మిస్టరీ.. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది.. | Sakshi
Sakshi News home page

అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే!

Published Sun, Apr 28 2024 12:46 PM

The Green Children Of Woolpit Village Mistory Story Of England

అది 12వ శతాబ్దం. వారసత్వ సంక్షోభంతో ఇంగ్లండ్‌ సింహాసనం కోసం అంతర్యుద్ధం జరుగుతున్న కాలమది. దాన్ని చరిత్రలో ‘ది అనార్కీ’ అని పిలుస్తారు. ఆ అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే!

సఫెక్‌లోని వూల్‌పిట్‌ అనే గ్రామంలో కొందరు పొలం పనులు చేసుకుంటున్నారు. అప్పుడే ఉన్నట్టుండి, సమీపంలో తోడేళ్ల కోసం తవ్విన గుంతలో ఎండుటాకుల అలికిడి బాగా పెరిగింది. ‘అబ్బ.. తోడేళ్లు పడినట్లు ఉన్నాయి. ఈ రోజుకి మన పంట పండింది’ అనుకున్నారు. వారంతా నెమ్మదిగా తోడేళ్ల గుంత వైపు నడిచారు. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది. ఆ అస్పష్టతకు కారణం స్వరం కాదు, భాష. ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అక్కడున్నవారెవ్వరికీ అర్థంకాలేదు.

దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తే ఆ గుంతలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చూస్తుంటే వారిద్దరూ అక్కా, తమ్ముడు అని అర్థమవుతోంది. కానీ ఇద్దరూ ఆకుపచ్చ చర్మంతో ఉన్నారు. వారి ఒంటి మీద దుస్తులు అసాధారణంగా, వింతగా కనిపించాయి. మానవులు కాదనే అనుమానం ఓ వైపు.. పసివాళ్లు అనే జాలి మరోవైపు.. పెనుగులాడుతుంటే.. చివరికి జాలే గెలిచింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పైకి తీసి, ‘రిచర్డ్‌ డి కాల్నే’ అనే ఊరిపెద్ద ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే పిల్లలకు ఆవాసం ఏర్పాటు చేశారు. అయితే తినడానికి ఏం పెట్టినా పిల్లలు వద్దన్నారు. వాళ్లు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల అవసరం పెద్దలకు బోధపడలేదు.

ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు.. చాలారోజుల పాటు తిండి తినలేదట. అయితే కొంత కాలానికి.. ‘కాల్నే’ తోటలో పెరుగుతున్న బఠాణీ మొక్కల నుంచి బఠాణీలను తెంపుకుని తినడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల పాటు వాటి మీదే బతకారు వాళ్లు.  దాంతో ఆ పిల్లలు వేరే లోకం నుంచి వచ్చి పడ్డారన్న వాదన స్థానికుల్లో బలపడింది. తర్వాత కొంత కాలానికి.. ‘కాల్నే’ ఇంట్లో కాల్చిన రొట్టెలను తినడం మొదలుపెట్టారా పిల్లలు. దానివల్ల క్రమంగా వారి చర్మం రంగు మారుతూ వచ్చింది. పిల్లలు స్థానిక భాషను నేర్చుకుని.. మాట్లాడటం ప్రారంభించారు. అలా నెమ్మదిగా వాళ్లు సాధారణ మనుషులుగా మారుతున్న తరుణంలో.. ఉన్నట్టుండి పిల్లాడు చనిపోయాడు.

తమ్ముడి మరణంతో ఆ పాప చాలా కుంగిపోయింది. తేరుకోవడానికి నెలలు పట్టింది. ఆ బాధలో చుట్టుపక్కలవారితో అనుబంధం పెరిగి.. అమ్మాయి మాటల్లో స్పష్టత వచ్చింది. ఆమె ఇంగ్లిష్‌ మాట్లాడటం నేర్చుకుంది. భాష పూర్తిగా నేర్చుకున్న తర్వాత.. ఆ అమ్మాయి మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ‘నేను, నా సోదరుడు గతంలో ఉన్న చోటకి.. ఇప్పుడు ఉంటున్న చోటికి చాలా తేడా ఉంది. అది వేరే గ్రహంలా అనిపిస్తోంది.

మేము ఇక్కడికి ఎలా వచ్చామో మాకు తెలియదు. మేము తోడేళ్ల గుంతలో పడకముందు వరకూ మా నాన్నతోనే ఉన్నాం. ఉన్నట్టుండి పెద్ద గంటల మోత వినిపించింది. మేము ఆ సమీపంలో పెద్ద నదిని కూడా చూశాం. ఆ క్షణంలో మాకేమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి మీ ముందు ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. ఆ పిల్ల అంత చెప్పుకొచ్చినా ఆ అక్క, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారనేది అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు.

అలా ‘కాల్నే’ ఇంట్లోనే పెరిగిన ఆ అమ్మాయికి.. ‘ఆగ్నెస్‌ బారే’ అనే పేరుపెట్టారు. దగ్గర్లోని కింగ్స్‌ లిన్‌ పట్టణానికి చెందిన ‘ఆర్చ్‌డీకన్‌ రిచర్డ్‌’ని పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమెకు పిల్లలు కూడా పుట్టారు. అయితే  ఆమె వంశస్థుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. ఆమెకు పుట్టిన పిల్లలు ఆకుపచ్చరంగులో పుట్టారని, వారు తిరిగి తమ పూర్వీకులను వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆనాడు ఆ పిల్లల్ని చూసిన కొందరు చిత్రకారులు.. కొన్ని చిత్రాలను గీసి భద్రపరచారట.

అయితే తర్వాత కాలంలో .. ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ బెల్జియంలోని ఫ్లాండర్స్‌కి చెందిన ఫ్లెమిష్‌ వలసదారుల పిల్లలు కావచ్చు అనే ఓ వాదన పుట్టుకొచ్చింది. 12వ శతాబ్దంలో అనేక మంది ఫ్లెమిష్‌ వలసదారులు.. వూల్‌పిట్‌ సమీపంలోని ఫోర్న్‌హామ్‌ సెయింట్‌ మార్టిన్‌ పట్టణానికి చేరుకున్నారనే ఆధారాలూ దొరికాయి. ఫోర్న్‌హామ్‌ను, పూల్‌పిట్‌లను.. లార్క్‌ నది వేరు చేస్తుంది. ఆ పాప చెప్పిన నది అదే కావచ్చని అంచనా వేశారు.

కింగ్‌ హెన్రీ ఐఐ పాలనలో, ఫోర్న్‌హామ్‌ యుద్ధంలో చాలామంది ఫ్లెమిష్‌ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం కారణంగా ఆ అక్కాతమ్ముళ్లిద్దరూ తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మారి ఉండొచ్చు. పాప విన్న పెద్ద గంటల చప్పుడు .. యుద్ధానికి సంబంధించిందే అయ్యుండొచ్చు. అలా అనాథలైన ఈ పిల్లలు.. అడవి బాటలో పడి పోషకాహారం కరవై అనారోగ్యానికి గురై ఉండొచ్చని, పిల్లల్ని కాపాడినవారికి వీరి డచ్‌ భాష అర్థమై ఉండకపోవచ్చని అంచనా వేశారు.

ఈ అంచనా నిజమైతే.. పిల్లల చర్మం ఎందుకు ఆకుపచ్చగా ఉంది? అనే ప్రశ్న.. మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. పోషకాహారం అందకుంటే చర్మం ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అందుకే సమతుల ఆహారం తీసుకున్నా కొద్ది రోజులకే వాళ్ల చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరిందని గుర్తుచేస్తూ.. పై వాదనకు బలాన్నిచ్చారు  నిపుణులు.

ఇదిలా ఉండగా..  ఆర్సెనిక్‌ పాయిజనింగ్‌ వల్ల కూడా చర్మం ఆకుపచ్చగా మారుతుందనే మరో వాదన వచ్చి షాక్‌నిచ్చింది అందరికీ! పిల్లలపై ఆ విషప్రయోగం జరిగి ఉంటుందా? కావాలనే పిల్లలకు ఈ విషం ఇచ్చి.. అడవిలో వదిలేసి వెళ్లారా? అనే ప్రశ్నలు ఈ కథను ఉత్కంఠగా మార్చాయి.

అయితే ఆ ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు దొరకలేదు. ఆ దిశలో అన్వేషణ కొనసాగుతుండగానే.. ఆ పిల్లలు ఏలియ¯Œ ్స అని కొందరు నమ్మసాగారు. పిల్లలు దొరకడం నిజమే. కానీ ఎలా దొరికారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే ఊహాజనితమైన ఈ కథనాన్ని ప్రేరణగా తీసుకుని.. ఎన్నో నవలలు, పద్యాలు, నాటకాలు, సినిమాలు, డ్రామాలు పుట్టుకొచ్చాయి. దాదాపు ఎనిమిది శతాబ్దాలకు పైగా ఈస్టోరీ మిస్టరీగా కొనసాగుతునే ఉంది. — సంహిత నిమ్మన

ఇవి చదవండి: Funday Story: చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?

Advertisement
Advertisement