ఈటీఎఫ్‌లపై ఎన్‌ఎస్‌ఈ దృష్టి | NSE bets on ETFs, other new products to expand market | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌లపై ఎన్‌ఎస్‌ఈ దృష్టి

Published Mon, Dec 23 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

ఈటీఎఫ్‌లపై ఎన్‌ఎస్‌ఈ దృష్టి

ఈటీఎఫ్‌లపై ఎన్‌ఎస్‌ఈ దృష్టి

 ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లను భారీ సంఖ్యలో ఆకట్టుకోవాలంటే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)పై ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉన్నదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) భావిస్తోంది. తద్వారా ఈక్విటీలలో పెట్టుబడులవైపు రిటైలర్లను  మరింత  ఆకర్షించవచ్చునని ఎన్‌ఎస్‌ఈ సీఈవో చిత్రా రామకృష్ణన్ పేర్కొన్నారు.  వీటితోపాటు ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర బాండ్లను కూడా రిటైలింగ్‌లోకి తీసుకురావాల్సి ఉన్నదని చెప్పారు. మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
 
 ఫండ్స్‌లాగే...
 ఈటీఎఫ్‌లు కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను పోలి ఉంటాయి. వివిధ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్‌చేయడంతోపాటు, వీటికి సంబంధించిన యూనిట్లను జారీ చేస్తాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా వీటిలో క్రయవిక్రయాలను నిర్వహించుకోవచ్చు. అయితే ఇందులో రెండు రకాలుంటాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు, సంపన్న వర్గాల వంటివారికి రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఈటీఎఫ్‌లను రూపొందించాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం సులభతరంగా ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దాలని చిత్ర వివరించారు. ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా రెండు రకాల ఇన్వెస్టర్లకూ వినియోగపడేలా ఉత్పత్తులను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనిలో భాగంగా త్వరలో 10ఏళ్ల కాలపరిమితిగల ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించిన ఇంటరెస్ట్ రేట్ ఫ్యూచర్స్(ఐఆర్‌ఎఫ్)లో లావాదేవీలను నిర్వహించేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించనుంది. ఈటీఎఫ్‌లలో పెట్టుబడులకు సంబంధించి ఖర్చులు తక్కువగా ఉండటమేకాకుండా ఫండ్ పనితీరును రోజువారీ గమనించాల్సిన పనిఉండదని చిత్ర వివరించారు. దీంతోపాటు ఒకే ఈటీఎఫ్ ద్వారా పలు షేర్లలో ఇన్వెస్ట్‌చేసేందుకు అవకాశముంటుందని వివరించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement