కొన్ని కథనాంశాలు కొందరి స్వార్థపరుల ఆలోచనల్లోంచి పుట్టుకొస్తాయి. అవి వ్యథలుగా మారి ఇంకొందరి భయాల్లోంచి, మరికొందరి నమ్మకాల్లోంచి కథలు కథలుగా వినిపిస్తాయి. బెంగళూరు చరిత్రలో వాజ్ విల్లా మిస్టరీ కూడా అలాంటిదే.
‘వాజ్ విల్లా’.. 2002 వరకూ అదొక నివాసయోగ్యమైన సాధారణ ఇల్లు. ఒక హత్య, కొన్ని పుకార్లు.. ఏవో అస్పష్టమైన కదలికలతో కలగలసి ఆ ఇంటిని భూత్ బంగ్లాగా మార్చాయి. చివరికి శిథిలం చేసి.. ఛిద్రం చేసి.. చరిత్రలో కలిపేశాయి. అసలు ఆ రియల్ క్రైమ్ స్టోరీ.. హారర్ స్టోరీగా ఎలా మారింది?
బెంగళూరులో ఎంతో రద్దీగా ఉండే ఎస్‌టీ మార్కెట్ రోడ్‌కి అతి సమీపంలో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది ఆ ఇల్లు. దీన్ని 1943లో నాటి బాంబే హైకోర్టు ప్రఖ్యాత న్యాయవాది ఇ.జె. వాజ్ కట్టించారు. వెరా వాజ్, డోల్స్ వాజ్ అనే తన ఇద్దరు కుమార్తెలకు ఆ ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. వెరా, డోల్స్ ఇద్దరూ వివాహం చేసుకోలేదు. వృద్ధాప్యం వరకూ అదే ఇంట్లో కలసి ఉన్నారు. అయితే 2002 సెప్టెంబర్ 4న తెల్లవారు జామున ఆ ఇంట్లోకి ఎవరో ఆగంతకులు ప్రవేశించి.. 75 ఏళ్ల డోల్స్ వాజ్‌ని కిరాతకంగా పొడిచి, చంపి పారిపోయారు. ఆ హత్యను వెరా కళ్లారా చూసింది.
అయితే హంతకులు పారిపోవడంతో సరైన సాక్ష్యం లేకుండా పోయింది. నాటి పోలీసు కమీషనర్ హెచ్.టి. సాంగ్లియా .. 80 ఏళ్ల వయసున్న వెరాను సురక్షిత ప్రదేశానికి మార్చాలని ఆదేశించారు. అందుకు ఆమె అంగీకరించలేదు. అయినా భద్రతాకారణాల దృష్ట్యా వెరా కూడా ఆ ఇంటిని విడిచివెళ్లక తప్పలేదు. తన బంధువుల్లో కొందరు తన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన వెరా.. తన చెల్లెలి హత్యకు కారణమైన వారిని పట్టుకోవాలని ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసింది. ఊరు వదిలిపోవాలంటూ వెరాకు బెదిరింపులు కూడా వచ్చాయట.
డోల్స్ హత్య తర్వాత 12 ఏళ్ల పాటు ఆ ఇంట్లో మనుషులే లేకపోవడంతో.. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరి.. ఆ ఇంట్లో దయ్యం ఉందని.. డోల్స్ ఆత్మ అక్కడే తిరుగుతోందని.. ఇలా ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. స్థానికులూ ఆ పుకార్లను బలపరుస్తూ.. ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా రాత్రుళ్లు వింత శబ్దాలు వినిపిస్తున్నాయని.. పియానో ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తోందంటూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్లడానికి కూడా వణికిపోయేవారు. ఎందుకంటే డోల్స్‌కి పియానో అంటే చాలా ఇష్టం. ఆ విషయం చుట్టుపక్కలవారందరికీ తెలుసు.
అందుకే రాత్రిళ్లు పియానో వాయించిన శబ్దం ఆ ఇంట్లోంచి వచ్చేసరికి.. విన్నవారంతా హడలిపోయేవారట. దానికి తగ్గట్టు ఆ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో.. చూడటానికీ భయంకరంగా ఉండేది. ఇంటి ముందు పార్క్ చేసిన హిల్‌మాన్ మింక్స్ అనే ఓల్డ్ మోడల్ కారు తుప్పుపట్టి ఉండేది. కిటికీ అద్దాలు పగిలిపోయి.. తలుపులు కుంగిపోయి.. ఇల్లు కూడా కళావిహీనంగా మారిపోయింది.
దాంతో ఆ ఇంట్లో ఏదో ఉందన్న వార్తలు అక్కడివారిని భయపెట్టేవి. అయితే వెరా మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించేది. కావాల్సినవారే తమ ఆస్తిపై కన్నేసి.. తన సోదరిని హత్య చేయించి.. ఇలా ఆత్మలు, దయ్యాలతో కేసును పక్కతోవ పట్టిస్తున్నారని వాపోయేది. అయినా ఫలితం లేదు. డోల్స్‌ని చంపింది ఎవరో నేటికీ తేలలేదు. ఐదేళ్ల క్రితం శిథిలమైన ఆ ఇంటిని కూల్చివేసినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
మరి ఆ కోట్ల రూపాయాల ఆస్తిని ఎవరు సొంతం చేసుకున్నారు? అసలు డోల్స్‌ని ఎవరు చంపారు? వెరా ఏమైంది? ఆత్మల పుకార్లు సృష్టించింది ఆస్తికోసమేనా? పియానో వాయించడంలో కూడా హత్యకు కారణం అయిన వారి హస్తం ఉందా? చుట్టుపక్కల వారిని భయపెట్టి.. కావాలనే దయ్యం కథను అల్లారా? లేదంటే నిజంగానే ఆ ఇంట్లో డోల్స్ ఆత్మ ఉండేదా? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన
ఇవి చదవండి: పర్యాటకులకు వింత ఉద్యోగాలు.. ఏంటో తెలుసా!?
Comments
Please login to add a commentAdd a comment