ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు చేపడుతూ ఉంటే.. ఇప్పటినుంచీ సెప్టెంబర్‌వరకూ క్రమానుగత పద్ధతి(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-SIP)ను అనుసరించమంటున్నారు ఆశిష్ సోమయ్య. రుణ సెక్యూరిటీలు, ఈక్విటీలు.. ఏదైనాగానీ పెట్టుబడుల విషయంలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం ద్వారా రీబ్యాలన్స్ చేసుకోమని సూచిస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎండీ, సీఈవో ఆశిష్. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లపై కరోనా వైరస్ ప్రభావం, ప్రపంచ మార్కెట్లు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..
అంచనాలకు అందదు
సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లపై అంచనాలు వేయడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి మార్కెట్ల నడకను ఊహించడం అంత సులభమేమీకాదు. మార్కెట్లు ఎక్కడివరకూ పెరుగుతాయో లేదా పతనమవుతాయన్నది ఎవరి అంచనాలకూ అందదు. ఉదాహరణకు ఈ ఏడాది(2020) తొలి నాలుగు నెలలనే పరిగణిస్తే.. జనవరి 20న ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 12,430 వద్ద గరిష్టానికి చేరింది. ఆపై ఆటుపోట్లు చవిచూసి ఫిబ్రవరి 12కల్లా తిరిగి 12,300ను తాకింది. ఈ బాటలో మార్చి 5కల్లా 11,300కు నీరసించింది. తదుపరి ఒక్కసారిగా పతన బాట పట్టి మూడు వారాల్లోనే అంటే మార్చి 23కల్లా 7,583కు దిగజారింది. ఫిబ్రవరి గరిష్టం నుంచి 40 శాతం పడిపోయింది. చైనాలో తలెత్తిన కరోనా వైరస్ యూరోపియన్ దేశాలను ను వణికించడంతోపాటు అమెరికాలోనూ విస్తరించడం మొదలుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఇదీ తీరు
దేశీయంగా కరోనా వైరస్ అడుగు పెట్టిన వార్తలతో కేంద్ర ప్రభుత్వం మార్చి 23న లాక్‌డవున్ ప్రకటించింది. అప్పటికి దేశీయంగా నమోదైన కోవిడ్-19 కేసులు సుమారు 500. లాక్‌డవున్ కారణంగా పలు రంగాలు, కంపెనీలలో ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. అమ్మకాలు స్థంభించడంతో డిమాండ్ పడిపోయింది. అయినప్పటికీ మార్చి చివర్లో మార్కెట్లలో రికవరీ ప్రారంభమై ఏప్రిల్‌లో జోరందుకుంది. వెరసి కనిష్టం నుంచి మార్కెట్లు 20 శాతం జంప్‌చేశాయి. ఈ కాలంలో దేశీయంగా కరోనా వైరస్ సోకిన కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇది ఒక్క దేశీ మార్కెట్లకే పరిమితంకాలేదు. అమెరికాసహా యూరప్, ఆసియా దేశాల మార్కెట్లలోనూ ఈ ట్రెండ్ కనిపించింది.
ఎక్కడైనా..
2008లో అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రభావంతో ప్రపంచంలోని పలు దేశాల మార్కెట్లు 50-60 శాతం మధ్య కుప్పకూలాయి. ఇక 2020లోనూ ఇదే విధంగా 25-35 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఈ ఏడాది(2020) మార్చిలో కరోనా వైరస్‌ను నియంత్రించిన కొరియా, తైవాన్.. లేదా కోవిడ్-19 ముంచెత్తిన అమెరికా, యూరోపియన్ దేశాల మార్కెట్లన్నీ ఒకే రీతిన వెనకడుగు వేశాయి. ఇక నామమాత్ర కేసులు నమోదైనప్పటికీ దేశీ మార్కెట్లు సైతం 40 శాతం క్షీణించాయి.
సిప్ మేలు
మార్కెట్ల బాటమ్ లేదా పీక్‌ను అంచనా వేయడం కంటే అవకాశం లభించినప్పుడల్లా పెట్టుబడులు చేపట్టడం దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. తగినంత నిధుల లభ్యత ఉంటే విభిన్న పెట్టుబడి మార్గాలవైపు దృష్టిసారించవచ్చు. సరైన మ్యూచువల్ ఫండ్స్ లేదా భవిష్యత్‌లో అవకాశాలు పెంచుకోగల రంగాలను ఎంచుకోవలసి ఉంటుంది. ఇదే విధంగా మెరుగైన పనితీరు చూపగల ఫండ్ పథకాలు లేదా మార్కెట్ వాటాను పెంచుకోగల కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పోర్ట్‌ఫోలియోను పటిష్టపరచుకోవచ్చు.
భయాలు వద్దు
నిజానికి మార్కెట్లు పతన బాట పట్టినప్పుడు అధిక భయాలకు లోనుకావద్దు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారనో.. మార్కెట్లు మరింత పతనమవుతాయనో వెలువడే వార్తలకు అతిగా స్పందించవద్దంటున్నారు స్టాక్ నిపుణులు. మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పనిసరిగా పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవలసి ఉంటుందని తెలియజేస్తున్నారు. కోవిడ్-19 వంటి అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు వినియోగదారుల అవసరాలు, అభిరుచులలో మార్పులకు అవకాశముంటుంది. దీంతో భవిష్యత్‌లో పటిష్ట పనితీరు చూపగల రంగాలు, కంపెనీలవైపు దృష్టి సారించవలసి ఉంటుందని వివరిస్తున్నారు. మార్చిలో గ్లోబల్ మార్కెట్ల నుంచి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లగా.. దేశీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 8-9 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ మాత్రమే విక్రయించినట్లు ఆశిష్ పేర్కొంటున్నారు. ఆటుపోట్ల మార్కెట్లలో సిప్ విధానం ప్రయోజనకరమని తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment