motilal oswal midcap fund: లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో అధిక స్థిరత్వం చాలా మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. కానీ, కొందరు రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు రాబడులు అధికంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఎంపిక చేసుకుంటారు. రిస్క్ మధ్యస్థంగా ఉండి, రాబడులు కూడా లార్జ్‌క్యాప్ కంటే ఎక్కువగా ఉండాలని కోరుకునే వారికి మిడ్‌క్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్ స్టాక్స్ కంటే స్మాల్‌క్యాప్ స్టాక్స్ అధికంగా రాబడులు ఇచ్చినట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన పదేళ్లలో రాబడుల పరంగా స్మాల్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్ సూచీ ముందుంది. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్‌ఐ సూచీ.. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ టీఆర్‌ఐ సూచీ కంటే 2.13 శాతం అధికంగా 21.32 శాతం చొప్పున ఏటా రాబడులు అందించింది. ఇదే కాలంలో స్మాల్‌క్యాప్ సూచీ వార్షిక రాబడులు 19.18 శాతంగానే ఉన్నాయి. మిడ్‌క్యాప్ విభాగంలో అధిక స్థిరత్వం, మెరుగైన రాబడులు కోరుకునే వారికి మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది.
రాబడులు..
ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఏడాది కాలంలో రాబడి 73 శాతంగా ఉంది. అదే రెగ్యుల్ ప్లాన్‌లో అయితే 71 శాతం రాబడి వచి్చంది. మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్ ఏటా 36 శాతానికి పైనే రాబడి తెచ్చి పెట్టింది. ఐదేళ్లలోనూ 35 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకం సొంతం. ఇక ఏడేళ్లలో ఏటా 24 శాతం, పదేళ్లలో ఏటా 23 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు రాబడి లభించింది. ఇందులో డైరెక్ట్ ప్లాన్ అన్నది మధ్యవర్తుల ప్రమేయం లేనిది. ఈ ప్లాన్‌లో ఫండ్స్ సంస్థ ఎవరికీ కమీషన్లు చెల్లించదు. రెగ్యులర్ ప్లాన్‌లో మధ్యవర్తులకు కమీషన్ వెళుతుంది. ఈ మేర ఇన్వెస్టర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తారు. కనుక రెగ్యులర్ ప్లాన్ కంటే డైరెక్ట్ ప్లాన్‌లో దీర్ఘకాలంలో రాబడులు ఎక్కువగా ఉంటాయి.
పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో...
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నాణ్యత, వృద్ధి, దీర్ఘకాలం, ధర అనే అంశాల ఆధారంగా మిడ్‌క్యాప్ విభాగంలో భవిష్యత్‌లో మంచి రాబడులు ఇచ్చే స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. బలమైన వృద్ధి అవకాశాలున్న నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. సహేతుక ధరల వద్దే కొనుగోలు చేస్తుంటుంది. ఎంపిక చేసుకునే కంపెనీలకు గణనీయమైన వ్యాపార వృద్ధి అవకాశాలు ఉండేలా జాగ్రత్త పడుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20 శాతానికి పైన ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. బలమైన ఫ్రీ క్యాష్ ఫ్లోను కూడా చూస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,604 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 81 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 15 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టింది. 3.89 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 66 శాతం మేర లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి.
చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
మిడ్‌క్యాప్‌లో 32.49 శాతం, స్మాల్‌క్యాప్‌లో 1.77 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్ విభాగంలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నప్పుడు మిడ్‌క్యాప్ పథకం ఎలా అయిందన్న సందేహం రావచ్చు. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు మధ్య కాలానికే లార్జ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించడం ఇందుకు కారణం. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, కన్జ్యూమర్ డి్రస్కీషనరీ, ఇండస్ట్రియల్స్ రంగాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ.. 61 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment