డిజిటల్‌ గోల్డ్‌.. జిగేల్‌! | Digital gold accounts cross 80 million, more than twice demat accounts | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ గోల్డ్‌.. జిగేల్‌!

Published Fri, Apr 12 2019 4:33 AM | Last Updated on Fri, Apr 12 2019 4:59 AM

Digital gold accounts cross 80 million, more than twice demat accounts - Sakshi

న్యూఢిల్లీ: బంగారం డిజిటల్‌ రూపంలోనూ తళుక్కుమంటోంది. ఆన్‌లైన్‌లో డిజిటల్‌ గోల్డ్‌ కొనేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుదలే దీన్ని తెలియజేస్తోంది. 2012–13లో బంగారం డిజిటల్‌ ఖాతాల ఆరంభం నుంచి చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్లకు పైగా ఖాతాలు ఆరంభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్‌ రూపంలో బంగారాన్ని ఆన్‌లైన్‌లో ఎన్నో వేదికలు ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిల్లో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి.

కొనుగోలు చేసిన బంగారాన్ని ఆయా సంస్థల వద్దే స్టోర్‌ చేసుకునే అవకాశం లేదంటే భౌతిక రూపంలో డెలివరీ తీసుకునే సదుపాయాలు కూడా వినియోగదారులను ఆకర్షింపజేస్తున్నాయి. సేఫ్‌గోల్డ్, డిజిటల్‌ గోల్డ్‌ వంటి సంస్థలూ ఈ సేవలను అందిస్తున్నాయి. ఆగ్మంట్‌ అనే సంస్థ రిఫైనరీల వద్ద స్వచ్ఛమైన బంగారం నుంచి దాన్ని మార్కెటింగ్‌ వరకు సమగ్ర సేవల్లో ఉన్న కంపెనీ. ఈ సంస్థ ‘డిజిగోల్డ్‌’ పేరుతో 2012 నుంచి డిజిటల్‌ గోల్డ్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇక మోతీలాల్‌ ఓస్వాల్‌ సైతం ఈ సేవల్లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ సేవల్లోకి గూగుల్‌పే సైతం అడుగు పెట్టడం ఈ మార్కెట్‌ భారీగా విస్తరించేందుకు చేయూతనివ్వగలదని పరిశ్రమకు చెందిన ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

పెరుగుతున్న డిమాండ్‌...
వివిధ రకాల వేదికలుగా వార్షికంగా తొమ్మిది టన్నుల వరకు డిజిటల్‌ గోల్డ్‌ విక్రయాలు జరుగుతున్నాయని పరిశ్రమ అంచనా. ఇందులో సుమారు మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు దారులు ప్రత్యక్ష రూపంలో డెలివరీ తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఆన్‌లైన్‌ వేదికల్లో బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్ల విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతుండడం గమనార్హం. డిజిటల్‌ గోల్డ్‌ కొనే వారు పెరిగిపోతుండడం, దీనికి తోడు ఆన్‌లైన్‌లోనే ఆభరణాలు కొనే ధోరణి విస్తరిస్తుండడం సంప్రదాయ జ్యుయలరీ వర్తకులను ఆందోళనకు గురి చేస్తోంది.

మరీ ముఖ్యంగా ఆన్‌లైన్‌లో డిజిటల్‌ గోల్డ్‌కు ఆసక్తి చూపించడానికి నాణ్యమైన, పారదర్శక సేవల ప్రాముఖ్యాన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. కొన్న డిజిటల్‌ బంగారాన్ని ఉచితంగా స్టోర్‌ చేసుకునే సదుపాయం, కోరినప్పుడు బంగారం రూపంలోనే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే సేవలను అవి ఆఫర్‌ చేస్తున్నాయి. దీనికితోడు డిజిటల్‌ గోల్డ్‌ను బంగారు ఆభరణాల కొనుగోలుతో మార్చుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి.  

ఆభరణాలుగా డిజిటల్‌ గోల్డ్‌
ఆగ్మంట్‌ సంస్థకు సొంతంగా గోల్డ్‌ రిఫైనరీ (బంగారం శుద్ధి కర్మాగారం) కూడా ఉంది. డెలివరీ కోరుకుంటే బంగారాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇస్తోంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలు కొనుగోలు చేసిన బంగారాన్ని తమ వేదికలుగానే స్టోర్‌ చేసుకునేందుకు గాను ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. సేఫ్‌ గోల్డ్, ఆగ్మంట్‌ సంస్థలు ఐడీబీఐ ట్రస్టీషిప్‌ సర్వీసెస్‌తో ఇందుకోసం టై అప్‌ అయ్యాయి. డిజిటల్‌ ఖాతాల్లోని బంగారాన్ని ఆభరణాలుగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని క్యారట్‌లేన్, క్యాండిర్‌ (కల్యాణ్‌ జ్యుయలర్స్‌ ఆన్‌లైన్‌ సబ్సిడరీలు) సౌజన్యంతో అందిస్తున్నట్టు డిజిటల్‌ గోల్డ్‌ ఇండియా ఎండీ గౌరవ్‌ మాథుర్‌ తెలిపారు. సేఫ్‌గోల్డ్‌ మాతృ సంస్థే డిజిటల్‌గోల్డ్‌. వినియోగదారులకు మరిన్ని ఎంపికల అవకాశాలను అందించేందుకు జ్యుయలర్స్‌ నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి పెట్టినట్టు మాథుర్‌ చెప్పారు.

పేటీఎం, గూగుల్‌ పే లేదా ఫోన్‌పే సంస్థల వేదికలపై కొనుగోలు చేసిన మొత్తాన్ని బంగారం రూపంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా సంస్థ తమ వోల్ట్‌లలో భద్రంగా ఉంచేస్తుంది. కోరితే డెలివరీ కూడా చేస్తుంది. గూగుల్‌ పే రాకతో డిజిటల్‌ ఖాతాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నామని ఓ కంపెనీ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. ఆగ్మంట్‌ సంస్థ బంగారం కాయిన్లను సైతం డెలివరీ చేస్తోంది. ‘‘వేల సంఖ్యలో జ్యూయలర్లను మా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలన్నది ప్రణాళిక. దీంతో ఆగ్మంట్‌ కస్టమర్లు తమ బంగారాన్ని ఆభరణాలతో మార్పిడి చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్, వ్యాలెట్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఆగ్మంట్‌ గోల్డ్‌ కొనే అవకాశం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం’’ అని ఆగ్మంట్‌ డైరెక్టర్‌ సచిన్‌ కొఠారి తెలిపారు.

► వ్యాలెట్ల నుంచి యాప్స్‌ నుంచి బంగారం కొనుగోలు చేసుకోవడాన్నే డిజిటల్‌ గోల్డ్‌గా పేర్కొంటారు.

► జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మంది డెలివరీ తీసుకోవడం లేదు.  

► డెలివరీ తీసుకుంటున్న వారిలోనూ ఎక్కువ మంది కాయిన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

► ఈ ధోరణి కాస్తా భవిష్యత్తులో బంగారం ఆభరణాలను డెలివరీ తీసుకోవడానికి మారనుందని అంచనా.

► కనీసం రూ.100 నుంచి కూడా పేటీఎం, సేఫ్‌గోల్డ్‌ వేదికల్లో బంగారం కొనుక్కోవచ్చు.

► ప్రస్తుతం రోజువారీగా జరుగుతున్న డిజిటల్‌ గోల్డ్‌ లావాదేవీల పరిమాణం 8–9 కిలోలు.


గూగుల్‌ పే ద్వారా పసిడి కొనుగోళ్లు
ఎంఎంటీసీ–పీఏఎంపీతో జట్టు
న్యూఢిల్లీ: చెల్లింపుల యాప్‌ గూగుల్‌ పే ద్వారా బంగారం కొనుగోలు, అమ్మకం లావాదేవీలు కూడా జరిపే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ తెలిపింది. ఇందుకోసం బులియన్‌ రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. గూగుల్‌ పే ద్వారా కొనుగోలు చేసే బంగారాన్ని యూజర్ల సూచనల మేరకు ఎంఎంటీసీ–పీఏఎంపీ సురక్షితమైన వోల్ట్‌లలో భద్రపరుస్తుందని గూగుల్‌ తెలిపింది. ఈ బంగారాన్ని లేటెస్ట్‌ ధర ప్రకారం ఎప్పుడైనా యూజర్లు కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయొచ్చని వివరించింది.

గూగుల్‌ పే యాప్‌లో ఎప్పటికప్పుడు తాజా ధరలు చూసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. అసలు గూగుల్‌ పే యాప్‌.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు తగిన అనుమతులు తీసుకుందా, లేదా అన్న విషయంపై వివరణనివ్వాలంటూ నియంత్రణ సంస్థ ఆర్‌బీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గూగుల్‌ కొత్తగా మరో ఫీచర్‌ ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ సంస్థ కేవలం చెల్లింపులకు సంబంధించి టెక్నాలజీపరమైన సేవలు మాత్రమే అందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్సు అవసరం లేదని గూగుల్‌ వివరణనిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement