డిజిటల్‌ బంగారం.. భద్రమేనా? | Sakshi Special Story About Digital Gold Investment Platforms | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ బంగారం.. భద్రమేనా?

Published Mon, Feb 22 2021 4:54 AM | Last Updated on Mon, Feb 22 2021 12:23 PM

Sakshi Special Story About Digital Gold Investment Platforms

బంగారం అంటే ఆభరణమే కానక్కర్లేదు. పెట్టుబడి సాధనంగా బంగారానికి మన దేశంలో ఆదరణ పెరిగిపోతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో బంగారం ధరల ర్యాలీ.. ఇన్వెస్టర్లలో కొత్త విశ్వాసాన్ని చిగురింపజేసింది. 3,000 సంవత్సరాల నుంచి బంగారానికి విలువైన లోహంగా గుర్తింపు ఉంది. మన దేశంలో బంగారం ఆభరణాలు కుటుంబ ఆస్తిలో భాగం. దీనికి తోడు పెట్టుబడి సాధనంగానూ డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది కరోనా మహమ్మారి సమయంలోనూ బంగారంలో డిజిటల్‌ పెట్టుబడులు కొనసాగడం దీన్నే సూచిస్తోంది. డిజిటల్‌ గోల్డ్‌తోపాటు  గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, బంగారంపై ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడులకు అందుబాటులో ఉన్న ‘బంగారం’ సాధనాలపై వివరాలను అందించే çసాక్షి ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం ఇది..

సహజంగా బంగారాన్ని భౌతిక రూపంలో (ఆభరణాలు, కాయిన్లు) కొనుగోలు చేసుకుని భద్రపరుచుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనికితోడు సార్వభౌమ బంగారం బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్‌ గోల్డ్‌ కూడా ఆదరణ పొందుతోంది. ఇటీవలి కాలంలో బంగారానికి పెట్టుబడి దృష్ట్యా డిమాండ్‌ ఎన్నో రెట్లు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. డిజిటల్‌ గోల్డ్‌కు డిమాండ్‌ పెరుగుతుండడం ఆసక్తికరం.  

మరి డిజిటల్‌ గోల్డ్‌ సంగతేంటి..?
ఆభరణాల కోసమైతే ఫర్వాలేదు. అలా కాకుండా పెట్టుబడి కోణంలో భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వాటి స్వచ్ఛత ఎంతన్నది గుర్తించడం కష్టం. భద్రంగా దాచుకోవడం కూడా సమస్యే. అవసరమొచ్చి విక్రయించాలనుకుంటే ఆ బంగారానికి ఎంత విలువ కడతారన్నది చెప్పలేము. కానీ, డిజిటల్‌ గోల్డ్‌కు ఇటువంటి సమస్యలేవీ లేవు. ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. బీమా సదుపాయం కలిగిన ఖజానాల్లో వీటిని భౌతిక రూపంలో విక్రయదారే భద్రపరుస్తారు. ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటే చాలు సులభంగా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసుకోవచ్చు.  

వేదికలు...
మన దేశంలో డిజిటల్‌ గోల్డ్‌ను ప్రధానంగా మూడు సంస్థలు అందిస్తున్నాయి. అవి ఆగ్మంట్‌ గోల్డ్, ఎమ్‌ఎమ్‌టీసీ–పీఏఎమ్‌పీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డిజిటల్‌ గోల్డ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (సేఫ్‌ గోల్డ్‌ బ్రాండ్‌పై). వీటి తరఫున గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎమ్, గ్రోవ్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్, అమెజాన్‌ ఇండియా తదితర సంస్థలు తమ వేదికలపై డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు అవకాశాలను కల్పిస్తున్నాయి. అంటే ఈ వేదికలపై కొనుగోళ్లు, అమ్మకాలు పైన చెప్పుకున్న మూడు సంస్థల తరఫున నడుస్తుంటాయి. ఆర్డర్‌ చేసిన తర్వాత.. అంత మొత్తానికి సరిపడా బంగారాన్ని ఈ సంస్థలు భౌతిక రూపంలో కొనుగోలు చేసి ఇన్వెస్టర్‌ పేరు మీద ఖజానాల్లో భద్రపరుస్తాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం, మొబైల్‌ నుంచే సు లభంగా పెట్టుబడులకు వీలుండడం డిజిటల్‌ గోల్డ్‌ పట్ల ఇన్వెస్టర్లను ఆకర్షించే అంశాలని చెప్పుకోవాలి.  

డిజిటల్‌ బంగారంలో ట్రేడింగ్‌
గ్రోవ్, పేటీఎమ్, గూగుల్‌ పే, ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ లేదా మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూ రిటీస్‌ మరే ఇతర సంస్థ అయినా కావచ్చు.. ఆయా ప్లాట్‌ఫామ్‌లో యూజర్‌ అయిఉండాలి. కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. డిజిటల్‌ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవాలనుకుంటే.. గ్రాములు లేదా రూపాయి వ్యాల్యూలో కొనుగోలు చేసుకోవచ్చు. పేమెంట్‌ విధానాన్ని ఎంచుకుని చెల్లింపులు చేస్తే సరిపోతుంది. బ్యాంకు ఖాతా, కార్డులు లేదా వ్యాలెట్‌ నుంచి అయినా చెల్లింపులు చేయవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా మీ బంగారాన్ని విక్రయించుకోవచ్చు.  

స్వచ్ఛంగా.. భౌతికంగా అందుకోవచ్చు..
ఒకవేళ విక్రయించుకునే ఉద్దేశం లేకుండా.. భౌతిక రూపంలో డెలివరీ తీసుకోవాలనే అనుకుంటే ఆ సదుపాయం కూడా ఈ వేదికల రూపంలో అందుబాటులో ఉంది. కాయిన్లు లేదా బులియన్‌ (బ్రిక్‌ ) రూపంలో మీ ఇంటి వద్దకే డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. డెలివరీ చార్జీలను కస్టమరే భరించాలి.

స్వచ్ఛత/చార్జీలు
ఎమ్‌ఎమ్‌టీసీ–పీఏఎమ్‌పీ, సేఫ్‌గోల్డ్‌ రెండూ 24 క్యారట్‌ బంగారాన్ని ఆఫర్‌ చేస్తున్నప్పటికీ.. స్వచ్ఛత విషయానికొస్తే ఎమ్‌ఎమ్‌టీసీ–పీఏఎమ్‌పీ 99.9 శాతం ప్యూరిటీ బంగారాన్ని ఇస్తుండగా.. సేఫ్‌గోల్డ్‌ మాత్రం 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఎమ్‌ఎమ్‌టీసీ–పీఏఎమ్‌పీ నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తే నిల్వ కోసం ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఐదేళ్ల వరకు ఉచితంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని బంగారం కాయిన్లలోకి మార్చి డెలివరీ తీసుకోవాలి లేదా విక్రయించడం తప్పనిసరి. అకౌంట్‌ అచేతనంగా మారకుండా ఉండాలంటే ఆరు నెలలకు ఒక లావాదేవీ అయినా నిర్వహించాలి. ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌పై సేఫ్‌గోల్డ్‌ సంస్థ అందించే బంగారాన్ని కొనుగోలు చేస్తే మాత్రం స్టోరేజీ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. మొదటి రెండేళ్లకు ఎటువంటి చార్జీల్లేవు. మొదటిసారి కొనుగోలు చేసిన తేదీ నుంచి సరిగ్గా రెండేళ్లకు బంగారం 2 గ్రాములు అంతకంటే తక్కువే ఉంటే ప్రతీ నెలా విలువపై 0.05 శాతం చార్జీ కింద చెల్లించాలి. గోల్డ్‌ బ్యాలన్స్‌ నుంచి దీన్ని ప్రతీ నెలా మినహాయించుకుంటారు. గరిష్టంగా ఏడేళ్ల వరకు డిజిటల్‌ రూపంలో గోల్డ్‌ను సేఫ్‌గోల్డ్‌ వద్ద కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత డెలివరీ తీసుకోవడం లేదా విక్రయించడం చేయాలి. డిజిటల్‌ రూపంలో ఉంచుకోవాలనుకుంటే విక్రయించి మర్నాడు మళ్లీ కొనుగోలు చేయడం ఒక మార్గం.   

పెట్టుబడికి డిజిటల్‌ గోల్డ్‌తో పోలిస్తే మెరుగైన సాధనాలు ఉన్నాయి.  బంగారం సౌర్వభౌమ బాండ్లను పరిశీలించొచ్చు. ఇందులో ప్రవేశ సమయంలో బంగారం మార్కెట్‌ ధర ఆధారంగా కేటాయింపులు చేస్తారు. గడువు తీరిన తర్వాత కూడా మార్కెట్‌ ధర ఆధారంగానే చెల్లింపులు చేస్తారు. దీనికితోడు వార్షికంగా 2.5% వడ్డీని చెల్లిస్తారు. కాకపోతే లాభాలపై పన్ను లేకపోవడం ఆకర్షణీయం. గోల్డ్‌ ఈటీఎఫ్‌లో అయితే లిక్విడిటీ పరంగా సమస్యఉండదు. క్రయ, విక్రయాలు అన్ని ట్రేడింగ్‌ రోజుల్లోనూ చేసుకోవచ్చు.

ఫోన్‌పే
► ఫోన్‌పే సంస్థ అటు సేఫ్‌గోల్డ్‌ నుంచి.. ఇటు ఎమ్‌ఎమ్‌టీసీ–పీఏఎమ్‌పీ వేదికల నుంచి డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు అవకాశాలను అందిస్తోంది. అప్పుడు ప్రతీ లాకర్‌ను విడివిడిగా నిర్వహిస్తారు.  
► రూపాయి లేదా 0.001 గ్రాము నుంచి బంగారాన్ని కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు.  
► కనీసం రూ.5 గోల్డ్‌  కలిగి ఉండాలి. ఒకే రోజు కొనుగోలు చేసిన డిజిటల్‌ గోల్డ్‌ను అదే రోజు అమ్మలేరు.  
► యాప్‌లో కనిపించే బంగారం ధరలో కస్టమ్స్‌ డ్యూటీలు, పన్నులు కూడా కలిసే ఉంటాయి.  
► గ్రాము పరిమాణం నుంచి కాయిన్‌ లేదా పెండెంట్‌ రూపంలో డెలివరీ తీసుకోవచ్చు.


పేటీఎమ్‌
పేటీఎమ్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపాయి నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల విలువకు సరిపడా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసుకోవచ్చు. గ్రాముల్లో అయితే 0.0005 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి ఒక కస్టమర్‌కు 50 గ్రాములు. ఇంతే పరిమాణాల్లో విక్రయించుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత కూడా కొనుగోలు చేసిన బంగారాన్ని నిల్వ చేసుకో వాలంటే అందుకు చార్జీ చెల్లించుకోవాలి. బంగారాన్ని విక్రయించే సమయంలో బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో విక్రయించిన 72 గంటల్లో ఆ మొత్తం ఇన్వెస్టర్‌ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేసిన బంగారాన్ని మీకు నచ్చిన వారికి కానుకగా ఇచ్చుకునే సదుపాయం కూడా ఉంది. పేటీఎం డిజిటల్‌ గోల్డ్‌ను కాయిన్‌గా మార్చుకోవాలంటే కనీస బంగారం బ్యాలెన్స్‌ కలిగి ఉండాలి. ఎమ్‌ఎమ్‌టీసీ–పీఏఎమ్‌పీ కాయిన్‌ అయితే 0.5 గ్రాము నుంచి ప్రారంభమవుతుంది. ఆగ్మంట్‌ కాయిన్లు 0.1 గ్రాము నుంచి లభిస్తాయి. పేటీఎమ్‌ ఇటీవలే కల్యాణ్‌ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్‌ తదితర సంస్థలతోనూ టైఅప్‌ అయింది. దీంతో పేటీఎమ్‌ యూజర్లు తమ డిజిటల్‌ గోల్డ్‌ను కల్యాణ్‌ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్‌ సంస్థల్లో ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు.

గోల్డ్‌ రష్‌
స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన.. ‘గోల్డ్‌రష్‌ఆన్‌లైన్‌ డాట్‌ కో డాట్‌ ఇన్‌’ పోర్టల్‌ నుంచి డిజిటల్‌ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు అకౌంట్‌ను ప్రారంభించి, కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ పోర్టల్‌ నుంచి పొందొచ్చు. రిజిస్ట్రేషన్‌ ఉచితమే. కనీసం రూ.100 నుంచి బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. రూ.50,000 మించితే పాన్‌ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే కనీసం ఒక గ్రాము అయినా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌గా కొనుగోలు చేసిన బంగారాన్ని భద్రంగా నిల్వ చేస్తారు. బంగారం కొనుగోలుపై పరిమితి లేకపోవడం ఆకర్షణీయం.

డిజిటల్‌ గోల్డ్‌ సానుకూలతలు
► భౌతిక రూపంలో పసిడిని ఒక్క రూపాయి నుంచే కొనుగోలు చేసుకునే సదుపాయం.  
► ఆన్‌లైన్‌లో రుణాలకు తనఖా పెట్టొచ్చు.
► లావాదేవీలన్నీ 24 క్యారట్‌‡ స్వచ్ఛత కలిగినవి. సేఫ్‌ గోల్డ్‌ అయితే 99.5 శాతం స్వచ్ఛత బంగారాన్ని ఆఫర్‌ చేస్తుండగా, ఎమ్‌ఎమ్‌టీసీ పీఏఎమ్‌పీ అయితే 99.9 స్వచ్ఛతతో అందిస్తున్నాయి.  
► కొన్న పసిడికి బీమా ఉంటుంది.
► డిజిటల్‌ గోల్డ్‌ను ఆభరణాలు, కాయిన్లు, బులియన్‌తో మార్పిడి చేసుకోవచ్చు.  
► పెట్టుబడి కాల వ్యవధి తర్వాత బంగారాన్ని భౌతిక రూపంలో డెలివరీ అందుకోవచ్చు.  


ప్రతికూలతలు
► చాలా ప్లాట్‌ఫామ్‌ల్లో డిజిటల్‌ గోల్డ్‌ కొను గోలు ఒక కస్టమర్‌కు రూ.2లక్షల పరిమితిగా అమల్లో ఉంది. మరింత అధికంగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలంటే పూర్తి కేవైసీ తప్పనిసరి.   
► నిర్ణీత కాలం వరకే బంగారం నిల్వ సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తూ, ఆ తర్వాత డెలివరీ తీసుకోవాలని సంస్థలు కోరుతున్నాయి. లేదంటే విక్రయించాల్సి రావచ్చు.   కొనసాగిస్తే అదనపు చార్జీలు ఉంటాయి.
► డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలుపైనా 3% జీఎస్‌టీని చెల్లించాలి. ఉదాహరణకు రూ.1,000తో డిజిటల్‌ గోల్డ్‌కు ఆర్డర్‌ చేస్తే రూ.970విలువకే బంగారం పొందగలరు. దీనికితోడు ఇతర చార్జీలు కూడా ఉంటాయి.  
► స్టోరేజీ చార్జీలు, బీమా, ట్రస్టీ ఫీజుల రూపంలో సంస్థలు 2–3 శాతం మేర చార్జీల కింద రాబట్టుకుంటున్నాయి.  
► బంగారం డెలివరీ తీసుకోవాలంటే డెలివరీ చార్జీలు, కాయిన్లుగా అందుకోవాలంటే తయారీ చార్జీలను భరించాల్సి ఉంటుంది.


నియంత్రణ ఎవరిది?
డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు, అమ్మకం ఎంతో సులభంగా ఉన్నప్పటికీ దీనిపై నియంత్రణ ఎవరిది? అన్న ప్రశ్న కచ్చితంగా ఇన్వెస్టర్లకు వస్తుంది. కొనుగోలు చేసిన విలువకు సరిపడా బంగారాన్ని మూడో పక్షానికి చెందిన ఖజానాల్లో భద్రపరుస్తారు. ఈ బాధ్యతలను చూసేందుకు ట్రస్టీలు ఉంటారు. కానీ, ఆచరణలో ఇలా నిల్వ చేస్తున్నారా? లేదా? అని చూసే యంత్రాంగం ఇప్పటికైతే లేదు. స్టాట్యుటరీ ఆడిట్‌లు నిర్వహించినప్పటికీ.. డిజిటల్‌గోల్డ్‌ను అందిస్తున్న సంస్థలకే నివేదికలను సమర్పించడం జరుగుతుంది. కానీ, ఇతర బంగారం డిజిటల్‌ సాధనాలు పలు నియంత్రణ సంస్థల కింద పనిచేస్తున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ ఉంటుంది. అదే సౌర్వభౌమ బంగారం బాండ్లపై ఆర్‌బీఐ పర్యవేక్షణ ఉంటుంది. నియంత్రణ సంస్థ ఉంటే తగిన తనిఖీలు, పర్యవేక్షణ ఉంటుందని.. నియంత్రణ సంస్థ లేని పక్షంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల విషయంలో రాజీకి అవకాశం లేకపోలేదని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ చిరాగ్‌ మెహతా అభిప్రాయపడ్డారు. కనుక డిజిటల్‌గోల్డ్‌ను కొనుగోలు చేసుకునే వారు బీమా సదుపాయం ఉందో, లేదో విచారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement