రిటైర్‌మెంట్ ప్లాన్ ఇలా బెటర్!
పొదుపు సలహా
మా వారొక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం మాకు బాగానే గడిచిపోతోంది. అయితే మరో పదిహేనేళ్లకు ఆయన రిటైరవుతారు. ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటన్నది నా ఆందోళన. దయచేసి మాకు ఒక మంచి రిటైర్‌మెంట్ ప్లాన్ చెప్పగలరు. మా వారి జీతం నుంచి నేను నెలకు ఐదువేల వరకు ఆదా చేయగలను.
- ఎన్.పి.లత, హైదరాబాద్
రిటైర్‌మెంట్ ప్లాన్ కోసం మీరు కేటాయించదలచిన ఈ మొత్తాన్ని ఈ కిందివిధంగా మదుపు చేస్తే మీ విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. పి.పి.ఎఫ్: ఈ ప్లాన్ కింద మీరు నెలకు రూ. 2000 చొప్పున పదిహేను సంవత్సరాలపాటు పొదుపు చేయండి. ఇది ఎటువంటి నష్టభయమూ లేని మార్గం. దీనికి సెక్షన్ 80 సి కింద దీనికి పన్ను రాయితీ ఉంది. వడ్డీపై ఎటువంటి పన్నూ లేదు. ప్రస్తుతం ఈ పథకంలో 8.7 శాతం వడ్డీ ఇస్తున్నారు. మనీ బ్యాక్ పాలసీలు/ఎన్‌పీఎస్: ఈ పథకం కింద మీరు నెలకు రూ.1500 వరకు మదుపు చేయవచ్చు. ఇది కూడా నష్టభయం లేని పథకమే. ఇందులో మదుపు చేయడం వల్ల బీమాతోపాటు మనం ఎంచుకున్న కాలవ్యవధి మేరకు విడతల వారీగా కొంత మొత్తం సొమ్ము చేతికి అందుతుంటుంది. దీనికి చెల్లించే ప్రీమియంకు పన్ను రాయితీ ఉంది. దీనితోబాటు నూతన పెన్షన్ పథకం కూడా ప్రయోజనకరమే. ఇందులో మంచి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్: పైన చెప్పుకున్న రెండూ స్వల్ప వడ్డీనిచ్చే నష్టభయం లేని పథకాలు కాబట్టి, మిగిలిన డబ్బును మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ ఆధారిత గోత్ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం. పదిహేనేళ్ల కనీస వ్యవధిని ఎంచుకుంటే 15 నుంచి 18 శాతం వరకు వడ్డీ గ్యారంటీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
- రజని భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ
పొదుపు సలహా