హెల్త్‌కేర్, బ్యాంకింగ్, వినియోగం, టెక్నాలజీ మొదలైనవన్నీ కచ్చితంగా అవసరమైనవే కాబట్టి .. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఈ రంగాలు వృద్ధి బాటలోనే ఉంటాయి. కాబట్టి ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకు కాస్త భద్రతతో పాటు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్ వృద్ధి కూడా చెందుతుందని భావించవచ్చు. అయితే, ఆయా రంగాల్లో మెరుగైన కంపెనీలను వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం కష్టమైన ప్రక్రియే.
ఇక్కడే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సాధనాలైన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అక్కరకొస్తాయి. నిర్దిష్ట సూచీపై ఆధారితమై ఉండే ఈటీఎఫ్‌లు.. షేర్ల ఎంపికలో రిస్కులను తగ్గించడంతో పాటు వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా తోడ్పడతాయి. ఇవి ఎక్సే్చంజీలో ట్రేడవుతాయి కాబట్టి సులభంగానే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అందుకే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ థీమ్‌లు, రంగాల ఆధారిత సూచీలు, ఈటీఎఫ్‌ల గురించి అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక కథనం.
► వినియోగం: ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్, ఆటో, టెలికం, హోటల్స్, మీడియా.. వినోదం, కన్జూమర్ గూడ్స్ .. సర్వీసులు, టెక్స్‌టైల్స్ వంటి వాటిపై ఖర్చు చేసే ధోరణులు కూడా పెరుగుతుంటుంది. మార్కెట్ క్యాప్ పరంగా భారీవైన 30 వినియోగ ఉత్పత్తుల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ సూచీ ద్వారా అవకాశం దొరుకుతుంది.
► హెల్త్‌కేర్: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, ఔషధాల తయారీ సంస్థలు, పరిశోధన.. అభివృద్ధి సంస్థలు మొదలైనవి హెల్త్‌కేర్ రంగం కిందికి వస్తాయి. ఇలాంటి 20 బడా హెల్త్‌కేర్ ఆధారిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ సహాయపడుతుంది.
► టెక్నాలజీ: క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి టెక్నాలజీ రంగాన్ని నడిపిస్తున్నాయి. సమీప, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో దాదాపు ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ద్వారా 10 పెద్ద ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
► బ్యాంకింగ్: ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకింగ్ రంగంతో ముడిపడే ఉంటాయి. ఇంతటి కీలకమైన బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సహాయకరంగా ఉంటుంది. ఈ సూచీలో ప్రధానంగా 95.7 శాతం వాటా లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీలదే ఉంటోంది.
► బంగారం: సెంటిమెంటుపరంగానే కాకుండా ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా కూడా బంగారానికి ఉన్న ప్రాధాన్యతను వేరే చెప్పనక్కర్లేదు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌లో ఇది ఎంతో ప్రత్యేకం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పసిడిలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉపయోగపడతాయి. దొంగల భయం, స్టోరేజీ, ప్యూరిటీ మొదలైన వాటి గురించి ఆందోళన పడే పరిస్థితి ఉండదు.
► ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్): ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్‌కం .. రెండు సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక మార్గం. ఇందులో వ్యక్తిగత ఇన్వెస్టరు.. దేశీ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలకు తగ్గ విధంగా రాబడులు అందించే దిశగా.. ఈ దేశీ ఫండ్ ఆ డబ్బును ఇతర దేశీయ లేదా అంతర్జాతీయ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ఈక్విటీ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లలోనూ పెట్టుబడుల కారణంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు ఆస్కారం ఉంటుంది.
ఈటీఎఫ్‌లతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు స్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి భద్రత ఉంటుంది. తక్కువ పెట్టుబడి వ్యయాలతో.. మార్కెట్లలో సత్వరం ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అవసరాలు తీరడం తో పాటు ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే భవిష్యత్‌లో మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలు కాగలదు. అలాగే, పన్నుపరంగా చూసినా ఈటీఎఫ్‌లు ప్రయోజనకరంగానే ఉంటాయి.
– అశ్విన్ పట్ని, ప్రోడక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ విభాగం హెడ్, యాక్సిస్ ఏఎంసీ
Comments
Please login to add a commentAdd a comment