ఆడవారికి ఆర్థికం.. అతి ముఖ్యం! | Single women should plan | Sakshi
Sakshi News home page

ఆడవారికి ఆర్థికం.. అతి ముఖ్యం!

Published Mon, Oct 9 2017 12:47 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

Single women should plan - Sakshi

దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా పోటీపడుతున్నారు. కానీ ఆర్థిక ప్రణాళికల విషయంలో మాత్రం చాలా మంది ఉద్యోగినులు తమ జీవిత భాగస్వాములపైనే ఆధారపడుతున్నారు. నిజానికి మహిళల ఆర్థిక అవసరాలు మగవారిలాంటివి కావు. శారీరకంగానే కాక సామాజికంగానూ వారు ఎదుర్కొనే రిస్కులు వేరుగా ఉంటాయి.

జీవన విధానాలు మారుతున్న నేపథ్యంలో పెళ్లి చేసుకోకూడదని అనుకునేవారు, ఒకవేళ విడాకులు తీసుకున్న వారైతే మళ్లీ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవించే వారు చాలామంది. వీరు ఏదో ఒక దశలో తమ ఆర్థిక అవసరాలకు తామే బాధ్యత తీసుకోవాల్సి రావచ్చు. సాధారణంగా పొదుపు చేయడం, క్రమపద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయటమనేది అంతా అనుకునేదే అయినప్పటికీ..  చాలా మంది వీలైనంత త్వరగా పొదుపు మొదలుపెట్టడంలో విఫలమవుతుంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆస్తి కూడబెట్టాలన్నా, ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా నిలదొక్కుకోవాలనుకున్నా సరైన ఆర్థిక ప్రణాళిక ముఖ్యం.


కీలకమైన అడుగులు...
♦ డబ్బు గురించి తెలుసుకోవాలి. డబ్బుపై మనకు ఎంత అవగాహన ఉంటే అంతగా దానిపై పట్టు సాధించగలం. కనుక ముందుగా డబ్బు సంపాదించడం ఎలా? పొదుపు చేయడం ఎలా? పెట్టుబడుల ద్వారా రెట్టింపు చేయడం ఎలా? కాపాడుకోవడం ఎలా? తర్వాత తరానికి అందించడం ఎలా? అనే అంశాల గురించి తెలుసుకోవాలి.
♦ స్వల్ప, దీర్ఘకాలాల్లో మనకు వచ్చే ఆదాయాలు, తలెత్తబోయే ఖర్చులు మొదలైన వాటి గురించి అంచనాలు వేసుకోవాలి.
♦ ఎంత రిస్కు తీసుకోగలుగుతాం అన్నది గుర్తెరిగి, దానికి తగినట్లుగా ఇన్వెస్ట్‌ చేయాలి.
♦ సాధ్యమైనంత వరకూ కెరియర్‌ ప్రారంభించిన మొదటి రోజు నుంచే రిటైర్మెంట్‌ కోసం కూడా ప్రణాళిక వేసుకోవాలి. తద్వారా కాంపౌండింగ్‌ ప్రయోజనాలు గణనీయంగా పొందవచ్చు.
♦ అర్థం కాని పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం ఎలాగన్నది తెలుసుకోవాలి.
♦  సొంత ఆర్థిక పరిస్థితుల గురించి అన్నివేళలా తెలిసి ఉండాలి. అవి పూర్తిగా మన అదుపులో ఉండేలా చూసుకోవాలి.
♦ వివాహమైన తర్వాత, కుటుంబ ఆర్థికావసరాల నిర్వహణలో పాలుపంచుకోగలగాలి.

పన్ను ప్రయోజనాలకు సెక్షన్‌ 80సి, డి
ఉద్యోగినుల పన్ను ప్రణాళికల విషయానికొస్తే... ప్రధానంగా రెండు సెక్షన్లను పరిగణనలోకి తీసుకోవాలి. అవి సెక్షన్‌ 80సి, సెక్షన్‌ 80డి. ఆరోగ్య బీమాకి సంబంధించి వార్షికంగా గరిష్టంగా రూ.20,000 దాకా ప్రీమియంపై సెక్షన్‌ 80డి కింద ఆదాయంలో మినహాయింపు పొందవచ్చు. ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా మహిళలకు ఎంతో అవసరం. ఒకవేళ కంపెనీ బీమా సదుపాయం కల్పిస్తున్నా స్వంతంగా కూడా తీసుకోవాల్సిన పాలసీ ఇది.

ఉద్యోగినులు తగిన మొత్తానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. సాధారణంగా చాలా మంది రూ. 1–2 లక్షల కవరేజీకే  పరిమితమైపోతూ ఉంటారు. కానీ వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం కనీసం రూ.5 లక్షలైనా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కంపెనీ పరంగా ఆరోగ్యబీమా సదుపాయం ఉన్నా.. కవరేజీ రూ. 1–2 లక్షల స్థాయిలోనే ఉంటే.. దాన్ని రూ. 5 లక్షల దాకా పెంచుకునే విధంగా ఉద్యోగినులు సొంతంగా మరో పాలసీ తీసుకోవడం మేలు.

మన ఆదాయంపైనే ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నపక్షంలో ఫ్యామిలీ ఫ్లోటర్‌ లాంటి ప్లాన్‌ తీసుకుంటే పిల్లలు, పేరెంట్స్‌ చికిత్స వ్యయాలకు కూడా కవరేజీ పొందవచ్చు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే.. అనూహ్యంగా వచ్చిపడే ఆస్పత్రి బిల్లులతో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తల్లకిందులు కూడా కావొచ్చు.

80సి మినహాయింపుల్లో పీపీఎఫ్‌..
ఉద్యోగినులకు సెక్షన్‌ 80సి కింద పన్ను ప్రయోజనాలు కల్పించే పలు సాధనాలున్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ కూడా వీటిలో ఒకటి. సాధారణంగానే ఉద్యోగం చేస్తున్న వారి వేతనాల నుంచి ఎంతో కొంత మొత్తం ఈ ఫండ్‌కి జమ అవుతుంటుంది. సెక్షన్‌ 80సి కింద ఈ మొత్తానికి పన్నుల పరమైన మినహాయింపులు లభిస్తాయి.

ఇది కాకుండా పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) అకౌంటు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఉద్యోగినులు కేవలం ఈపీఎఫ్‌తో సరిపెట్టుకోకుండా పీపీఎఫ్‌ అకౌంటు కూడా తీసుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన పరిభాష చాలా గందరగోళపర్చేలా ఉంటే మీ ఆర్థిక లక్ష్యాలు, వాటికి అనుగుణంగా ఇటు ఫైనాన్షియల్, అటు ట్యాక్స్‌ ప్లానింగ్‌కు తోడ్పడేందుకు ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ కూడా ఉన్నారు. వారి సహకారం తీసుకోవచ్చు.

∙ఫైనాన్షియల్‌ బేసిక్స్‌
రిటైర్మెంట్‌లో ఆర్థిక నిర్వహణ ఇలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక పరమైన అంశాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. వీటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. రిటైర్మెంట్‌ సమయంలో నెలవారీ వేతనం రాదు. పెన్షన్‌ వస్తుంది. ఇక్కడ రెండింటికీ తేడా ఉంది. వేతనం కన్నా పెన్షన్‌ చాలా తక్కువ. దీంతో మనం చేసే ఖర్చుల్లో ఆటోమేటిక్‌గా మార్పు వస్తుంది. జీవన విధానం మారుతుంది.  అందుకే స్వల్పకాలిక లక్ష్యాలు, అత్యవసర పరిస్థితులు, రోజూవారీ వ్యయాలు వంటి వాటిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి.

రోజూవారీ వ్యయాలు: దైనందిన ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. గ్రాసరీ, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు వంటివి ఇందులో ఉంటాయి. వీటికోసం కొంత నగదును బ్యాంక్‌లో ఉంచుకోవాలి.
స్వల్పకాల లక్ష్యాలు: అదేంటి.. రిటైర్మెంట్‌ తర్వాత కూడా లక్ష్యాలేంటని అనుకుంటున్నారా? ఉండొచ్చండి. కారు మెయింటెనెన్స్, టూర్లు వంటి  వాటిని ఇక్కడ ఉదాహరణగా చెప్పొచ్చు. వీటి కోసం కొంత మొత్తాన్ని రిస్క్‌ తక్కువగా ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీనికోసం బ్యాంకు డిపాజిట్లు, షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. అలాగే ఏ సమయంలో డబ్బులు అవసరమౌతాయో ముందే గ్రహించి.. ఆ సమయంలో మెచ్యూరిటీకి వచ్చే సాధనాల్లో కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.
ఎమర్జెన్సీ కోసం: ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకోసం ఎప్పుడూ కొంత మొత్తాన్ని చేతిలో ఉంచుకోవాలి. చేతిలో అంటే చేతిలో కాదు.. ఇంట్లో అని. హాస్పిటల్‌ వ్యయాలు, ఇంటి మరమ్మతు ఖర్చులు, ఊహించని ప్రమాదాలు/అవసరాలకు ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ను ఉపయోగించుకోవాలి.  


యాప్‌కీ కహానీ...
అదా
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని చిన్నప్పుడు స్కూల్‌లో టీచర్లు చెప్పేవారు. అప్పుడు అర్థమయ్యేది కాదు.. కానీ  అనారోగ్యం చేసినపుడు ఆ మాట విలువ  తెలుస్తుంది, గొప్పతనం అర్థమవుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం. మన శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ వ్యాధుల బారిన పడుతుంటాం.

తలనొప్పి, జ్వరం, జలుబు, కడుపు నొప్పి, పంటి నొప్పి, దగ్గు వంటివి తరచుగా వస్తుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మనకు ఉన్న అనారోగ్య లక్షణాల ద్వారా మనకు ఏ సమస్య ఉందో తెలుసుకోవడానికి ఒక యాప్‌ అందుబాటులో ఉంది. అదే ‘అదా’. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

ప్రత్యేకతలు
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేస్తుంది.  
ఈ–మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి.
  అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉంటే తెలియజేయాలి. అప్పుడు యాప్‌ పలు ప్రశ్నలు అడుగుతుంది. వాటికి సమాధానం ఇవ్వాలి. మీరిచ్చిన సమాధానాల ఆధారంగా చివరిలో మీ సమస్యకు ఒక రిపోర్ట్‌ ఇస్తుంది.  
రిపోర్ట్‌లో అనారోగ్యం ఏమై ఉండొచ్చు? దానికి చికిత్స ఎలా? నివారణ వంటి  విషయాలుంటాయి. ఇవి ఎంత మేరకు నిజమో మీరే ఓ  అంచనాకు రావాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement