ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? | Invest in Index Funds? | Sakshi
Sakshi News home page

ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Published Mon, Sep 18 2017 1:42 AM | Last Updated on Fri, Sep 22 2017 6:44 PM

ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

నేను మూడు ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. బిర్లా సన్‌లైఫ్‌ వెల్త్‌ యాస్పైర్‌ ప్లాన్, కోటక్‌ ప్రీమియర్‌ ఎండోమెంట్‌ ప్లాన్, మ్యాక్స్‌ లైఫ్‌ గెయిన్‌ ప్రీమియర్‌... ప్లాన్‌ల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిస్తున్నాను. మ్యాక్స్‌ ప్లాన్‌ను 2014లో, బిర్లా సన్‌లైఫ్‌ ప్లాన్‌ను, కోటక్‌ ప్రీమియర్‌ ప్లాన్‌ను గత ఏడాది తీసుకున్నాను. వీటిల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? లేక వీటిని సరెండర్‌ చేయమంటారా? వీటిని సరెండర్‌ చేసి వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసే మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా? తగిన సూచనలివ్వండి.   –ఫరూక్, హైదరాబాద్‌

మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న రెండు ప్లాన్‌లు–కోటక్‌ ప్రీమియర్, మ్యాక్స్‌ లైఫ్‌లు ఎండోమెంట్‌ ప్లాన్‌లు కాగా, బిర్లా సన్‌లైఫ్‌ యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌). ఈ మూడు ప్లాన్‌లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సరైనవి కావు. ఈ మూడు ప్లాన్‌లూ.. తగిన రాబడులను,  సరిపోయినంత బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. వీటిని సరెండర్‌ చేయడమే ఉత్తమం. బిర్లా సన్‌లైఫ్‌ వెల్త్‌ యాస్పైర్‌ ప్లాన్‌కు ఐదేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంది. ఈ ప్లాన్‌ను మీరు సరెండర్‌ చేస్తే, సరెండర్‌ చార్జీలను మినహాయించుకొని వచ్చిన మొత్తాన్ని డిస్‌కంటిన్యూడ్‌ పాలసీ ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఈ మొత్తం మీకు అందుతుంది.

ఇక మిగిలిన రెండు ఎండోమెంట్‌ పాలసీలను. మూడేళ్ల తర్వాతనే సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. వీటిని సరెండర్‌ చేస్తే మీరు చెల్లించిన మొత్తం ప్రీమియమ్‌ల్లో 30 శాతం మాత్రమే గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూగా వస్తుంది. ఈ పాలసీల సరెండర్‌ వల్ల మీకు ఎలాంటి లాభం లేనప్పటికీ, వీటికి ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేయండి. ఇవి ల్యాప్స్‌ అయ్యేలా చూడండి. వీటికి చెల్లించే మొత్తాలను మంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం వల్ల.. ప్రస్తుతమున్న పాలసీలను సరెండర్‌ చేయడం వల్ల వచ్చే నష్టాలను కూడా పూడ్చుకునే విధంగా రాబడులు వస్తాయి. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కలగలపకండి. బీమా కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవాలి. వీటికి ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి.  

నేను డీ–మ్యాట్‌ ఖాతాలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. డీ–మ్యాట్‌ ఖాతాలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్వహణ  కారణంగా నేను ఏ రకమైన వ్యయాలను చెల్లించాల్సి ఉంటుంది?    –సురేఖ, విశాఖపట్టణం  
డీ–మ్యాట్‌ ఖాతాలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్వహిస్తున్న కారణంగా డీ–మ్యాట్‌ లావాదేవీలకు సంబంధించిన వ్యయాలను మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కో డిపాజిటరీ పార్టిసిపెంట్‌(డీపీ)కు ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయిస్తే, ఒక్కో లావాదేవీకి రూ.20 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డీ–మ్యాట్‌ ఖాతాలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్వహిస్తే, బ్రోకరేజ్‌ చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసే, లేదా విక్రయించే మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల విలువలో ఇది సాధారణంగా 0.30 శాతం నుంచి 0.40 శాతం రేంజ్‌లో ఉంటుంది.

ఈ వివరాలన్నీ మీ డీ–మ్యాట్‌ కాంట్రాక్టులో పొందుపరచబడి ఉంటాయి. చార్జీలకు సంబంధించిన సవివరమైన వివరాలు కావాలంటే, మీరు మీ డీపీని సంప్రదించవచ్చు.ఈ వ్యయాలు వద్దనుకుంటే మీరు నేరుగా సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వెబ్‌సైట్‌ నుంచి లేదా రిజిష్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఆర్‌ అండ్‌ టీ) ఏజెంట్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.

ఇండెక్స్‌  ఫండ్స్‌ అంటే ఏమిటి?  వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదేనా? –కిరణ్, ఈ మెయిల్‌   
దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం కొందరు ఇన్వెస్టర్లు ఇండెక్స్‌ ఫండ్స్‌ను  ఎంచుకుంటారు. ఒక సూచీ(సెన్సెక్స్‌ లేదా నిఫ్టీ. మొదలైనవి)లో ఉన్న కంపెనీల షేర్లలో ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. సూచీలో ఆయా షేర్ల వెయిటేజీని బట్టి ఆయా షేర్లలో ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి.  ఇతర ఫండ్స్‌ మాదిరి షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు చురుకుగా ఈ ఫండ్స్‌ నిర్వహించవు. అందుకని వీటికి వ్యయాలు తక్కువగా ఉంటాయి.  అంతేకాకుండా ఇవి చార్జ్‌ చేసే వ్యయాలపై ఒక పరిమితి ఉంటుంది.

ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ట్రాకింగ్‌ ఎర్రర్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ట్రాకింగ్‌ ఎర్రర్‌ ఎంత తక్కువగా ఉంటే ఆ ఫండ్‌ పనితీరు అంత సమర్థవంతంగా ఉందని అర్థం. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్‌ ఫండ్స్‌ మంచి రాబడులను ఇస్తున్నాయి. కానీ భారత్‌  వంటి ఆభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. పలు కంపెనీలు  సూచీల్లో  ఉన్న కంపెనీల కంటే మంచి వృద్ధిని సాధిస్తుండడమే దీనికి కారణం.  ఇక ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేయడానికి పలు ఇండెక్స్‌ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

బిర్లా సన్‌లైఫ్‌ ఇండెక్స్‌ ఫండ్, ప్రాంక్లిన్‌ ఇండియా ఇండెక్స్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ ఇండెక్స్‌ ఫండ్, ఎస్‌బీఐ నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్, యూటీఐ నిఫ్టీ ఫండ్‌. వాటిల్లో కొన్ని. నిఫ్టీని ప్రతిబింబించే ఫండ్స్‌లో రిలయన్స్‌ నిఫ్టీ బీఎస్‌ఈఎస్‌ అనేది ఒక ఉత్తమమైన ఫండ్‌.  అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇండెక్స్‌ ఫండ్స్‌  అత్యుత్తమమైన సాధనాలని చెప్పలేము. ఇంతకంటే మంచి రాబడులనిచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ అనేకం ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement