ETFs
-
ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఫండ్స్ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది. జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్పీ, మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ, మిరే అస్సెట్ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ అమర్ రాను తెలిపారు. ప్యాసివ్ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్ ఇండెక్స్ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 176 కొత్త పథకాలు.. 2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు చెప్పారు. -
నూతన పథకాల వరద
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 176 నూతన పథకాలను (ఎన్ఎఫ్వో) ఆవిష్కరిం చాయి. వీటి రూపంలో రూ.1.07,896 కోట్లను ఇన్వెస్టర్ల నుంచి అవి సమీకరించాయి. దాదాపు అన్ని కేటగిరీల్లో ఏఎంసీలు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించాయి. 2020–21 సంవత్సరంలో ఏఎంసీలు 84 కొత్త పథకాల రూపంలో రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాల ఆవిష్కరణ రెట్టింపు కాగా.. సమీకరించిన మొత్తం ఒకటిన్నర రెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు భిన్నం.. సాధారణంగా మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు, బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఏఎంసీలు కొత్త పథకాలు తీసుకొస్తుంటాయి. దీనివల్ల నిధుల సమీకరణ వాటికి సులభంగా ఉంటుంది. 2020 మార్కెట్ క్రాష్ తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగడం.. ఏఎంసీలకు కలిసొచ్చింది. దీంతో అవి పెద్ద మొత్తంలో పథకాలను తీసుకొచ్చాయి. మరోవైపు ఇన్వెస్టర్లకు సానుకూలించే కొన్ని చర్యలను కూడా సెబీ అమల్లోకి తీసుకురావడం గురించి చెప్పుకోవాలి. ఎగ్జిట్ లోడ్‌ను తీసేసింది. ఎక్స్పెన్స్ రేషియోపై పరిమితులు విధించింది. పథకాల విభాగాల్లో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఫ్లెక్సీక్యాప్ తదితర కొత్త విభాగాలను ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే చర్యలను కూడా అమలు చేసింది. ఇవి కూడా అనుకూలించినట్టు చెప్పుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడుల విధానం, సెబీ, యాంఫి తీసుకున్న చర్యలు విభిన్న విభాగాల్లో పెద్ద ఎత్తున ఎన్‌ఎఫ్‌వోల ప్రారంభానికి దారితీసినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి చెప్పారు. ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎక్కువ ఎక్కువగా ఇండెక్స్, ఈటీఎఫ్ విభాగాల్లో ఎన్‌ఎఫ్‌వోలు వచ్చాయి. ఇండెక్స్ ఫండ్ విభాగంలో 49 కొత్త పథకాలను ఏఎంసీలు ప్రారంభించాయి. ఇవి రూ.10,629 కోట్లు సమీకరించాయి. ఈటీఎఫ్ విభాగంలో 34 ఎన్‌ఎఫ్‌వోలు రూ.7,619 కోట్లు, ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్ల విభాగంలో 32 కొత్త పథకాలు రూ.5,751 కోట్లు సమీకరించాయి. విదేశీ ఫండ్స్ రూపంలో రూ.5,218 కోట్లు, 11 సెక్టోరల్ లేదా థీమ్యాటిక్ ఫండ్స్ రూపంలో రూ.9,127 కోట్లు ఇన్వెస్టర్ల నుంచి ఆకర్షించాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటి వరకు నాలుగు ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రాగా, ఇవి రూ.3,307 కోట్లు సమీకరించాయి. మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుండడం, వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు, స్థిరీకరణ చూస్తూనే ఉన్నాం. దీనికితోడు ఇంటి నుంచి పనికి బదులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులతో ఇక మీదట ఎన్‌ఎఫ్‌వోలకు ఆదరణ తగ్గొచ్చని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్ఎంపీలు) విభాగంలో పథకాల ఆవిష్కరణ ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. -
పోర్ట్‌ఫోలియో వైవిధ్యానికి ఈటీఎఫ్‌లు
హెల్త్‌కేర్, బ్యాంకింగ్, వినియోగం, టెక్నాలజీ మొదలైనవన్నీ కచ్చితంగా అవసరమైనవే కాబట్టి .. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఈ రంగాలు వృద్ధి బాటలోనే ఉంటాయి. కాబట్టి ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకు కాస్త భద్రతతో పాటు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ వృద్ధి కూడా చెందుతుందని భావించవచ్చు. అయితే, ఆయా రంగాల్లో మెరుగైన కంపెనీలను వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం కష్టమైన ప్రక్రియే. ఇక్కడే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సాధనాలైన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అక్కరకొస్తాయి. నిర్దిష్ట సూచీపై ఆధారితమై ఉండే ఈటీఎఫ్‌లు.. షేర్ల ఎంపికలో రిస్కులను తగ్గించడంతో పాటు వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా తోడ్పడతాయి. ఇవి ఎక్సే్చంజీలో ట్రేడవుతాయి కాబట్టి సులభంగానే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అందుకే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ థీమ్‌లు, రంగాల ఆధారిత సూచీలు, ఈటీఎఫ్‌ల గురించి అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక కథనం. ► వినియోగం: ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్, ఆటో, టెలికం, హోటల్స్, మీడియా.. వినోదం, కన్జూమర్ గూడ్స్ .. సర్వీసులు, టెక్స్టైల్స్ వంటి వాటిపై ఖర్చు చేసే ధోరణులు కూడా పెరుగుతుంటుంది. మార్కెట్ క్యాప్ పరంగా భారీవైన 30 వినియోగ ఉత్పత్తుల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ సూచీ ద్వారా అవకాశం దొరుకుతుంది. ► హెల్త్‌కేర్: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, ఔషధాల తయారీ సంస్థలు, పరిశోధన.. అభివృద్ధి సంస్థలు మొదలైనవి హెల్త్‌కేర్ రంగం కిందికి వస్తాయి. ఇలాంటి 20 బడా హెల్త్‌కేర్ ఆధారిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ సహాయపడుతుంది. ► టెక్నాలజీ: క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి టెక్నాలజీ రంగాన్ని నడిపిస్తున్నాయి. సమీప, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో దాదాపు ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ద్వారా 10 పెద్ద ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ► బ్యాంకింగ్: ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకింగ్ రంగంతో ముడిపడే ఉంటాయి. ఇంతటి కీలకమైన బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సహాయకరంగా ఉంటుంది. ఈ సూచీలో ప్రధానంగా 95.7 శాతం వాటా లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీలదే ఉంటోంది. ► బంగారం: సెంటిమెంటుపరంగానే కాకుండా ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా కూడా బంగారానికి ఉన్న ప్రాధాన్యతను వేరే చెప్పనక్కర్లేదు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌లో ఇది ఎంతో ప్రత్యేకం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పసిడిలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉపయోగపడతాయి. దొంగల భయం, స్టోరేజీ, ప్యూరిటీ మొదలైన వాటి గురించి ఆందోళన పడే పరిస్థితి ఉండదు. ► ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్): ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్‌కం .. రెండు సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక మార్గం. ఇందులో వ్యక్తిగత ఇన్వెస్టరు.. దేశీ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలకు తగ్గ విధంగా రాబడులు అందించే దిశగా.. ఈ దేశీ ఫండ్ ఆ డబ్బును ఇతర దేశీయ లేదా అంతర్జాతీయ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ఈక్విటీ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లలోనూ పెట్టుబడుల కారణంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు ఆస్కారం ఉంటుంది. ఈటీఎఫ్‌లతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు స్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి భద్రత ఉంటుంది. తక్కువ పెట్టుబడి వ్యయాలతో.. మార్కెట్లలో సత్వరం ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అవసరాలు తీరడం తో పాటు ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే భవిష్యత్‌లో మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలు కాగలదు. అలాగే, పన్నుపరంగా చూసినా ఈటీఎఫ్‌లు ప్రయోజనకరంగానే ఉంటాయి. – అశ్విన్ పట్ని, ప్రోడక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ విభాగం హెడ్, యాక్సిస్ ఏఎంసీ -
క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త! బాంబే స్టాక్ ఎక్సేంజీ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్‌చెయిన్ ఐఎఫ్ఎస్సీ, బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ) అంతర్జాతీయ విభాగం ఇండియా ఐఎన్ఎక్స్ చేతులు కలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. ఈటీఎఫ్‌లు, డిస్కౌంట్ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్‌చెయిన్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చెయిన్ ఐఎఫ్ఎస్సీ సీఈవో కృష్ణ మోహన్ మీనవల్లి తెలిపారు. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
బంగారం ధరలు మరింత తగ్గుతాయా?!
న్యూఢిల్లీ: నేరుగా బంగారాన్ని కొనుగోలు చేయడం కాకుండా.. పెట్టుబడుల కోణంలో సౌర్వభౌమ బంగారం బాండ్లు(ఎస్జీబీ), బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసే ధోరణి విస్తృతమవుతోంది. ఈ ఏడాది ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లను పరిశీలిస్తే ఇదే తెలుస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఎస్జీబీ ఇష్యూల రూపంలో రూ.16,049 కోట్ల నిధులను సమీకరించింది. అంటే 32.4 టన్నులకు సమానమైన ఎస్జీబీలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. తదుపరి ఎస్జీబీ విక్రయం ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఉండనుంది. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లను కూడా కలిపి చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46 టన్నుల మేర పేపర్ బంగారం (పత్రాల రూపంలో) కొనుగోళ్లు నమోదయ్యాయి. భౌతికంగా పెట్టుబడి కోణంలో కొనుగోలు చేసే బంగారం ఇప్పటికీ పెద్ద మొత్తంలోనే ఉంటోంది. 2020–21 మొత్తం మీద 135 టన్నుల మేర బంగారం ఈ రూపంలో కొనుగోలుదారులను చేరొచ్చని అంచనా. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి భౌతిక బంగారంలో 102 టన్నుల మేర కొనుగోళ్లు జరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,062 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.6,062 కోట్ల మేర (12.9 టన్నులు) పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక పెరగడం వరుసగా ఇది రెండో ఆర్థిక సంవత్సరం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం మీద 14 టన్నుల మేర పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వస్తాయని అంచనా. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) డేటా ప్రకారం ఈటీఎఫ్‌లు పేపర్గోల్డ్ కిందకే వస్తాయి. ‘‘ఎస్‌జీబీలు ఇప్పుడు బంగారం పెట్టుబడుల్లో ప్రధాన సాధనంగా అవతరించాయి. బంగారంలో పెట్టుబడుల ప్రాధాన్యతను కరోనా మహమ్మారి మరోసారి తెరముందుకు తీసుకొచ్చింది. లాక్డౌన్ల వల్ల చాలా మంది బంగారం పెట్టుబడుల కోసం పేపర్ సాధనాలను ఆశ్రయించారు. ఇక ముందూ ఎస్జీబీలకు డిమాండ్ బలంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాము’’ అని మెటల్ ఫోకస్ ప్రధాన సలహాదారు చిరాగ్సేత్ తెలిపారు. ఈ నెలలో ఎస్‌జీబీల కొనుగోళ్లు 3.23 టన్నుల మేర నమోదయ్యాయి. గతేడాది ఆగస్ట్ ఎస్జీబీ ఇష్యూలో 6.35 టన్నుల బంగారం బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది. ఆ తర్వాత అత్యధిక కొనుగోళ్లు ఈ నెల్లోనే (మార్చి1–5) నమోదయ్యాయి. ఎస్జీబీ పథకం 2015 నవంబర్‌లో ప్రారంభమైన తర్వాత.. 32.4 టన్నులతో అత్యధిక కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21)లోనే నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా మార్చిలో ఎక్కు వ కొనుగోళ్లకు కారణం.. పసిడి ధరలు దిగిరా వడం ఒక కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. ధరలు మరింత తగ్గుతాయా? బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండడం వ్యాల్యూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండడం బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆందోళనలకు కారణమవుతోందని పేర్కొన్నారు. ‘‘బంగారం ఎన్నో రిస్క్‌లను ఎదుర్కొంటోంది. బిట్‌కాయిన్‌కు ప్రాచుర్యం పెరుగుతుండడం కూడా బంగారానికి ఒక ముప్పు. బాండ్ ఈల్డ్స్ లేదా వడ్డీ రేట్లు పెరిగే ధోరణి బంగారానికి బదులు బాండ్ల పట్ల ఆకర్షణను పెంచొచ్చు’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే అరోరా రిపోర్ట్ వ్యవస్థాపకుడు నిగమ్ ఆరోరా తెలిపారు. బంగారానికి గతంలో మాదిరి ఆకర్షణీయమైన రోజులు ముగిసినట్టేనన్నది బిట్‌కాయిన్ మద్దతుదారుల అభిప్రాయమని ఆరోరా పేర్కొన్నారు. గణనీయమైన పెట్టుబడులు పుత్తడి నుంచి ఇప్ప టికే బిట్‌కాయిన్‌లోకి వెళ్లినట్టు చెప్పారు. ఇకపైనా కొత్త పెట్టుబడుల్లో అధిక భాగం బిట్కాయిన్లలోకి వెళ్లొచ్చన్నారు. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తుంటే బంగారం వన్నె తగ్గడం మామూలే. ఈక్విటీలు బేలచూపులు చూసే సమయంలో పసిడి మెరుస్తుంటుంది. అయితే, బంగారాన్ని కనిష్ట ధరల వద్ద కొనుగోలు చేయొచ్చని ఆరోరా సూచించారు. -
డిజిటల్ బంగారం.. భద్రమేనా?
బంగారం అంటే ఆభరణమే కానక్కర్లేదు. పెట్టుబడి సాధనంగా బంగారానికి మన దేశంలో ఆదరణ పెరిగిపోతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో బంగారం ధరల ర్యాలీ.. ఇన్వెస్టర్లలో కొత్త విశ్వాసాన్ని చిగురింపజేసింది. 3,000 సంవత్సరాల నుంచి బంగారానికి విలువైన లోహంగా గుర్తింపు ఉంది. మన దేశంలో బంగారం ఆభరణాలు కుటుంబ ఆస్తిలో భాగం. దీనికి తోడు పెట్టుబడి సాధనంగానూ డిమాండ్ పెరుగుతోంది. గతేడాది కరోనా మహమ్మారి సమయంలోనూ బంగారంలో డిజిటల్ పెట్టుబడులు కొనసాగడం దీన్నే సూచిస్తోంది. డిజిటల్ గోల్డ్‌తోపాటు గోల్డ్ ఈటీఎఫ్‌లు, బంగారంపై ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడులకు అందుబాటులో ఉన్న ‘బంగారం’ సాధనాలపై వివరాలను అందించే çసాక్షి ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. సహజంగా బంగారాన్ని భౌతిక రూపంలో (ఆభరణాలు, కాయిన్లు) కొనుగోలు చేసుకుని భద్రపరుచుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనికితోడు సార్వభౌమ బంగారం బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ కూడా ఆదరణ పొందుతోంది. ఇటీవలి కాలంలో బంగారానికి పెట్టుబడి దృష్ట్యా డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుండడం ఆసక్తికరం. మరి డిజిటల్ గోల్డ్ సంగతేంటి..? ఆభరణాల కోసమైతే ఫర్వాలేదు. అలా కాకుండా పెట్టుబడి కోణంలో భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వాటి స్వచ్ఛత ఎంతన్నది గుర్తించడం కష్టం. భద్రంగా దాచుకోవడం కూడా సమస్యే. అవసరమొచ్చి విక్రయించాలనుకుంటే ఆ బంగారానికి ఎంత విలువ కడతారన్నది చెప్పలేము. కానీ, డిజిటల్ గోల్డ్‌కు ఇటువంటి సమస్యలేవీ లేవు. ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. బీమా సదుపాయం కలిగిన ఖజానాల్లో వీటిని భౌతిక రూపంలో విక్రయదారే భద్రపరుస్తారు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు సులభంగా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు. వేదికలు... మన దేశంలో డిజిటల్ గోల్డ్‌ను ప్రధానంగా మూడు సంస్థలు అందిస్తున్నాయి. అవి ఆగ్మంట్ గోల్డ్, ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (సేఫ్ గోల్డ్ బ్రాండ్‌పై). వీటి తరఫున గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎమ్, గ్రోవ్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, అమెజాన్ ఇండియా తదితర సంస్థలు తమ వేదికలపై డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశాలను కల్పిస్తున్నాయి. అంటే ఈ వేదికలపై కొనుగోళ్లు, అమ్మకాలు పైన చెప్పుకున్న మూడు సంస్థల తరఫున నడుస్తుంటాయి. ఆర్డర్ చేసిన తర్వాత.. అంత మొత్తానికి సరిపడా బంగారాన్ని ఈ సంస్థలు భౌతిక రూపంలో కొనుగోలు చేసి ఇన్వెస్టర్ పేరు మీద ఖజానాల్లో భద్రపరుస్తాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం, మొబైల్ నుంచే సు లభంగా పెట్టుబడులకు వీలుండడం డిజిటల్ గోల్డ్ పట్ల ఇన్వెస్టర్లను ఆకర్షించే అంశాలని చెప్పుకోవాలి. డిజిటల్ బంగారంలో ట్రేడింగ్ గ్రోవ్, పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లేదా మోతీలాల్ ఓస్వాల్ సెక్యూ రిటీస్ మరే ఇతర సంస్థ అయినా కావచ్చు.. ఆయా ప్లాట్ఫామ్లో యూజర్ అయిఉండాలి. కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవాలనుకుంటే.. గ్రాములు లేదా రూపాయి వ్యాల్యూలో కొనుగోలు చేసుకోవచ్చు. పేమెంట్ విధానాన్ని ఎంచుకుని చెల్లింపులు చేస్తే సరిపోతుంది. బ్యాంకు ఖాతా, కార్డులు లేదా వ్యాలెట్ నుంచి అయినా చెల్లింపులు చేయవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా మీ బంగారాన్ని విక్రయించుకోవచ్చు. స్వచ్ఛంగా.. భౌతికంగా అందుకోవచ్చు.. ఒకవేళ విక్రయించుకునే ఉద్దేశం లేకుండా.. భౌతిక రూపంలో డెలివరీ తీసుకోవాలనే అనుకుంటే ఆ సదుపాయం కూడా ఈ వేదికల రూపంలో అందుబాటులో ఉంది. కాయిన్లు లేదా బులియన్ (బ్రిక్ ) రూపంలో మీ ఇంటి వద్దకే డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. డెలివరీ చార్జీలను కస్టమరే భరించాలి. స్వచ్ఛత/చార్జీలు ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ, సేఫ్గోల్డ్ రెండూ 24 క్యారట్ బంగారాన్ని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. స్వచ్ఛత విషయానికొస్తే ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ 99.9 శాతం ప్యూరిటీ బంగారాన్ని ఇస్తుండగా.. సేఫ్గోల్డ్ మాత్రం 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తే నిల్వ కోసం ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఐదేళ్ల వరకు ఉచితంగా స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని బంగారం కాయిన్లలోకి మార్చి డెలివరీ తీసుకోవాలి లేదా విక్రయించడం తప్పనిసరి. అకౌంట్ అచేతనంగా మారకుండా ఉండాలంటే ఆరు నెలలకు ఒక లావాదేవీ అయినా నిర్వహించాలి. ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌పై సేఫ్గోల్డ్ సంస్థ అందించే బంగారాన్ని కొనుగోలు చేస్తే మాత్రం స్టోరేజీ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. మొదటి రెండేళ్లకు ఎటువంటి చార్జీల్లేవు. మొదటిసారి కొనుగోలు చేసిన తేదీ నుంచి సరిగ్గా రెండేళ్లకు బంగారం 2 గ్రాములు అంతకంటే తక్కువే ఉంటే ప్రతీ నెలా విలువపై 0.05 శాతం చార్జీ కింద చెల్లించాలి. గోల్డ్ బ్యాలన్స్ నుంచి దీన్ని ప్రతీ నెలా మినహాయించుకుంటారు. గరిష్టంగా ఏడేళ్ల వరకు డిజిటల్ రూపంలో గోల్డ్‌ను సేఫ్గోల్డ్ వద్ద కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత డెలివరీ తీసుకోవడం లేదా విక్రయించడం చేయాలి. డిజిటల్ రూపంలో ఉంచుకోవాలనుకుంటే విక్రయించి మర్నాడు మళ్లీ కొనుగోలు చేయడం ఒక మార్గం. పెట్టుబడికి డిజిటల్ గోల్డ్‌తో పోలిస్తే మెరుగైన సాధనాలు ఉన్నాయి. బంగారం సౌర్వభౌమ బాండ్లను పరిశీలించొచ్చు. ఇందులో ప్రవేశ సమయంలో బంగారం మార్కెట్ ధర ఆధారంగా కేటాయింపులు చేస్తారు. గడువు తీరిన తర్వాత కూడా మార్కెట్ ధర ఆధారంగానే చెల్లింపులు చేస్తారు. దీనికితోడు వార్షికంగా 2.5% వడ్డీని చెల్లిస్తారు. కాకపోతే లాభాలపై పన్ను లేకపోవడం ఆకర్షణీయం. గోల్డ్ ఈటీఎఫ్‌లో అయితే లిక్విడిటీ పరంగా సమస్యఉండదు. క్రయ, విక్రయాలు అన్ని ట్రేడింగ్ రోజుల్లోనూ చేసుకోవచ్చు. ఫోన్‌పే ► ఫోన్‌పే సంస్థ అటు సేఫ్గోల్డ్ నుంచి.. ఇటు ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ వేదికల నుంచి డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశాలను అందిస్తోంది. అప్పుడు ప్రతీ లాకర్‌ను విడివిడిగా నిర్వహిస్తారు. ► రూపాయి లేదా 0.001 గ్రాము నుంచి బంగారాన్ని కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ► కనీసం రూ.5 గోల్డ్ కలిగి ఉండాలి. ఒకే రోజు కొనుగోలు చేసిన డిజిటల్ గోల్డ్‌ను అదే రోజు అమ్మలేరు. ► యాప్‌లో కనిపించే బంగారం ధరలో కస్టమ్స్ డ్యూటీలు, పన్నులు కూడా కలిసే ఉంటాయి. ► గ్రాము పరిమాణం నుంచి కాయిన్ లేదా పెండెంట్ రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. పేటీఎమ్ పేటీఎమ్ ప్లాట్‌ఫామ్‌పై రూపాయి నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు. గ్రాముల్లో అయితే 0.0005 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి ఒక కస్టమర్‌కు 50 గ్రాములు. ఇంతే పరిమాణాల్లో విక్రయించుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత కూడా కొనుగోలు చేసిన బంగారాన్ని నిల్వ చేసుకో వాలంటే అందుకు చార్జీ చెల్లించుకోవాలి. బంగారాన్ని విక్రయించే సమయంలో బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో విక్రయించిన 72 గంటల్లో ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేసిన బంగారాన్ని మీకు నచ్చిన వారికి కానుకగా ఇచ్చుకునే సదుపాయం కూడా ఉంది. పేటీఎం డిజిటల్ గోల్డ్‌ను కాయిన్‌గా మార్చుకోవాలంటే కనీస బంగారం బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ కాయిన్ అయితే 0.5 గ్రాము నుంచి ప్రారంభమవుతుంది. ఆగ్మంట్ కాయిన్లు 0.1 గ్రాము నుంచి లభిస్తాయి. పేటీఎమ్ ఇటీవలే కల్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ తదితర సంస్థలతోనూ టైఅప్ అయింది. దీంతో పేటీఎమ్ యూజర్లు తమ డిజిటల్ గోల్డ్‌ను కల్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ సంస్థల్లో ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు. గోల్డ్ రష్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌కు చెందిన.. ‘గోల్డ్రష్ఆన్లైన్ డాట్ కో డాట్ ఇన్’ పోర్టల్ నుంచి డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు అకౌంట్‌ను ప్రారంభించి, కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ పోర్టల్ నుంచి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ ఉచితమే. కనీసం రూ.100 నుంచి బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. రూ.50,000 మించితే పాన్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే కనీసం ఒక గ్రాము అయినా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌గా కొనుగోలు చేసిన బంగారాన్ని భద్రంగా నిల్వ చేస్తారు. బంగారం కొనుగోలుపై పరిమితి లేకపోవడం ఆకర్షణీయం. డిజిటల్ గోల్డ్ సానుకూలతలు ► భౌతిక రూపంలో పసిడిని ఒక్క రూపాయి నుంచే కొనుగోలు చేసుకునే సదుపాయం. ► ఆన్లైన్లో రుణాలకు తనఖా పెట్టొచ్చు. ► లావాదేవీలన్నీ 24 క్యారట్‡ స్వచ్ఛత కలిగినవి. సేఫ్ గోల్డ్ అయితే 99.5 శాతం స్వచ్ఛత బంగారాన్ని ఆఫర్ చేస్తుండగా, ఎమ్ఎమ్టీసీ పీఏఎమ్‌పీ అయితే 99.9 స్వచ్ఛతతో అందిస్తున్నాయి. ► కొన్న పసిడికి బీమా ఉంటుంది. ► డిజిటల్ గోల్డ్‌ను ఆభరణాలు, కాయిన్లు, బులియన్‌తో మార్పిడి చేసుకోవచ్చు. ► పెట్టుబడి కాల వ్యవధి తర్వాత బంగారాన్ని భౌతిక రూపంలో డెలివరీ అందుకోవచ్చు. ప్రతికూలతలు ► చాలా ప్లాట్ఫామ్ల్లో డిజిటల్ గోల్డ్ కొను గోలు ఒక కస్టమర్‌కు రూ.2లక్షల పరిమితిగా అమల్లో ఉంది. మరింత అధికంగా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే పూర్తి కేవైసీ తప్పనిసరి. ► నిర్ణీత కాలం వరకే బంగారం నిల్వ సదుపాయాన్ని ఆఫర్ చేస్తూ, ఆ తర్వాత డెలివరీ తీసుకోవాలని సంస్థలు కోరుతున్నాయి. లేదంటే విక్రయించాల్సి రావచ్చు. కొనసాగిస్తే అదనపు చార్జీలు ఉంటాయి. ► డిజిటల్ గోల్డ్ కొనుగోలుపైనా 3% జీఎస్టీని చెల్లించాలి. ఉదాహరణకు రూ.1,000తో డిజిటల్ గోల్డ్‌కు ఆర్డర్ చేస్తే రూ.970విలువకే బంగారం పొందగలరు. దీనికితోడు ఇతర చార్జీలు కూడా ఉంటాయి. ► స్టోరేజీ చార్జీలు, బీమా, ట్రస్టీ ఫీజుల రూపంలో సంస్థలు 2–3 శాతం మేర చార్జీల కింద రాబట్టుకుంటున్నాయి. ► బంగారం డెలివరీ తీసుకోవాలంటే డెలివరీ చార్జీలు, కాయిన్లుగా అందుకోవాలంటే తయారీ చార్జీలను భరించాల్సి ఉంటుంది. నియంత్రణ ఎవరిది? డిజిటల్ గోల్డ్ కొనుగోలు, అమ్మకం ఎంతో సులభంగా ఉన్నప్పటికీ దీనిపై నియంత్రణ ఎవరిది? అన్న ప్రశ్న కచ్చితంగా ఇన్వెస్టర్లకు వస్తుంది. కొనుగోలు చేసిన విలువకు సరిపడా బంగారాన్ని మూడో పక్షానికి చెందిన ఖజానాల్లో భద్రపరుస్తారు. ఈ బాధ్యతలను చూసేందుకు ట్రస్టీలు ఉంటారు. కానీ, ఆచరణలో ఇలా నిల్వ చేస్తున్నారా? లేదా? అని చూసే యంత్రాంగం ఇప్పటికైతే లేదు. స్టాట్యుటరీ ఆడిట్లు నిర్వహించినప్పటికీ.. డిజిటల్‌గోల్డ్‌ను అందిస్తున్న సంస్థలకే నివేదికలను సమర్పించడం జరుగుతుంది. కానీ, ఇతర బంగారం డిజిటల్ సాధనాలు పలు నియంత్రణ సంస్థల కింద పనిచేస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ ఉంటుంది. అదే సౌర్వభౌమ బంగారం బాండ్లపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉంటుంది. నియంత్రణ సంస్థ ఉంటే తగిన తనిఖీలు, పర్యవేక్షణ ఉంటుందని.. నియంత్రణ సంస్థ లేని పక్షంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల విషయంలో రాజీకి అవకాశం లేకపోలేదని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. కనుక డిజిటల్‌గోల్డ్‌ను కొనుగోలు చేసుకునే వారు బీమా సదుపాయం ఉందో, లేదో విచారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. -
పెట్టుబడులకు ‘బంగారం’!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి తీవ్రత, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడులకు పసిడి ఆకర్షణీయంగా నిలిచింది. మూడవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి రూ.2,426 కోట్ల నికర పెట్టుబడులు వచ్చినట్లు భారత్ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (యాంఫీ) తాజా గణాంకాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ 2019 జూలై–సెప్టెంబర్ మధ్య గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన మొత్తం కేవలం రూ.172 కోట్లే. ⇔ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి క్యూ2లో రూ.5,957 కోట్ల నికర పెట్టుబడులు వస్తే, ఇందులో గోల్డ్ ఈటీఎఫ్‌లదే అధిక మొత్తం. ⇔ నెలవారీగా చూస్తే, జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.202 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ పెట్టుబడుల విలువ రూ.1,483 కోట్లుగా ఉంది. అయితే రూ.195 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. లాభాల స్వీకరణ దీనికి కారణం. ⇔ ఇక ఏప్రిల్ (రూ.731 కోట్లు), మే (రూ.815 కోట్లు), జూన్ (రూ.494 కోట్లు), జూలై (రూ.921 కోట్లు), ఆగస్టు (రూ.908 కోట్లు), సెప్టెంబర్ (రూ.597 కోట్లు)లో నికర పెట్టుబడులు కొనసాగాయి. ⇔ గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న మొత్తం విలువ (ఏయూఎం) సెప్టెంబర్ 2020 నాటికి రూ.13,590 కోట్లు. 2019 సెప్టెంబర్ ముగింపునాటికి ఈ విలువ రూ.5,613 కోట్లుగా ఉంది. ఆర్థిక అనిశ్చితే కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకుల మార్కెట్‌ను ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులకు పసిడే సురక్షితమైనదని భావిస్తున్నారు. మార్కెట్లు దాదాపు రికవరీ బాటన నడుస్తూ, కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అనిశ్చితి తొలగిపోని పరిస్థితి కొనసాగుతుండడం ఇక్కడ గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్‌ల పెట్టుబడులు గత ఏడాది కాలంగా మంచి రిటర్న్స్ అందించడానికి ఆర్థిక అనిశ్చితే కారణం. దీనికి ప్రస్తుతం కరోనా మహమ్మారి కూడా తోడయ్యింది. అమెరికా ఎన్నికలు, ఫలితాలు రానున్న రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన హెడ్జింగ్ సాధనంగా గోల్డ్ ఈటీఎఫ్లనే ఎంచుకుంటారని భావిస్తున్నాం. అంతక్రితం రెండు నెలలతో పోల్చితే, సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినా, ఇక్కడ పాజిటివ్ అవుట్‌లుక్ మాత్రమే కనబడుతోంది. కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతుండడం, ఉద్దీపన చర్యలతో వ్యవస్థలోకి వస్తున్న అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ), కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల వల్ల పెట్టుబడులు సురక్షిత సాధనమైన పసిడిలోకే మళ్లే అవకాశాలే ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు లేదా ఫిజికల్ గోల్డ్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నాం. – దివామ్ శర్మ, గ్రీన్ పోర్ట్‌ఫోలియో సహ వ్యవస్థాపకులు -
పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్స్
ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇండెక్స్ ఫండ్స్ కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వ్యయాలపరంగా కాస్త చౌకగా ఉండటంతో పాటు అర్థం చేసుకోవడానికి సులభతరంగా ఉండటం కూడా వీటికి సానుకూలాంశం. దీర్ఘకాలికంగా సంపద సృష్టికి అనువైనవిగా నిరూపించుకున్నాయి. అమెరికా తదితర సంపన్న దేశాల్లో వందల కొద్దీ ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్చంజీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఉన్నప్పటికీ.. భారత్‌లో ఇవి ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం పలు అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు .. పెద్ద సంఖ్యలోనే ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. వందలకొద్దీ మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఈ ఇండెక్స్ ఫండ్స్ సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల ముందు ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ఈటీఎఫ్‌ల సంగతేంటి? ఎక్కడ మొదలెట్టాలి.. లాంటి సందేహాలెన్నో వస్తాయి. ఇందుకోసం బేరీజు వేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యామ్నాయం.. ఈటీఎఫ్‌లు ఇక ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఈటీఎఫ్‌లు మిగతా షేర్లలాగానే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతుంటాయి. ఇండెక్స్ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. నిర్వహిస్తుంటాయి. సాధారణంగా ఈటీఎఫ్‌లలో యూనిట్లు కొంటే ఓ రేటు, అమ్మితే ఇంకో రేటులాగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. తక్కువ వ్యయాలతో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కేటాయింపుల కోసం ఇండెక్స్ ఫండ్స్ చాలా మెరుగైన సాధనాలనే చెప్పవచ్చు. ఫండ్స్ మేళవింపే 90 శాతం పైగా రాబడులకు కీలకంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాం.. దేన్ని.. ఎప్పుడు అమ్మేశాం.. అన్నది కాకుండా పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. వివిధ రకాల అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇండెక్స్ ఫండ్స్‌ను నిస్సందేహంగా పరిశీలించవచ్చు. రిస్క్ సామర్థ్యం ముందుగా మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఎంతవరకూ రిస్కు తీసుకోగలరో అర్థం చేసుకుని, దానికి కట్టుబడి ఉండాలి. రిస్క్ సామర్థ్యంపై అవగాహన లేకపోతే.. బుల్ మార్కెట్లలో మరీ దూకుడుగా ఉండటమో, బేర్ మార్కెట్లలో మరీ వెనక్కి తగ్గిపోవడమో చేయడంవల్ల మొత్తం సంపదనంతా పోగొట్టుకునే అవకాశం ఉంది. అనువైన సాధనం మార్కెట్లో బోలెడన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు.. పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టరు.. మరీ ఎక్కువగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోవడం శ్రేయస్కరం. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు కొంత మొత్తంలో కేటాయించవచ్చు. ఇక అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లు.. షేర్లలోనూ, మిడ్.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనూ కాస్త పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి. అవేంటంటే.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టోరల్, ఇంటర్నేషనల్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లో భారత్‌లోని టాప్ 100 స్టాక్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో తదుపరి 150 స్టాక్స్ (101–250), స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో మిగతా స్టాక్స్ (250 ప్లస్) ఉంటాయి. గత రాబడులు చూస్తే.. సెక్టోరల్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆకర్షణీయంగానే కనిపించవచ్చు. అయినప్పటికీ ఇవి చాలా రిస్కుతో కూడుకున్నవే కాకుండా తీవ్ర హెచ్చుతగ్గులకు కూడా లోనవుతుంటాయన్నది గుర్తుంచుకోవాలి. సురక్షితమైన సాధనం కావాలనుకునే వారు లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ (నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కాకుండా, ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. రూపాయి మారకం విలువ క్షీణించినప్పుడు హెడ్జింగ్‌కు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు.. ఇంటర్నేషనల్ ఫండ్స్ తోడ్పడతాయి. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. సరైన ఫండ్ ఎంపిక అనేక రకాల ఫండ్స్ సంస్థలు దాదాపు ఒకే రకమైన ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో గందరగోళం తలెత్తడం సహజం. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రస్తుతం చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకే రకంగానే కనిపించినా.. ఇన్వెస్టర్లు ప్రధానంగా వ్యయాలపైన (టోటల్ ఎక్స్పెన్స్ నిష్పత్తి), ట్రాకింగ్ ఎర్రర్‌ని (టీఈ) పరిశీలించాలి. ప్రామాణిక సూచీ ఇచ్చే రాబడితో పోలిస్తే ఫండ్ ఎంత రాబడి ఇస్తోందన్నది టీఈ ద్వారా తెలుస్తుంది. అయితే, ప్రామాణిక సూచీ పనితీరునే కచ్చితంగా ప్రతిబింబించడం ఏ ఫండ్‌కైనా అసాధ్యమే. ట్రేడింగ్ వ్యయాలు, పన్నులు, వ్యయాల నిష్పత్తి మొదలైన వాటి కారణంగా ప్రతీ ఏటా.. ఎంతో కొంత టీఈకి దారి తీస్తుంది. చాలా సందర్భాల్లో వ్యయాల నిష్పత్తులు ఎంత ఎక్కువగా ఉంటే టీఈ అంత ఎక్కువగా ఉంటుంది. కనుక.. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. -
పసిడి.. వెండి- ఆకాశమే హద్దు
ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. ఈటీఎఫ్‌ల వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలనూ భారీగా ఆకట్టుకుంటున్న బంగారం, వెండి ధరల ర్యాలీ కొనసాగుతూనే ఉంది. బులియన్ చరిత్రలో బుధవారం మరోసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. ఈ బాటలో వెండి ధర 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. నేటి ట్రేడింగ్‌లో సైతం లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.2 శాతం బలపడి 2056 డాలర్లకు ఎగువన కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ స్వల్ప లాభంతో 2043 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. 2020లో ఇప్పటివరకూ పసిడి 500 డాలర్లు ఎగసింది. ఇది 34 శాతం వృద్ధికాగా.. గత రెండు వారాల్లోనే 200 డాలర్లు పెరగడం విశేషం! ఇక వెండి సైతం 0.6 శాతం బలపడి 27 డాలర్లకు ఎగువన ట్రేడవుతోంది. తద్వారా 2020లో ఏకంగా 48 శాతం ర్యాలీ చేసింది. వెరసి 2013 తదుపరి గరిష్ట స్థాయికి చేరింది! ర్యాలీ బాటలోనే ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 202 పుంజుకుని రూ. 55,300 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 691 బలపడి రూ. 72,584 వద్ద కదులుతోంది. దేశీయంగానూ దేశీయంగా ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల పసిడి రూ. 547(1 శాతం) లాభపడి రూ. 55,098 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధరకాగా.. తొలుత గరిష్టంగా రూ. 55,597ను తాకింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర రూ. 2096(3 శాతం) దూసుకెళ్లి రూ. 71,893 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 72,980 వరకూ ఎగసింది. తద్వారా 2011 ఏప్రిల్ 25న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 75,000 మార్క్‌కు చేరువైంది! ఈటీఎఫ్‌ల జోరు ఈ జనవరి-జూన్ కాలంలో పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. గత ఆరు నెలల కాలంలో 734 టన్నుల పసిడిని ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. దీంతో జూన్‌చివరికల్లా గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం విలువ 3,621 టన్నులకు చేరినట్లు వెల్లడించింది. ఇది సరికొత్త రికార్డ్ కావడం గమనార్హం! అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇన్వెస్టర్లు 47 బిలియన్ డాలర్లను గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేశారు. పసిడి ఈటీఎఫ్‌ల విలువ చరిత్రలో తొలిసారి 206 బిలియన్ డాలర్లను తాకింది. కాగా.. ప్రస్తుత ధరల ప్రకారం జులై చివరికల్లా 922 టన్నుల పసిడి జమకాగా.. 60 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు డబ్ల్యూజీసీ తాజాగా తెలియజేసింది. -
ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ వారంలో 3 ఇష్యూలు
ఈ వారం మూడు ఇష్యూలతో ప్రైమరీ, సెండరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. నేటి నుంచి స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 423-425కాగా.. ఇష్యూ బుధవారం(15న) ముగియనుంది. తద్వారా రూ. 496 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇక మంగళవారం(14) నుంచి భారత్ బాండ్ ఈటీఎఫ్ రెండో దశ మొదలుకానుంది. పీఎస్‌యూ కంపెనీల బాండ్లలో ప్రధానంగా పెట్టుబడులుంటాయి. ప్రభుత్వం తరఫున ఎడిల్వీజ్ మ్యూచువల్ ఫండ్ వీటిని చేపడుతోంది. 17న ముగియనున్న ఇష్యూ ద్వారా కనిష్టంగా(బేస్ పరిమాణం) రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రూ. 11,000 కోట్లవరకూ గ్రీన్‌షూ ఆప్షన్ ఉంది. అంటే ఇష్యూకి అధిక స్పందన వస్తే.. ఇందుకు వీలుగా యూనిట్లను విక్రయించనుంది. ఇంతక్రితం 2019 డిసెంబర్లో తొలిసారి ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. ఇక మరోవైపు ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ 15న ప్రారంభమై 17న ముగియనుంది. యస్ బ్యాంక్ షేరు పతనం మార్కెట్ ధరతో పోలిస్తే ఎఫ్‌పీవోకు యస్ బ్యాంక్ షేరుకి రూ. 12 ధరను నిర్ణయించింది. ఇది 55 శాతం తక్కువకావడంతో వరుసగా రెండో రోజు యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ వారం మార్కెట్లలో ఇన్వెస్టర్లకు లభిస్తున్న పెట్టుబడి మార్గాలు మూడూ విభిన్నమైనవని విశ్లేషకులు చెబుతున్నారు. రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకాగా.. భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు స్థిరపెట్టుబడి మార్గమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధర ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్ కార్యకలాపాలపట్ల కొంతమేర ఆందోళనలున్నట్లు తెలియజేశారు. భారత్ బాండ్ భేష్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఆప్షన్లలోనూ ఒక పెట్టుబడి మార్గాన్నే ఎంచుకోవలసి వస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్ మేలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణిస్తే..దీర్ఘకాలిక దృష్టితో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం లాభించగలదని రెలిగేర్ బ్రోకింగ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొంటున్నారు. వీటిలో పెట్టుబడులపై రిటర్నులను అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. తొలి దశలో వచ్చిన బాండ్లు వార్షికంగా 14-18 శాతం రిటర్నులను అందించినట్లు తెలియజేశారు. దీనికితోడు భారత్ బాండ్ ఈటీఎఫ్నకు ఉత్తమ క్రెడిట్ రేటింగ్ ఉన్నట్లు తెలియజేశారు. రుణ మార్కెట్లో పెట్టుబడులకు ఇవి వీలుకల్పిస్తున్నట్లు వివరించారు. ప్రీమియంలో.. పలు ప్రొడక్టులతో పటిష్ట పోర్ట్‌ఫోలియోను కలిగిన రోజారీ బయోటెక్ డైవర్సిఫైడ్ కంపెనీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. అయితే ప్రీమియం ధరలో కంపెనీ ఐపీవో చేపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో తొలి రెండు రోజులూ ఇష్యూకి స్పందన ఎలా ఉందన్న అంశాన్ని గమనించడం మేలు చేయగలదని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. తద్వారా ఇష్యూకి కనిపిస్తున్న డిమాండ్ ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇక యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. గత సమస్యలు బ్యాంక్‌కు భవిష్యత్‌లో సవాళ్లు విసరవచ్చన్న ఆందోళనలున్నట్లు తెలియజేశారు. ఇదే అభిప్రాయాన్ని పిక్రైట్ టెక్నాలజీస్ కీలక వ్యూహాల అధికారి(సీఎస్‌వో) సిద్ధార్ధ్ పంజ్వానీ కూడా వ్యక్తం చేశారు. ఇక ప్రత్యర్ధి సంస్థలు వినతీ, అతుల్, ఫైన్ ఆర్గానిక్స్‌తో పోలిస్తే ఐపీవో ద్వారా రోజారీ బయోటెక్ కొంతమేర ప్రీమియంను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆదాయం, నికర లాభాల్లో వృద్ధిరీత్యా ఇది కొంతమేర సమంజసమేనని అభిప్రాయపడ్డారు. భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు అంటే బాండ్లలో ఇన్వెస్ట్ చేయడమేనని.. ఒకస్థాయి దాటి రిటర్నులు అందుకునే వీలుండదని వివరించారు. రిస్క్ తక్కువ పెట్టుబడులుగా వీటిని భావించవచ్చని తెలియజేశారు. దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే శామ్కో సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ నిపుణులు నీరాలీ షా సైతం వెల్లడించడం గమనార్హం! అధిక రిస్క్‌ను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రిటర్నులు ఆశించే ఇన్వెస్టర్లు రోజారీ బయోటెక్ లేదా.. యస్ బ్యాంక్ ఇష్యూవైపు దృష్టిసారించవచ్చని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యస్ బ్యాంక్ కౌంటర్ భవిష్యత్‌లో పలు ఆటుపోట్లను చవిచూసే వీలున్నదని భావిస్తున్నారు. -
జూలైలో.. రెండో దశ భారత్ బాండ్స్ ఈటీఎఫ్‌లజారీ
రెండో దశలో భాగంగా భారత్ బాండ్ ఈటీఎఫ్‌లను జారీకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఎడెల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. జూలై నెలలో రెండు కొత్త సిరీస్‌ల ద్వారా భారత్ బాండ్ ఈటీఎఫ్‌లను జారీ చేసి రూ.14,000 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ఎడెల్వీజ్ తెలిపింది. ఈ రెండు సిరీస్‌లలో మెచ్యూరిటీ పిరియడ్‌ను ఒక సిరీస్ ఏప్రిల్ 2025ను, రెండో సిరీస్‌కు ఏప్రిల్ 2031 నిర్ణయించినట్లు పేర్కొంది. గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.3,000 కోట్లు, మార్కెట్ డిమాండ్‌ను బట్టి అదనంగా రూ.11,000 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధిక గుప్తా చెప్పారు. వివిధ రకాల మెచ్యూరిటి కాల పరిమితులు రూపొందించడం వల్ల ఇన్వెస్టర్లకు ఎక్కువ ఆప్షన్లు లభిస్తాయని తద్వారా వివిధ రకాల పెట్టుబడులు భారత్ బాండ్ ఈటీఎఫ్‌లలోకి వస్తాయన్నారు. డీమ్యాట్ అకౌంట్ లేకపోయినప్పటికీ.. డీమ్యాట్ అకౌంట్ లేని వారికి సైతం భారత్ బాండ్ ఫండ్స్ ఆఫ్ఫండ్స్(ఎఫ్ఓఎఫ్)ను అందిస్తున్నట్లు రాధిక వెల్లడించారు. నిఫ్టీ భారత్ బాండ్ ఇండెక్స్‌లో AAA పబ్లిక్ రేటింగ్ కలిగిన ఎక్సిమ్ బ్యాంక్, హెచ్‌పీసీఎల్, హడ్కో, ఐఆర్‌ఎప్‌సీ, నాబార్డ్, ఎన్హెచ్ఏఐ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్టీపీసీ, పీఎఫ్సీ, ఎన్పీసీఐఎల్,పవర్‌గ్రిడ్, ఆర్ఈసీ, సిడ్బీబాండ్లు ఉంటాయి. గతేడాది డిసెంబర్లో ప్రవేశపెట్టిన భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి దశలో రూ.12,400 కోట్లు సమీకరించిందని తెలిపారు. కాగా భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ కార్యక్రమం ఆరోగ్యకరమైన పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్నీ, ఎక్సెంజీలలో లిక్విడిటీని కల్పిస్తుంది. -
ఈటీఎఫ్‌లపై ఎన్ఎస్ఈ దృష్టి
ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లను భారీ సంఖ్యలో ఆకట్టుకోవాలంటే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)పై ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉన్నదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) భావిస్తోంది. తద్వారా ఈక్విటీలలో పెట్టుబడులవైపు రిటైలర్లను మరింత ఆకర్షించవచ్చునని ఎన్ఎస్ఈ సీఈవో చిత్రా రామకృష్ణన్ పేర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర బాండ్లను కూడా రిటైలింగ్‌లోకి తీసుకురావాల్సి ఉన్నదని చెప్పారు. మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఫండ్స్‌లాగే... ఈటీఎఫ్‌లు కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను పోలి ఉంటాయి. వివిధ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్చేయడంతోపాటు, వీటికి సంబంధించిన యూనిట్లను జారీ చేస్తాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా వీటిలో క్రయవిక్రయాలను నిర్వహించుకోవచ్చు. అయితే ఇందులో రెండు రకాలుంటాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు, సంపన్న వర్గాల వంటివారికి రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఈటీఎఫ్‌లను రూపొందించాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం సులభతరంగా ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దాలని చిత్ర వివరించారు. ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా రెండు రకాల ఇన్వెస్టర్లకూ వినియోగపడేలా ఉత్పత్తులను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనిలో భాగంగా త్వరలో 10ఏళ్ల కాలపరిమితిగల ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించిన ఇంటరెస్ట్ రేట్ ఫ్యూచర్స్(ఐఆర్ఎఫ్)లో లావాదేవీలను నిర్వహించేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించనుంది. ఈటీఎఫ్‌లలో పెట్టుబడులకు సంబంధించి ఖర్చులు తక్కువగా ఉండటమేకాకుండా ఫండ్ పనితీరును రోజువారీ గమనించాల్సిన పనిఉండదని చిత్ర వివరించారు. దీంతోపాటు ఒకే ఈటీఎఫ్ ద్వారా పలు షేర్లలో ఇన్వెస్ట్‌చేసేందుకు అవకాశముంటుందని వివరించారు.