పిల్లలకూ బీమా ధీమా కావాలి!
తల్లిదండ్రులెవరైనా తమ పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని కోరుకుంటారు. వారి భావి జీవితం గురించి గొప్ప కలలుకంటారు. అయితే... వారి భవిష్యత్తుకి తగిన విధంగా పొదుపు చేస్తున్నామా లేదా విషయంలో వారు కొంత నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఉదయం పిల్లలను పాఠశాల వద్ద దింపడం... వారిని ఇంటివద్ద చదివించడం సెలవు రోజుల్లో పార్కులకు, షికార్లకు, సినిమాలకు తిప్పడం... బొమ్మలూ అవీ ఇవీ కొనివ్వడం... వారు మురిసిపోవడం చూసి ఆనందంతో ఉప్పొంగిపోవడం.. దీనితో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోతుందా? వారి బంగారు భవిష్యత్తుకు ఇవి మాత్రమే బాటలు పరుస్తాయా..?
చేయాల్సింది ఎంతో...
పిల్లల విషయంలో పైన పేర్కొన్న వన్నీ అవసరమే. అయితే వారికి సంబంధించి ఇంకా చేయాల్సింది ఎంతో ఉంటుంది. పిల్లల పెంపకం ఒక్కరోజుతో అయిపోయే పనికాదు. వారు పెరుగుతూ ఉంటే... వారికి సంబంధించిన అవసరాలూ పెరుగుతూ ఉంటాయి. స్కూల్ ఫీజులు, ప్రాజెక్ట్ ఐటమ్స్, అదనపు క్లాసులు, ట్యూషన్లు, ఉన్నత విద్య... వీటన్నింటికీ ఊహించినదానికన్నా అధిక వ్యయాన్ని చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తల్లిదండ్రులకు రోజురోజుకూ... ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారుతుండడాన్ని కూడా చూస్తుంటాం. ఇక్కడే పొదుపు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే పదాలకు కీలక ప్రాధాన్యత ఏర్పడుతుంది. మార్కెట్లో ఇందుకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రమెంట్లు ఎన్నో కనబడతాయి. ఇక్కడ బీమా రంగంలో పిల్లల ప్రొడక్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
లక్ష్యం చేరుకునేలా ఉండాలి...
భవిష్యత్ బాగుండాలని మనం కోరుకోగలంకానీ... ఇలానే ఉండాలని నిర్దేశించుకోలేం. భవిష్యత్తుకు సంబంధించి మంచితోపాటు చెడునూ ప్రాక్టికల్‌గా ఊహించగలగాలి. మన పిల్లల పట్ల మన కోరికలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగారిపోకుండా గరిష్ట స్థాయిలో ప్రణాళిక వేసుకోవడం ఇక్కడ అవసరం. ఇంకా చెప్పాలంటే... భవిష్యత్తులో భౌతికంగా పేరెంట్ అండ ఉన్నా, లేకున్నా... పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగేలా తల్లిదండ్రులు ముందే చర్యలు తీసుకోవాలి. ఇందుకు బీమానే అండాదండా.
రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు... కానీ...
పిల్లల భవిష్యత్‌కు సంబంధించి ఎంచుకునే బీమా ప్రొడక్ట్ మంచి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. అయితే దురదృష్టవశాత్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నడిపే వ్యక్తి మరణిస్తే... బాధిత కుటుంబం విషయంలో బీమా తదుపరి ప్రీమియంల రద్దు... బీమా మొత్తం చెల్లింపులు... పిల్లల భవిష్యత్ విద్యకు సంబంధించి ఆర్థిక అవసరాలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా చూసే పరిస్థితులు ఇక్కడ ఉంటాయి.
టర్మ్ కవర్‌తో పోల్చకూడదు...
టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌కూ- దీనికి తేడా ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ఒకేలా అనిపిస్తున్నా... కొంత వ్యత్యాసం ఇక్కడ ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న సందర్భంలో పేరెంట్‌కు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితేనే బీమా ప్రయోజనం అందుతుంది. అయితే పిల్లల భవిష్యత్‌కు సంబంధించి తీసుకునే బీమా పథకాల్లో... పేరెంట్‌కు ఏదైనా జరిగితే తదుపరి ప్రీమియం చెల్లింపు అవసరం ఉండదు. అదే సమయంలో ‘అండ కోల్పోయిన’ చిన్నారి విద్యా అవసరాలకు సంబంధించి ఒక ప్రణాళికా బద్ధంగా తగిన రీతిలో బీమా సొమ్ము అందుతుంది.
డబ్బుకు సంబంధించి పిల్లలు ఏ దశ, స్థాయిలోనూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంతా అనుకున్నది అనుకున్నట్లు మంచిగా జరిగిపోతే బీమా మొత్తం మెచ్యూరిటీ సమయంలో కొంత బోనస్‌తో వెనక్కువచ్చే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. మీ చేతుల్లో పెరిగిన మీ పసిబిడ్డ ఉన్నత స్థానంలో నిలబడ్డం... మీరు బీమా నిమిత్తం చెల్లిస్తూ వచ్చిన సొమ్ము మొత్తం ఏకమొత్తంగా కొంత బోనస్‌తో మీ చేతుల్లో ఉండడం... ఒకేసారి డబుల్ బొనాంజాను మీరు చూడగలుగుతారు. చివరిగా ఇలాంటి బీమా ప్రొడక్టుల ఆఫర్ విషయంలో కంపెనీ-కంపెనీకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్ విద్యా ప్రణాళికకు అనుగుణంగా తగిన మంచి ప్రొడక్ట్‌ను ఎంచుకోండి. తక్షణం మీ సంపాదనలో కొంత మొత్తం ఈ తరహా పథకాలపై వెచ్చించాలన్న విషయాన్ని మర్చిపోవద్దు..!