ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇండెక్స్ ఫండ్స్ కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వ్యయాలపరంగా కాస్త చౌకగా ఉండటంతో పాటు అర్థం చేసుకోవడానికి సులభతరంగా ఉండటం కూడా వీటికి సానుకూలాంశం. దీర్ఘకాలికంగా సంపద సృష్టికి అనువైనవిగా నిరూపించుకున్నాయి. అమెరికా తదితర సంపన్న దేశాల్లో వందల కొద్దీ ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్చంజీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఉన్నప్పటికీ.. భారత్‌లో ఇవి ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం పలు అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు .. పెద్ద సంఖ్యలోనే ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. వందలకొద్దీ మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఈ ఇండెక్స్ ఫండ్స్ సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల ముందు ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ఈటీఎఫ్‌ల సంగతేంటి? ఎక్కడ మొదలెట్టాలి.. లాంటి సందేహాలెన్నో వస్తాయి. ఇందుకోసం బేరీజు వేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
ప్రత్యామ్నాయం.. ఈటీఎఫ్‌లు
ఇక ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఈటీఎఫ్‌లు మిగతా షేర్లలాగానే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతుంటాయి. ఇండెక్స్ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. నిర్వహిస్తుంటాయి. సాధారణంగా ఈటీఎఫ్‌లలో యూనిట్లు కొంటే ఓ రేటు, అమ్మితే ఇంకో రేటులాగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. తక్కువ వ్యయాలతో దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కేటాయింపుల కోసం ఇండెక్స్ ఫండ్స్ చాలా మెరుగైన సాధనాలనే చెప్పవచ్చు. ఫండ్స్ మేళవింపే 90 శాతం పైగా రాబడులకు కీలకంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాం.. దేన్ని.. ఎప్పుడు అమ్మేశాం.. అన్నది కాకుండా పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. వివిధ రకాల అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇండెక్స్ ఫండ్స్‌ను నిస్సందేహంగా పరిశీలించవచ్చు.
రిస్క్ సామర్థ్యం
ముందుగా మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఎంతవరకూ రిస్కు తీసుకోగలరో అర్థం చేసుకుని, దానికి కట్టుబడి ఉండాలి. రిస్క్ సామర్థ్యంపై అవగాహన లేకపోతే.. బుల్ మార్కెట్లలో మరీ దూకుడుగా ఉండటమో, బేర్ మార్కెట్లలో మరీ వెనక్కి తగ్గిపోవడమో చేయడంవల్ల మొత్తం సంపదనంతా పోగొట్టుకునే అవకాశం ఉంది.
అనువైన సాధనం
మార్కెట్లో బోలెడన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు.. పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టరు.. మరీ ఎక్కువగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోవడం శ్రేయస్కరం. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు కొంత మొత్తంలో కేటాయించవచ్చు. ఇక అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లు.. షేర్లలోనూ, మిడ్.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనూ కాస్త పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి. అవేంటంటే.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టోరల్, ఇంటర్నేషనల్ ఫండ్స్.
లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లో భారత్‌లోని టాప్ 100 స్టాక్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో తదుపరి 150 స్టాక్స్ (101–250), స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో మిగతా స్టాక్స్ (250 ప్లస్) ఉంటాయి. గత రాబడులు చూస్తే.. సెక్టోరల్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆకర్షణీయంగానే కనిపించవచ్చు. అయినప్పటికీ ఇవి చాలా రిస్కుతో కూడుకున్నవే కాకుండా తీవ్ర హెచ్చుతగ్గులకు కూడా లోనవుతుంటాయన్నది గుర్తుంచుకోవాలి. సురక్షితమైన సాధనం కావాలనుకునే వారు లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ (నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కాకుండా, ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. రూపాయి మారకం విలువ క్షీణించినప్పుడు హెడ్జింగ్‌కు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు.. ఇంటర్నేషనల్ ఫండ్స్ తోడ్పడతాయి. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.
సరైన ఫండ్ ఎంపిక
అనేక రకాల ఫండ్స్ సంస్థలు దాదాపు ఒకే రకమైన ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో గందరగోళం తలెత్తడం సహజం. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రస్తుతం చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకే రకంగానే కనిపించినా.. ఇన్వెస్టర్లు ప్రధానంగా వ్యయాలపైన (టోటల్ ఎక్స్‌పెన్స్ నిష్పత్తి), ట్రాకింగ్ ఎర్రర్‌ని (టీఈ) పరిశీలించాలి. ప్రామాణిక సూచీ ఇచ్చే రాబడితో పోలిస్తే ఫండ్ ఎంత రాబడి ఇస్తోందన్నది టీఈ ద్వారా తెలుస్తుంది. అయితే, ప్రామాణిక సూచీ పనితీరునే కచ్చితంగా ప్రతిబింబించడం ఏ ఫండ్‌కైనా అసాధ్యమే. ట్రేడింగ్ వ్యయాలు, పన్నులు, వ్యయాల నిష్పత్తి మొదలైన వాటి కారణంగా ప్రతీ ఏటా.. ఎంతో కొంత టీఈకి దారి తీస్తుంది. చాలా సందర్భాల్లో వ్యయాల నిష్పత్తులు ఎంత ఎక్కువగా ఉంటే టీఈ అంత ఎక్కువగా ఉంటుంది. కనుక.. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment