Index funds
-
కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకుంటే తిరుగుండదు!
Index funds: సులువుగా అర్థమయ్యేలా ఉంటూ, పెట్టుబడులను సులభతరం చేసే చక్కని వ్యూహంగా ఇండెక్స్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? నిర్దిష్ట ప్రామాణిక సూచీని ట్రాక్ చేసే ఒక తరహా మ్యుచువల్ ఫండ్స్‌ను ( mutual fund ) ఇండెక్స్ ఫండ్స్ అంటారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి విస్తృత సూచీలను లేదా నిర్దిష్ట రంగానికి చెందిన నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ వంటి సూచీలను ట్రాక్ చేసేలా ఇవి ఉండొచ్చు. సదరు సూచీలోని కంపెనీల షేర్లను, అదే వెయిటేజీతో ఈ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాలకు చెందిన కొన్ని కీలక స్టాక్స్ సమూహాన్ని ఇండెక్స్‌గా వ్యవహరిస్తారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వీటిలో ఉంటాయి. ఇవి రెండూ కూడా నిర్దిష్ట సూచీని ట్రాక్ చేసేవే అయినా వీటి పని తీరులో మార్పులు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే పని చేస్తాయి. రోజు ముగిసే నాటి ఎన్ఏవీ ప్రకారం వీటి యూనిట్లను ఏఎంసీల్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇక ఈటీఎఫ్‌లు పేరుకు తగ్గట్లే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి, షేర్ల తరహాలోనే ట్రేడ్ అవుతుంటాయి. ఏఎంసీ ప్రస్తావన లేకుండా ఇన్వెస్టర్లు వీటిని నేరుగా ఎక్సే్చంజ్ నుంచే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ప్రయోజనాలు ఏమిటి? సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యూహం. వ్యక్తిగతంగా ఏ ఒక్క స్టాక్ పైనో పక్షపాతం చూపించే పరిస్థితి లేకుండా ముందుగానే నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టాక్స్ ఎంపిక ఉంటుంది. మార్కెట్‌ను బట్టి పని చేస్తుంది. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా ఉండరు కాబట్టి సాధారణంగా యాక్టివ్ మ్యుచువల్ ఫండ్‌తో పోలిస్తే వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. వ్యయాలు తక్కువ ఎందుకంటే? ముందే చెప్పుకున్నట్లు ఇండెక్స్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజరు ప్రత్యేకంగా స్టాక్స్ ఎంపిక చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పని ఉండదు. కాబట్టి పరిశోధనలపరమైన వ్యయాలూ ఉండవు. పైగా యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే పోర్ట్‌ఫోలియోలో మార్పులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అందుకే వీటి వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఎవరికి అనువైనవి? సులభతరమైన, సమర్ధమంతమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఎవరికైనా అనువైనవే. సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఇక అనుభవమున్న ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ క్యాప్వ్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసేందుకు, నిర్దిష్ట ఇండెక్స్ వ్యూహాలను అమలు చేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ట్రాకింగ్ వ్యత్యాసాలు అంటే? బెంచ్ మార్క్, ఫండ్‌కి సంబంధించి పనితీరు అలాగే రాబడుల్లో వ్యత్యాసాలను ట్రాకింగ్ ఎర్రర్‌గా వ్యవహరిస్తారు. ఇది ఫండ్ పనితీరు సమర్ధతను సూచిస్తుంది. ఇక, ఫీజులు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ఫండ్ అందించే రాబడులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏఎంసీకి (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ) ఆన్లైన్లో లేదా ఫిజికల్‌గా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తమ డిస్ట్రిబ్యూటర్ లేదా రిలేషన్షిప్ మేనేజర్‌ను సంప్రదించడం ద్వారా కూడా చేయొచ్చు. అలాగే లేటెస్ట్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా చేసేందుకు వీలుంది. ఏమేమి రిస్కులు ఉంటాయి? సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహా రిస్కులన్నీ ఇండెక్స్ ఫండ్స్‌కి కూడా ఉంటాయి. వాటికి అదనంగా ట్రాకింగ్ ఎర్రర్, ట్రాకింగ్ డిఫరెన్స్, సూచీ ఆధారిత రిస్కులు, నిర్వహణపరమైన రిస్కులు మొదలైనవి ఉంటాయి. పథకానికి సంబంధించిన రిస్కులను గురించి తెలుసుకునేందుకు స్కీమ్ సమాచారపత్రాన్ని ముందుగానే క్షుణ్నంగా చదువుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్‌పై పన్ను విధానం ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్‌ని బట్టి ఇండెక్స్ ఫండ్స్‌పై పన్నులు వర్తిస్తాయి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్‌కి ఈక్విటీ ట్యాక్సేషన్, అలాగే డెట్ ఇండెక్స్ ఫండ్స్‌కి డెట్ ట్యాక్సేషన్ విధానం ఆధారంగా పన్నులు ఉంటాయి. ఏదైనా సరే, ఇన్వెస్ట్ చేసే ముందుగానే స్కీమ్ వివరాలతో కూడిన డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. - సమాధానాలు - నీరజ్ సక్సేనా ఫండ్ మేనేజర్, బరోడా బీఎన్పీ పారిబాస్ -
ఇండెక్స్ ఫండ్ ఎంపిక ఎలా?
ఇండెక్స్ ఫండ్ ఎంపిక ఎలా? మల్టీక్యాప్ పేరుతో కొత్తగా వస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – ఆశిష్ ఈ తరహా పథకాల నుంచి సరైన రాబడులు అందుకోగలమా? అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఉంది. నేడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుసరిస్తున్న పెట్టుబడుల విధానాన్ని గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పాటించాయి. వాటిపై ఎటువంటి నియంత్రణలు లేవు. కనుక మార్కెట్ క్యాప్ పరిమితితో సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ కొద్దీ అన్ని రకాల మార్కెట్ క్యాప్ ఆధారిత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేవారు. దీంతో వాటి విధానం మార్చే దిశగా సెబీ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మల్టీక్యాప్ ఫండ్స్ కచ్చితంగా కనీసం 25 శాతం లార్జ్‌క్యాప్, 25% మిడ్‌క్యాప్, 25% స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా వరకు మల్టీక్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల పెరంగా పెద్ద గా మారిపోయాయి. దీంతో 25% చొప్పున ప్రతీ విభాగంలో పెట్టుబడులు కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్నది వాటికి ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే భారీ పెట్టుబడులకు తగ్గ అవకాశాలు స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో అన్ని వేళలా ఉండాలని లేదు. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ మార్కెట్‌కు ఇది ప్రతికూలంగా మారుతుందని గుర్తించి.. ఫ్లెక్సీక్యాప్ పేరుతో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టింది. 25 శాతం చొప్పున కచ్ఛితంగా ప్రతీ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం వీలు కాకపోతే మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ వెసులుబాటునిచ్చింది. దీంతో చాలా మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయాయి. కొత్త పథకం ఆవిష్కరించడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని మ్యూచువల్ ఫండ్ సంస్థలు భావించాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే ఉండాలన్నది సెబీ నిబంధన. దీంతో మల్టీక్యాప్ నుంచి ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయిన ఫండ్స్ సంస్థలు.. మల్టీక్యాప్ విభాగంలో కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) తీసుకొస్తున్నాయి. కనుక అవి తమకు అనుకూలమా? కాదా? అన్నది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కాల వ్యవధి, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాలి. మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? – శశాంక్ ముందుగా పథకం ఎక్స్పెన్స్ రేషియో చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01%, 1.99%గా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఇక్కడ కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. -
మంచి రాబడిని ఇచ్చే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఏదీ?
నాకు ఎనిమిది వరకు ఆర్ధిక లక్ష్యాలు ఉన్నాయి. ప్రతీ లక్ష్యానికి విడిగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవాలా? అలా అయితే పర్యవేక్షణకు ఇబ్బంది కాదా? – శివాని లక్ష్యాలు, పోర్ట్‌ఫోలియో మధ్య సమతూకం ఉండాలి. ముందుగా సమీప కాలంలోని లక్ష్యాలను వేరు చేయండి. అలాగే, మధ్య కాలం, దీర్ఘకాల లక్ష్యాలను కూడా వేరు చేయండి. ఇప్పుడు స్వల్పకాల, మధ్యకాల లక్ష్యాలను సైతం.. రాజీ పడతగ్గ, రాజీపడలేని అనే రెండు విభాగాలుగా వేరు చేయండి. రాజీపడలేని అంటే రిస్క్ తీసుకోని పెట్టుబడులు. రిస్క్ తీసుకోలేని మధ్యకాలం లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటికోసం ఒక్కటే పోర్ట్‌ఫోలియో సరిపోతుంది. ఈ పెట్టుబడుల కోసం ఈక్విటీలపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఇక దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులను అంటే తదుపరి ఐదేళ్ల కాలం వరకు అవసరం లేని పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ప్రతీ లక్ష్యానికి విడిగా ఎంత చొప్పున కావాలి, ఎంత వ్యవధి ఉందనే దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ లక్ష్యానికి కావాల్సిన నగదు మీరు కోరుకున్న సమయంలో లభించేలా ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5 లక్షలు కావాలి, ఐదేళ్లలో రూ.5 లక్షల కావాలనుకుంటే లేదా 25–30 ఏళ్లలో రూ.కోటి రూపాయలు (రిటైర్మెంట్) కావాలనుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వేర్వేరు పోర్ట్ఫోలియోలన్నవి కాలవ్యవధికి అనుగుణంగానే ఉండాలి. స్వల్పకాల లక్ష్యాల కోసం ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లకు మించిన ఏ లక్ష్యానికైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు లక్ష్యాల వారీగా కాకుండా, కాలవ్యవధి ఆధారంగా ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలు ఉంటాయి. ఇందుకోసం వ్యాల్యూరీసెర్చ్ ఆన్లైన్లో ‘మై ఇన్వెస్ట్మెంట్’ టూల్‌ను వినియోగించుకోవచ్చు. ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వివిధ లక్ష్యాలకు అనుగుణంగా ఈ టూల్‌తో వేరు చేసుకోవచ్చు. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో ఏది మంచిదనే విషయంలో సందేహం నెలకొంది. పథకం ఎంపిక చేసుకోవడం ఎలా? – స్వామినాథన్ ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందో చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్బీఐ, యూటీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. -
మిరే అసెట్ నుంచి టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రారంభించింది. అవి, మిరే అసెట్ నిఫ్టీ ఎఎఎ పిఎస్‌యు బాండ్ ప్లస్ ఎస్డిఎల్ ఏప్రిల్ 2026 50:50 ఇండెక్స్ ఫండ్, మిరే అసెట్ క్రిసిల్ ఐబిఎస్ గిల్ట్ ఇండెక్స్– ఏప్రిల్ 2033 ఇండెక్స్ ఫండ్. మొదటిది 2026 ఏప్రిల్ 30తో మెచ్యూర్ అయ్యే ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లు, రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక రెండోది 2033 ఏప్రిల్ 29 నాటికి మెచ్యూర్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీల్లో మదుపు చేస్తుంది. కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కుతో మెరుగైన రాబడి అందుకునేందుకు ఇవి ఉపయోగకరంగా ఉండగలవని సంస్థ తెలిపింది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు అక్టోబర్ 18న ముగుస్తాయి. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాలి. సంస్థ సీఐవో (ఫిక్సిడ్ ఇన్‌కం) మహేంద్ర జాజూ ఈ ఫండ్లను నిర్వహిస్తారు. -
ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఫండ్స్ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది. జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్పీ, మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ, మిరే అస్సెట్ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ అమర్ రాను తెలిపారు. ప్యాసివ్ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్ ఇండెక్స్ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 176 కొత్త పథకాలు.. 2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు చెప్పారు. -
ఇండెక్స్ ఫండ్స్.. ఆప్షన్లు ఎన్నో..!
మ్యూచువల్ ఫండ్స్‌లో ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్)కు ఆదరణ పెరుగుతోంది. రెండేళ్ల క్రితం ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో రూ.8,000 కోట్ల ఆస్తులు ఉంటే.. అవి ఇప్పుడు రూ.50,000 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, లార్జ్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్ పనితీరు అంత ఆశాజనకంగా లేకపోవడం, తక్కువ వ్యయాలు.. వెరసి ప్యాసివ్ ఫండ్స్‌కు ఆదరణ విస్తరిస్తోంది. ఆయా సూచీల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవే ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ పనితీరు స్థాయిలో రాబడులను అందించడం వీటి ప్రత్యేకత. యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. మరి రాబడులు సంగతి ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్‌లో అసలు ఎన్ని రకాలున్నాయి? తమ లక్ష్యానికి అనుకూలమేనా? వీటికి సమాధానమే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. నేడు వివిధ సూచీలను అనుసరించి పెట్టుబడులు పెట్టే ఇండెక్స్ ఫండ్స్ 50 వరకు ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మూమెంటమ్, క్వాలిటీ ఇలా ఎన్నో విభాగాల్లో ప్యాసివ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌ను తీసుకుంటే.. ఈ పథకం నిఫ్టీ–50లోని కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగినట్టు పెట్టుబడులు పెడుతుంది. ఇందులో ఫండ్ మేనేజర్ ప్రమేయం పెద్దగా ఉండదు. కానీ, యాక్టివ్ ఫండ్స్ అలా కాదు. ఆయా పథకం పెట్టుబడుల విధానాన్ని అనుసరించి ఇండెక్స్‌లో కాకుండా.. మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అంటారు. వీటిల్లో రాబడులు ఫండ్స్ మేనేజర్ నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలన్న స్వేచ్ఛ వారికి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, కంపెనీల్లో జరిగే పరిణామాలు, ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా వీరు పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. అధిక రాబడులను ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తుంటాయి. కనుక వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకనో గానీ, గతంతో పోలిస్తే మన మార్కెట్ కొంత పరిపక్వత సాధించిన నేపథ్యంలో ఏవో కొన్ని మినహాయిస్తే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ రాబడులు సూచీలతో పోలిస్తే ఏమంత మెరుగ్గా ఉండడం లేదు. అందు కనే ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ గణనీయంగా ఉంటుంది. మన దగ్గరే ఇది ఇంకా మొగ్గ దశలోనే ఉంది. యూఎస్ మార్కెట్లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో 35% ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్నాయి. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అన్నింటిలోకి లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్ విభాగంలోనే ఎక్కువ యాక్టివ్ ఫండ్స్ సూచీలకు మించి రాబడులను ఇవ్వలేకపోతున్నాయి. 2018లో సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఫలితంగా ఈ విభాగంలో ప్యాసివ్ ఫండ్స్‌ను ఆశ్రయించే ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. నేడు లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో (ప్యాసివ్ ఫండ్స్) ఎన్నో భిన్నమైన పథకాలు అందుబాటులో ఉండడాన్ని గమనించాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, నిఫ్టీ నెక్ట్స్ 50 టీఆర్ఐ, నిఫ్టీ 100 టీఆర్ఐ, ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐ, లో వోలటాలిటీ ఇండెక్స్ ఫండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. టీఆర్ఐ అంటే మొత్తం సూచీ రాబడులుగా చూడాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, సెన్సెక్స్ టీఆర్ఐ ఫండ్స్ అన్నవి ఈ రెండు సూచీల్లోని అగ్రగామి లార్జ్‌క్యాప్ కంపెనీలను ప్రతిఫలిస్తాయి. గడిచిన పదేళ్లలో సగటున సూచీల స్థాయిలోనే ఇవి రాబడులు ఇచ్చాయి. అదే విధంగా సూచీలు ప్రతికూల రాబడులను ఇచ్చిన సందర్భాల్లోనూ ఈ పథకాల్లో నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కనుక ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే ఈ రెండు సూచీలకు సంబంధించి ఏదేనీ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్‌కు సంబంధించి ట్రాకింగ్ ఎర్రర్ అని ఒకటి ఉంటుంది. సూచీతో పోలిస్తే పథకం ఇచ్చిన రాబడులకు మధ్య ఉన్న అంతరమే ట్రాకింగ్ ఎర్రర్. చాలా వరకు లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు ట్రాకింగ్ ఎర్రర్ 0.10–0.27 శాతం మధ్య ఉంటుంది. అంటే ఒక సూచీ ఏడాది కాలంలో 16 శాతం రాబడులను ఇస్తే, అదే సూచీని అనుసరించే ఇండెక్స్ ఫండ్ రాబడి 15.90 శాతం మేర ఉండొచ్చు. అప్పుడు 0.10 శాతాన్ని ట్రాకింగ్ ఎర్రర్‌గా పేర్కొంటారు. అందుకని ఇండెక్స్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న దానిని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలంలో సూచీలతో పోలిస్తే తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉండి, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో పథకం అయితే ఇంకా మంచిది. ఐడీఎఫ్సీ నిఫ్టీ ఫండ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.08 శాతం మేర ఉంటే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో 0.17 శాతం ఉంది. వీటి డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ 0.16 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తోంటే, నిప్పన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.15 శాతంగా ఉంది. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.16 శాతంలోపే ఉంది. ఇవన్నీ మూడేళ్లకు పైగా పనిచేస్తున్న పథకాలు. నిఫ్టీ 100 నిఫ్టీ 100 టీఆర్ఐ అన్నది మార్కెట్ విలువలో టాప్–100 కంపెనీలను ప్రతిఫలిస్తుంది. ఇవన్నీ లార్జ్‌క్యాప్ కిందకే వస్తాయి. ఈ లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌ను ప్రతిఫలించే ప్యాసివ్ ఫండ్స్‌ను ఇటీవలే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించాయి. కనుక ఈ పథకాలకు దీర్ఘకాల చరిత్ర లేదు. అయినప్పటికీ సూచీల స్థాయిలో రాబడిని వీటి నుంచి ఆశించొచ్చు. ఎన్ఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో నిఫ్టీ 100 కంపెనీల వాటా 70 శాతంగా ఉంది. నిఫ్టీ 50, సెన్సెక్స్ స్థాయిలోనే రాబడులు వీటిలో ఉండొచ్చు. నిఫ్టీ నెక్ట్స్ 50 మార్కెట్ విలువ పరంగా 51వ స్థానం నుంచి 100 వరకు ఉన్న కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీ కిందకు వస్తాయి. టాప్ 50 కంపెనీలు నిఫ్టీ 50 కింద ఉంటాయి. కానీ, నిఫ్టీ–50తో పోలిస్తే నెక్ట్స్ 50లో ఎక్కువ అస్థిరత కనిపిస్తుంది. కనుక రిస్క్‌ను సర్దుబాటు చేసుకునే, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.14 శాతం మేర ఉంది. ఈ రెండూ కూడా 0.30 శాతం, 0.33 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తున్నాయి. ఒకవేళ ఇన్వెస్టర్లు ఎవరైనా నిఫ్టీ–50, నిఫ్టీ నెక్ట్స్50 పథకాల్లో విడిగా ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే.. దీనికి బదులు నేరుగా నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సూచీల్లో ఉండే కంపెనీలే నిఫ్టీ 100 సూచీలోనూ ఉంటాయి. కాకపోతే వెయిటేజీ పరంగా అంతరం చూడొచ్చు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అధిక రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ కోసం చూస్తుంటే.. నిఫ్టీ 150 టీఆర్ఐను అనుసరించే నాలుగు పథకాలు ఉన్నాయి. ఇక్కడ యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్ విభాగంలో ఒక్క యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ మినహా మిగిలిన అన్ని యాక్టివ్ పథకాలు సూచీలకు సమానంగా, అంతకంటే అధిక రాబడులను ఇచ్చాయి. కానీ, ప్రతికూల పరిస్థితుల్లో సూచీలతో పోలిస్తే అధిక నష్టాలను కూడా పంచాయి. అందుకనే ఈ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ ఎంపిక మెరుగైనది అవుతుంది. ఉన్న నాలుగు ఇండెక్స్ ఫండ్స్‌లో మూడు 2021లో మొదలైనవి. మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన పథకం 2019లో ప్రారంభమైంది. కనుక వీటి రాబడులను విశ్లేషించడానికి కొంత సమయం ఇవ్వాల్సిందే. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చినవే. వీటికి సంబంధించి దీర్ఘకాల ట్రాక్ రికార్డు లేదు. ఈ విభాగంలో మూడు పథకాలు ఉండగా, అన్నీ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250టీఆర్ఐను అనుసరించేవే. స్ట్రాటజీ ఇండెక్స్ ఫండ్స్ (వ్యూహాత్మకమైనవి) ఇండెక్స్‌లోని కాంపోనెంట్స్లోనే కొన్ని అంశాల ఆధారంగా ఎంపిక చేసిన షేర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ అన్నది.. నిఫ్టీ 200 ఇండెక్స్‌లోని మూమెంటమ్ పరంగా టాప్ 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందుకు ఆయా స్టాక్స్ ధరల కదలికలు ప్రామాణికం అవుతాయి. అలాగే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ 30 ఇండెక్స్ కూడా ఒకటి. అంటే నిఫ్టీ 100 సూచీలోని 100 కంపెనీల్లో తక్కువ అస్థిరతలతో ఉన్న 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇండెక్స్‌లకు సంబంధించి ఈక్వల్ వెయిట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవేమి చేస్తాయంటే ఆయా సూచీల్లోని కంపెనీల్లో వాటికున్న వెయిటేజీ ప్రకారం ఇన్వెస్ట్ చేయవు. అన్ని కంపెనీలకు సమాన కేటాయింపులు చేస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ 50లో ఒక్క రిలయన్స్ వెయిటేజీ 10.86 శాతంగా ఉంది. సాధారణ నిఫ్టీ 50 ఫండ్ అయితే తనవద్దనున్న నిర్వహణ ఆస్తుల్లో 10.86 శాతాన్ని రిలయన్స్‌కు కేటాయిస్తుంది. ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అలా కాదు. నిఫ్టీ 50 కంపెనీలకు ఒక్కో దానికి 2 శాతం చొప్పున కేటాయింపులు చేస్తుంది. దీనివల్ల ఒకటే రంగంలో ఎక్కువ పెట్టుబడులు పోగు పడవు. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్‌కు వెయిటేజీ ఎక్కువ. ఈక్వల్ వెయిటేజీ ఇండెక్స్ ఫండ్‌కు వస్తే సమాన కేటాయింపులు చేస్తుంది కనుక దీన్ని నిరోధించొచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లోనే భిన్నమైన ఎక్స్పోజర్ కోరుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ క్వాలిటీ స్కోరు ఆధారంగా నిఫ్టీ 100 కంపెనీల్లో మెరుగైన 30 కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి. క్వాలిటీ అంటే.. అధిక లాభదాయకత ను చూపిస్తున్న కంపెనీలు. అంటే కంపెనీల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) అధికంగా ఉంటుంది. ఈక్విటీతో పోలిస్తే తక్కువ రుణ భారం ఉన్నవి. అలాగే, ఆదాయం, లాభాల్లో పెద్దగా అస్థిరతలు లేనివి ఈ ఇండెక్స్ కిందకు వస్తాయి. క్వాలిటీ స్కోరు, ఫ్రీ ఫ్లోట్ మా ర్కెట్ క్యాప్ ఆధారంగా కేటాయింపులు ఉంటాయి. అయితే, నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ రాబడులు.. నిఫ్టీ 100 కంటే గడిచిన 3–5 ఏళ్లలో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాణ్యతకు, తక్కువ అస్థిరతలకు ప్రాధాన్యం ఉం టుంది. అందుకని రాబడి తక్కువ ఉన్నప్పటికీ, మార్కెట్ పతనాల్లో నషా ్టలు కూడా పరి మితంగా ఉంటాయని గమనించాలి. ఈ విభాగంలో ఎడెల్వీజ్ మ్యూచు వల్ ఫండ్ ఒక్కటే నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రారంభించి ఆరు నెలలే అయింది. ఎక్స్పెన్స్ రేషియో 0.27 శాతమే ఉంది. నిఫ్టీ 200 మోమెంటమ్ 30 ఇండెక్స్ ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపిం చిన కంపెనీలు ఈ ఇండెక్స్ పరిధిలోకి వస్తాయి. గడిచిన 6, 12 నెలల్లో నిఫ్టీ టాప్ 200 కంపెనీల్లో (లార్జ్ అండ్ మిడ్‌క్యాప్) అధిక రాబడులను ఇచ్చిన టాప్ 30 కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసేవే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్స్. సూచీల కంటే ఈ పథకాల్లో రాబడి 6% అధికంగా ఉంది. యూటీఐ మ్యూచువల్ పండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూ చువల్ ఫండ్ సంస్థలు ఈ పథకాలను అందిస్తున్నాయి. ఈ రెండూ గడచిన ఏడాది కాలంలో ఆరంభమైనవి. పెద్దగా ట్రాక్ రికార్డు లేదు. గమనిక యాక్టివ్ ఫండ్స్‌కు సంబంధించి స్మాల్‌క్యాప్ విభాగం ఒక్కటీ భిన్నంగా ఉంది. అన్ని పేరున్న స్మాల్‌క్యాప్ యాక్టివ్ పథకాలు సూచీలకంటే అధిక రాబడులిస్తున్నాయి. అంతేకాదు, అస్థిరతలూ తక్కువగా ఉంటున్నాయి. అధిక రిస్క్ భరించగలిగేవారు స్మాల్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్‌కు బదులు యాక్టివ్ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. వీటిలో ఎస్బీఐ, యాక్సిస్, నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తున్నాయి. -
పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్స్
ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇండెక్స్ ఫండ్స్ కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వ్యయాలపరంగా కాస్త చౌకగా ఉండటంతో పాటు అర్థం చేసుకోవడానికి సులభతరంగా ఉండటం కూడా వీటికి సానుకూలాంశం. దీర్ఘకాలికంగా సంపద సృష్టికి అనువైనవిగా నిరూపించుకున్నాయి. అమెరికా తదితర సంపన్న దేశాల్లో వందల కొద్దీ ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్చంజీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఉన్నప్పటికీ.. భారత్‌లో ఇవి ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం పలు అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు .. పెద్ద సంఖ్యలోనే ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. వందలకొద్దీ మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఈ ఇండెక్స్ ఫండ్స్ సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల ముందు ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ఈటీఎఫ్‌ల సంగతేంటి? ఎక్కడ మొదలెట్టాలి.. లాంటి సందేహాలెన్నో వస్తాయి. ఇందుకోసం బేరీజు వేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యామ్నాయం.. ఈటీఎఫ్‌లు ఇక ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఈటీఎఫ్‌లు మిగతా షేర్లలాగానే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతుంటాయి. ఇండెక్స్ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. నిర్వహిస్తుంటాయి. సాధారణంగా ఈటీఎఫ్‌లలో యూనిట్లు కొంటే ఓ రేటు, అమ్మితే ఇంకో రేటులాగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. తక్కువ వ్యయాలతో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కేటాయింపుల కోసం ఇండెక్స్ ఫండ్స్ చాలా మెరుగైన సాధనాలనే చెప్పవచ్చు. ఫండ్స్ మేళవింపే 90 శాతం పైగా రాబడులకు కీలకంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాం.. దేన్ని.. ఎప్పుడు అమ్మేశాం.. అన్నది కాకుండా పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. వివిధ రకాల అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇండెక్స్ ఫండ్స్‌ను నిస్సందేహంగా పరిశీలించవచ్చు. రిస్క్ సామర్థ్యం ముందుగా మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఎంతవరకూ రిస్కు తీసుకోగలరో అర్థం చేసుకుని, దానికి కట్టుబడి ఉండాలి. రిస్క్ సామర్థ్యంపై అవగాహన లేకపోతే.. బుల్ మార్కెట్లలో మరీ దూకుడుగా ఉండటమో, బేర్ మార్కెట్లలో మరీ వెనక్కి తగ్గిపోవడమో చేయడంవల్ల మొత్తం సంపదనంతా పోగొట్టుకునే అవకాశం ఉంది. అనువైన సాధనం మార్కెట్లో బోలెడన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు.. పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టరు.. మరీ ఎక్కువగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోవడం శ్రేయస్కరం. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు కొంత మొత్తంలో కేటాయించవచ్చు. ఇక అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లు.. షేర్లలోనూ, మిడ్.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనూ కాస్త పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి. అవేంటంటే.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టోరల్, ఇంటర్నేషనల్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లో భారత్‌లోని టాప్ 100 స్టాక్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో తదుపరి 150 స్టాక్స్ (101–250), స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో మిగతా స్టాక్స్ (250 ప్లస్) ఉంటాయి. గత రాబడులు చూస్తే.. సెక్టోరల్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆకర్షణీయంగానే కనిపించవచ్చు. అయినప్పటికీ ఇవి చాలా రిస్కుతో కూడుకున్నవే కాకుండా తీవ్ర హెచ్చుతగ్గులకు కూడా లోనవుతుంటాయన్నది గుర్తుంచుకోవాలి. సురక్షితమైన సాధనం కావాలనుకునే వారు లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ (నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కాకుండా, ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. రూపాయి మారకం విలువ క్షీణించినప్పుడు హెడ్జింగ్‌కు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు.. ఇంటర్నేషనల్ ఫండ్స్ తోడ్పడతాయి. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. సరైన ఫండ్ ఎంపిక అనేక రకాల ఫండ్స్ సంస్థలు దాదాపు ఒకే రకమైన ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో గందరగోళం తలెత్తడం సహజం. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రస్తుతం చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకే రకంగానే కనిపించినా.. ఇన్వెస్టర్లు ప్రధానంగా వ్యయాలపైన (టోటల్ ఎక్స్పెన్స్ నిష్పత్తి), ట్రాకింగ్ ఎర్రర్‌ని (టీఈ) పరిశీలించాలి. ప్రామాణిక సూచీ ఇచ్చే రాబడితో పోలిస్తే ఫండ్ ఎంత రాబడి ఇస్తోందన్నది టీఈ ద్వారా తెలుస్తుంది. అయితే, ప్రామాణిక సూచీ పనితీరునే కచ్చితంగా ప్రతిబింబించడం ఏ ఫండ్‌కైనా అసాధ్యమే. ట్రేడింగ్ వ్యయాలు, పన్నులు, వ్యయాల నిష్పత్తి మొదలైన వాటి కారణంగా ప్రతీ ఏటా.. ఎంతో కొంత టీఈకి దారి తీస్తుంది. చాలా సందర్భాల్లో వ్యయాల నిష్పత్తులు ఎంత ఎక్కువగా ఉంటే టీఈ అంత ఎక్కువగా ఉంటుంది. కనుక.. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. -
ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ?
నేను మూడు ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. బిర్లా సన్‌లైఫ్ వెల్త్ యాస్పైర్ ప్లాన్, కోటక్ ప్రీమియర్ ఎండోమెంట్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ గెయిన్ ప్రీమియర్... ప్లాన్‌ల్లో నా ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తున్నాను. మ్యాక్స్ ప్లాన్‌ను 2014లో, బిర్లా సన్‌లైఫ్ ప్లాన్‌ను, కోటక్ ప్రీమియర్ ప్లాన్‌ను గత ఏడాది తీసుకున్నాను. వీటిల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? లేక వీటిని సరెండర్ చేయమంటారా? వీటిని సరెండర్ చేసి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి. –ఫరూక్, హైదరాబాద్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రెండు ప్లాన్లు–కోటక్ ప్రీమియర్, మ్యాక్స్ లైఫ్‌లు ఎండోమెంట్ ప్లాన్లు కాగా, బిర్లా సన్‌లైఫ్ యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్). ఈ మూడు ప్లాన్లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సరైనవి కావు. ఈ మూడు ప్లాన్లూ.. తగిన రాబడులను, సరిపోయినంత బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. వీటిని సరెండర్ చేయడమే ఉత్తమం. బిర్లా సన్‌లైఫ్ వెల్త్ యాస్పైర్ ప్లాన్‌కు ఐదేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ఉంది. ఈ ప్లాన్‌ను మీరు సరెండర్ చేస్తే, సరెండర్ చార్జీలను మినహాయించుకొని వచ్చిన మొత్తాన్ని డిస్కంటిన్యూడ్ పాలసీ ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఈ మొత్తం మీకు అందుతుంది. ఇక మిగిలిన రెండు ఎండోమెంట్ పాలసీలను. మూడేళ్ల తర్వాతనే సరెండర్ చేయాల్సి ఉంటుంది. వీటిని సరెండర్ చేస్తే మీరు చెల్లించిన మొత్తం ప్రీమియమ్‌ల్లో 30 శాతం మాత్రమే గ్యారంటీడ్ సరెండర్ వేల్యూగా వస్తుంది. ఈ పాలసీల సరెండర్ వల్ల మీకు ఎలాంటి లాభం లేనప్పటికీ, వీటికి ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేయండి. ఇవి ల్యాప్స్ అయ్యేలా చూడండి. వీటికి చెల్లించే మొత్తాలను మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ప్రస్తుతమున్న పాలసీలను సరెండర్ చేయడం వల్ల వచ్చే నష్టాలను కూడా పూడ్చుకునే విధంగా రాబడులు వస్తాయి. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కలగలపకండి. బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి. వీటికి ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నేను డీ–మ్యాట్ ఖాతాలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. డీ–మ్యాట్ ఖాతాలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నిర్వహణ కారణంగా నేను ఏ రకమైన వ్యయాలను చెల్లించాల్సి ఉంటుంది? –సురేఖ, విశాఖపట్టణం డీ–మ్యాట్ ఖాతాలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నిర్వహిస్తున్న కారణంగా డీ–మ్యాట్ లావాదేవీలకు సంబంధించిన వ్యయాలను మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కో డిపాజిటరీ పార్టిసిపెంట్(డీపీ)కు ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, ఒక్కో లావాదేవీకి రూ.20 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డీ–మ్యాట్ ఖాతాలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నిర్వహిస్తే, బ్రోకరేజ్ చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసే, లేదా విక్రయించే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల విలువలో ఇది సాధారణంగా 0.30 శాతం నుంచి 0.40 శాతం రేంజ్లో ఉంటుంది. ఈ వివరాలన్నీ మీ డీ–మ్యాట్ కాంట్రాక్టులో పొందుపరచబడి ఉంటాయి. చార్జీలకు సంబంధించిన సవివరమైన వివరాలు కావాలంటే, మీరు మీ డీపీని సంప్రదించవచ్చు.ఈ వ్యయాలు వద్దనుకుంటే మీరు నేరుగా సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్సైట్ నుంచి లేదా రిజిష్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ (ఆర్ అండ్ టీ) ఏజెంట్ల నుంచి మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? –కిరణ్, ఈ మెయిల్ దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొందరు ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. ఒక సూచీ(సెన్సెక్స్ లేదా నిఫ్టీ. మొదలైనవి)లో ఉన్న కంపెనీల షేర్లలో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. సూచీలో ఆయా షేర్ల వెయిటేజీని బట్టి ఆయా షేర్లలో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇతర ఫండ్స్ మాదిరి షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు చురుకుగా ఈ ఫండ్స్ నిర్వహించవు. అందుకని వీటికి వ్యయాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి చార్జ్ చేసే వ్యయాలపై ఒక పరిమితి ఉంటుంది. ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రాకింగ్ ఎర్రర్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ట్రాకింగ్ ఎర్రర్ ఎంత తక్కువగా ఉంటే ఆ ఫండ్ పనితీరు అంత సమర్థవంతంగా ఉందని అర్థం. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తున్నాయి. కానీ భారత్ వంటి ఆభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. పలు కంపెనీలు సూచీల్లో ఉన్న కంపెనీల కంటే మంచి వృద్ధిని సాధిస్తుండడమే దీనికి కారణం. ఇక ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి పలు ఇండెక్స్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. బిర్లా సన్‌లైఫ్ ఇండెక్స్ ఫండ్, ప్రాంక్లిన్ ఇండియా ఇండెక్స్ ఫండ్, హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ ఫండ్. వాటిల్లో కొన్ని. నిఫ్టీని ప్రతిబింబించే ఫండ్స్‌లో రిలయన్స్ నిఫ్టీ బీఎస్ఈఎస్ అనేది ఒక ఉత్తమమైన ఫండ్. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇండెక్స్ ఫండ్స్ అత్యుత్తమమైన సాధనాలని చెప్పలేము. ఇంతకంటే మంచి రాబడులనిచ్చే మ్యూచువల్ ఫండ్స్ అనేకం ఉన్నాయి. -
రిస్క్‌కొద్దీ రాబడి..
సాధారణంగా స్టాక్ మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాలు, అన్ని షేర్లు పాలు పంచుకోవు. కొన్ని రంగాలు ఎక్కువగా పెరిగితే మరికొన్ని తక్కువ పెరగడం లేదా నష్టాలను అందించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత ర్యాలీ కూడా ఇందుకు భిన్నం కాదు. తాజాగా మొదలైన ఈ ర్యాలీలో ఇన్ఫ్రా, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఇండెక్స్‌ల కంటే అధికరాబడులను అందిస్తుంటే టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇండెక్స్‌ల కంటే తక్కువ రాబడులను అందించాయి. గతేడాది కాలంలో నిఫ్టీ ఇండెక్స్ 39 శాతం లాభాలను అందించగా, ఇదే సమయంలో ఇన్ఫ్రా ఫండ్స్ 82నుంచి 98 శాతం లాభాలను సాధించాయి. అలాగే బ్యాంకింగ్ ఫండ్స్ 62 నుంచి 70 శాతం పెరిగితే, ఫార్మా ఫండ్స్ 52 నుంచి 62 శాతం శాతం వృద్ధి చెందాయి. కానీ థీమటిక్ కోవకు చెందిన గోల్డ్ ఫండ్స్ 10 నుంచి 13 శాతం నష్టాలను అందిస్తే, ఇంటర్నేషనల్ ఫండ్స్ 10 నుంచి 24 శాతం, అసెట్ అలకేషన్ ఫండ్స్ 22 నుంచి 47 శాతం, ఎఫ్ఎంసీజీ 32 నుంచి 36 శాతం లాభాలను అందించాయి. పనితీరు భిన్నం.. సాధారణ ఈక్విటీ ఫండ్స్ విభిన్న రంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిని డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అంటారు. కాని సెక్టోరల్/థీమటిక్ ఫండ్స్ పనితీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇవి కేవలం ఒకే రంగానికి లేదా థీమ్‌కు చెందిన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ ఫండ్స్‌నే తీసుకుంటే ఇవి కేవలం బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లలోనే ఇన్వెస్ట్‌చేస్తాయి. ఇలా ఒకే రంగానికి చెందిన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ రంగానికి సంబంధించి ఏదైనా ప్రతికూల వార్త లేదా సంఘటన జరిగినపుడు షేర్లు పడిపోయి నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎవరికి అనుకూలం.. సాధారణంగా మార్కెట్ల ర్యాలీలకు అన్నీ కాకుండా కొన్ని రంగాలు మాత్రమే నేతృత్వం వహిస్తాయి. ఇండెక్స్‌లు కంటే ఎక్కువ రాబడి పొందాలనుకునే ఈ రంగాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఉదాహరణకు ఏడాదిలో ఇండెక్స్‌లు సుమారు 39 శాతం లాభాలను అందిస్తే ఇదే సమయంలో ఇన్ఫ్రా ఫండ్స్ 90 శాతం వరకు లాభాలను అందించాయి. కానీ ఈ ఏడాది బంగారాన్ని నమ్ముకున్న వారికి మాత్రం నష్టాలు వచ్చాయి. ఎక్కువ రిస్క్ చేయగలవారికి థీమటిక్ ఫండ్స్ అనుకూలమైనవని చెప్పవచ్చు. అలాగే మీ పోర్ట్‌ఫోలియోలో ఏదైనా ఒక సెక్టార్, థీమ్‌కు సరైన ప్రాధాన్యం లభించలేదని భావించి, అది రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందనుకుంటే అప్పుడు వీటికేసి చూడొచ్చు. ఒక రంగంపై నమ్మకమున్నా.. అందులో ఏ షేర్లు కొనాలో తెలియని వారికి ఈ ఫండ్స్ అనువైనవని చెప్పొచ్చు. వీటిలో అధిక లాభాలు పొందడానికి ఎంత ఆస్కారం ఉందో అదే సమయంలో నష్టాలు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ మొత్తం వీటికి కేటాయించకూడదని నిపుణులు చెపుతారు. పోర్ట్‌ఫోలియోలో సెక్టోరల్, థీమటిక్ ఫండ్స్ వాటా 20 శాతం మించకుండా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్ థీమ్స్, సెక్టార్ పనితీరు వేగంగా మారిపోతుంటాయి. కాబట్టి థీమటిక్ ఫండ్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైనవి కావు. స్వల్పకాలంలో మార్కెట్లో నడిచే ట్రెండ్ నుంచి ప్రయోజనం పొందాలనుకునే వారికి ఇవి అనువైనవి. ఇండెక్స్ ఫండ్స్.. వివిధ ఇండెక్స్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ జూనియర్, నిఫ్టీ 500, మిడ్‌క్యాప్, డివిడెండ్ ఇండెక్స్ ఇలా విభిన్న రకాల ఇండెక్స్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌నే తీసుకుంటే ఇవి నిఫ్టీ ఇండెక్స్‌లో ఉన్న 50 షేర్లలో ఇండెక్స్ వెయిటేజ్ ఆధారంగానే ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే నిఫ్టీ 500, నిఫ్టీ మిడ్‌క్యాప్‌లు కూడా.. అంటే వీటి రాబడి దాదాపు ఆయా ఇండెక్స్‌లకు దగ్గరగా ఉంటుంది. చిన్న మొత్తంతో ఇండెక్స్‌లోని అన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్లు: ఐసీఐసీఐ నిఫ్టీ జూనియర్ ( 48%), జీఎస్ నిఫ్టీ జూనియర్ (48%), రిలయన్స్ నిఫ్టీ 100 (38%), కోటక్ సెన్సెక్స్ ఈటీఎఫ్ (36%), ఎస్బీఐ సెన్సెక్స్ ఈటీఎఫ్ (36%). ఇండెక్స్ కంటే తక్కువ రాబడి... టెక్నాలజీ.. ఇవి ప్రధానంగా కంప్యూటర్ రంగానికి చెందిన షేర్లతో పాటు ఇతర శాస్ట్రసాంకేతికరంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇండెక్స్ రాబడితో పోలిస్తే కొన్ని ఫండ్స్ సమాన రాబడిని అందించగా మరికొన్ని అంతకంటే కొద్దిగా తక్కువ రాబడిని అందించాయి టెక్నాలజీ ఫండ్స్: ఎస్బీఐ ఐటీ ఫండ్ ( 40%), ఐసీఐసీఐ టెక్నాలజీ ( 38%), బిర్లా సన్‌లైఫ్ న్యూ మిలీనియం (34%), డీఎస్పీ బ్లాక్‌రాక్ టెక్నాలజీడాట్కామ్ (33%), ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ (28%). ఎఫ్ఎంసీజీ గత కొంతకాలంగా బాగా పెరిగిన ఎఫ్ఎంసీజీ షేర్లు ఇప్పుడు ఆ స్థాయిలో పెరగడం లేదు. ఈ ఏడాది కాలంలో ఎఫ్ఎంసీజీ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఇండెక్స్‌ల కంటే తక్కువ రాబడిని అందించాయి. ఎఫ్ఎంసీజీ ఫండ్స్: ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ (36%), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎఫ్ఎంసీజీ (34%) అన్నింట్లో కొద్దికొద్దిగా.. ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియని వారికోసం అసెట్ అలకేషన్ థీమ్‌తో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త తరహా థీమ్‌ను ప్రవేశపెట్టాయి. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని ఈక్విటీలు, డెట్ పథకాలు, బంగారానికి కేటాయిస్తాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ, డెట్ ఇన్వెస్ట్మెంట్ నిష్పత్తి మారుతుంటుంది. మూడు విభిన్న రంగాలకు చెందిన సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి రాబడిని ఈక్విటీ ఇండెక్స్‌లతో పోల్చలేము. కానీ గడిచిన ఏడాది కాలంలో ఈ ఫండ్స్ 22-47% రాబడిని అందిచాయి. అసెట్ అలకేషన్ ఫండ్స్: కోటక్ అసట్ అలకేటర్ (47%), బిర్లా సన్‌లైఫ్ అసెట్ అలకేటర్ (43%), ప్రిన్సిపల్ స్మార్ట్ ఈక్విటీ (50%), ఫ్రాంక్లిన్ డైనమిక్ పీఈ (29%), పారమెరికా అసెట్ అలకేషన్ (22%). గోల్డ్ ఫండ్స్ ఇవి కేవలం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తాయి. గత ఏడాది కాలంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లకు నష్టాలను అందించాయి. పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే వారు కొద్ది మేర బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. గోల్డ్ ఫండ్స్: మోతిలాల్ ఓస్వాల్ గోల్డ్ ఈటీఎఫ్ (-11%), రెలిగేర్ గోల్డ్ ఈటీఎఫ్ (-12%), కెనరా గోల్డ్ సేవింగ్స్ (-12%), ఐడీబీఐ గోల్డ్ ఫండ్ (-12%), ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ (1-12%), ఐసీఐసీఐ గోల్డ్ ఈటీఎఫ్ (-12%).