ఆర్థిక ప్రణాళికలో బీమాకూ చోటివ్వండి
బీమా... భద్రత కల్పించేదిగా, పొదుపుతో పాటు సంపద పెంచే విధంగా సరైన మేళవింపుతో ఉండాలి. నిజానికి జీవిత బీమా పాలసీ అనేది .. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుంది. అంతేకాదు.. ఆర్థిక ప్రణాళికలో సరిగ్గా ఉపయోగించుకోగలిగితే సంపదను సమకూర్చుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, అవసరం పడినప్పుడు డబ్బు సమకూరేలా చూసుకునేందుకు తోడ్పడుతుంది. పెట్టుబడులకు సంబంధించి ఎంత ఇన్వెస్ట్ చేయాలి.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే సందిగ్ధం సర్వసాధారణంగా ఎదురవుతుంటుంది. షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటివెన్నో పరిశీలిస్తాం. అయితే జీవిత బీమా పాలసీ కూడా మంచి పెట్టుబడి సాధనమే.
చాలా సరళమైన, చవకైనదే కాకుండా జీవితంలో వివిధ దశల్లో ఆర్థిక అవసరాలకు తోడ్పడుతుంది ఇది. చిన్న వయస్సులోనే టర్మ్ ప్లాన్ వంటిది తీసుకుంటే చవకగా లభిస్తుంది. తర్వాత దశల్లో యూనిట్ లింక్డ్ ప్లాన్ తీసుకుంటే అధిక రాబడులు రాగలవు. కానీ మార్కెట్ రిస్కు ఉంటుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే పిల్లల చదువులకు ఆటంకం ఎదురుకాకుండా నిర్దిష్ట ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయి. అలాగే రిటైర్మెంట్ అవసరాల కోసం పింఛను పథకాల్లాంటివీ అందుబాటులో ఉన్నాయి.
క్రమశిక్షణతో పొదుపు..: జీవిత బీమాను భద్రత సాధనంగానే చూడకుండా పాలసీదారు క్రమశిక్షణతో పొదుపు చేస్తే... తగు మొత్తంలో నిధి సమకూర్చుకోగలిగేలా చూసేందుకు తోడ్పడుతుంది. మిగతా ఆర్థిక సాధనాలు మరింత ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చినా.. చాలా తక్కువ పెట్టుబడితోను, ఎక్కువగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండాను మెరుగైన భద్రతనిచ్చే జీవిత బీమాకు సాటి రావు.
జీవిత బీమా కవరేజీని ఎంచుకునేటప్పుడు.. ప్రస్తుత రుణ బాధ్యతలు, భవిష్యత్ అవసరాలు, మనమీద ఆధారపడిన వారి సంఖ్య, ఆర్థిక లక్ష్యాలు, జీవన విధానం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లల చదువు కావొచ్చు.. అమ్మాయి వివాహం కావొచ్చు లేదా రిటైర్మెంటో, రుణ చెల్లింపు కావొచ్చు.. నిర్దిష్ట లక్ష్యం ఉంటే ప్రణాళిక వేసుకోవడం సులభతరం అవుతుంది. జీవిత బీమా పాలసీలు పన్నులపరమైన ప్రయోజనాలు కూడా అందిస్తాయి.
కవరేజీ ఎంత..
పాలసీని ఎంత కవరేజీకి తీసుకోవాలన్న దానికి సంబంధించి సంక్లిష్టమైన లెక్కలు చాలానే ఉన్నప్పటికీ.. బండగుర్తులాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సింపుల్‌గా తేల్చుకోవాలంటే.. వార్షికాదాయానికి 20 రెట్లు ఉండేలా జీవిత బీమా కవరేజీ తీసుకోవడం శ్రేయస్కరం. స్థూలంగా చెప్పొచ్చేదేమిటంటే. ‘పెట్టుబడి.. సంపద సృష్టి’ అవసరాలకు చాలా సాధనాలే ఉన్నప్పటికీ.. ఒకవైపు రక్షణ ప్రయోజనాలనిస్తూ.. మరోవైపు నిలకడగా, క్రమపద్ధతిలో పొదుపు ప్రయోజనాలను కూడా అందించేవి బీమా పథకాలు. కాబట్టి ఆర్థిక ప్రణాళికల్లో కీలకమైన జీవిత బీమాకూ తగినంత ప్రాధాన్యమివ్వడం శ్రేయస్కరం.
- ప్రదీప్ పాండే
చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఫ్యూచర్ జనరాలి లైఫ్.