సాక్షి, అమరావతి: పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)తో సమానంగా నూతన పెన్షన్ విధానం రూపుదిద్దుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. మంగళవారం వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అనేది ఉండదన్నారు. ఓపీఎస్‌తో సమానమైన పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. ఉద్యోగులు 50 శాతం బెనిఫిట్ పొందే విధంగా ఈ విధానం ఉంటుందన్నారు.
కేబినెట్‌లో తీసుకునే నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వ హయాంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో పలు సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చారన్నారు. 32 శాఖలకు సంబంధించి సుమారు 454 అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తేగా 330 అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయన్నారు. తక్కువ వ్యవధిలో ఇన్ని సమస్యలు పరిష్కరించడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇప్పటికే జీపీఎఫ్ బకాయిలు, సరెండర్ లీవులు, ఏపీజీఎల్‌ఐ పెండింగ్ బిల్లులను చెల్లించారని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో సమస్యలను పరిష్కరించేందుకు ఆరోగ్యశ్రీ ïసీఈఓ ఖాతాలో హెల్త్ కార్డ్ డబ్బులను ఈ నెల నుంచే జమ చేస్తారని చెప్పారు.
గతంలో ఓ సీఎం మాట తప్పారు
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబధ్దీకరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన తర్వాత తాము అలా ఎప్పుడు చెప్పామంటూ గతంలో ఒక ముఖ్యమంత్రి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు సీఎం జగన్ హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తున్నారని తెలిపారు. సుమారు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీలు, సహకార సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచనున్నారని తెలిపారు. స్పెషల్ పే చెల్లించేందుకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలను పదవీ విరమణ తర్వాత ఇవ్వాలని తొలుత భావించినా ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు నాలుగేళ్లలో 16 విడతలుగా సుమారు రూ.7,382 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.76 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందన్నారు.
పద్ధతి ప్రకారం చెల్లింపులు
తాము చేసిన ఉద్యమం వల్లే ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేస్తున్నట్లు కొన్ని ఉద్యోగ సంఘాలు గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేయడం సరికాదని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమైన పెద్ద అంశాలపై మాత్రమే ఉద్యమాలు నిర్వహించగా ఇప్పుడు కొన్ని సంఘాలు ఎందుకు ఉద్యమం చేస్తున్నాయో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వడం లేదని, ఒక పద్ధతి ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో పీఆర్సీ కమిషన్ నియమించాలని ఉద్యమాలు జరగగా ఇప్పుడు ప్రభుత్వం ముందుగానే నియమిస్తోందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment