైన ఎన్నిక జరిగి ఉండదు’

Published Thu, Apr 4 2019 3:35 PM | Last Updated on Thu, Apr 4 2019 5:31 PM

YS Jagan Speech At Nandyal Public Meeting - Sakshi

సాక్షి, నంద్యాల: ‘ నంద్యాలలో ఉప ఎన్నిక జరిగినప్పుడు.. ఎన్ని డ్రామాలు జరిగాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉప ఎన్నికలకు ముందు నంద్యాల మీద చంద్రబాబు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేశారు. ఓట్ల కోసం గారడీ చేశారు. ప్రజలను భయపెట్టడంతో పాటు ప్రలోభాలకు గురిచేశారు. ఇంతటి అన్యాయమైన, అరాచకమైన  ఎన్నిక భారత దేశ చరిత్రలో ఎప్పుడూ జరగి ఉండద’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా అక్కడికి తరలివచ్చిన ప్రజలకు వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘ఉప ఎన్నిక జరిగి 19 నెలలు గడుస్తున్న నంద్యాలలో రోడ్డు విస్తరణ బాధితులకు ఇంకా నష్ట పరిహారం అందిందా?. ఓట్లేస్తే ఇళ్లు ఇస్తామని చెప్పి పేదవాళ్లను లూఠీ చేశారు. పేదవారి నెత్తిన అప్పులు మోపి చంద్రబాబు స్కామ్‌లు చేస్తున్నారు. మూడు లక్షల రూపాయలు కూడా విలువ చేయని ఫ్లాట్‌లను 6 లక్షల రూపాయలకు పేదవారికి అమ్ముతున్నారు. అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు.  లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా?. చంద్రబాబు ఇచ్చిన ఫ్లాటులను తీసుకున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3లక్షల రూపాయలను మాఫీ చేస్తాం. 

కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తాం..
ఈ జిల్లాలో భారీగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ముందకు రాలేదు.. కానీ అగ్రిగోల్డ్‌ ఆస్తులను వాళ్ల అత్తగారి సొత్తు అన్నట్టు చంద్రబాబు దోచుకున్నారు. ఈ జిల్లాలో కేశవరెడ్డి, పిల్లల చదువు పేరిట తల్లిదండ్రుల నుంచి వేలాది, లక్షలాది రూపాయలు లూఠీ చేశారు. కేశవరెడ్డి గారి వియ్యంకుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తారు. అందుకే చంద్రబాబు చర్యలు తీసుకోరు. కేశవరెడ్డి బాధితులకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. చంద్రబాబు వారికి ఒక్క రూపాయి కూడా ఇప్పించలేదు. కేశవరెడ్డి ఆస్తులను ఇష్టం వచ్చినట్టు వారి బినామీలకు అమ్ముకునే ప్రయత్నం చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తాం. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆటో నగర్‌ వారికి పట్టాలు ఇస్తామని అన్నారు. 19 నెలలు గడిచిన నేటికి వారికి పట్టాలు వచ్చాయా?, ఉప ఎన్నికల సమయంలో పాతిమా కాలేజ్‌లో చదువుతున్న వైద్య విద్యార్థులకు తానే ఫీజులు కడుతున్నానని చెప్పారు. కానీ నేడు ఆ విద్యార్థుల న్యాయం జరగక చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు పాలనలో మోసం మాత్రమే కనిపిస్తుంది. మార్పు కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. 

చంద్రబాబు హయంలో ఏం జరిగిందంటే రైతున్నలకు గిట్టుబాటు ధర లేదు. రుణాలు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ కాలేదు. కరెంట్‌  చార్జీలు పెంచడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. ఉద్యోగాలు లేక నిరుద్యోగం రెట్టింపయింది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ బాబు వచ్చి ఉన్న జాబులు ఉడగొట్టారు. నిరుద్యోగి భృతి అన్న చంద్రబాబు ప్రతి ఒక్కరికి లక్ష 20వేల రూపాయలు ఎగ్గొట్టారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయలేదు. చంద్రబాబు హయంలో మహిళలకు భద్రత కరువైంది. ఇసుక మాఫీయాలను మహిళ ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళితే కేసులు కూడా పెట్టలేదు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ జరిగితే చంద్రబాబు నిందితులను శికించరు. పదేళ్ల క్రితంతో పొల్చితే చంద్రబాబు పాలనలో పంటల దిగుబడితోపాటు సాగు విస్తీర్ణం తగ్గింది. బీసీ లపై ప్రేమ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. బీసీ పిల్లలు చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్న పట్టించుకోరు.

గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది..
చంద్రబాబు హయంలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. నారాయణ స్కూల్స్‌లో ఫీజులు గుంజడానికి గవర్నమెంట్‌ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో ఎక్కడబడితే మద్యం దుకాణాలు, బార్లు కనబడుతున్నాయి. 108 గ్రామాల్లో తిరగడం తగ్గింది. ఆరోగ్య శ్రీ కాస్తా అనారోగ్య శ్రీగా మారింది. పెద్ద వ్యాధులకు చికిత్స  చేయించుకోలేక బాధితులు ఆత్మహత్యలు చేసకుంటున్నారు. రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్‌లు పెరగలేదు కానీ ప్రతి వార్డులోను జన్మభూమి మాఫియాలు తయారయ్యాయి.

రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి..
మంత్రి యనమల రామకృష్ణుడు వైద్యం చేయించుకునేందుకు సింగపూర్‌ వెళ్లవచ్చు.. కానీ పేదవారు హైదరాబాద్‌ వెళ్లి వైద్యం చేయించుకుంటే బిల్లులు చెల్లించని పరిస్థితి. ఆర్టీసీ చార్జీలు, కరెంట్‌ చార్జీలు, పన్నులు పెంచుకుంటూ పోయారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన 650 హామీల్లో 5 శాతం కూడా నెరవేర్చలేదు.  వేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసం చేశారు. ఈ రోజు ఆ మేనిఫెస్టో ఎక్కడ కనిపించని పరిస్థితి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రతి రాజకీయ నాయకుడు తాను చెప్పిన పనిని చేయకపోతే.. రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తోంది. ఈ రోజు మనం చంద్రబాబు కుట్రలు చూస్తున్నాం. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. మనం యుధ్దం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఒక్కడితోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా. ఒక్క అబద్దం చెప్పి అది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి..
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. వారం రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఎంత పెద్ద  చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.  గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. రాజన్న పాలనలో మాదిరి మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే అది జగనన్నతోనే సాధ్యం అని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని రైతన్నను అడగండి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. పింఛన్‌ మూడు వేలకు పెంచుకుంటూ పొతారని ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి. నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పిండి. నవరత్నాలను ప్రతి ఇంటి వద్దకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నా. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిని,  ఎంపీ అభ్యర్థి బ్రహ్మానందం అన్నను ఆశీర్వదించమ’ని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement