Index funds: సులువుగా అర్థమయ్యేలా ఉంటూ, పెట్టుబడులను సులభతరం చేసే చక్కని వ్యూహంగా ఇండెక్స్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం.
ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి?
నిర్దిష్ట ప్రామాణిక సూచీని ట్రాక్ చేసే ఒక తరహా మ్యుచువల్ ఫండ్స్‌ను ( mutual fund ) ఇండెక్స్ ఫండ్స్ అంటారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి విస్తృత సూచీలను లేదా నిర్దిష్ట రంగానికి చెందిన నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ వంటి సూచీలను ట్రాక్ చేసేలా ఇవి ఉండొచ్చు. సదరు సూచీలోని కంపెనీల షేర్లను, అదే వెయిటేజీతో ఈ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాలకు చెందిన కొన్ని కీలక స్టాక్స్ సమూహాన్ని ఇండెక్స్‌గా వ్యవహరిస్తారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది.
ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఏమిటి?
ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వీటిలో ఉంటాయి. ఇవి రెండూ కూడా నిర్దిష్ట సూచీని ట్రాక్ చేసేవే అయినా వీటి పని తీరులో మార్పులు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే పని చేస్తాయి. రోజు ముగిసే నాటి ఎన్‌ఏవీ ప్రకారం వీటి యూనిట్లను ఏఎంసీల్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇక ఈటీఎఫ్‌లు పేరుకు తగ్గట్లే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి, షేర్ల తరహాలోనే ట్రేడ్ అవుతుంటాయి. ఏఎంసీ ప్రస్తావన లేకుండా ఇన్వెస్టర్లు వీటిని నేరుగా ఎక్సే్చంజ్ నుంచే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు.
ప్రయోజనాలు ఏమిటి?
సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యూహం. వ్యక్తిగతంగా ఏ ఒక్క స్టాక్ పైనో పక్షపాతం చూపించే పరిస్థితి లేకుండా ముందుగానే నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టాక్స్ ఎంపిక ఉంటుంది. మార్కెట్‌ను బట్టి పని చేస్తుంది. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా ఉండరు కాబట్టి సాధారణంగా యాక్టివ్ మ్యుచువల్ ఫండ్‌తో పోలిస్తే వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.
వ్యయాలు తక్కువ ఎందుకంటే?
ముందే చెప్పుకున్నట్లు ఇండెక్స్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజరు ప్రత్యేకంగా స్టాక్స్ ఎంపిక చేయడం లేదా ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పని ఉండదు. కాబట్టి పరిశోధనలపరమైన వ్యయాలూ ఉండవు. పైగా యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే పోర్ట్‌ఫోలియోలో మార్పులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అందుకే వీటి వ్యయాలు తక్కువగా ఉంటాయి.
ఎవరికి అనువైనవి?
సులభతరమైన, సమర్ధమంతమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఎవరికైనా అనువైనవే. సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఇక అనుభవమున్న ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ క్యాప్వ్‌వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసేందుకు, నిర్దిష్ట ఇండెక్స్ వ్యూహాలను అమలు చేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
ట్రాకింగ్ వ్యత్యాసాలు అంటే?
బెంచ్ మార్క్, ఫండ్‌కి సంబంధించి పనితీరు అలాగే రాబడుల్లో వ్యత్యాసాలను ట్రాకింగ్ ఎర్రర్‌గా వ్యవహరిస్తారు. ఇది ఫండ్ పనితీరు సమర్ధతను సూచిస్తుంది. ఇక, ఫీజులు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ఫండ్ అందించే రాబడులు కొంత భిన్నంగా ఉంటాయి.
ఇండెక్స్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
ఏఎంసీకి (అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ) ఆన్‌లైన్‌లో లేదా ఫిజికల్‌గా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తమ డిస్ట్రిబ్యూటర్ లేదా రిలేషన్‌షిప్ మేనేజర్‌ను సంప్రదించడం ద్వారా కూడా చేయొచ్చు. అలాగే లేటెస్ట్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా చేసేందుకు వీలుంది.
ఏమేమి రిస్కులు ఉంటాయి?
సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహా రిస్కులన్నీ ఇండెక్స్ ఫండ్స్‌కి కూడా ఉంటాయి. వాటికి అదనంగా ట్రాకింగ్ ఎర్రర్, ట్రాకింగ్ డిఫరెన్స్, సూచీ ఆధారిత రిస్కులు, నిర్వహణపరమైన రిస్కులు మొదలైనవి ఉంటాయి. పథకానికి సంబంధించిన రిస్కులను గురించి తెలుసుకునేందుకు స్కీమ్ సమాచారపత్రాన్ని ముందుగానే క్షుణ్నంగా చదువుకోవాలి.
ఇండెక్స్ ఫండ్స్‌పై పన్ను విధానం ఎలా ఉంటుంది?
ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్‌ని బట్టి ఇండెక్స్ ఫండ్స్‌పై పన్నులు వర్తిస్తాయి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్‌కి ఈక్విటీ ట్యాక్సేషన్, అలాగే డెట్ ఇండెక్స్ ఫండ్స్‌కి డెట్ ట్యాక్సేషన్ విధానం ఆధారంగా పన్నులు ఉంటాయి.
ఏదైనా సరే, ఇన్వెస్ట్ చేసే ముందుగానే స్కీమ్ వివరాలతో కూడిన డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.
- సమాధానాలు - నీరజ్ సక్సేనా ఫండ్ మేనేజర్, బరోడా బీఎన్‌పీ పారిబాస్
Comments
Please login to add a commentAdd a comment