Motilal Oswal
-
మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!
motilal oswal midcap fund: లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో అధిక స్థిరత్వం చాలా మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. కానీ, కొందరు రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు రాబడులు అధికంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఎంపిక చేసుకుంటారు. రిస్క్ మధ్యస్థంగా ఉండి, రాబడులు కూడా లార్జ్‌క్యాప్ కంటే ఎక్కువగా ఉండాలని కోరుకునే వారికి మిడ్‌క్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్ స్టాక్స్ కంటే స్మాల్‌క్యాప్ స్టాక్స్ అధికంగా రాబడులు ఇచ్చినట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన పదేళ్లలో రాబడుల పరంగా స్మాల్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్ సూచీ ముందుంది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐ సూచీ.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ టీఆర్ఐ సూచీ కంటే 2.13 శాతం అధికంగా 21.32 శాతం చొప్పున ఏటా రాబడులు అందించింది. ఇదే కాలంలో స్మాల్‌క్యాప్ సూచీ వార్షిక రాబడులు 19.18 శాతంగానే ఉన్నాయి. మిడ్‌క్యాప్ విభాగంలో అధిక స్థిరత్వం, మెరుగైన రాబడులు కోరుకునే వారికి మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది.రాబడులు.. ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఏడాది కాలంలో రాబడి 73 శాతంగా ఉంది. అదే రెగ్యుల్ ప్లాన్‌లో అయితే 71 శాతం రాబడి వచి్చంది. మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్ ఏటా 36 శాతానికి పైనే రాబడి తెచ్చి పెట్టింది. ఐదేళ్లలోనూ 35 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకం సొంతం. ఇక ఏడేళ్లలో ఏటా 24 శాతం, పదేళ్లలో ఏటా 23 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు రాబడి లభించింది. ఇందులో డైరెక్ట్ ప్లాన్ అన్నది మధ్యవర్తుల ప్రమేయం లేనిది. ఈ ప్లాన్‌లో ఫండ్స్ సంస్థ ఎవరికీ కమీషన్లు చెల్లించదు. రెగ్యులర్ ప్లాన్‌లో మధ్యవర్తులకు కమీషన్ వెళుతుంది. ఈ మేర ఇన్వెస్టర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తారు. కనుక రెగ్యులర్ ప్లాన్ కంటే డైరెక్ట్ ప్లాన్‌లో దీర్ఘకాలంలో రాబడులు ఎక్కువగా ఉంటాయి.పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో... మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నాణ్యత, వృద్ధి, దీర్ఘకాలం, ధర అనే అంశాల ఆధారంగా మిడ్‌క్యాప్ విభాగంలో భవిష్యత్‌లో మంచి రాబడులు ఇచ్చే స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. బలమైన వృద్ధి అవకాశాలున్న నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. సహేతుక ధరల వద్దే కొనుగోలు చేస్తుంటుంది. ఎంపిక చేసుకునే కంపెనీలకు గణనీయమైన వ్యాపార వృద్ధి అవకాశాలు ఉండేలా జాగ్రత్త పడుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20 శాతానికి పైన ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. బలమైన ఫ్రీ క్యాష్ ఫ్లోను కూడా చూస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,604 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 81 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 15 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టింది. 3.89 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 66 శాతం మేర లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి.చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!మిడ్‌క్యాప్‌లో 32.49 శాతం, స్మాల్‌క్యాప్‌లో 1.77 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్ విభాగంలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నప్పుడు మిడ్‌క్యాప్ పథకం ఎలా అయిందన్న సందేహం రావచ్చు. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు మధ్య కాలానికే లార్జ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించడం ఇందుకు కారణం. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, కన్జ్యూమర్ డి్రస్కీషనరీ, ఇండస్ట్రియల్స్ రంగాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ.. 61 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. -
మరో రెండేళ్లలో రూ.86 వేలకు బంగారం: ఓస్వాల్
పండుగ సీజన్లో పసిడి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారం రూ. 78వేలకు చేరువలో ఉంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు మార్కెట్‌కు మరింత లాభాలను జోడించే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించారు. అంతే కాకుండా దేశీయ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ETF), SPDR హోల్డింగ్స్‌తో పాటు దిగుమతులు, CFTC స్థానాలు మార్కెట్‌కు మద్దతునిస్తాయని ఆయన అన్నారు.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరి, భౌగోళిక రాజకీయాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమని ఓస్వాల్ పేర్కొన్నారు. పండుగలు, వివాహ సంబంధిత శుభకార్యాలు కూడా దేశీయ డిమాండ్ మార్కెట్లో సెంటిమెంట్లను పెంచుతుందని వివరించారు. ఇదే విధంగా ధరలు ముందుకు సాగితే.. బంగారం ధర 86,000 (10 గ్రాములు) రూపాయలకు చేరుతుందని అన్నారు.పండుగ సీజన్ ముగిసే వరకు బంగారం ధరలు తగ్గే అవకాశం చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది మెరుగైన రుతుపవనాలు, అధిక పంట దిగుబడులు.. గ్రామీణ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయనున్నాయి. దిగుమతి సుంకం తగ్గింపు ప్రకటన వెలువడిన తరువాత బంగారం కొనుగోళ్లు పెరిగాయని ఆయన ఓస్వాల్ వివరించారు. -
ఎక్కువ పని చేయడానికి అనుమతించం.. మోతీలాల్‌ఓస్వాల్ కీలక నిర్ణయం
అధిక పని గంటలతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఉద్యోగం మానేద్దామంటే ద్రవ్యోల్బణం కారణంగా ఇతర కంపెనీల్లో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. జీతాల పెరుగుదల అంతంతమాత్రమే. దానికితోడు వారానికి డెబ్బై గంటల పనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌లో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తూ.. ఉన్నవారితో ఎలా ఎక్కువసేపు పనిచేయించుకోవాలో ఆలోచిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా మోతీలాల్‌ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. పని గంటలపై చర్చ కొనసాగుతున్నప్పటికీ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. ఉద్యోగులు తమకు కేటాయించిన సమయం 8-8.5 గంటల కంటే ఎక్కువ పని చేయడానికి అనుమతించరు. ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ నిరేన్ శ్రీవాస్తవ తెలిపారు. పని సమయం ముగిసిన వెంటనే కంపెనీ ఈమెయిల్ సర్వర్లను ఆపేస్తామన్నారు. 45 నిమిషాల గ్రేస్ పిరియడ్ తర్వాత కంపెనీ తరఫున ఎలాంటి ఈమెయిల్‌లు పంపడం, స్వీకరించడం జరగదని చెప్పారు. ఎవరైనా షిఫ్ట్ సమయానికి మించి కార్యాలయంలో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. కొత్త పాలసీని ఉద్దేశించి సంస్థ ఎండీ, సీఈఓ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ.. తమకు పని గంటల సంఖ్య ముఖ్యం కాదని ఉద్యోగుల మనశ్శాంతి, సంతృప్తి, ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రైవేట్ ఈక్విటీ, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న సంస్థలోని కొందరు ఉన్నత అధికారులకు వారి సొంత పని షెడ్యూల్ కారణంగా ఈ పాలసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ విధానాన్ని సంస్థ అన్ని కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. కొత్త పాలసీ సంస్థలో పనిచేస్తున్న 11,000 మందిలో దాదాపు 9,500 మందికి వర్తిస్తుందని చెప్పారు. -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్‌దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, శివ్‌నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. -
ఎఫ్‌అండ్‌వోలో బ్రోకరేజీల జోరు..
ముంబై: డిస్కౌంట్ బ్రోకరేజీలను మించి పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలు ఇటీవల రిటైల్ డెరివేటివ్ విభాగంలో జోరు చూపుతున్నాయి. ఫ్యూచర్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో ఏంజెల్‌వన్, మోతీలాల్ ఓస్వాల్ డిస్కౌంట్ బ్రోకరేజీలను మించుతూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. రిటైల్ విభాగంలో ఏంజెల్‌వన్ 82 శాతం, మోతీలాల్ ఓస్వాల్ 54 శాతం ఆదాయ వాటాను పొందినట్లు ఒక నివేదిక పేర్కొంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల చేపట్టిన ఒక పరిశీలన ప్రకారం డిస్కౌంట్ బ్రోకర్స్ ఎన్ఎస్ఈలో అత్యధికంగా జరిగే ఎఫ్‌అండ్‌వో లావాదేవీల జోరుకు కారణమవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో పరిమాణంలో 2022లోనూ ఎన్ఎస్ఈ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్సే్ఛంజీగా నిలిచిన సంగతి తెలిసిందే. రిటైలర్లకు నష్టాలు గత కేలండర్ ఏడాది(2022)లో రిటైల్ ట్రేడర్లు నిర్వహించిన 10 ఎఫ్‌అండ్‌వో ట్రేడ్లలో 9 నష్టాలతోనే ముగిసినట్లు గత నెలలో సెబీ పేర్కొంది. సుమారు రూ. 1.1 లక్షల కోట్ల నష్టాలు నమోదైనట్లు తెలియజేసింది. అంతేకాకుండా 2019తో పోలిస్తే డెరివేటివ్ విభాగంలో రిటైల్ ట్రేడర్ల సంఖ్య 500 శాతం పెరిగినట్లు వెల్లడించింది. వెరసి ఇన్వెస్టర్ల కోసం బ్రోకర్లు, స్టాక్ ఎక్సే్ఛంజీలు రూపొందించే అదనపు రిస్క్ మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలియజేసింది. టెక్నాలజీపై దృష్టిపెట్టిన ఏంజెల్‌వన్ అతితక్కువ కాలంలోనే 12.89 మిలియన్ కస్టమర్లను పొందడం ద్వారా 2023 జనవరికల్లా అతిపెద్ద బ్రోకరేజీగా ఆవిర్భవించింది. 2022 అక్టోబర్–డిసెంబర్(క్యూ3) కాలంలో సాధించిన రూ. 800 కోట్ల ఆదాయంలో 82 శాతం వాటాను ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారానే పొందింది. ఈ కంపెనీ వెబ్సైట్ ప్రకారం వరుసగా గత రెండు సంవత్సరాలలో ఎఫ్‌అండ్‌వో వాటా 72 శాతం, 52 శాతంగా నమోదైంది. ఇక ఈ క్యూ3లో మోతీలాల్ ఆర్జించిన రూ. 688 కోట్ల ఆదాయంలో 54 శాతం వాటా ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచే లభించింది. 2019లో 39 శాతంగా నమోదైన ఈ వాటా తదుపరి ఇదేస్థాయిలో కొనసాగుతూ తాజాగా 54 శాతానికి ఎగసింది. మరోవైపు బ్రోకింగ్ రంగంలో రెండో ర్యాంకులో ఉన్న జిరోధా డెరివేటివ్ విభాగం నుంచి 20 శాతమే పొందింది. ఈ సంస్థ 7 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో డిస్కౌంట్ బ్రోకింగ్‌లో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి 75 శాతం పరిమాణాన్ని సాధిస్తోంది. అప్‌స్టాక్స్, 5పైసా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితరాలు సైతం డిస్కౌంట్ బ్రోకింగ్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. కాగా.. పూర్తిస్థాయి బ్రోకింగ్ సేవలందించే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్‌అండ్‌వో నుంచి 20 శాతం ఆదాయాన్ని అందుకుంది. ఈ బాటలో 8.7 మిలియన్ కస్టమర్లను కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్‌నుంచి 20 శాతం ఆదాయాన్నే పొందింది. డెరివేటివ్స్‌లో రిటైలర్లు సెబీ పరిశీలన ప్రకారం గతేడాది(2022)లో టాప్–10 బ్రోకర్ల ద్వారా 45 లక్షలకుపైగా రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించారు. 2019లో నమోదైన 7.1 లక్షమందితో పోలిస్తే ఈ సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. ఇటీవల కొత్త ఇన్వెస్టర్లు, యువత అత్యధికంగా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ చేపడుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో 36 శాతం 20–30 మధ్య వయసువారు కావడం గమనార్హం! 2019లో వీరి సంఖ్య 11 శాతమే. -
మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్‌ఈఐ ఇండెక్స్ ఫండ్
మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్సీఐ ఈఏఎఫ్‌ఈ టాప్ 100 సెలక్ట్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీనిద్వారా ఎంఎస్‌ఈఐ ఈఏఎఫ్ఈలో టాప్–10 దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని పేర్కొంది. యూరోప్, ఆస్ట్రేలియా తదితర 21 వర్ధమాన మార్కెట్ల వెయిటేజీతో ఎంఎస్సీఐ ఈఏఎఫ్ఈని ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి తీసుకొచ్చిన మొదటి ఇండెక్స్ ఫండ్ ఇదని, దీనివల్ల అంతర్జాతీయంగా ఉన్న చక్కని అవకాశాలను కోల్పోకుండా చూసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 15న మొదలై.. 25న ముగుస్తుంది. -
బుల్ రన్: రాందేవ్ అగర్వాల్ సంచలన అంచనాలు
సాక్షి,ముంబై: కరోనా సంక్షోభ కాలంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు శరవేగంగా దూసుకుపోతున్నాయి. మధ్యలో కొన్ని ఒడిదుడుకులున్నప్పటికీ కీలక సూచీలు రెండూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ నిపుణులలు స్టాక్‌మార్కెట్ వృద్ధిపై కీలక అంచనాలు వెలువరించారు. దలాల్ స్ట్రీట్‌లో బుల్ పరుగుకు ఇది ప్రారంభం మాత్రమేనని రానున్న కాలంలో సరికొత్త శిఖరాలను అధిరోహించడం ఖాయమని పేర్కొంటున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ రాబోయే పదేళ్ళలో ప్రస్తుత స్థాయినుంచి నాలుగు రెట్లు పుంజుకోనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) సహ వ్యవస్థాపకుడు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాందేవ్ అగర్వాల్ అంచనా వేశారు. కొన్నేళ్లుగా కార్పొరేట్ రంగంలోఆరోగ్యకరమైన వృద్ధి, ఇతర డెమోగ్రాఫిక్స్ కారణంగా సెన్సెక్స్ 200,000 మార్కును చేరుకుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వార్షిక ప్రాతిపదికన కార్పొరేట్ లాభాలు 15 శాతం పెరుగుతాయన్నారు. 12-13 శాతం (నామమాత్ర దేశ స్థూల జాతీయోత్పత్తి)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కార్పొరేట్ లాభాల పెరుగుదలకు అనుగుణంగా మార్కెట్ రాబడి ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో, ఎస్ అండ్ పి బీఎస్ఇ 10 శాతం సిఎజిఆర్ రిటర్న్ ఇచ్చిందన్నారు. మార్చి 2011 లో 19,445 స్థాయిల నుండి 2021 మార్చి నాటికి 49,509 స్థాయిలకు సెన్సెక్స్ చేరుకుందని అగర్వాల్ చెప్పారు. ఈ కాలంలో, భారత ఆర్థిక వ్యవస్థ 4 శాతం సీఏజీఆర్ వృద్ధిని సాధించగా, 2010 లో 1.7 ట్రిలియన్ల నుండి 2020లో 2.6 ట్రిలియన్లకు పెరిగింది, చైనాతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. అంతేకాదు 2029 నాటికి, భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కాలంలో మార్కెట్ డీమోనిటైజేషన్, ఐఎల్ఎఫ్ఎస్ కుంభకోణం, కోవిడ్ వంటి సంక్షోభాలను ఎదుర్కొందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లకు సూచించారు. వ్యూహాత్మక పెట్టుబడుల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన హోల్డింగ్స్‌ను వేగంగా మళ్లించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కోసం అన్ని 'దిగ్బంధనాలను' క్లియర్ చేయాలి, ఉద్యోగాల కల్పన , వృద్ధిపై దృష్టి పెట్టాలని అగర్వాల్ తెలిపారు. కాగా అగర్వాల్‌తో పాటు, మరికొందరు మార్కెట్ నిపుణులు ,పండితులు కూడా న్సెక్స్ కోసం ఆరు అంకెల స్థాయికి చేరుకోనుందని అంచనావేయడం గమనార్హం. 2024 నాటికి సెన్సెక్స్ లక్షమార్క్‌ను తాకుతుందని ఇలియట్ వేవ్ ఇంటర్నేషనల్ మార్క్ గాలాసివ్స్కీ 2017 లోఅంచనా వేశారు. అప్పటికి సెన్సెక్స్ 30,750 స్థాయిలలో ఉంది. అలాగే 2020 నాటికి 100,000 మార్కును చేరుకుంటుందని, కార్వి పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ హెడ్ వరుణ్ గోయెల్ 2014 లో తెలిపారు. వీరితోపాటు ప్రముఖ ఈక్విటీ పెట్టుబడి దారుడు రాకేశ్ ఝన్‌ఝన్ వాలా మదర్ ఆఫ్ బుల్ రన్ గా మార్కెట్ ర్యాలీని ఇదివరకే అభివర్ణించారు. చదవండి : కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు -
పుత్తడి @ 67,000
దీర్ఘకాలికంగా పసిడి పది గ్రాముల ధర రూ. 65,000–67,000 దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. దీనికి ఊతమిచ్చే అంశాలను ఈ విధంగా వివరించింది. ‘గడిచిన దశాబ్దకాలంలో దేశీయంగా పసిడి 159 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే సమయంలో కీలకమైన స్టాక్స్ సూచీ నిఫ్టీ 50 ఇచ్చిన రాబడులు 93 శాతమే. ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ క్షీణత నుంచి రక్షణనివ్వడంలో పసిడి స్టార్ పెర్ఫార్మర్గా నిల్చింది. మధ్యమధ్యలో కాస్తంత తగ్గడం మినహా వార్షికంగా చూస్తే పుత్తడి ఇప్పటిదాకా మంచి రాబడులే ఇచ్చింది. డిమాండ్, పండుగల ఊతంతో నాలుగో త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. అధిక ధరలు, కరోనావైరస్పరమైన అంశాల కారణంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రభావం చూపడంతో మొత్తం మీద చూస్తే పసిడి వినియోగం తగ్గినప్పటికీ.. పెరుగుతున్న రేటు కారణంగా ఇన్వెస్టర్లు క్రమంగా పుత్తడి వైపు మళ్లడం వల్ల నాణేలు, కడ్డీలకు మాత్రం డిమాండ్ పెరిగింది. అనిశ్చితి పరిస్థితుల కారణంగా పుత్తడి ధర అంతర్జాతీయంగా ఔన్సు (33.1 గ్రాములు)కి 2,085 డాలర్లు, దేశీయంగా పది గ్రాములకు రూ. 56,400 గరిష్ట స్థాయిలను తాకి ప్రస్తుతం ఒక శ్రేణిలో తిరుగాడుతోంది. సెంట్రల్ బ్యాంకుల విధానాలు, తక్కువ వడ్డీ రేట్లు.. రాబడులు, మార్కెట్లోకి నిధుల వెల్లువ, కరోనా వైరస్ ప్రభావం తదితర అంశాలు దీర్ఘకాలంలో పసిడి రేట్లకు ఊతమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రూ. 49,500–48,500 దాకా తగ్గినప్పుడల్లా కొంతకొంతగా కొనుగోలు చేయొచ్చు. స్వల్పకాలికంగా రూ. 52,000–53,000 దాకా పెరగవచ్చు. దీర్ఘకాలికంగా మాత్రం పది గ్రాములకు రూ. 65,000–67,000 స్థాయికి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 2,500 డాలర్ల అంచనాలను కొనసాగిస్తున్నాం. -
5జీపై రూ. 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలందించేందుకు స్పెక్ట్రం, సైట్లు, ఫైబర్ నెట్‌వర్క్‌పై టెలికం కంపెనీలు దాదాపు రూ. 1.3–2.3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని మోతీలాల్ ఓస్వాల్(ఎంవోఎఫ్ఎస్) ఒక నివేదికలో అంచనా వేసింది. ఒక్క ముంబై సర్కిల్లోనే 5జీ నెట్‌వర్క్‌పై రూ. 10,000 కోట్లు, ఢిల్లీలో రూ. 8,700 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని పేర్కొంది. మధ్య లేదా కనిష్ట స్థాయి బ్యాండ్ స్పెక్ట్రం రిజర్వ్ ధర ప్రాతిపదికన ఎంవోఎఫ్ఎస్ ఈ లెక్కలు వేసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రిజర్వ్ ధర ప్రకారం ముంబైలో 100 మెగాహెట్జ్ మిడ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రిజర్వ్ ధర రూ. 8,400 కోట్లుగా ఉండనుంది. మరిన్ని కంపెనీలు తీవ్రంగా పోటీపడితే బిడ్డింగ్ ధర మరింతగా పెరగవచ్చు. కవరేజీ కోసం కనీసం 9,000 సైట్లు అవసరమయిన పక్షంలో వీటిపై సుమారు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. దీంతో ముంబైలో 5జీ నెట్‌వర్క్‌పై వెచ్చించాల్సిన మొత్తం రూ. 10,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. -
కార్పోరేట్ ఫలితాలను పట్టించుకోనక్కర్లేదు
ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ బోత్రా తెలిపారు. తొలి త్రైమాసికానికి ప్రత్యేక నేపథ్యం ఉందని కావున కంపెనీల ఫలితాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఏప్రిల్-జూన్ వ్యవధిలో ప్రతి కంపెనీ కనీసం నెలరోజులకు తగ్గకుండా లాక్డౌన్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రైమాసిక ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడం అవివేకం అవుతుంది. అయితే ఈ సందర్భంలోనూ కొన్ని కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించి ఆశ్చర్యపరిచాయి’’ అని బోత్రా చెప్పుకొచ్చారు. ఐటీ, ఫార్మా సెక్టార్‌పై సానుకూలం: ఐటీ సెక్టార్‌పై తాము సానుకూలంగా ఉన్నట్లు బోత్రా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఫలితాలను వెల్లడించిన ఐటీ కంపెనీలు ఫలితాలు బాగున్నాయని, ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు, అవుట్‌లుక్‌లు ఐటీ రంగం షేర్లను మరింత ఆకర్షణీయం చేశాయని బోత్రా తెలిపారు. అలాగే గత రెండేళ్ల నుంచి ఫార్మా షేర్లపై తాము సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఫార్మా రంగంలో తమకు పెద్ద పొజిషన్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ తమ దృష్టి దేశీయ ఫార్మా కంపెనీల షేర్లపై ఉందని, ఈ సెక్టార్ నుండి డాక్టర్ రెడ్డీస్ షేరును సిఫార్సు చేస్తామని బోత్రా తెలిపారు. రూరల్ రికవరీ భేష్: దేశీయ ఆర్థిక వ్యవస్థనంతటికీ అవలోకనం చేస్తే..., వ్యవసాయ లేదా రూరల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అది ప్రభుత్వ ప్రకటించిన ఉద్దీపన చర్యలతో కావచ్చు.మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చు రూరల్ వ్యవస్థ సవ్యంగా ఉంది. వలస కూలీలు కూడా తమ స్వస్థలాలైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడ వినిమయ వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాయి. -
గరిష్టస్థాయిల వద్ద నిఫ్టీపై ఒత్తిడి
నిఫ్టీ ఇండెక్స్ ఈ వారాన్ని లాభంతో ముగించింది. ఈ ఇండెక్స్ శుక్రవారం 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒకవేళ మార్కెట్లో అప్‌ట్రెండ్ కొనసాగితే గరిష్టస్థాయిల వద్ద నిఫ్టీపై ఒత్తిడి కలిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ తదుపరి కదలికలపై ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అప్‌ట్రెండ్‌లో పరిమితి ర్యాలీకి అవకాశం: జీమిత్ మోదీ నిఫ్టీకి అప్‌ట్రెండ్‌లో పరిమితి ర్యాలీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జీమిత్ మోదీ తెలిపారు. నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం ప్రారంభ, ముగింపు స్థాయిలు దాదాపు ఒకేచోటు ఉండటంతో రోజువారీ ఛార్ట్‌లో డోజీ ప్యాట్రన్ ఏర్పాటైందని తెలిపారు. ఈ ప్యాట్రన్స్ వీక్లీ స్కేల్లో స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఏర్పడేందుకు తోడ్పడిందన్నారు. ఈ క్యాండిల్ నమూనా ఏర్పాటుతో రానున్న రోజుల్లో నిఫ్టీ అధికస్థాయిల ఇబ్బంది ఏర్పడనుందని విషయాన్ని సూచిస్తుందని ఆయన అంటున్నారు. ఈ టెక్నికల్ అంశాల దృష్ట్యా వచ్చే వారంలో నిఫ్టీకి 10550 స్థాయి కీలక నిరోధంగా మారనుందని మోదీ అన్నారు. ‘‘ఈ వారంలో నిఫ్టీ ఇండెక్స్ 10,330 పాయింట్ల స్థాయిని అధిగమించింది. తర్వాత దానికి 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 10,550 పాయింట్ల స్థాయిని పరీక్షించిందని చేధించలేకపోయింది. కాబట్టి ప్రస్తుతానికి నిఫ్టీలో అప్‌ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ, ర్యాలీ పరిమితంగా ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో డౌన్ ట్రెండ్ బలపడితే నిఫ్టీ 9,700 స్థాయిని కూడా పరీక్షించవచ్చు.’’ అని జీమిత్ మోదీ తెలిపారు. గత రెండు సెషన్లలో నిఫ్టీ ట్రేడింగ్ సరళిని పరిశీలిస్తే 10,553–10,194 శ్రేణిలో కొత్త పరిధిని ఏర్పాటు చేసుకుందని ఛార్ట్వ్యూఇండియా డాట్ ఇన్ అధ్యక్షుడు మజర్ మహమ్మద్ తెలిపారు. ఒకవేళ నిఫ్టీ 10553 స్థాయిని విజయవంతంగా బ్రేక్ చేయగలిగితే తదుపరి టార్గెట్ 10,900 స్థాయిగా నిలుస్తుందన్నారు.. కన్సాలిడేటివ్ మూడ్‌లో మార్కెట్: మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నిఫ్టీ డైలీ, వీక్లీ ఛార్ట్లను పరిశీలిస్తే మార్కెట్ కన్సాలిడేటివ్ మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తుందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు చందన్ తపారియా తెలిపారు. ‘‘నిఫ్టీ ఇండెక్స్ గడచిన 14వారాల్లో అత్యధిక గరిష్టస్థాయిని చూసింది. నిఫ్టీకి కీలక మద్దతు స్థాయిలు క్రమంగా అధిక స్థాయిలకు మారుతున్నాయి. దీంతో నిఫ్టీ చుట్టూ బుల్లిష్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు నిఫ్టీకి అప్‌ట్రెండ్‌లో 10,555 వద్ద కీలక నిరోధం కలిగి ఉంది. డౌన్‌ట్రెండ్‌లో 10300 వద్ద మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోయి 10250 వద్ద మరో కీలక మద్దతు స్థాయి ఉంది.’’ ఆయన తెలిపారు. -
టెలికం- ఆటో.. మురిపిస్తాయ్!
ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న భారీ ప్యాకేజీలతో వ్యవస్థలో లిక్విడిటీ బాగా పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్, సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొంటున్నారు. నామమాత్ర వడ్డీ రేట్ల కారణంగా చౌన నిధులు స్టాక్ మార్కెట్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కొద్ది రోజులుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పరుగు తీస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం.. నాస్డాక్ జోరు గత రెండు వారాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం జోరు చూపుతున్నాయి. ఇందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు సైతం దోహదపడుతున్నాయి. ఈ నెలలోనే ఇటీవల రూ. 15,000 కోట్లవరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో గత రెండు వారాల్లోనే మార్కెట్లు 12-13 శాతం ఎగశాయి. ఇక గ్లోబల్ మార్కెట్లు సైతం లిక్విడిటీ దన్నుతో పరుగు తీస్తున్నాయి. మార్చి కనిష్టాల నుంచి అమెరికన్ ఇండెక్స్ నాస్డాక్ 45 శాతం జంప్ చేసింది. తాజాగా సరికొత్త రికార్డ్ గరిష్టాన్ని చేరుకుంది. ఇదే విధంగా ఎస్అండ్పీ, డోజోన్స్ ర్యాలీ చేస్తున్నాయి. వీటితో పోలిస్తే దేశీ మార్కెట్లు కొంత వెనకబడ్డాయి. ఫలితాలవైపు సమీప కాలంలో మార్కెట్లు కంపెనీల ఫలితాలవైపు దృష్టిసారించవచ్చు. అయితే కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు, నిలిచిపోయిన పారిశ్రామికోత్పత్తి, డిమాండ్ క్షీణత వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలపై అంచనాలు తక్కువే. వీటిని ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంది. నిజానికి 2021 అంచనాలతో పోలిస్తే 21 పీఈలో మార్కెట్లపట్ల అంత భరోసా ఉండకపోవచ్చు. దీంతో ఈ స్థాయిల నుంచి మార్కెట్లు తదుపరి దశ ర్యాలీలోకి ప్రవేశించేముందు కొంతమేర కన్సాలిడేషన్ లేదా.. పతనానికి అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేయడం, ఆర్థిక వ్యవస్థలు తిరిగి పట్టాలెక్కుతుండటం వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చే వీలుంది. దీనికితోడు అంతర్జాతీయ స్థాయిలో రెండో దశ ప్యాకేజీలు వెలువడితే.. లిక్విడిటీ మరింత పెరగవచ్చు. ఎయిర్టెల్ భేష్ కోవిడ్-19.. ఫైనాన్షియల్ రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నదీ వేచిచూడవలసి ఉంది. ప్రస్తుత వాతావరణంలో మొబైల్ టెలికం రంగం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ రంగంలో భారతీ ఎయిర్టెల్ కౌంటర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. క్రమంగా ఏఈర్పీయూలు బలపడుతుండటం ఈ కౌంటర్‌కు హుషారునిస్తోంది. ఇప్పటికే రూ. 125 స్థాయి నుంచి ఏఆర్పీయూలు రూ. 150కు పుంజుకున్నాయి. అత్యధిక శాతం వినియోగదారులు 2జీ నుంచి 4జీకు మారడం కంపెనీకి కలిసొస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం 4జీ సేవలకు డిమాండ్ పెరుగుతుండటం సానుకూల అంశం. సమీప భవిష్యత్‌లో పెట్టుబడి వ్యయాల అవసరం తగ్గడంతో క్యాష్‌ఫ్లోలు మెరుగుపడే వీలుంది. ఇటీవల రిలయన్స్ జియోపట్ల విదేశీ సంస్థల ఆసక్తిని గమనిస్తే.. దేశీ టెలికం, డిజిటల్ రంగానికున్న అవకాశాలను అంచనా వేయవచ్చు. టెలికంకు సాంకేతికను జోడించడం ద్వారా డిజిటల్ అవకాశాలు పెంచుకోవచ్చు. దీనికితోడు ఇప్పటికే దేశీయంగా టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరిగింది. మూడు ప్రధాన కంపెనీలు మాత్రమే సేవలందిస్తున్నాయి. ఫలితంగా టెలికం కంపెనీలకు భారీ అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నాం. ఆటో.. గ్రీన్‌సిగ్నల్ స్టాక్ మార్కెట్ దృష్టితో చూస్తే.. గ్రామీణ ప్రాంత వినియోగానికి ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే రబీ సీజన్ జోరందుకుంది. ఇటీవల వాతావరణ శాఖ వెలువరించిన అంచనాల ప్రకారం నైరుతీ రుతుపవనాలు ఆశలు రేపుతున్నాయి. ఈసారి తగిన సమయానికే రుతుపవనాలు రావడంతోపాటు.. సాధారణ సగటు వర్షపాతానికి చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ప్రభుత్వం సైతం ఎంజీఎన్ఆర్ఈజీఏకు అధిక కేటాయింపులు చేసింది. కనీస మద్దతు ధరలనూ పెంచుతోంది. వలస కూలీలు, శ్రామికుల నుంచి సైతం డిమాండ్ కనిపించే వీలుంది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహన తయారీ కంపెనీలతోపాటు, గ్రామీణ ఫైనాన్సింగ్, ఫెర్టిలైజర్, ఆగ్రో కెమికల్ కంపెనీల బిజినెస్‌లు వృద్ధి చూపే అవకాశముంది. ప్రధానంగా ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను ప్రతిబింబిస్తాయి. ఎంఅండ్ఎం ఆటో రంగంలో మహీంద్రా(ఎంఅండ్ఎం) ఆసక్తికరంగా కనిపిస్తోంది. కంపెనీ నిర్వహణలోని మూడు కీలక బిజినెస్‌లలో రెండు పటిష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధికంగా అమ్మకాలు సాధించడంలో సఫలంకాగలదని అంచనా. కోవిడ్-19 పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దీంతో రెండేళ్ల కాలంలో ఆదాయంలో 60 శాతం, నికర లాభాల్లో 80 శాతం వరకూ గ్రామీణ ప్రాంతాల నుంచి సమకూర్చుకోగలదని అంచనా వేస్తున్నాం. ఇక ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటో, బజాజ్ ఆటోను ప్రస్తావించవచ్చు. ఎగుమతులు, త్రిచక్ర వాహన మార్కెట్ కారణంగా బజాజ్ ఆటోతో పోలిస్తే.. హీరోమోటోకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. -
సెప్టెంబర్‌వరకూ ‘సిప్’ చేయండి!
ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు చేపడుతూ ఉంటే.. ఇప్పటినుంచీ సెప్టెంబర్‌వరకూ క్రమానుగత పద్ధతి(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్-SIP)ను అనుసరించమంటున్నారు ఆశిష్ సోమయ్య. రుణ సెక్యూరిటీలు, ఈక్విటీలు.. ఏదైనాగానీ పెట్టుబడుల విషయంలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం ద్వారా రీబ్యాలన్స్ చేసుకోమని సూచిస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ, సీఈవో ఆశిష్. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లపై కరోనా వైరస్ ప్రభావం, ప్రపంచ మార్కెట్లు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. అంచనాలకు అందదు సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లపై అంచనాలు వేయడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి మార్కెట్ల నడకను ఊహించడం అంత సులభమేమీకాదు. మార్కెట్లు ఎక్కడివరకూ పెరుగుతాయో లేదా పతనమవుతాయన్నది ఎవరి అంచనాలకూ అందదు. ఉదాహరణకు ఈ ఏడాది(2020) తొలి నాలుగు నెలలనే పరిగణిస్తే.. జనవరి 20న ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 12,430 వద్ద గరిష్టానికి చేరింది. ఆపై ఆటుపోట్లు చవిచూసి ఫిబ్రవరి 12కల్లా తిరిగి 12,300ను తాకింది. ఈ బాటలో మార్చి 5కల్లా 11,300కు నీరసించింది. తదుపరి ఒక్కసారిగా పతన బాట పట్టి మూడు వారాల్లోనే అంటే మార్చి 23కల్లా 7,583కు దిగజారింది. ఫిబ్రవరి గరిష్టం నుంచి 40 శాతం పడిపోయింది. చైనాలో తలెత్తిన కరోనా వైరస్ యూరోపియన్ దేశాలను ను వణికించడంతోపాటు అమెరికాలోనూ విస్తరించడం మొదలుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇదీ తీరు దేశీయంగా కరోనా వైరస్ అడుగు పెట్టిన వార్తలతో కేంద్ర ప్రభుత్వం మార్చి 23న లాక్‌డవున్ ప్రకటించింది. అప్పటికి దేశీయంగా నమోదైన కోవిడ్-19 కేసులు సుమారు 500. లాక్‌డవున్ కారణంగా పలు రంగాలు, కంపెనీలలో ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. అమ్మకాలు స్థంభించడంతో డిమాండ్ పడిపోయింది. అయినప్పటికీ మార్చి చివర్లో మార్కెట్లలో రికవరీ ప్రారంభమై ఏప్రిల్‌లో జోరందుకుంది. వెరసి కనిష్టం నుంచి మార్కెట్లు 20 శాతం జంప్‌చేశాయి. ఈ కాలంలో దేశీయంగా కరోనా వైరస్ సోకిన కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇది ఒక్క దేశీ మార్కెట్లకే పరిమితంకాలేదు. అమెరికాసహా యూరప్, ఆసియా దేశాల మార్కెట్లలోనూ ఈ ట్రెండ్ కనిపించింది. ఎక్కడైనా.. 2008లో అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రభావంతో ప్రపంచంలోని పలు దేశాల మార్కెట్లు 50-60 శాతం మధ్య కుప్పకూలాయి. ఇక 2020లోనూ ఇదే విధంగా 25-35 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఈ ఏడాది(2020) మార్చిలో కరోనా వైరస్‌ను నియంత్రించిన కొరియా, తైవాన్.. లేదా కోవిడ్-19 ముంచెత్తిన అమెరికా, యూరోపియన్ దేశాల మార్కెట్లన్నీ ఒకే రీతిన వెనకడుగు వేశాయి. ఇక నామమాత్ర కేసులు నమోదైనప్పటికీ దేశీ మార్కెట్లు సైతం 40 శాతం క్షీణించాయి. సిప్ మేలు మార్కెట్ల బాటమ్ లేదా పీక్‌ను అంచనా వేయడం కంటే అవకాశం లభించినప్పుడల్లా పెట్టుబడులు చేపట్టడం దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. తగినంత నిధుల లభ్యత ఉంటే విభిన్న పెట్టుబడి మార్గాలవైపు దృష్టిసారించవచ్చు. సరైన మ్యూచువల్ ఫండ్స్ లేదా భవిష్యత్‌లో అవకాశాలు పెంచుకోగల రంగాలను ఎంచుకోవలసి ఉంటుంది. ఇదే విధంగా మెరుగైన పనితీరు చూపగల ఫండ్ పథకాలు లేదా మార్కెట్ వాటాను పెంచుకోగల కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పోర్ట్‌ఫోలియోను పటిష్టపరచుకోవచ్చు. భయాలు వద్దు నిజానికి మార్కెట్లు పతన బాట పట్టినప్పుడు అధిక భయాలకు లోనుకావద్దు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారనో.. మార్కెట్లు మరింత పతనమవుతాయనో వెలువడే వార్తలకు అతిగా స్పందించవద్దంటున్నారు స్టాక్ నిపుణులు. మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పనిసరిగా పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవలసి ఉంటుందని తెలియజేస్తున్నారు. కోవిడ్-19 వంటి అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు వినియోగదారుల అవసరాలు, అభిరుచులలో మార్పులకు అవకాశముంటుంది. దీంతో భవిష్యత్‌లో పటిష్ట పనితీరు చూపగల రంగాలు, కంపెనీలవైపు దృష్టి సారించవలసి ఉంటుందని వివరిస్తున్నారు. మార్చిలో గ్లోబల్ మార్కెట్ల నుంచి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లగా.. దేశీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 8-9 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ మాత్రమే విక్రయించినట్లు ఆశిష్ పేర్కొంటున్నారు. ఆటుపోట్ల మార్కెట్లలో సిప్ విధానం ప్రయోజనకరమని తెలియజేస్తున్నారు. -
రిలయన్స్ బీమా ఐపీఓ మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: అనిల్ ధీరూబాయ్ అంబా నీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రణాళికను అటకెక్కించింది. సెబీకి సమర్పించిన ఐపీఓ ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీఓను ఎందుకు ఉపసంహరించుకుందో వివరాలను కంపెనీ గానీ, ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మోతిలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ గానీ వెల్లడించలేదు. షెడ్యూల్ ప్రకారమైతే, ఈ ఐపీఓలో భాగంగా రూ.200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రిలయన్స్ క్యాపిటల్ 7.9 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. 2017లో కూడా అంతే..! రిలయన్స్ బీమా ఐపీఓ డాక్యుమెంట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 8నే మోతిలాల్ ఓస్వాల్ సంస్థ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను ఉపసంహరించుకుంటున్నామని ఈ నెల 24న సెబీకి ఒక మెయిల్ పంపించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. 2017, అక్టోబర్‌లో ఐపీఓ పత్రాలను సమర్పించి ఆ మరుసటి నెలలో సెబీ నుంచి ఆమోదం పొందింది. అయితే అప్పుడు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగడం, ఐపీఓల పట్ల ఇన్వెస్టర్లకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఐపీఓ ప్లాన్‌ను అటకెక్కించింది. -
డిజిటల్ గోల్డ్.. జిగేల్!
న్యూఢిల్లీ: బంగారం డిజిటల్ రూపంలోనూ తళుక్కుమంటోంది. ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుదలే దీన్ని తెలియజేస్తోంది. 2012–13లో బంగారం డిజిటల్ ఖాతాల ఆరంభం నుంచి చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్లకు పైగా ఖాతాలు ఆరంభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ రూపంలో బంగారాన్ని ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బంగారాన్ని ఆయా సంస్థల వద్దే స్టోర్ చేసుకునే అవకాశం లేదంటే భౌతిక రూపంలో డెలివరీ తీసుకునే సదుపాయాలు కూడా వినియోగదారులను ఆకర్షింపజేస్తున్నాయి. సేఫ్గోల్డ్, డిజిటల్ గోల్డ్ వంటి సంస్థలూ ఈ సేవలను అందిస్తున్నాయి. ఆగ్మంట్ అనే సంస్థ రిఫైనరీల వద్ద స్వచ్ఛమైన బంగారం నుంచి దాన్ని మార్కెటింగ్ వరకు సమగ్ర సేవల్లో ఉన్న కంపెనీ. ఈ సంస్థ ‘డిజిగోల్డ్’ పేరుతో 2012 నుంచి డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ సైతం ఈ సేవల్లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ సేవల్లోకి గూగుల్‌పే సైతం అడుగు పెట్టడం ఈ మార్కెట్ భారీగా విస్తరించేందుకు చేయూతనివ్వగలదని పరిశ్రమకు చెందిన ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్... వివిధ రకాల వేదికలుగా వార్షికంగా తొమ్మిది టన్నుల వరకు డిజిటల్ గోల్డ్ విక్రయాలు జరుగుతున్నాయని పరిశ్రమ అంచనా. ఇందులో సుమారు మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు దారులు ప్రత్యక్ష రూపంలో డెలివరీ తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ వేదికల్లో బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్ల విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతుండడం గమనార్హం. డిజిటల్ గోల్డ్ కొనే వారు పెరిగిపోతుండడం, దీనికి తోడు ఆన్లైన్లోనే ఆభరణాలు కొనే ధోరణి విస్తరిస్తుండడం సంప్రదాయ జ్యుయలరీ వర్తకులను ఆందోళనకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్‌కు ఆసక్తి చూపించడానికి నాణ్యమైన, పారదర్శక సేవల ప్రాముఖ్యాన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. కొన్న డిజిటల్ బంగారాన్ని ఉచితంగా స్టోర్ చేసుకునే సదుపాయం, కోరినప్పుడు బంగారం రూపంలోనే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే సేవలను అవి ఆఫర్ చేస్తున్నాయి. దీనికితోడు డిజిటల్ గోల్డ్‌ను బంగారు ఆభరణాల కొనుగోలుతో మార్చుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆభరణాలుగా డిజిటల్ గోల్డ్ ఆగ్మంట్ సంస్థకు సొంతంగా గోల్డ్ రిఫైనరీ (బంగారం శుద్ధి కర్మాగారం) కూడా ఉంది. డెలివరీ కోరుకుంటే బంగారాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇస్తోంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలు కొనుగోలు చేసిన బంగారాన్ని తమ వేదికలుగానే స్టోర్ చేసుకునేందుకు గాను ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. సేఫ్ గోల్డ్, ఆగ్మంట్ సంస్థలు ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌తో ఇందుకోసం టై అప్ అయ్యాయి. డిజిటల్ ఖాతాల్లోని బంగారాన్ని ఆభరణాలుగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని క్యారట్‌లేన్, క్యాండిర్ (కల్యాణ్ జ్యుయలర్స్ ఆన్లైన్ సబ్సిడరీలు) సౌజన్యంతో అందిస్తున్నట్టు డిజిటల్ గోల్డ్ ఇండియా ఎండీ గౌరవ్ మాథుర్ తెలిపారు. సేఫ్గోల్డ్ మాతృ సంస్థే డిజిటల్‌గోల్డ్. వినియోగదారులకు మరిన్ని ఎంపికల అవకాశాలను అందించేందుకు జ్యుయలర్స్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టినట్టు మాథుర్ చెప్పారు. పేటీఎం, గూగుల్ పే లేదా ఫోన్‌పే సంస్థల వేదికలపై కొనుగోలు చేసిన మొత్తాన్ని బంగారం రూపంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా సంస్థ తమ వోల్ట్‌లలో భద్రంగా ఉంచేస్తుంది. కోరితే డెలివరీ కూడా చేస్తుంది. గూగుల్ పే రాకతో డిజిటల్ ఖాతాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నామని ఓ కంపెనీ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. ఆగ్మంట్ సంస్థ బంగారం కాయిన్లను సైతం డెలివరీ చేస్తోంది. ‘‘వేల సంఖ్యలో జ్యూయలర్లను మా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలన్నది ప్రణాళిక. దీంతో ఆగ్మంట్ కస్టమర్లు తమ బంగారాన్ని ఆభరణాలతో మార్పిడి చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్, వ్యాలెట్ ప్లాట్‌ఫామ్‌లపై ఆగ్మంట్ గోల్డ్ కొనే అవకాశం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం’’ అని ఆగ్మంట్ డైరెక్టర్ సచిన్ కొఠారి తెలిపారు. ► వ్యాలెట్ల నుంచి యాప్స్ నుంచి బంగారం కొనుగోలు చేసుకోవడాన్నే డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటారు. ► జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మంది డెలివరీ తీసుకోవడం లేదు. ► డెలివరీ తీసుకుంటున్న వారిలోనూ ఎక్కువ మంది కాయిన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఈ ధోరణి కాస్తా భవిష్యత్తులో బంగారం ఆభరణాలను డెలివరీ తీసుకోవడానికి మారనుందని అంచనా. ► కనీసం రూ.100 నుంచి కూడా పేటీఎం, సేఫ్గోల్డ్ వేదికల్లో బంగారం కొనుక్కోవచ్చు. ► ప్రస్తుతం రోజువారీగా జరుగుతున్న డిజిటల్ గోల్డ్ లావాదేవీల పరిమాణం 8–9 కిలోలు. గూగుల్ పే ద్వారా పసిడి కొనుగోళ్లు ఎంఎంటీసీ–పీఏఎంపీతో జట్టు న్యూఢిల్లీ: చెల్లింపుల యాప్ గూగుల్ పే ద్వారా బంగారం కొనుగోలు, అమ్మకం లావాదేవీలు కూడా జరిపే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇందుకోసం బులియన్ రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. గూగుల్ పే ద్వారా కొనుగోలు చేసే బంగారాన్ని యూజర్ల సూచనల మేరకు ఎంఎంటీసీ–పీఏఎంపీ సురక్షితమైన వోల్ట్‌లలో భద్రపరుస్తుందని గూగుల్ తెలిపింది. ఈ బంగారాన్ని లేటెస్ట్ ధర ప్రకారం ఎప్పుడైనా యూజర్లు కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయొచ్చని వివరించింది. గూగుల్ పే యాప్‌లో ఎప్పటికప్పుడు తాజా ధరలు చూసుకోవచ్చని గూగుల్ తెలిపింది. అసలు గూగుల్ పే యాప్.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు తగిన అనుమతులు తీసుకుందా, లేదా అన్న విషయంపై వివరణనివ్వాలంటూ నియంత్రణ సంస్థ ఆర్బీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ కొత్తగా మరో ఫీచర్ ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ సంస్థ కేవలం చెల్లింపులకు సంబంధించి టెక్నాలజీపరమైన సేవలు మాత్రమే అందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్సు అవసరం లేదని గూగుల్ వివరణనిచ్చింది. -
అన్ని కాలాల్లోనూ మెప్పించిన ఫండ్!
ప్రారంభించి కొన్నేళ్లే అయినా, పనితీరులో ఇప్పటి వరకు వెనుతిరిగి చూడలేదు. అదే మోతీలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్డ్ మల్టీక్యాప్ ఫండ్. ఇది స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అన్నింటిలోనూ ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఫండ్. మార్కెట్ల ఆటుపోట్ల సమయాల్లోనూ స్థిరమైన రాబడులను అందించిన చరిత్ర ఉంది. రాబడులు ఎలా ఉన్నాయంటే... వార్షిక రాబడులను చూస్తే గడిచిన ఏడాది కాలంలో 18 శాతం, మూడేళ్ల కాలంలో 15 శాతం చొప్పున, ప్రారంభించిన నాటి నుంచి వార్షికంగా 28 శాతం చొప్పున ఈ పథకం రాబడులనిచ్చింది. ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ 500 కంటే అధిక రాబడులు ఇందులో ఉన్నాయి. మల్టీ క్యాప్ విభాగంలో ఇది ఉన్నత విభాగంలోకి వస్తుంది. ఇక త్రైమాసికం వారీ పనితీరు అంత ప్రామాణికంగా చూడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, గత డిసెంబర్ నుంచి చూసుకుంటే ఈ పథకం రాబడులు బెంచ్‌మార్క్ కంటే తక్కువే ఉన్నాయి. అయితే, గత కరెక్షన్ సమయంలోనూ (2015 జనవరి నుంచి 2016 ఫిబ్రవరి వరకు) ఈ పథకంలో నష్టాలే కనిపించాయి. అయినప్పటికీ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మొదలైన తర్వాత చాలా వేగంగా ఈ పథకం పెట్టుబడుల విలువ పెరిగింది. దీంతో బెంచ్ మార్క్తోనూ, ఇదే విభాగంలోని ఇతర పథకాలతోనూ రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. పెట్టుబడులు మల్టీక్యాప్ ఫండ్ కావడంతో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ స్థాయి కంపెనీల్లో అయినా పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. దీంతో పెట్టుబడుల పరంగా అధిక రాబడి అవకాశాలను సొంతం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మిడ్ క్యాప్ స్టాక్స్ విలువలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిన నేపథ్యంలో ఈ విభాగంలో పెట్టుబడులను 10 శాతంలోపునకు తగ్గించుకుంది. అయితే, ఇటీవలి కరెక్షన్ నేపథ్యంలో మిడ్ క్యాప్‌లో పెట్టుబడులు 12 శాతానికి చేరాయి. పెట్టుబడులను గరిష్టంగా 35 స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. నిధుల్లో 10 శాతాన్ని విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంది. అయితే, కొంత కాలంగా ఈ ఫండ్ మేనేజర్లు 20–25 స్థానిక స్టాక్స్ మించకుండా పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తున్నారు. స్టాక్స్ సంఖ్య తక్కువకు పరిమితం చేసినందున రిస్క్ తగ్గించేందుకు బాటమ్ అప్ స్టాక్స్ ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నారు. వృద్ధికి అవకాశాలుండి, సరసమైన ధరల్లో ఉన్న స్టాక్స్‌నే ఎంచుకుంటున్నారు. ఈ పథకంలో ఎక్స్పెన్స్ రేషియో సగటున చూస్తే తక్కువగానే ఉంది. స్టాక్స్ ఎంపిక కొన్ని ఐపీవోల్లోనూ ఈ పథకం ఇన్వెస్ట్ చేసింది. మన్‌పసంద్ బెవరేజెస్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఆల్కెమ్ ల్యాబ్స్ మంచి లాభాలను ఇచ్చాయి. గతేడాది టైటాన్, టీసీఎస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలోకి యాడ్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటాలు తగ్గించుకోగా, ఎస్బీఐ, లుపిన్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ నుంచి పూర్తిగా తప్పుకుంది. -
స్టాక్స్ వ్యూ
మారుతీ సుజుకీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.7,630 టార్గెట్ ధర: రూ.8,863 ఎందుకంటే: మారుతీ సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కార్ల అమ్మకాలు 13 శాతం పెరగడంతో నికర అమ్మకాల ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.17,550 కోట్లకు పెరిగింది. ప్రమోషన్, మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండడంతో పాటు జీఎస్టీ వ్యయాలు కూడా తోడవడంతో ఇబిటా మార్జిన్ 150 బేసిస్ పాయింట్లు క్షీణించి 13.3 శాతానికి తగ్గిపోయింది. రూ.680 కోట్ల ఇతర ఆదాయం సాధించింది. అయితే అధిక పన్ను రేట్ల కారణంగా నికర లాభం 4 శాతం మాత్రమే పెరిగి రూ.1,560 కోట్లకు చేరింది. ప్రీమియమ్ కార్ల విక్రయాలు కోసం ఏర్పాటు చేసిన నెక్సా అవుట్లెట్ల అమ్మకాలు మొత్తం అమ్మకాల్లో 20 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ1లో కంపెనీ మార్కెట్ వాటా 55.5 శాతానికి పెరిగింది. ఉత్పత్తుల అభివృద్ధికి, పరిశోధన, అభివృద్ధి, షోరూమ్‌ల ఏర్పాటు కోసం స్థల సమీకరణ నిమిత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ది సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో గుజరాత్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించగలదు. వాహన రంగంలో డిమాండ్ పుంజుకుంటే అత్యధికంగా ప్రయోజనం పొందే కంపెనీ ఇదే కానున్నది. రెండేళ్లలో కంపెనీ అమ్మకాలు 13 శాతం, ఆదాయం 18 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. అరవింద్ బ్రోకరేజ్ సంస్థ: వెంచుర సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.360 టార్గెట్ ధర: రూ.624 ఎందుకంటే: జీఎస్టీ అమలు కారణంగా అత్యధికంగా ప్రయోజనం పొందే పెద్ద కంపెనీల్లో ఇది ప్రధానమైనది. టెక్స్టైల్స్ రంగంలో మొత్తం 75 శాతం మార్కెట్ వాటా ఉన్న అసంఘటిత రంగం నుంచి అధిక భాగం మార్కెట్ వాటా ఈ కంపెనీకే దక్కే అవకాశాలున్నాయి. అప్పారెల్ బ్రాండ్ల విషయానికొస్తే, యారో, యూఎస్ పోలో, ఫ్లైయింగ్ మెషీన్, టామీ హిల్ఫిగర్, కాల్విన్ క్లెయిన్, తదితర బ్రాండ్లలో కొన్నికంపెనీ సొంతానివి కాగా, మరికొన్నింటికి లైసెన్స్‌లు పొందింది. ఎంట్రీ లెవల్, మధ్య తరహా, ప్రీమియమ్ బ్రాండ్లు.. ఇలా అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండే బ్రాండ్లు ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. భారత్‌లో బ్రాండెడ్ దుస్తులకు డిమాండ్ బాగా పెరగగలదని, ఈ అవకాశాలను ఈ కంపెనీ అందిపుచ్చుకోగలదని అంచనా. డెనిమ్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అతి పెద్ద ప్రపంచ కంపెనీల్లో ఇది ఒకటి. తక్కువ వేతనాలు, అనేకమైన రాయితీలు లభిస్తున్న, యూరప్ మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఇథియోపియోలో దుస్తుల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం, దుస్తుల బ్రాండ్ పోర్ట్ ఫోలియో అత్యధిక వృద్ధి, రిటైల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్లిమిటెడ్(గతంలో మెగామార్ట్ స్టోర్స్) సంస్థ ఆదాయం, లాభదాయకత మెరుగుపడుతుండడం సానుకూలాంశాలు. మూడేళ్లలో కంపెనీ ఆదాయం 13.5% చక్రగతి వృద్ధితో రూ.13,503 కోట్లకు, నికర లాభం 29% వృద్ధితో రూ.680 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
ఎస్బీఐ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.308 ; టార్గెట్ ధర: రూ.375 ఎందుకంటే: అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. వాచ్ లిస్ట్‌లో ఉండే రుణాలు తగ్గుతుండడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, తదితర కారణాల వల్ల రుణ నాణ్యత మెరుగుపడగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీలకు, భారీ ప్రైవేట్ రంగ కంపెనీలకు రుణాలివ్వడం వల్ల రుణాల విషయంలో బ్యాంక్ సౌకర్యవంతంగా ఉందనే చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి వాతావరణం మెరుగుపడితే రుణ నాణ్యత అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరపతి వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగినా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయని బ్యాంక్ భావిస్తోంది. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి రికవరీలు పెరుగుతున్నాయి. ఈ పోకడ మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర మొండి బకాయిలు తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్(నిమ్), నిర్వహణ మెరుగుపడుతాయనే అంచనాలతో బ్యాంక్ ఆదాయం(స్టాండోలోన్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. మూడేళ్లలో నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించవని భావిస్తున్నాం. అనుబంధ బ్యాంక్‌ల విలీనం విషయమై 70వేలకు పైగా ఉద్యోగుల సర్దుబాటు, బ్రాంచ్‌ల హేతుబద్ధీకరణ, విద్యుత్తురంగ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై ఒత్తిడి అధికంగా ఉండడం... అంశాలు కొంచెం సమస్యాత్మకమైనవి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, అత్యుత్తమంగా ప్రయోజనం పొందే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. ప్రొవిజనల్ కవరేజ్ రేషియో 66 శాతంగా ఉండడం, మూలధన నిధులు పుష్కలంగా ఉండడం, రిటైల్ డిపాజిట్లు 95 శాతానికి మించి ఉండడం, నిర్వహణ లాభదాయకత పెంపుపై బ్యాంక్ దృష్టి పెట్టడం.. ఇవన్నీ సానుకూలాంశాలు. జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.175 ; టార్గెట్ ధర: రూ.215 ఎందుకంటే: మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాల, ట్రక్కు, బస్సు టైర్ల(టీబీఆర్) సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొక్కటి. ప్రయాణికుల కార్ల రేడియల్ టైర్ల సెగ్మెంట్లో 12 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చైనా టైర్ల దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. చైనా టైర్ల దిగుమతి లావాదేవీలు అధికంగా నగదులో జరగడమే దీనికి కారణం. మరో వైపు చైనా టైర్లపై అమెరికా ఎలాంటి సుంకాలు విధించకూడదని నిర్ణయించడంతో చైనా కంపెనీలు భారత్‌కు కాకుండా అధిక లాభాలు వచ్చే అమెరికా మార్కెట్‌కు తమ టైర్లను ఎగుమతి చేస్తున్నాయి. ఈ రెండు రణాల వల్ల చైనా నుంచి పోటీ బాగా తగ్గింది. చైనా నుంచి టైర్ల దిగుమతులు తగ్గడం వల్ల కంపెనీ మార్కెట్ వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. టైర్ల తయారీకి కీలకమైన సహజమైన రబ్బరు ధరలు ఇటీవల కాలంలో తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.94గా ఉన్న కేజీ సహజ రబ్బరు ధర ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.159కు పెరిగినా, ప్రస్తుతానికి రూ.140కి పడిపోయింది. ఈ ధర మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ఇతర ముడి పదార్ధాల ధరలు (ముడిచమురుతో సంబంధించిన కొన్ని) కూడా తక్కువగానే ఉన్నాయి. నిర్వహణ పనితీరు రక్షణ నిమిత్తం ఈ కంపెనీతో సహా ప్రధాన టైర్ల కంపెనీలు గత ఆర్నెళ్లలో తమ ఉత్పత్తుల ధరలను 10 శాతం వరకూ పెంచాయి. ఈ ధరల పెంపు కారణంగా కంపెనీ మార్జిన్స్ మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన కావెండిష్ ఇండస్ట్రీస్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న 2 వీలర్, 3 వీలర్ సెగ్మెంట్లలోకి ఈ కంపెనీ ప్రవేశించడమే కాకుండా, టీబీఆర్ సెగ్మెంట్లో కంపెనీ స్థానం మరింతగా పటిష్టం కానుంది. -
స్టాక్స్ వ్యూ
యస్ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రనూ.1,553 ; టార్గెట్ ధర: రూ.2,110 ఎందుకంటే: ఇటీవలే రూ.4,900 కోట్ల నిధులను సమీకరించింది. దీంతో ఈ బ్యాంక్‌కు మూలనిధులు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిదాకా కార్పొరేట్ రంగంపై దృష్టి సారించిన ఈ బ్యాంక్ రిటైల్, ఎస్ఎంఈ సంబంధిత పథకాలను జోరుగా అందుబాటులోకి తెస్తోంది. 2011–16 కాలానికి బ్యాంక్ బ్రాంచీలు 32 శాతం, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 90 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2010–11 కాలానికి 11 శాతంగా ఉన్న కాసా నిష్పత్తి గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి 33 శాతానికి పెరిగింది. కాసా డిపాజిట్లు 2020 కల్లా 40 శాతం సాధించాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. విస్తృతంగా బ్రాంచ్‌ల విస్తరణ, రిటైల్, కార్పొరేట్ రంగాలకు అవసరమైన సేవలందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని ఏడాది ముందుగానే సాధించే అవకాశాలున్నాయి. ఆర్థిక వృద్ధి మందగమనం, ఇతరత్రా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నప్పటికీ, మంచి రుణవృద్ధి సాధిస్తూనే స్థూల మొండి బకాయిలను 1 శాతం లోపే నియంత్రించడం ద్వారా మంచి రుణ నాణ్యతను సాధించింది. 2011–16 కాలానికి రుణ వృద్ధి 23 శాతంగా, నికర లాభం 28 శాతం చొప్పున వృద్ధి చెందాయి. మూడేళ్లలో రుణ వృద్ధి 28 శాతం(బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధికి ఇది దాదాపు రెట్టింపు) చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. కాసా అధికంగా ఉండడం, రిటైల్ రుణాలు కూడా అధికంగానే ఉండడం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్ 20 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఫీజు ఆదాయం కూడా ఎక్కువగా ఉండటంతో నికర లాభం 2020 మార్చి కల్లా 27 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 20 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం. ర్యాలీస్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.250 ; టార్గెట్ ధర: రూ.300 ఎందుకంటే: విత్తనాలు, వ్యవసాయ రసాయనాలు సహా వివిధ వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ అందిస్తోంది. వ్యవసాయ రసాయనాల మార్కెట్లో 7 శాతం వాటా ఈ కంపెనీదే. తన అనుబంధ సంస్థ మెటాహెలిక్స్తో కలసి విత్తనాల మార్కెట్లో 3 శాతం వాటా సాధించింది. వ్యవసాయ ఆదాయం పెంచడం లక్ష్యంగా వివిధ ప్రభుత్వాలు పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఫలితంగా 2017–19 కాలానికి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులనందించే ఈ తరహా కంపెనీల అమ్మకాలు జోరుగా ఉంటాయని భావిస్తున్నాం. 2022 కల్లా వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా తాజా కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమం కోసం కేటాయింపులు 16% పెరిగి రూ.41,855 కోట్లకు పెరిగాయి. వివిధ పథకాలకు భారీ కేటాయింపులు జరిగాయి. రూ.10 లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాలు ఇవ్వాలని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇవన్నీ ర్యాలీస్ ఇం డియా వంటి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం కలిగించేవే. ఎలాంటి రుణ భారం లేని ఈ కంపెనీకి ఈ ఏడాది మార్చి చివరి కల్లా రూ.150 కోట్ల నికర నగదు నిల్వలున్నాయి. రెండేళ్లలో ఏడాదికి రూ.200 కోట్ల చొప్పున నగదు నిల్వలు సాధిస్తుందన్న అంచనాలున్నాయి. రెండేళ్ల కాలానికి ఆర్ఓసీఈ(రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్) 22 శాతంగా ఉంటుందని, ఇబిటా మార్జిన్లు 150 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని భావిస్తున్నాం. రెండేళ్లలో అమ్మకాలు 10%, నికర లాభం 17% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయదగ్గ షేర్ ఇదని సూచిస్తున్నాం. -
జియో జోరుకు బ్రేకులు!
• నెమ్మదించిన సబ్స్క్రైబర్ల వృద్ధి • సగానికి తగ్గిన డేటా స్పీడ్ • మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ముంబై: టెలికం రంగంలో జియో ఓ సంచలనం. ఇది నిన్నటి మాట. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది. జియో సేవలు ఆశించినంత స్థారుులో లేవని యూజర్లు పెదవి విరచడం ఇప్పుడు కంపెనీని ఆందోళనలో పడేసింది. కంపెనీకి 2018 డిసెంబర్ నాటికి 10 కోట్ల మంది కస్టమర్లను చేరుకోవాలనే లక్ష్యం కూడా దూరమయ్యేలా కనిపిస్తోంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తన నివేదిక పేర్కొంది. తగ్గిన నెట్వర్క్ నాణ్యత సేవలు ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా కూడా జియో.. 2-35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటాను కస్టమర్లకు అందించలేకపోతోందని మోతీలాల్ ఓస్వాల్ విమర్శించింది. ఎక్కువ మంది కస్టమర్లు, వారి అధిక వినియోగం అనే రెండు అంశాలు కంపెనీ డేటా స్పీడ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. అలాగే దీని వల్ల నెట్వర్క్ నాణ్యత కూడా తగ్గిపోరుుందని వివరించింది. అసలు సత్తా తెలిసేది అప్పుడే! తన సర్వీసులకు చార్జీలను వసూలు చేయడం ప్రారంభించిన దగ్గరి నుంచే రిలయన్స జియో అసలు సత్తా తెలుస్తుందని మోతీలాల్ పేర్కొంది. వెల్కమ్ ఆఫర్ ముగిసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్లు జియోను రెండవ సిమ్గా వినియోగిస్తారని అంచనా వేసింది. ఇక జియో భాగస్వాములకు యూజర్ల నుంచి అధిక ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడింది. చాలా మంది సబ్స్క్రిప్షన్సను కొనసాగించకపోవచ్చని పేర్కొంది. జియోకి ఎరుుర్టెల్లే ప్రధాన పోటీదారు రిలయన్స జియోకి భారతీ ఎరుుర్టెల్లే ప్రధాన పోటీదారని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అటు నెట్‌వర్క్‌లో గానీ, ఇటు డేటా సేవల్లో గానీ జియోకి కేవలం ఎరుుర్‌టెల్ మాత్రమే గట్టిపోటినిస్తుందని అభిప్రాయపడింది. ఇతర టెలికం కంపెనీలకు వాటి బలాన్ని చూపడానికి 12-18 నెలల సమయం పడుతుందని పేర్కొంది. కాగా, ఎరుుర్‌టెల్ టెలికం మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరిన్ని పెట్టుబడులు... యూజర్ల నుంచి వ్యక్తమౌతోన్న సమస్యల పరిష్కారానికి జియో వచ్చే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెడుతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం టెలికం ఇన్వెస్ట్మెంట్లు రూ.2.25-రూ.2.30 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడం, డిజిటల్ సేవల విస్తరణ వంటి వాటికి ఈ నిధులను ఉపయోగించుకుంటుందని తెలిపింది. కాగా కంపెనీ లాభాలను గడించాలంటే కనీసం 8-10 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. వెల్కమ్ ఆఫర్‌ను పొడిగిస్తుందా? రిలయన్స జియో తన వెల్కమ్ ఆఫర్‌ను పొడిగించే అవకాశముందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. సంస్థ తన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కూడా రిలయన్స డిజిటల్స్ నుంచి మరిన్ని ఇతర ఔట్‌లెట్స్‌కి, స్టోర్లకి విస్తరించొచ్చని తెలిపింది. అలాగే రూ.200-రూ.300 ధర శ్రేణిలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తేవొచ్చని అభిప్రాయపడింది. -
స్టాక్స్ వ్యూ టీటీకే ప్రెస్టీజ్
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.4,176 టార్గెట్ ధర: రూ.5,150 ఎందుకంటే: గృహోపకరణాలు, కుక్వేర్ కేటగిరీల్లో అగ్రస్థాయి కంపెనీల్లో ఒకటి. ప్రెజర్ కుక్కర్ల కేటగిరీలో 37 శాతం, కుక్వేర్ కేటగిరీలో 31 శాతం, గృహోపకరణాల కేటగిరీలో 10 శాతం చొప్పున మార్కెట్ వాటాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత క్యూ3లో రూ.380 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో 17 శాతం వృద్ధితో రూ.450 కోట్లకు పెరిగాయి. ఇబిటా మార్జిన్ 110 బేసిస్ పాయింట్ల వృద్ధితో 13 శాతానికి ఎగసింది. నికర లాభం రూ.28 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.37 కోట్లకు పెరిగింది. ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జోరుగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో ఈ కామర్స్ విభాగం వాటా 5 శాతంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఒక కుక్వేర్ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదికాలంలో విభిన్న మోడళ్లలో వాటర్ ప్యూరిఫయర్లను అందించనున్నది. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా కొత్త మోడళ్లలో పాత్రలను, కుక్కర్లను, ఇండక్షన్ కుక్‌టాప్‌లను అందుబాటులోకి తేనున్నది. కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనుండడం, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మంచి పనితీరు కనబరచడం, ముడి పదార్థాల ధరలు తగ్గుతుండడం, సొంతంగా వస్తువులను ఉత్పత్తి చేయడం పెరుగుతుండడం వల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుండడం, ప్రజల ఆదాయాలు పెరుగుతుండడం, ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటంతో దేశీయంగా డిమాండ్ పుంజుకుంటుండడం...ఇవన్నీ కంపెనీకి కలసి వచ్చే అంశాలు. గత ఐదేళ్లలో కంపెనీ స్థిరాస్తులు 8 రెట్లు పెరిగాయి. ఆస్తుల వినియోగం అత్యుత్తమంగా ఉండడం వల్ల రీ ఇన్వెస్ట్మెంట్ అవసరాలు స్వల్పంగా ఉండడంతో నగదు ప్రవాహాలు పుష్కలంగా వస్తాయిని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 14 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఆల్ట్రాటెక్ సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.2,719 టార్గెట్ ధర: రూ.3,600 ఎందుకంటే: దేశంలోనే అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సిమెంట్ కంపెనీ ఇది. దేశవ్యాప్తంగా సిమెంట్ రంగంలో 18 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. గత ఐదేళ్లలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 72.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.5,747 కోట్లకు పెరిగింది. విద్యుత్తు, ఇంధన వ్యయాలు తగ్గడంతో ఇబిటా టన్నుకు 15 శాతం వృద్ధితో రూ.900కు ఎగసింది. ఇంధన వ్యయాలు మరింతగా తగ్గుతాయని అంచనా. ఈ వ్యయాల క్షీణత పూర్తి ఫలాలు ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో కనిపిస్తాయి. మౌలిక రంగాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించడం, హౌసింగ్ డిమాండ్ క్రమక్రమంగా పుంజుకోవడం, ఏడవ వేతన కమిషన్ సిఫారసులు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణమవుతుండడం..ఈ అంశాలన్నీ సిమెంట్‌కు డిమాండ్ పెరగడానికి తోడ్పడతాయని అంచనా వేస్తున్నాం. డిమాండ్ పుంజుకుంటే అతి పెద్ద సిమెంట్ కంపెనీగా ఈ కంపెనీకి ప్రయోజనం కలుగుతుంది. దేశవ్యాప్తంగా విస్తరించడం, సొంత పవర్ ప్లాంట్లు ఉండడం, కంపెనీ వినియోగించే విద్యుత్తు 80% సొంత ప్లాంట్ల నుంచే కావడం, పెట్ కోక్ వినియోగం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుండడం, మరిన్ని గ్రైండింగ్ యూనిట్లను ప్రారంభించడం ద్వారా రవాణా వ్యయాలు తగ్గనుండడం కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నాయి. రెండేళ్లలో సిమెంట్‌కు డిమాండ్ 9% చొప్పున, కంపెనీ అమ్మకాలు 8% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.187 టార్గెట్ ధర: రూ.250 ఎందుకంటే: 1984లో కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 550కు పైగా కార్యాలయాలతో, 2 అంతర్జాతీయ కార్యాలయాలతో సేవలందిస్తోంది. ఈ కంపెనీ 2015-16 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలం (అక్టోబర్- డిసెంబర్) ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.190 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగింది. రుణ మంజూరీ 31 శాతం ఎగసింది. అయితే రుణ నాణ్యత స్వల్పంగా క్షీణించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం క్యూ2లో 0.81 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 0.84 శాతానికి పెరిగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తన పెట్టుబడులను 53 శాతం బ్యాంకుల నుంచే సమీకరిస్తోంది. అందువలన బ్యాంక్‌లు బేస్ రేట్ (కనీస రుణరేటు) తగ్గించడం ఈ కంపెనీకి కలసి వచ్చే అంశం. మూడో త్రైమాసిక కాలం (అక్టోబర్- డిసెంబర్) కాలంలో ఎస్ఎంఈ సెగ్మెంట్ రుణాలు పెరిగాయి. ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన వారంట్ల జారీ ద్వారా రూ.500 కోట్ల నిధులు సమీకరించాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అందరికీ ఇళ్లు’(హౌసింగ్ ఫర్ ఆల్) స్కీమ్ వల్ల దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రయోజనం కలగనున్నది. గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.159గా ఉన్న కంపెనీ పుస్తక విలువ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.232కు పెరుగుతుందని భావిస్తున్నాం, నికర మొండి బకాయిలు 0.7 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నిర్వహణ ఆస్తులు 22 శాతం చొప్పున, ఆదాయం 18 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. రిస్క్ అధికంగా ఉండే ప్రాజెక్ట్ లోన్లు మొత్తం లోన్‌బుక్‌లో పెరుగుతుండడం.. ప్రతికూలాంశం. -
మోడీ వస్తే చిన్న ర్యాలీ... రాకపోతే భారీ పతనమే!
మరి ఈసారో?... సగటు ఎగ్జిట్ పోల్స్‌ను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ వర్గాలు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 250-270 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్కెట్లు పరుగులు తీశాయి. గత 5 రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లు భారీగా పెరగడంతో అప్పర్ సర్క్యూట్‌కి(20% పెరగడం) అవకాశాల్లేవని, ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉంటే లోయర్ సర్క్యూట్‌ను (20% తగ్గడం) తాకొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ గరిష్టంగా 20% పెరగడం లేదా తగ్గడం జరిగితే, ఆ రోజుకి ఇక ట్రేడింగ్ ఆపేస్తారు. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న శుక్రవారం స్టాక్ మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం సూచీలు 15 శాతానికి పైగా పెరగడం కానీ నష్టపోవడం కానీ జరిగింది. ఈ సారి కూడా అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో 20% కదలికలకు మార్కెట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. ప్రస్తుతం నిఫ్టీ 7,100 స్థాయి వద్ద ఉంటే పెరిగితే 8,000-8,500 స్థాయి వరకు వెళ్ళొచ్చన్న నమ్మకంతో ట్రేడర్లు కాల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే 6,000-5,500 స్థాయి వరకు పడొచ్చన్న ఉద్దేశ్యంతో ట్రేడర్లు పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేస్తున్నారు. ర్యాలీ జరిపితే కాల్ ఆప్షన్ కొన్నవారికి, తగ్గితే పుట్ ఆప్షన్ కొన్నవారికి లాభం వస్తుంది. ఎగ్జిట్ పోల్ ప్రభావం ఎంత? గత రెండు ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. 2004లో అందరూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్ అంచనాలు వస్తే దానికి భిన్నంగా వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అలాగే 2009లో యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి రాదని, థర్డ్ ఫ్రంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ ఘోషించాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వామపక్షాల మద్దతు అవసరం లేకుండానే యూపీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు తీశాయి. కాని ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఇంకోటుంది. 2004 ఫలితాల తర్వాత సూచీలు కుప్పకూలినా.. ఆ తర్వాతి కాలంలో ఎన్నడూ ఊహించనంత లాభాలందించాయి. 2009 లో స్వల్పకాలానికి పెరిగినా ఆ తర్వాత కుప్పకూలి పరిమిత శ్రేణిలో కదిలాయి. అప్పర్ సర్క్యూట్ చాన్స్ తక్కువే ఎన్నికల ఫలితాల లెక్కింపు 8 గంటలకే ప్రారంభం కానుండటంతో 9.15కల్లా ఫలితాల సరళిపై కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మార్కెట్లు ప్రారంభంలోనే కొద్దిగా గానప్ అప్ లేదా గ్యాప్ డౌన్‌తో ప్రారంభం కావచ్చని ఎస్ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకి 280 వరకు సీట్లు వస్తాయని అంచనాతో మార్కెట్లు ఇప్పటికే పెరగడంతో వాస్తవ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాసరే మార్కెట్లు పెద్దగా పెరగకపోవచ్చన్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి 220-240 దగ్గరకొచ్చి ఆగిపోతే భారీ పతనం తప్పకపోవచ్చన్నారు. ఫలితాలు ఏకపక్షంగా ఉండకుండా, చివరివరకూ ఊగిసలాట ధోరణిలో ఉంటే మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతాయన్నారు. రేపటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని, బీజేపీఒంటిరిగా ఎన్ని సీట్లు సాధిస్తున్నది అన్న అంశాలను పరిశీలించాలంటున్నారు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. ఎన్డీఏ కూటమి 300 సీట్లు దాటితే 10% వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కేవలం బీజేపీ సీట్లు 220 లోపునకు పరిమితం అయినా, ఎన్డీఏ కూటమి 230లోపు ఆగినా, థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా సూచీలు లోయర్ సర్క్యూట్ తాకుతాయని సతీష్ పేర్కొన్నారు. స్వల్ప మెజార్టీతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెన్సెక్స్ కేవలం 150 నుంచి 200 పాయింట్లు పెరుగుతుందని, అదే ఫలితాలు భిన్నంగా ఉంటే 2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఎడల్విస్ ఫైనాన్షియల్ మేనేజింగ్ పార్టనర్ అంబరీష్ బాలిగ పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం వస్తే రానున్న 12-18 నెలల్లో నిఫ్టీ 8,700 వరకు పెరుగుతుందని, అదే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే సూచీలు 15-20% నష్టపోయి 3-6 నెలల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి దిశ తీసుకుంటుందనేది కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా. ఎన్నికల తర్వాత... సంవత్సరం రెండు రోజుల్లో 1999 6.05% 2004 -16.56% 2009 17.34% -
చెట్టినాడ్ చేతికి అంజనీ సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్‌ను తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ సిమెంట్ కొనుగోలు చేసింది. ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. సుమారు రూ.100 కోట్లకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లకు చెందిన 61.62% వాటాను చెట్టినాడ్‌కు విక్రయించడానికి మంగళవారం సమావేశమైన అంజనీ సిమెంట్స్ బోర్డు ఆమోదం తెలిపింది. మిగిలిన వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఓపెన్ ఆఫర్ ధర రూ.61.75 కాగా, రూ. 10 ముఖ విలువగల 47.89 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ బీఎస్ఈకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం రూ.29.52 కోట్లు కేటాయించింది. కె.వి.విష్ణురాజుకు చెందిన అంజనీ పోర్ట్లాండ్ సిమెం ట్ గత 9 నెలల్లో రూ.202 కోట్ల ఆదాయంపై రూ.5.24 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కంపెనీకి రూ.222 కోట్ల రుణ భారం ఉన్నట్లు తెలుస్తోంది. 1983లో స్థాపించిన అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్‌కి నల్లగొండ జిల్లాలో 1.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల్గిన యూనిట్ ఉంది. ఈ వార్తల నేపథ్యంలో అంజనీ పోర్ట్‌ల్యాండ్ షేరు 4% తగ్గి రూ.55.45 వద్ద ముగిసింది. -
పీటీసీ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.58 టార్గెట్ ధర: రూ.76 ఎందుకంటే: భారత్‌లో అగ్రశ్రేణి విద్యుత్ ట్రేడింగ్ కంపెనీ. భారీ విద్యుత్ ప్రాజెక్టులకు ఊతాన్నిచ్చే ఉద్దేశంతో 1999లో ఏర్పాటు చేశారు. రిబేట్/సర్‌చార్జీ ఆదాయం కారణంగా క్యూ3 ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం రూ.2,750 కోట్లకు, నికర లాభం రూ.91 కోట్లకు పెరిగాయి. గతేడాది చివరి నాటికి నగదు నిల్వలు రూ.800 కోట్లుగా ఉన్నాయి. రిబేట్/సర్‌చార్జీ ఆదాయం పెరుగుతుండడం, అమ్మకాల పరిమాణం వృద్ధి చెందుతుండడం, ఇతర ఆదాయం అధికంగా ఉండడం డిస్కమ్‌ల నుంచి నగదు వసూళ్లు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 57 శాతం వృద్ధితో రూ. 310 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. రాష్ట్రాల మధ్య విద్యుత్ ప్రసారానికి అనుమతించడం, కొత్త పవర్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించడం, అంతరాష్ట్ర గ్రిడ్ అనుసంధానానికి ఆటంకాలు తొలగుతుండడం వంటి కారణాల వల్ల కంపెనీ మార్కెట్ విస్తృతం అవుతోంది. రాష్ట్రాల విద్యుత్ బోర్డ్‌ల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, విద్యుత్ సంబంధిత నిబంధనలు మారే అవకాశలు, స్వల్పకాలిక మార్కెట్లో పోటీ పెరుగుతుండడం ప్రభా వం చూపించే అంశాలు.