ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోండి ఇలా..
ఆర్థిక ఇబ్బందులనేవి జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమయంలో ఎదురవ్వడం సాధారణమే. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడడం, ఉద్యోగం పోవడం, ఇలా ఎన్నో సమస్యలు అనుకోకుండా సంభవించి ఆర్థికంగా ఉక్కరిబిక్కిరి చేస్తుంటాయ్. అయితే ఆ పరిస్థితులు అకస్మాత్తుగా ఎదురయ్యేవరకు ఎక్కువమంది వీటి గురించి ఆలోచించరు. కానీ ముందుగానే వీటి గురించి ఆలోచించేవారు.
అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేవారూ... ఏదైనా అనుకోని ఇబ్బం దిలో పడ్డా... సులువుగా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఒకవేళ ఆర్థిక సమస్యల చట్రంలోకి వెళ్లినా... ‘తమకు అందుబాటులో ఉండే కొద్ది మొత్తాన్ని అయి నా... జాగ్రత్తగా వినియోగించుకుంటూ’ దాని నుంచి బయటపడతారు. మిగిలినవారు నిరాశ, ఇబ్బందుల్లో కూరుకుపోతారు.
ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొనడానికి దోహదపడే కొన్ని మార్గాలను పరిశీలిస్తే...
బీమా ధీమా
ఇక్కడ మొదటిగా చెప్పుకోవాల్సింది బీమా గురించి. సంపాదనలో ఉన్నప్పుడు పన్ను మినహాయింపు పొందే జీవిత బీమా ప్రణాళికను అనుసరిస్తే... కుటుంబ ఖజానాకు కొంత అదనపు డబ్బు సమకూరుతుంది. కొంచెం కొంచెంగా ఇలా పొదుపైన డబ్బు ఇబ్బందులు ఎదురయినప్పుడు ఎంతో అండగా ఉం టుంది. ఇక టర్మ్ పాలసీలు సైతం కుటుంబం మొత్తం భవిష్యత్‌కు భరోసాను ఇస్తుంది.
కాలపరిమితి ముగిసిన తర్వాత రిటర్న్స్ ఏవీ రానప్పటికీ ప్రమాదాల వంటి సమయంలో భారీ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ప్రీమియంకు ఈ ప్రొడక్టులు లభిస్తుండడం సానుకూలాంశం. వైద్య బీమాతో కుటుంబంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సెక్షన్ 80డీ కింద వైద్య బీమా పథకాలకు చెల్లించే ప్రీమియం రూ.15,000పై, అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ. 20,000 వరకూ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
బడ్జెట్
వ్యయం పూర్తిగా అదుపులో ఉండాలి. ప్రతిపైసా కుటుంబ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేయాలి. నెలవారీ సంపాదనకు మించి వ్యయం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరక్కుండా చూసుకోవాలి. ప్రతినెలా వ్యయాలు, భవిష్యత్ నెల ఆదాయం ప్రాతిపదికన దాదాపు ఖచ్చితమైన బడ్జెట్ రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి. ధరల పెరుగుదల అంశం సైతం బడ్జెట్‌లో ప్రతిబింబించాలి. దీనివల్ల మీ బడ్జెట్ అంచనా గాడి తప్పకుండా ఉంటుంది. మధ్యమధ్యలో ఒక్కసారి వేసుకున్న బడ్జెట్‌ను సరిచూసుకుంటూ, దాని ప్రకారమే వ్యయం జరుగుతోందా... లేదా? అన్న అంశాన్ని పరిశీలించుకోవాలి.
రిటైర్‌మెంట్ ప్రణాళిక
సంపాదిస్తున్న వయస్సులోనే పదవీ విరమణ అనంతర జీవన విధానం గురించి కూడా ఆలోచించడం మంచిది. సంపాదన ప్రారంభం నుంచే రిటైర్‌మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక పొదుపు, మదుపు ప్రణాళికలు ఉండాలి. ఇక్కడ ‘చక్రీయ’ వడ్డీ విధానం మీ సొమ్ము భారీగా పెరగడానికి ఒక మంత్రంలా ఉపయోగపడుతుంది. సంపాదన సమయంలో కొంత డబ్బును ఈక్విటీల వంటి ‘రిస్క్’ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చినా... అదే సమయంలో రిటైర్‌మెంట్ అవసరాలకు గాను రిటర్న్స్‌కు భరోసా ఇచ్చే మరికొన్ని ఆర్థిక సాధనాలను ఎంచుకోవడం మంచిది.
ఇక 55 ఏళ్లు వచ్చేసరికి ఈక్విటీల వంటి రిస్క్ సాధనాల్లో పెట్టిన డబ్బులో కొంత భాగం సురక్షిత ఆర్థిక సాధనాల్లోకి మార్చాలి. ఇక చివరిగా మరో సూచన- రిటైర్‌మెంట్‌కు ఉద్దేశించిన పొదుపు మొత్తాలన్నీ చివరకు (మెచ్యూరిటీ తరువాత) మీ అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా జమయ్యే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ (ఈసీఎస్ మార్గం) విధానాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల పొదుపు, మదుపు డబ్బు తిరిగి పొందడంలో అనవసర వ్యయ, ప్రయాసల భారం తప్పుతుంది.