సాక్షి, అమరావతి: కేన్సర్ రోగుల కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించడానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు కేన్సర్ రోగులు చికిత్స కోసం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు. ఇకపై వారికి రాష్ట్రంలోనే ఆధునిక చికిత్సను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 21 నుంచి రాష్ట్రంలోని 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవలు ప్రారంభిస్తోంది. రోగులు ఈ ఆస్పత్రుల్లో హబ్ అండ్ స్పోక్ విధానంలో కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు పొందవచ్చు.
తిరుపతిలోని స్విమ్స్‌తో పాటు మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోని పాత 10 బోధనాస్పత్రులు హబ్స్‌గా వ్యవహరిస్తాయి. వీటికి సమీపంలోని జిల్లా ఆస్పత్రులను మ్యాపింగ్ చేశారు. రోగులకు తొలుత హబ్స్‌లో చికిత్స అందిస్తారు. ఆ తర్వాత కేన్సర్ వైద్య నిపుణుల సూచనలతో జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తారు. ఇందుకోసం ప్రతి జిల్లా ఆస్పత్రిలో నాలుగు పడకలతో ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేస్తారు. వైద్య సేవలందించడానికి ప్రతి యూనిట్‌లో ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మాసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించారు.
వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. మందులు, ఇంట్రావీనస్, ఇంట్రాపెరిటోనియల్, ఇంట్రాథేకల్ ఇలా వివిధ కేన్సర్ వ్యాధులకు కీమోథెరపీ చేస్తారు. సాధారణంగా బ్రెస్ట్, తల, గొంతు కేన్సర్ రోగులకు వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితి ఆధారంగా ఆరు అంతకంటే ఎక్కువ సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర కేన్సర్ కేర్ ప్రత్యేకాధికారి డాక్టర్ రమేశ్ తెలిపారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడేవారికి ఐదు సైకిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు తొలుత రెండు సైకిల్స్ కీమోథెరపీని బోధనాస్పత్రుల్లో (హబ్స్‌లో) ఇస్తారు. అనంతరం రోగి ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోని జిల్లా ఆస్పత్రికి మ్యాప్ చేస్తారు. ఇలా మ్యాప్ చేసిన రోగికి హబ్‌లోని అంకాలజీ నిపుణుడి సూచనల మేరకు మిగిలిన అన్ని సైకిల్స్ కీమోథెరపీ జిల్లా ఆస్పత్రుల్లోనే చేస్తారు. భరించలేని నొప్పితో బాధపడుతున్న రోగులకు నొప్పి నుంచి నివారణ కల్పించేలా పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు.
కేన్సర్ రోగుల వైద్యానికి ఇప్పటికే రూ.1,800 కోట్లు ఖర్చు
కేన్సర్ రోగులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని అన్ని రకాల కేన్సర్ రోగులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 2019–20 నుంచి ఇప్పటివరకు 2.70 లక్షల మందికిపైగా రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,800 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన కేన్సర్ వైద్య సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో కేన్సర్ రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందించడానికి గుంటూరు బోధనాస్పత్రిని లెవెల్–1, కర్నూలు, విశాఖ ఆస్పత్రులను లెవెల్–2 సెంటర్స్‌గా అభివృద్ధి చేస్తోంది.
డిసెంబర్ 21 నుంచి ప్రారంభం
డిసెంబర్ 21 నుంచి 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కీమోథెరపీ, పాలియేటివ్ కేర్‌కు అవసరమైన మందులు, ఇతర సదుపాయాలను ఏపీఎంఎస్‌ఐడీసీ సమకూరుస్తోంది. ఇక మీదట కేన్సర్ రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే వారు చికిత్స పొందవచ్చు.
– డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్
Comments
Please login to add a commentAdd a comment