ఒంటరైనా...ప్లానింగ్ తోడుండాలి
♦ ఒంటరి మహిళలకూ జీవితంలో ఎన్నో అవసరాలు, లక్ష్యాలు
♦ విశ్రాంత జీవనం, సొంతిల్లు, ఆరోగ్యం, పర్యాటకం
♦ వీటికంటూ ఓ ప్రణాళిక అవసరం
♦ ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే అన్నింటినీ జయించొచ్చు
రోజులు ఒకప్పటిలా లేవు. మన దేశంలో మహిళలూ ముందడుగు వేస్తున్నారు. ఒకరిపై ఆధారపడకుండా ఆర్థికంగా సర్వ స్వతంత్రంగా జీవించేందుకు ఇష్టపడే మహిళల సంఖ్య పెరుగుతోంది కూడా!!. విద్య, ఉపాధి అవకాశాల విస్తృతి ఇలా ఎన్నో కారణాలు దీనివెనుక ఉన్నాయి. దేశంలో వివాహం కానివారు, పెళ్లయి విడిపోయిన వారు, భర్తను కోల్పోయిన వారు... ఇలాంటి ఒంటరి మహిళల సంఖ్య దాదాపు 7.41 కోట్లు. 2001– 2011 మధ్య చూస్తే వీరి సంఖ్య దాదాపు 39 శాతం పెరిగింది. పెళ్లి కాని వారైనా, పెళ్లయి ఒంటరిగా మారినవారైనా జీవితంలో పెద్దగా అవసరాలేవీ ఉండవనుకుంటే పొరపడినట్టే. సొంతిల్లు, విశ్రాంత జీవనం, కారు ఈ తరహా అవసరాలు అందరికీ ఉంటాయి. తమ కాళ్లపై తాము నిలబడిన ఒంటరి మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కనుక లక్ష్యాలు నెరవేర్చుకునే వెసులుబాటు వీరికి కొంచెం ఎక్కువే ఉంటుంది. కాకపోతే అందుకు తగిన ప్రణాళిక ఉండాలనేది నిపుణుల సూచన.
లక్ష్యాల్లో వెనుకంజే
ఒంటరి మహిళల్లో ఎక్కువ మందికి ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ లక్ష్యాలు, వాటి ప్రణాళికల పట్ల అంత పట్టింపుతో ఉండడం లేదని ఫైనాన్షియల్ ప్లానర్ల పరిశీలనలో వెల్లడయింది. ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ అశ్విని బిద్వాల్కర్ ఓ సందర్భంలో ఒక క్లయింట్‌తో భేటీ అయిన అనంతరం తెలిసిన విషయం ఏమిటంటే... ఆమెకు కనీసం ఒక్క లక్ష్యం కూడా లేదని!. ఉద్యోగరీత్యా నగరాలకు వచ్చి చక్కని సంపాదన ఉండడంతో ఖరీదైన ఫ్లాట్లలో అద్దెకుండటానికి వీరు ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారిపై వారి తల్లిదండ్రులు ఆధారపడిన సందర్భాలు కూడా ఎక్కువేనన్నది అశ్విని మాట. అందుకే వీరు తమ బాధ్యతలను విస్మరించకుండా అందుకు తగ్గట్టు ప్రణాళిక వేసుకోవాలి.
ఇలాంటివారు కాస్త వేరు...
ఓ హాస్పిటాలిటీ సంస్థలో హెల్త్ మేనేజర్‌గా పనిచేస్తున్న తాన్య (26) కూడా ఒంటరి మహిళే. ఇంకా వివాహం కాలేదు. ఆమెకున్న లక్ష్యాలు విదేశీ టూర్‌కు వెళ్లడం. దీనికితోడు సొంతిల్లు కూడా సమకూర్చుకోవాలని భావించిన ఆమె... అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు డౌన్ పేమెంట్ చెల్లించడానికి అంగీకరించారు. దీంతో ప్రతి నెలా గృహరుణం ఈఎంఐ చెల్లించడానికి తాన్య సిద్ధమైంది.
గృహ ఈఎంఐతో పాటు తన టూర్ ప్లాన్ కోసం ప్రతి నెలా రూ.5,000–10,000 మధ్య పక్కన పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. పాతికేళ్ల గౌతమి కూడా సొంత సంపాదనను నమ్ముకున్న మహిళే. ఆమె ఉన్నత విద్యపై దృష్టి పెట్టింది. స్నేహితులతో సరదాగా పర్యాటక ప్రదేశాలను చూసి రావాలనుకుంటోంది. మరో లక్ష్యం... జీవితంలో తాను కోరుకున్నప్పుడు విరామం తీసుకోవాలి. ఇలా లక్ష్యాల విషయంలో వీరి మాదిరి స్పష్టత అందరు ఒంటరి మహిళల్లోనూ ఉండడం లేదు.
ఆకాంక్ష (24) ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్. స్థిరమైన ఆదాయం ఉండదు. దీంతో ఆమె లక్ష్యం ముందుగా తన సొంత అవసరాలను తీర్చుకోవడమే. ఆరు నెలల కిందటి వరకూ ఆమె తన అవసరాలు, ఖర్చులకు తల్లిదండ్రులపైనే ఆధారపడింది. కానీ, ఇటీవల తనకంటూ ఓ నిధిని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్న ఆమె వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా ఒంటరి మహిళల్లో ఎక్కువ మందికి పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని, పెద్ద వయసు వచ్చే సరికి తమకంటూ ఓ ఇల్లు ఉండాలని, దాతృత్వ కార్యక్రమాలకు విరాళమివ్వాలని, తమ వారసులకు ఎంతో కొంత సమకూర్చాలని లక్ష్యాలుంటున్నట్టు ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు.
తప్పనిసరి అవసరాలపై దృష్టి
ఆర్థిక లక్ష్యాలన్నవి ఒంటరి వ్యక్తులకూ అవసరమే. ఊహించని పరిస్థితులు ఎదురైతే మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు వీలుగా ప్రణాళిక ఉండాలన్నది ఆర్థిక నిపుణులు సూచన. ఉదాహరణకు అనారోగ్య పరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎంత వ్యయం అవుతుందో తెలియదు. అందుకే తగినంత కవరేజీతో హెల్త్ పాలసీ ఉండాలి. ఉద్యోగం కోల్పోతే మీ ఖర్చులు తీరేందుకు సరిపడా రిజర్వ్ ఫండ్ అవసరం. ఒంటరి మహిళలకు తల్లిదండ్రుల నుంచి సహకారం ఉండకపోవచ్చు. కనుక వీరు తప్పకుండా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి.
కనీసం 9 నుంచి 12 నెలల అవసరాలకు తగ్గట్టు ఉండాలన్నది నిపుణుల మాట. ముందు ఈ రెండు అవసరాలకు ప్లాన్ చేసుకున్న తర్వాత పెట్టుబడులపై దృష్టి సారించాలి. విశ్రాంత జీవనంలో అవసరాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. సొంతిల్లు సమకూర్చుకోవాలనుకుంటే అందుకోసం ఈక్విటీ, డెట్ విభాగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను పరిశీలించొచ్చు. ప్రయాణాల కోసమైతే స్వల్పకాల లక్ష్యం కనుక షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ ఖర్చు, ఎక్కువ పొదుపుతో చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే దీర్ఘకాలంలో భారీ నిధి సమకూరుతుంది. ప్రణాళిక విషయంలో స్పష్టత లేకపోతే అందుకోసం ఫైనాన్షియల్ ప్లానర్ల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు.
– సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం